అంపశయ్యపై మేను వాల్చిన భీష్మ పితామహుణ్ణి తలపిస్తూ ఎయిమ్స్‌లో దాదాపు రెండు నెల లుగా చికిత్స తీసుకుంటున్న రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గురువారం కన్నుమూశారు. పార్టీ ఏదైనా, సిద్ధాంతాలు వేరైనా రాజకీయాల్లో అందరూ అభిమానించే, ప్రేమించే నాయకులు అతి కొద్ది మంది ఉంటారు. అటువంటివారిలో వాజ్‌పేయి అగ్రగణ్యులు. 1957లో జరిగిన రెండో సార్వత్రిక ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని బల్‌రామ్‌పూర్ నియోజకవర్గం నుంచి ఎన్నికై లోక్‌సభలో అడుగిడిన వాజ్‌పేయి ఆదినుంచీ తన వాక్పటిమతో ఆకట్టుకునేవారు. కనుకనే మన దేశంలో పర్యటిస్తున్న ఒక దేశాధినేతకు వాజ్‌పేయిని పరిచయం చేస్తూ ‘ఈ యువ కుడు ఏదో ఒక రోజు ప్రధాని అవుతాడ’ని తొలి ప్రధాని నెహ్రూ అన్నారట. నాలుగు దశాబ్దాలు గడవకముందే ఆ వాక్కును వాజ్‌పేయి నిజం చేశారు. తొలిసారి 1996లో బీజేపీ అతి పెద్ద రాజ కీయ పక్షంగా అవతరించినప్పుడు 13 రోజుల వ్యవధిలో ప్రధాని కొలువు పోగొట్టుకున్నా... రెండో సారి 1998లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ మెజారిటీ స్థానాలు కైవసం చేసు కుని 13 నెలలపాటు మాత్రమే అధికారంలో ఉన్నా ఎప్పుడూ ఫిరాయింపులకూ, బేరసారాలకూ ఆయన తావీయలేదు. రెండోసారి కేవలం ఒకే ఒక్క ఓటుతో ప్రభుత్వం కూలిపోతుందని తెలిసినా ఆయన చెక్కు చెదరలేదు.
‘ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. పార్టీలు పుడతాయి, గిడతాయి. వీటన్నిటికీ అతీతంగా దేశం వెలుగులీనాలి. ప్రజాస్వామ్యం చిరస్థాయిగా వర్థిల్లాలి’ అంటూ అప్పుడా యన చెప్పిన మాటలు అందరినీ ఉద్వేగభరితుల్ని చేశాయి. ఆయన నీతినిజాయితీలను గమనించే 1999లో ఎన్‌డీఏకు జనం సుస్థిరమైన మెజారిటీ కట్టబెట్టారు. యువకుడిగా ఉన్నప్పుడు భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకుడు శ్యామప్రసాద్ ముఖర్జీకి కుడి భుజంగా మెలగుతూ... పాత్రికేయుడిగా పనిచేస్తూ... కవిగా తన సున్నిత మనోభావాలకు పదును పెట్టుకుంటూ... జనాన్ని మంత్రముగ్ధుల్ని చేసే ఉపన్యాసాలిస్తూ రాజకీయాల్లో వాజపేయి ఒక్కో మెట్టే అధిరోహించారు. అలా ఎదుగుతూనే ఉన్నత విలువలను ఒడిసి పట్టుకున్నారు. సాధారణ పార్లమెంటేరియన్‌గా ప్రతిపక్షంలో ఉన్నా... మంత్రి పదవిలో కొనసాగినా... ప్రధాని పదవిని అధిష్టించినా ఆయన ఈ విలువలను చేజారనీయ లేదు. దేశంలో తొలిసారి విజయవంతంగా సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపటంలో ఆయనకు అందివచ్చి నవి ఈ విలువలే. 2004లో అప్పటి ఎన్‌డీఏ కన్వీనర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబు ఇచ్చిన తప్పుడు సలహాతో గడువుకు ముందే లోక్‌సభను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి ఊహించని రీతిలో ఆయన ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
అత్యవసర పరిస్థితి ఎత్తేశాక 1977లో జరిగిన ఎన్నికల్లో జనతాపార్టీ అధికారంలోకొచ్చిన ప్పుడు మొరార్జీ ప్రభుత్వంలో ఆయన విదేశాంగమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అటు పాకి స్తాన్‌తో, ఇటు చైనాతో మనకెన్నో సమస్యలుండగా తీవ్ర జాతీయవాద భావాలను తలకెత్తుకునే జనసంఘ్ నేపథ్యం ఉన్న నేతకు ఈ పదవిని కట్టబెట్టడంలోని ఔచిత్యమేమిటని పలువురు ప్రశ్నిం చారు. కానీ అలాంటివారి అంచనాలన్నిటినీ తలకిందులు చేస్తూ దేశ చరిత్రలో ఆయన ఉత్తమ విదేశాంగమంత్రి అనిపించుకున్నారు. అంతక్రితం అనేక ఏళ్లుగా ఎడమొహం పెడమొహంగా ఉంటున్న చైనాతో సత్సంబంధాలు నెలకొల్పారు. పాకిస్తాన్‌తో సైతం సామరస్య వాతావరణం ఏర్పడటానికి కృషి చేశారు. ‘మీరు స్నేహితుల్ని మార్చుకోగలరు తప్ప పొరుగును మార్చుకోవడం అసాధ్యమ’ని ఆ సందర్భంలో ఆయనన్న మాటలు ఎన్నదగినవి. ప్రధానిగా కూడా ఈ రెండు దేశా లతో ఉన్న వైషమ్యాలు సమసిపోవాలని భావించారు. కశ్మీర్ సమస్యపై మూడో పక్షం జోక్యం లేకుండా భారత్–పాక్‌ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగాలని ప్రతిపాదించారు. ఢిల్లీ–లాహోర్ బస్సు సర్వీసును ప్రారంభించి రెండు దేశాల మధ్యా సుహృద్భావ వాతావరణం ఏర్పర్చడానికి ప్రయత్నించారు. అయితే పాకిస్తాన్ నుంచి ఆ చర్యలకు సానుకూల స్పందన రాకపోగా కార్గిల్‌లో చొరబాట్లు చోటు చేసుకుని ఇరు దేశాల మధ్యా ఘర్షణలు తలెత్తాయి. పోఖ్రాన్‌లో అమెరికా కన్ను గప్పి అణు పరీక్ష నిర్వహించటంలో ఆయన సర్కారు విజయం సాధించింది. అయితే ఈ చర్య పాకి స్తాన్‌ను సైతం అణ్వస్త్ర దేశంగా మార్చిందన్నది మరవలేం.
నెహ్రూ ప్రధానిగా ఉండగా ఆయన ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన చరిత్ర వాజ్‌పేయిది. కేరళలో ఏర్పడ్డ తొలి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినప్పుడైనా, చైనాతో కయ్యం ఏర్పడి నప్పుడు దానితో సక్రమంగా వ్యవహరించలేని అశక్తత ప్రదర్శించినప్పుడైనా ఆయన నెహ్రూ సర్కారును నిశితంగా విమర్శించారు. అదే సమయంలో నెహ్రూ ఉదారవాద భావాల ప్రభావం ఆయనపై ఉంది. స్వాతంత్రోద్యమ నేతగా, ప్రధానిగా ఆయన పాత్రను ఏనాడూ తక్కువ చేసి చూడలేదు. నెహ్రూ కన్నుమూసినప్పుడు వాజ్‌పేయిఅర్పించిన నివాళే ఇందుకు నిదర్శనం. హిందూత్వ సిద్ధాంతాన్ని విశ్వసించే బీజేపీకి అధినాయకుడిగా ఉన్నా, ఎన్‌డీఏ సర్కారుకు సారథ్యం వహించినా తప్పును తప్పుగా ఎత్తిచూపటంలో ఏనాడూ తడబడలేదు. బాబ్రీ మసీదు విధ్వంస సమయంలో, గుజరాత్ మారణకాండ సమయంలో ఆయన తన అభిప్రాయాలు దాచుకోలేదు. రాజకీయవేత్తగా ఆయన ఎన్నో నిమ్నోన్నతాలను చూసి ఉండొచ్చు. కానీ కవిగా ఆయన సున్నిత హృదయుడు. ‘సంవేదన్’ శీర్షికతో రాసిన కవితలో– ‘‘క్యా ఖోయా, క్యా పాయా జగ్ మే/మిల్తే ఔర్ బిచడ్తే మగ్ మే/ముఝే కిసీ సే నహీ( షికాయత్/యద్‌యాపీ చలా గయా పగ్–పగ్ మే/ఏక్ దృష్టి బీతీ పర్ డాలే యాదోంకి పోట్లి టటోలే(’’(కలిసి విడిపోయే ఈ ప్రయాణంలో/భూమ్మీద నాకు దక్కిందీ, పోగొట్టుకున్నదీ ఏమిటి?/ ప్రతి అడుగులో మోసాన్ని చూశాను/కానీ నాకు బాధలూ లేవు, ఫిర్యాదులూ లేవు/ఎందుకంటే, గతాన్ని మథిస్తూ స్మృతులు చెరుగుతున్నాను) అంటా రాయన. రాజనీతిజ్ఞుడు వాజపేయికి ‘సాక్షి’ వినమ్రంగా నివాళులర్పిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment