అవసరాలు తీరడం ముఖ్యమా, ఆదర్శాలు పాటించడం ముఖ్యమా అనే ప్రశ్న తలెత్తినప్పుడు ‘తెలివైనవారు’ అవసరాలవైపే మొగ్గుతారు.
సంపాదకీయం: అవసరాలు తీరడం ముఖ్యమా, ఆదర్శాలు పాటించడం ముఖ్యమా అనే ప్రశ్న తలెత్తినప్పుడు ‘తెలివైనవారు’ అవసరాలవైపే మొగ్గుతారు. ప్రధాని నరేంద్ర మోడీని తమ దేశానికి ఆహ్వానించడం ద్వారా అమెరికా ఇప్పుడు సరిగ్గా ఆ తెలివితేటలనే ప్రదర్శించింది. ఆ ఆహ్వానాన్ని మన్నించి వచ్చే సెప్టెంబర్‌లో ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామాతో శిఖరాగ్ర సమావేశాన్ని జరుపుతానని మోడీ వర్తమానం పంపారు. వాస్తవానికి న్యూయార్క్‌లో జరగబోయే ఐక్యరాజ్యసమితి సమావేశా లకు మోడీ వెళ్తున్నారు. అలాంటి సందర్భాల్లో మన ప్రధాని అమెరికా అధ్యక్షుణ్ణి కలవడం సాధారణంగా జరిగేదే. కానీ, అందుకు భిన్నంగా ఈసారి వాషింగ్టన్‌లో ఇరు దేశాల అధినేతలూ శిఖరాగ్ర సమావేశం జరపబోతున్నారు. విదేశాంగ విధానంలో కొత్త దోవను పరుస్తున్న మోడీ ఆ వరుసలో తీసుకున్న మరో కీలకమైన నిర్ణయమిది. సరిగ్గా తొమ్మిదేళ్లక్రితం... అంటే 2005లో అమెరికా నరేంద్రమోడీకి ఉన్న వ్యక్తి గత వీసాను రద్దుచేయడంతోపాటు ఆయనకు దౌత్యపరమైన వీసాను నిరాకరించింది. 2002లో జరిగిన గుజరాత్ నరమేథంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ పాత్రపై ఆరోపణలు వచ్చాక ఈ నిర్ణయం తీసుకుంది. అమెరికా బాటలోనే బ్రిటన్, ఇతర యూరోప్ దేశాలు కూడా వ్యవహ రించాయి. 2005లో బ్రిటన్ వెళ్లాలనుకున్నప్పుడు మోడీకి ఆ దేశం వీసా నిరాకరించింది. మోడీ ప్రధాని పదవిని అధిష్టించిన తర్వాత అమెరికా వెనక్కు తగ్గక తప్పలేదు.
నరేంద్ర మోడీ విషయంలో అమె రికా అప్పట్లో వ్యవహరించిన తీరుపై చాలా విమర్శలొచ్చాయి. దేశంలో ఏ న్యాయస్థానమూ మోడీని తప్పుపట్టనప్పుడు, ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికా ఏ ప్రాతిపదికన ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని పలువురు ప్రశ్నించారు. పోనీ ఇదే సూత్రాన్ని అమెరికా అందరికీ వర్తింపజేసివుంటే అది వారి విధానమని సరిపెట్టుకోవచ్చు. కానీ, తమకు అనుకూలంగా ఉన్న అధినేతలు నియంతలైనా సరే వారి చర్యలను చూసీచూడనట్టు ఊరుకుంటుంది. వారికి రెండు చేతులా సహాయసహకారా లను అందిస్తుంది. ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఎల్లకాలమూ నిలబడలేవు.
నరేంద్ర మోడీకి విశేషజనాదరణ ఉన్నదని సర్వేల్లో తేలినప్పుడే పలువురు విశ్లేషకులు ఆయన ప్రధాని అయితే అమెరికాతో ఎలాంటి సంబంధాలు ఉంటాయోనన్న సందేహం వెలిబుచ్చారు. తొమ్మిదేళ్లుగా తనపై నిషేధం విధించిన దేశంతో మోడీ ఏ రకంగా వ్యవహరిస్తారన్న అంశంపై ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. ఆయన అంటీముట్టన ట్టుగా ఉండిపోవచ్చునని, అదే జరిగితే అటు అమెరికాకు, ఇటు మనకూ కూడా పరిస్థితి ఇబ్బందికరంగానే మారవచ్చునని అనుకు న్నారు. న్యూయార్క్‌లోని భారత కాన్సులేట్‌లో పనిచేసిన సీనియర్ ఐఎఫ్‌ఎస్ అధికారిణి దేవయాని ఖోబ్రగడేని అరెస్టుచేయడం... కరడు గట్టిన నేరస్తులను ఉంచిన సెల్‌లో ఆమెను నిర్బంధించడం లాంటి చర్యల తర్వాత ఇరు దేశాల సంబంధాలూ అట్టడుగు స్థాయికి దిగజా రాయి.
ఈ ఉదంతానికి ప్రతీకారంగా మన దేశం కూడా కఠినంగా వ్యవహరించింది. అమెరికా దౌత్య సిబ్బందికి సమకూర్చే ప్రత్యేక సౌక ర్యాలను రద్దుచేసింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో మోడీ ప్రధా ని అయితే భారత్-అమెరికా సంబంధాలు ఇంకెలా ఉంటాయోనన్న ఆందోళన అందరిలోనూ ఉంది. కానీ, ఒబామా ఆహ్వానాన్ని రెండో ఆలోచన లేకుండా అంగీకరించడంద్వారా నరేంద్రమోడీ విశాల దృక్ప థాన్నే ప్రదర్శించారు. నిజానికి మోడీకి దేశంలో అనుకూల వాతావర ణం ఉన్నదని చూచాయిగా తెలిశాక యూరోప్ దేశాలు ఆయనతో సర్దు బాటుకు ప్రయత్నించాయి. అమెరికా కంటే ముందే మేల్కొని ఆయన వద్దకు ప్రతినిధి బృందాలను పంపడంలాంటి చర్యలు తీసుకున్నాయి. అమెరికా మాత్రమే ఏమీ పట్టనట్టు ఉండిపోయింది. అమెరికా రాయ బారి నాన్సీ పావెల్ ఫిబ్రవరిలో మోడీని కలవకపోలేదుగానీ అప్పటికే ఆలస్యమైంది. ఆమె చురుగ్గా వ్యవహరించకపోవడంవల్ల భారత్‌లో తన ప్రయోజనాలకు విఘాతం కలిగే పరిస్థితి ఏర్పడిందని భావించి అమెరికా పావెల్‌ను మొన్నటి ఏప్రిల్‌లో ఇక్కడినుంచి తప్పించింది.
యూపీఏ తొలి దశ పాలనలో భారత్-అమెరికా సంబంధాలు ఉచ్చస్థితిలో ఉన్నాయి. అప్పట్లో అమెరికాతో అణు ఒప్పందాన్ని కుదు ర్చుకోవడం కోసం మన్మోహన్‌సింగ్ తన ప్రభుత్వాన్నే పణంగా ఒడ్డారు. కానీ, యూపీఏ రెండో దశ పాలనలో ఆ ఒప్పందానికి అనుగు ణంగా తీసుకొచ్చిన అణు పరిహార చట్టం తమ సంస్థల ప్రయోజ నాలను దెబ్బతీసేలా ఉన్నదని అమెరికా భావిస్తున్నది. ముఖ్యంగా అణు ప్రమాదం సంభవించిన సందర్భాల్లో ఆ రియాక్టర్లను సరఫరా చేసిన సంస్థనుంచి గరిష్టంగా రూ. 1,500 కోట్లు వసూలు చేయాలన్న సెక్షన్ 17(బీ)ని రద్దుచేయాలని కోరుతున్నది. అందుకు మన దేశం ససేమిరా అనడంతో కినుక వహించింది.
అలాగే పన్ను విధానాల్లో అనిశ్చితి తొలగించమని, ఎఫ్‌డీఐల అనుమతి విషయంలో మరింత ఉదారంగా ఉండాలని అడుగుతున్నది. ఇరుగుపొరుగుతో సంబంధాల మెరుగుదలకు మోడీ చేస్తున్న కృషి పర్యవసానంగా భవిష్యత్తులో ఆయన చైనాకు దగ్గర కాగలరన్న భయమూ అమెరికాలో లేకపోలేదు. అందుకు ప్రతిగా అమెరికా-భారత్-జపాన్ త్రైపాక్షిక సహకారం దిశగా ఆయనను ఒప్పించాలని... చైనా దూకుడుకు కళ్లెం వేయడానికి ఇది అవసరమని ఆ దేశం అనుకుంటున్నది. ఇవన్నీ నెరవేరాలంటే మోడీకి సన్నిహితం కావడమే ఉత్తమమని అమెరికా భావిస్తున్నది. కనుకనే ఆయనపై ఉన్న నిషేధాన్ని తొమ్మిదేళ్ల తర్వాత తొలగించింది. తన అవసరాలను దృష్టిలో పెట్టుకుని కాకుండా... తానింతకాలమూ పాటించినవి ద్వంద్వ ప్రమాణాలని గుర్తించి అమెరికా ఈ పని చేసివుంటే మరింత బాగుండేది.