లోకంతో పంచుకోవాల్సినవి ఉన్నాయనుకున్నప్పుడే ఎవరైనా ఆత్మకథల్ని, జ్ఞాపకాల్ని గ్రంథాలుగా వెలువరిస్తారు. మిగిలినవారి మాటెలా ఉన్నా రాజకీయ నాయకులు రాసే ఆ మాదిరి పుస్తకాలకు బాగా గిరాకీ ఉంటుంది. వాటిని జనం ఆసక్తితో చదువుతారు. సామాజిక, రాజకీయ పరిణామాలను ఎప్పటికప్పుడు అధ్యయనం చేసేవారికైతే వాటితో అవసరం ఎక్కువుంటుంది. ముఖ్యంగా కీలక పదవులు నిర్వహించిన నేతలు తమకు తెలిసిన అంశాల విషయంలో ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో, వాటి గురించి అదనంగా ఏం చెప్పారో తెలుసుకోవడానికి వారు ఉత్సాహం చూపుతారు.
అధికారంలో కొనసాగుతూ ఆత్మకథలు రాయడం ఇబ్బంది గనుక ఎక్కువమంది నేతలు విశ్రాంత తీరం చేరాకే ఆ పని చేస్తారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఇలాంటివారికి భిన్నం. ఆయన నిరుడు ‘ద డ్రమెటిక్ డికేడ్’ (నాటకీయ దశాబ్దం) పేరిట 70వ దశకంనాటి పరిణామాలను విశ్లేషణాత్మకంగా గ్రంథస్తం చేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం, బంగ్లాదేశ్ ఆవిర్భావం, ఎమర్జెన్సీ విధింపు, జనతాపార్టీ ఆవిర్భావంలాంటి అనేక ఘట్టాలను ఆయన పరామర్శించారు.
దానికి కొనసాగింపుగా ఇప్పుడాయన ‘ద టర్బ్యులెంట్ ఇయర్స్’(సంక్షుభిత సంవత్సరాలు) అనే గ్రంథం తీసుకొచ్చారు. ఇందులో 1980 మొదలుకొని 1996 వరకూ జరిగిన కీలక పరిణామాలను వివరించారు. దేశ చరిత్రలో ఈ కాలం అత్యంత కీలకమైనది. అంతేకాదు...ఆ పరిణామాలకు దారితీసిన నిర్ణయాల్లో, విధానాల్లో, అందుకు జరిగిన చర్చోపచర్చల్లో ఆయన భాగస్వామి. దేశం దిశనూ, దశనూ మార్చిన పరిణామాలవి. అంతవరకూ అనుసరించిన నెహ్రూ సామ్యవాద విధానాల నుంచి వైదొలగి దేశం ఉదారవాద ఆర్థిక సంస్కరణలను నెత్తికెత్తుకున్న సమయమది.
కనుక ఈ పుస్తకంలో ప్రణబ్ వాటన్నిటి గురించీ ఏం చెబుతారోనన్న ఆసక్తి అందరికీ ఉంటుంది. అయితే అలాంటివారి ఉత్సాహంపై ఆయన ముందే చన్నీళ్లు చల్లారు. కొన్ని రహస్యాలను తాను ఉద్దేశపూర్వకంగానే చెప్పడం మానేశా నని ఆయన ప్రకటించారు. అవి తనతోనే ముగిసిపోతాయని కూడా అన్నారు. అలాగని వాటిని ఆయన అక్షరబద్ధం చేయడం మానలేదు. వాటికి సంబంధించిన డిజిటల్ కాపీ వేరేగా ఉన్నదని, అది తన వారసులకే పరిమితమవుతుందని చెప్పారు.
జ్ఞాపకాలను...మరీ ముఖ్యంగా అక్షరబద్ధమయ్యే జ్ఞాపకాలను యాంత్రి కంగా చూడలేం. జ్ఞాపకాలంటే ఏకకాలంలో రచయిత తనతో తాను సంభాషించు కోవడం...లోకంతో సంభాషించడం. ఆ సంభాషణల్లో పరిహరించినవేమిటో, ప్రాధాన్యత సంతరించుకున్నవేమిటో, అప్రాధాన్యంగా మిగిలినవేమిటో...పాక్షికత ఎంతో, నిష్పాక్షికత ఎంతో చెప్పాల్సింది విమర్శకులే.
అయితే కొన్ని రహస్యాలను వెల్లడించబోనని ముందే చెప్పి అలాంటివారి పనిని ప్రణబ్ కాస్త తగ్గించారు. నిజానికి జ్ఞాపకాలు రాసేవారందరూ అన్నీ చెబుతారనుకోవడానికి లేదు. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టడం...తనకు సంబంధించిన మంచీ చెడూ ఏకరువు పెట్టడం, ఆత్మ పరిశీలన చేసుకోవడం అందరికీ సాధ్యం కాదు. అలా రాయడం మహాత్ములకే సాధ్యం.
ప్రణబ్ తాజా గ్రంథం అనేక విధాల మొదటి పుస్తకం కంటే ఆసక్తికరమైనది. ఇందులో అస్సాం, పంజాబ్ రాష్ట్రాల్లో వెల్లువెత్తిన ఉద్యమాలు, ఉద్రిక్తతల ప్రస్తావ నలున్నాయి. వేలమంది ముస్లింలను ఊచకోత కోసిన నెల్లి మారణకాండ ఉదం తం, పంజాబ్‌లోని ఖలిస్తాన్ ఉద్యమం, ఉగ్రవాదం, ఆపరేషన్ బ్లూస్టార్ వంటివి ఉన్నాయి. ఇందిరాగాంధీ, ఆమె ఇద్దరు కుమారులు రాజీవ్‌గాంధీ, సంజయ్ గాంధీల మరణాలకు సంబంధించిన అంశాలున్నాయి.
వీరిలో సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో దుర్మరణం పాలైతే ఆయన తల్లి ఇందిరాగాంధీ తన నివాస గృహం ఆవరణలోనే దుండగుల తుపాకి గుళ్లకు నేలకొరిగారు. రాజీవ్‌గాంధీని తమిళ టైగర్లు ఆత్మాహుతి దాడిలో బలితీసుకున్నారు. వీరిలో సంజయ్‌గాంధీతో ప్రణబ్‌కు చాలా చనువుండేది. ఆయనంటే ఉన్న అభిమానాన్ని ప్రణబ్ దాచుకోలేదు. రాజకీయాల్లో సంజయ్ తళుక్కుమన్నది కేవలం ఆరేళ్లే అయినా దేశ రాజకీయ చిత్తరువుపై ఆయన చెరగని ముద్రవేశారన్నది ప్రణబ్ నిశ్చితాభి ప్రాయం.
రాజీవ్‌గాంధీ ప్రధాని కావడం, ఆ తర్వాత ఆయనకు దూరమై ప్రణబ్ కాంగ్రెస్‌నుంచి నిష్ర్కమించాల్సిరావడం, రాజీవ్ మరణానంతర పరిణామాల్లో మళ్లీ పార్టీలోకి పునఃప్రవేశం, ఆర్ధిక సంస్కరణల సమయంలో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావుతో సన్నిహితంగా పనిచేయడం, బాబ్రీ మసీదు విధ్వంసంలాంటి అనేక విషయాలను ప్రణబ్ వివరించారు. ఆయా ఘట్టాలపై తన మనోగతాన్ని వెల్లడించారు. ఇందిరాగాంధీ హత్యానంతరం ప్రణబ్ ప్రధాని కావాలనుకున్నారని, ఆ సంగతి తెలిసే రాజీవ్ ఆ తర్వాత కాలంలో ఆయన్ను దూరం పెట్టారన్న కథ నాలు ప్రచారంలో ఉన్నాయి.
ఈ పుస్తకంలో ప్రణబ్ అలాంటి కథనాలను తోసిపు చ్చారు. మరి ప్రణబ్‌ను ముందుగా కేబినెట్‌నుంచీ, ఆ తర్వాత పార్టీనుంచీ రాజీవ్ ఎందుకు తొలగించారు? ఆర్ధిక శాఖను చూసేవారు ‘చాలా కఠినంగా’ ఉండాలని భావించడంవల్ల అక్కడినుంచి ప్రణబ్‌ను తప్పించవలసివచ్చినట్టు రాజీవ్‌గాంధీయే ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. అలాగే తానిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పని మాటల్ని ఓ పత్రిక ప్రచురించడంవల్ల పార్టీనుంచి బహిష్కరించారని తెలిపారు.
ఈ దేశాన్ని మలుపు తిప్పిన అనేక ఉదంతాల్లో ప్రణబ్ కీలక భూమికనైనా పోషించారు లేదా అలాంటి ఉదంతాలకు ప్రత్యక్షసాక్షిగానైనా ఉన్నారు. ఆయనే చెప్పుకున్నట్టు వీటిల్లో కొన్నిటినే గ్రంథస్తం చేశారు. రహస్యాలున్నాయంటూనే వాటిని వెల్లడించబోనని చెప్పడం ద్వారా ప్రణబ్ కొత్త సంప్రదాయాన్ని నెలకొ ల్పారు. దేశ అత్యున్నత పీఠంపై ఉన్నా కొన్నిటిపై నిష్కర్షగా తన అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ఇదీ కొత్త ఒరవడే. కానీ ‘ఎక్కువ నిజాలు’ చెబితేనే ఏ గ్రంథానికైనా శాశ్వతత్వం వస్తుందని మూడో పుస్తకం నాటికైనా ప్రణబ్ గ్రహించాలి.
జ్ఞాపకాల ‘నిగ్రహం’
Published Wed, Feb 3 2016 12:34 AM | Last Updated on Sun, Sep 3 2017 4:49 PM
Advertisement
Advertisement