పకడ్బందీ చర్యలు అవసరం | Sakshi Editorial On Delhi Air Pollution | Sakshi
Sakshi News home page

పకడ్బందీ చర్యలు అవసరం

Published Wed, Nov 20 2019 12:28 AM | Last Updated on Wed, Nov 20 2019 12:28 AM

Sakshi Editorial On Delhi Air Pollution

దేశ రాజధాని నగరాన్ని ఊపిరి పీల్చుకోనీయకుండా చేస్తున్న వాయు కాలుష్యంపై మంగళవారం లోక్‌సభలో చర్చ మొదలైంది. బిల్లులపైనా, రాజకీయపరమైన అంశాలపైనా  తీవ్ర వాగ్యుద్ధాలు రివా జుగా మారిన చట్టసభలో చాన్నాళ్ల తర్వాత ఒక అత్యవసరమైన... పౌరుల మనుగడకు ముప్పుగా పరిణమించిన అంశంపై చర్చ జరగడాన్ని స్వాగతించాలి. అయితే 545మంది సభ్యులుండే లోక్‌ సభలో ఈ చర్చకు నిండా వందమంది ఎంపీలు కూడా లేకపోవడం విచారకరం. రోడ్లపై తిరిగే వాహ నాలను తగ్గించడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించాలన్న సంకల్పంతో వాటి నంబర్‌ప్లేట్ల ఆధా రంగా కార్లను అనుమతించే సరి–బేసి సంఖ్య విధానాన్ని  ఢిల్లీ ప్రభుత్వం ఈసారి కూడా అమల్లోకి తెచ్చింది. అయితే పంట వ్యర్థాలను తగలబెట్టే అలవాటును పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌ రైతులతో మాన్పించడంలో అక్కడి ప్రభుత్వాలు మరోసారి విఫలమయ్యాయి. పంట వ్యర్థాలను తగ లబెట్టకుండా వేరే ప్రత్యామ్నాయాలను చూపిస్తే రైతులు వాటినే అనుసరించేవారు. వాటితో బయో గ్యాస్‌ ఉత్పత్తి చేయొచ్చని చాన్నాళ్లక్రితమే నిపుణులు సూచించారు. కానీ ఇంతవరకూ ఆ దిశగా ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న దాఖలా లేదు. ఏటా 50 కోట్ల టన్నుల పంట వ్యర్థాలు తగలబెడు తున్నారని అంచనా. అంతమాత్రం చేత మొత్తం సమస్యంతటికీ ఇదే ప్రధాన కారణమని చెప్పడం సరికాదు. ఢిల్లీలో తిరిగే లక్షలాది వాహనాలు, ధూళి, ఆ నగరం చుట్టుపట్ల ఉండే పరిశ్రమలు, విద్యు దుత్పత్తి కేంద్రాలు, నిర్మాణ కార్యకలాపాలు వగైరా కారణాలెన్నో ఉన్నాయి.

ఏటా నవంబర్‌ నెల వచ్చేసరికి ఢిల్లీ వాతావరణం  ప్రమాదకరంగా ఉంటున్నది. ఊపిరితిత్తుల్ని సర్వనాశనం చేసే అత్యంత ప్రమాదకరమైన ధూళి కణాలు ఆ వాతావరణంలో నిండిపోతున్నాయి. ఆ నగర వాసులు దాదాపు మూడునెలలపాటు సూర్యోదయాన్ని చూడటం అసాధ్యమవుతోంది. ఒక ప్పుడు శీతాకాలం వస్తోందంటే దేశంలోని ఇతర ప్రాంతాల తరహాలోనే ఉత్తర భారతం కూడా పులకించిపోయేది. కానీ ఈమధ్యకాలంలో అదంతా మారింది. బడికెళ్లే పిల్లలున్న తల్లులు, ఉద్యో గాలు చేసేవారు మాస్క్‌లు కొనడం పెరిగింది. స్తోమత ఉన్నవారు, అవకాశం ఉన్నవారు ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి ఆ మూడు నాలుగు నెలలూ వేరే ప్రాంతాలకు వలసపోతున్నారు. ప్రభుత్వాలు తీసుకుంటున్న అరకొర చర్యల ప్రభావంపై నమ్మకంలేనివారు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తున్నారు. సర్వోన్నత న్యాయస్థానం గట్టిగా మందలించినా, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినా పెద్దగా ఫలితం ఉన్న దాఖలా లేదు. కార్లలో వెళ్లేవారు అద్దాలు బిగించుకుని ఏసీ పెట్టుకోవడమో, స్కూళ్లకు సెలవులివ్వడమో ఈ సమస్యకు పరిష్కారం కాదు. లోక్‌సభ చర్చ సందర్భంగా బీజేపీ సభ్యులంతా కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని తప్పుబట్టారు. కాలుష్య నియంత్రణకు తీసుకున్న చర్యలకంటే, వాటి ప్రచారానికే అధికంగా ఖర్చు పెట్టారని విమర్శించారు. అయితే సభలో ఆమ్‌ ఆద్మీ పార్టీకి కేవలం ఒక్క సభ్యుడు మాత్రమే ఉన్నారు గనుక ఈ ఆరోపణలకు గట్టిగా బదులిచ్చేవారు లేక పోయారు. లేకపోతే ఈ వాగ్యుద్ధం గంటల తరబడి సాగేది. కాలుష్యంపై వాణిజ్య ప్రకటనల కోసం ఢిల్లీ ప్రభుత్వం రూ. 600 కోట్లు ఖర్చు పెట్టిందని, అందులో సరి–బేసి విధానానికే రూ. 70 కోట్లు వెచ్చించిందని బీజేపీ సభ్యుల ఆరోపణ. ఢిల్లీలో విస్తృతంగా కాలుష్య నియంత్రణ టవర్లు నిర్మించడం అవసరమన్న ఒక సభ్యుడి సూచన సమస్యకు పరిష్కారం అనుకోలేం. వాటివల్ల ఎంతో కొంత నివా రణ సాధ్యం కావొచ్చు. కానీ కాలుష్య కారకాలను పూర్తిగా అరికట్టడంపై దృష్టి పెట్టడం అవసరం. 

నాలుగురోజుల క్రితం పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉండే పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం జరిగిన తీరు గమనిస్తే కాలుష్య నివారణ సంకల్పం ఎంత బలహీనంగా ఉందో అర్ధమవుతుంది. 29మంది సభ్యులుండే ఆ కమిటీలో చైర్మన్‌తోపాటు హాజరైంది కేవలం నలు గురు మాత్రమే. కమిటీలో సభ్యులుగా ఉన్న వేరే రాష్ట్రాల ఎంపీలు రాలేకపోతే ఎంతోకొంత అర్ధం చేసుకోవచ్చు. కానీ న్యూఢిల్లీ నుంచి ఎన్నికైన ఎంపీల్లో కేవలం బీజేపీ ఎంపీ గౌతమ్‌ గంభీర్‌కు మాత్రమే ఈ కమిటీలో సభ్యత్వం ఉండగా ఆయన కూడా గైర్హాజరయ్యారు. నేతల తీరిలా ఉంటే అధికారులైనా సక్రమంగా లేరు. ఆ సమావేశానికి హాజరై సభ్యులకు వారు సమస్య మూలాలను వివ రించవలసివుంది. కానీ వారికి కూడా తీరికలేకపోయింది! హాజరుకావాల్సిన అధికారుల్లో హౌసింగ్, పట్టణాభివృద్ధి వ్యవహారాలు, పర్యావరణం, కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు, ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్, ఢిల్లీ అభివృద్ధి సంస్థ తదితర అనేక శాఖల, విభాగాల వారున్నారు. అంటే ఎంపీలు హాజ రైనా వారి సందేహాలు తీర్చేవారెవరూ ఉండేవారు కాదు. బుధవారం మరోసారి ఈ కమిటీ సమా వేశం కాబోతోంది. గత సమావేశంలో సభ్యులు, ఉన్నతాధికారుల నిర్వాకంపై విమర్శలొచ్చినందు వల్ల రేపు కమిటీ  సమావేశం కిటకిటలాడే అవకాశం ఉంది. 

ఢిల్లీ, చుట్టుపట్ల ప్రాంతాల వాతావరణంలో అత్యంత ప్రమాదకరమైన నైట్రేట్, సల్ఫేట్, కార్బన్, సోడియం క్లోరైడ్, కాడ్మియం, పాదరసం వంటి అణువులుంటున్నాయి. ఇవి ఆస్తమా, క్షయ వంటి వ్యాధులతోపాటు కేన్సర్, హృద్రోగం వంటి ప్రాణాంతక రోగాలకు దారితీస్తున్నాయి. పౌరుల ప్రాణా లను తోడేస్తున్నవాటిలో వాయు కాలుష్యం అయిదో స్థానాన్ని ఆక్రమించిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. మనసుంటే మార్గముంటుంది. చైనా రాజధాని బీజింగ్‌ వాతావరణంలో ప్రమా దకరమైన అతి సూక్ష్మ ధూళి కణాలు(పీఎం 2.5) పరిమితికి మించి 45 రెట్లు ఎక్కువున్నాయని 2014 నాటి నివేదిక చెప్పగా, ఆ దేశం పకడ్బందీ చర్యలు తీసుకుని కేవలం అయిదేళ్లలో దాన్ని పూర్తిగా అదు పులోనికి తెచ్చింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఢిల్లీ వాయు కాలుష్యాన్ని తరిమేయడానికి ప్రభు త్వంతోపాటు అన్ని పార్టీలూ ఏకం కావాలి. బుధవారం లోక్‌సభలో కొనసాగే చర్చ ఆ దిశగా తీసు కునే చర్యలకు నాంది పలకాలని ఆశిద్దాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement