ప్రమాదమా...కుట్రా?! | Russian plane crashed in Sinai is preplaned or accident? | Sakshi
Sakshi News home page

ప్రమాదమా...కుట్రా?!

Published Mon, Nov 2 2015 12:12 AM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM

ప్రమాదమా...కుట్రా?! - Sakshi

ప్రమాదమా...కుట్రా?!

పెను వేగంతో కూడిన వర్తమాన జీవనంలో ఏదీ అసంభవం అనుకోవడానికి లేదు. వ్యాపారం, వాణిజ్యం, ఉపాధి, చదువు, పర్యాటకం...ఇలా ఎన్నో అవసరాల కోసం ఒకచోట నుంచి మరో చోటకు వెళ్లడం, రావడం ప్రతివారికీ ఇప్పుడు జీవితా వసరంగా మారింది. కొందరికైతే నెలలో చాలా రోజులు విమాన ప్రయాణాల్లోనే గడిచిపోతుంటాయి. అందువల్లే రష్యాకు చెందిన ఎయిర్ బస్ విమానం ఈజిప్టు లోని సినాయ్ ద్వీపకల్పంలో శనివారం కూలిపోయిందని విన్నప్పుడు చాలామంది కలవరపాటుకు గురయ్యారు. ఈజిప్టు నుంచి రష్యా వెళ్తున్న ఈ విమానంలో ఏడుగురు సిబ్బందితోపాటు మొత్తం 224మంది ప్రయాణిస్తున్నారు. వీరిలో అత్యధి కులు రష్యన్ పౌరులు...వారిలో చాలామంది పర్యాటకంపై ఆసక్తితో వచ్చినవారు.

విమానం ప్రమాదం బారిన ఎలా చిక్కుకుందన్నది అంతుబట్టని అంశంగా మారిం ది. ఈజిప్టులో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే అక్కడి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)తో అది సంబంధాలు కోల్పోయిందని అధికారులు వెల్లడిస్తున్న సమాచారా న్నిబట్టి చూస్తే సాంకేతిక లోపమే ఇందుకు కారణమై ఉండొచ్చని భావించవచ్చు. విమానం 30,000 అడుగుల ఎత్తులో ఉండగా ఒక వైర్‌లెస్ పరికరం పనిచేయడం లేదని, సమీపంలోని విమానాశ్రయంలో అత్యవసరంగా దిగడానికి అనుమతించ మని పైలట్ కోరినట్టు చెబుతున్నారు. అయితే అతను అలా కోరిన కొన్ని క్షణాలకే విమానంతో సంబంధాలు తెగిపోయాయి.


 వాస్తవానికి ఈ విమానంలో సాంకేతికంగా సరిదిద్దవలసిన సమస్యలున్నా యని చాన్నాళ్లక్రితం సిబ్బంది ఫిర్యాదు చేసినట్టు చెబుతున్నారు. అదే నిజమైతే క్షమార్హం కాని నేరం. ప్రపంచంలోని వివిధ విమానయాన సంస్థలు భద్రతా ప్రమా ణాలను ఏ విధంగా పాటిస్తున్నాయో చూసేందుకు అంతర్జాతీయ విమానయాన సంస్థ(ఐసీఏఓ) ఉంది. విమానయానానికి సంబంధించి అది ఎన్నో ప్రమాణాలను ఏర్పరిచింది. వాటిని ఎవరెంత శ్రద్ధగా పాటిస్తున్నారో గమనిస్తూ, అందుకవసర మైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెప్పించుకుంటూ వివిధ సంస్థలకు రేటింగ్ ఇస్తుంది. ఏఏ దేశాల్లో విమాన ప్రయాణం సురక్షితం కాదో, అందుకు కారణాలేమి టో చెబుతుంటుంది. మరి ఈ విమానానికి సంబంధించి సిబ్బందినుంచి ఫిర్యాదు వచ్చినట్టు ఆ సంస్థ దృష్టికి రాలేదా? ప్రమాదంపై పూర్తి స్థాయి దర్యాప్తు మొదల య్యాకగానీ ఆ సంగతి తెలియదు. విమానాన్ని యూరప్‌కు చెందిన ఎయిర్‌బస్ తయారు చేసింది గనుక యూరొపియన్ విమానయాన భద్రతా సంస్థ... విమానానికి అమర్చిన ఇంజన్లు అమెరికాలో ఉత్పత్తి అయ్యాయి గనుక అమెరికా జాతీయ రవాణా భద్రతా బోర్డు కూడా ఈ దర్యాప్తులో పాలుపంచుకుంటాయి.


 ఐఎస్ ఉగ్రవాద సంస్థ దాన్ని తామే కూల్చేశామని ప్రకటించడంతోపాటు అందుకు సాక్ష్యంగా ఒక వీడియోను కూడా విడుదల చేసింది. గతంలో వారు ఒక హెలికాప్టర్‌ను కూల్చిన ఉదంతం ఉన్నది గనుక నిజమే కావొచ్చునని కొందరు అను మానించారు. అయితే దీన్ని రెండు కోణాల్లో తిరస్కరించవచ్చన్నది రష్యా అధికా రులు చెబుతున్న మాట. 30,000 అడుగుల ఎత్తులో ఎగిరే విమానాన్ని కూల్చడా నికి అవసరమైన సామర్థ్యం గల క్షిపణిని ప్రయోగించగల సత్తా ఉగ్రవాదుల వద్ద లేదన్నది అందులో ఒకటి. విమానాన్ని ఏ విధంగా కూల్చామన్నది చెప్పలేదు గనుక ఆ ప్రకటనను విశ్వసించవలసిన పనిలేదని అధికారుల అభిప్రాయం. ఇక్కడొక సంగతి గమనించాలి. ఇంతవరకూ తాము చేయని పనిని దేన్నీ ఐఎస్ ఉగ్రవాదులు భుజాన వేసుకోలేదు. కనుక వారి ప్రకటనను అంత తేలిగ్గా తోసిపుచ్చడం కూడా సాధ్యంకాదు. ప్రస్తుతం సిరియాలో ఐఎస్ ఉగ్రవాదులపై రష్యా నేరుగా దాడులు చేయడం ప్రారంభించిన నేపథ్యంలో ఈ ఘటనను ఆసరా చేసుకుని తాము ప్రతి దాడి చేయగలిగామని చెప్పుకోవడం...తమ సానుభూతిపరుల నైతిక స్థైర్యాన్ని పెంచడం ఐఎస్ ఉగ్రవాదులకు అవసరం అయిందని కొందరి అంచనా. అయితే ఉగ్రవాదులు విమానంలో బాంబు పెట్టడం లేదా కావాలని అందులోని కీలకమైన సాంకేతిక వ్యవస్థలను ధ్వంసం చేయడంవంటి పనులకు పాల్పడే అవకాశాలను తోసిపుచ్చలేమని కొందరు నిపుణులు చెబుతున్న మాట. అది అసాధ్యమనుకోవడా నికి లేదు. ఎందుకంటే ఉగ్రవాద భూతాన్ని ఎదుర్కొనడానికి ఎన్ని అత్యాధునిక పరికరాలూ, వ్యవస్థలూ వచ్చినా వాటిని అమలు చేయాల్సింది అంతిమంగా మనుషులే. ఎక్కడ లోపం జరిగినా, ఏ ఒక్కరు అలసత్వంతో ఉన్నా ఉపద్రవం చోటు చేసుకుంటుంది. ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ, నిత్యం వేయి కళ్లతో కనిపెడుతుంటే తప్ప ఏం జరగడానికైనా ఆస్కారం ఉంటుంది. మొన్న మార్చిలో జర్మనీకి చెందిన లుఫ్తాన్సా సంస్థకు చెందిన ఎయిర్‌బస్-ఏ320 విమానంలో కోపైలట్ ఉద్దేశపూర్వకంగా కూల్చివేసి 150మంది మరణానికి కారకుడయ్యాడన్న సంగతిని గుర్తుంచుకుంటే ఈ జాగ్రత్తల అవసరం ఎంతగా ఉందో అర్ధమవుతుంది.

 
  ప్రపంచంలో ఇప్పుడు చాలాచోట్ల ఉద్రిక్తతలు అలుముకున్నాయి. ఘర్షణలను నివారించడానికి అవసరమైన పరిపక్వతను ప్రదర్శించడంలో దేశాధినేతలు విఫలమవుతున్నారు. కొందరైతే తమ కార్యాచరణతో వాటిని మరింతగా ప్రేరేపిస్తున్నారు. నిరుడు జూలైలో ఉక్రెయిన్ గగనతలం మీదుగా వెళ్తున్న విమానం ఒకటి క్షిపణి దాడికి గురై 298మంది ప్రాణాలు కోల్పోవడం ఇందుకు ఉదాహరణ. ఉగ్రవాదం పుట్టి విస్తరించడంలో, వేళ్లూనుకోవడంలో అమెరికా చర్యలు ఎలా దోహదపడుతున్నాయో అందరికీ తెలుస్తూనే ఉంది. ఉక్రెయిన్ గగనతలంలో విమానం కూలిపోయాక అటువైపుగా వెళ్లొద్దని విమానయాన సంస్థలకు ఆదేశాలు వెళ్లాయి. తాజా ప్రమాదంతో సినాయ్ ద్వీపకల్పంవైపు కన్నెత్తి చూడొద్దని వివిధ దేశాలు తమ పౌరుల్ని హెచ్చరిస్తున్నాయి. ఇవి పరిష్కారాలు కాదు. అప్రమత్తంగా ఉంటూ, అన్ని రకాలుగా పటిష్టమైన చర్యలు తీసుకున్నప్పుడే ఈ తరహా ఉదంతాలను నివారించగలమని గుర్తించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement