ఎవరేమనుకున్నా తాలిబన్‌లు పరివర్తన చెందారని నూరు శాతం నమ్ముతున్న అమెరికా ఆ సంస్థతో సర్దుకుపొమ్మని బుధవారం మరోసారి భారత్‌కు సలహా ఇచ్చింది. మొన్న ఫిబ్రవరిలో ఆ సంస్థతో అమెరికా ఒప్పందం కుదుర్చుకోవడానికి ముందూ, ఆ తర్వాతా కూడా మన దేశం అమెరికాకు తన అసంతృప్తిని తెలియజేసింది. కానీ వచ్చే నవంబర్‌లో జరిగే అధ్యక్ష ఎన్నికల సమయానికల్లా అఫ్ఘాన్ వ్యవహారం ముగిసిపోవాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆత్రంగా వున్నారు. అధికారం అప్పగిస్తే అఫ్ఘాన్ నుంచి అమెరికా సేనలను వెనక్కి తీసుకొస్తానని 2016 అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో ట్రంప్ వాగ్దానం చేశారు. అది నెరవేర్చినట్టు కనబడటం కోసమే ఈ ఆత్రమంతా. ఆయన అవసరాల మాటెలావున్నా అమెరికా నిర్ణయం వల్ల ఇబ్బందులేర్పడతాయని మన దేశం భావిస్తోంది.
అఫ్ఘాన్‌లోకి అమెరికా సేనలు ప్రవేశించి 19 ఏళ్లవుతోంది. ఆ దేశంలోని ఉగ్రవాద ముఠాలను అంతమొందిస్తానని 2001లో ప్రకటించి వెళ్లిన అమెరికా వరస నష్టాలు చవిచూసింది. వేలాదిమంది సైనికులు బలయ్యారు. ఎందరో గాయపడ్డారు. వేల కోట్ల డాలర్ల సొమ్ము ఆవిరైపోయింది. అది అమల్లోకి తెచ్చిన వ్యూహాలన్నీ బెడిసికొట్టాయి. దేశంలోని మూడోవంతు భాగం పూర్తిగా తాలిబన్‌ల చేతుల్లోకి పోగా, మిగిలిన ప్రాంతంలో నిత్యం అశాంతే. మందుపాతరలు, కారుబాంబులు పేలు తుండటం, పదులకొద్దీమంది మరణించడం అక్కడ రివాజు. దేశ రాజధాని కాబూల్‌లోకి సైతం ఉగ్రవాదులు చొరబడి విధ్వంసం సృష్టించడం కొనసాగుతూనేవుంది. ‘గ్రీన్‌జోన్’ పేరిట అమెరికా కార్యాలయాలన్నిటినీ పటిష్టమైన భద్రత మధ్య నడిపిస్తున్నా ఆ ప్రాంతం సైతం ఉగ్రవాదుల దాడు లతో దద్దరిల్లుతూనే వుంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా సేనలు అక్కడుండి సాధించేదేమీ లేదన్నది వాస్తవం. కానీ దశాబ్దాలపాటు ఆ దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకుని అక్కడ ఉగ్రవాదం పెరగడానికి, ప్రత్యేకించి తాలిబన్‌లు పుట్టుకురావడానికి కారణమైన అమెరికా ఇప్పటి కిప్పుడు తన స్వప్రయోజనాల కోసం ఒప్పందం పేరిట ఏదో ఒకటి కుదుర్చుకుని పలాయనం చిత్త గించాలని చూడటం ఈ ప్రాంతాన్ని మరింత సంక్లిష్టంగా మారుస్తుంది.
అఫ్ఘాన్‌లో ఒక్క తాలిబన్‌లు మాత్రమే లేరు. అక్కడ అనేక ఉగ్రవాద ముఠాలున్నాయి. తాలిబన్‌లే భిన్న రకాల వ్యక్తుల సమూహం. వీరెవరూ ప్రస్తుత దేశాధ్యక్షుడు అష్రాఫ్ ఘనీని లేదా ఆయన ప్రత్యర్థి అబ్దుల్లా అబ్దుల్లాను గుర్తించడం లేదు. నిరుడు సెప్టెంబర్‌లో జరిగిన దేశాధ్యక్ష ఎన్నికల్లో తానే గెల్చినట్టు ఘనీ ప్రకటించుకోగా, అసలు విజేతను తానేనని అబ్దుల్లా చెప్పుకున్నారు. అంత టితో ఆగక దేశాధ్యక్షుడినంటూ ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఒకపక్క తాలిబన్‌లతో శాంతి ఒప్పందం కుదుర్చుకుని, అక్కడినుంచి త్వరగా బయటపడాలని చూస్తున్న అమెరికాకు వీరిద్దరి గొడవా పెద్ద అడ్డంకిగా మారింది. కనుకనే తెరవెనక మంతనాలు జరిపి ఈ నేతలిద్దరి మధ్యా అవగాహన కుదిర్చింది.
అధికార పంపకంపై వారొక ఒప్పందానికొచ్చారు. అయితే వారిద్దరూ తెరమరుగు కావడం, తాలిబన్‌లు అధికారంలోకి రావడం ఇక ఎంతో దూరంలో లేదు. కానీ మన దేశం పరిస్థితేమిటన్నదే ప్రశ్న. తాలిబన్‌లకూ, ఇతర ఉగ్రవాద ముఠాలకూ పాకిస్తాన్ మద్దతు వుందన్నది బహిరంగ రహస్యం. ఈ ముఠాలన్నీ పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ నియంత్రణలోనే పనిచేస్తాయి. ఇదంతా తెలిసినా... అటు పాకిస్తాన్ నుంచీ, ఇటు తాలిబన్‌ల నుంచీ ప్రాంతీయ భద్రతకు సంబంధించి స్పష్టమైన హామీ లేకుండానే అమెరికా ఒప్పందం చేసుకుంది గనుక మన దేశం తన ప్రయోజనాల పరిరక్షణకు సొంతంగా వ్యూహ రచన చేసుకోక తప్పదు. తాలిబన్‌లతో మనకు చేదు అనుభవాలున్నాయి. పాతికేళ్లక్రితం అఫ్ఘాన్‌లో అధికారం చలాయించినప్పుడు పాక్ ఆదేశాలతో కశ్మీర్‌కు ఉగ్రవాదుల్ని తరలించి అక్కడ నెత్తురుటేర్లు పారించిన చరిత్ర తాలిబన్‌లది. అలాగే మన విమానాన్ని హైజాక్ చేసి జైళ్లలోవున్న ఉగ్రవాదుల్ని విడిపించుకున్నారు. వారు మరోసారి అధికారంలోకొస్తే ఆ మాదిరి అరాచకాలు సాగవన్న గ్యారెంటీ ఏం లేదు. పాకిస్తాన్–అఫ్ఘాన్ సరిహద్దుల్లో వందలాది ఉగ్రవాద శిబిరాలున్నాయి. అవి కొనసాగినంతకాలమూ మన దేశానికి సమస్యలు తప్పవు. భారత్ మా మిత్ర దేశమని తరచు చెప్పే ట్రంప్‌కు ఇవి గుర్తుకురాలేదు. భారత్ విషయంలో తాలిబన్‌ల నుంచి స్పష్టమైన హామీ తీసుకోవాలన్న స్పృహ లేదు.
తాము భారత్‌తో సఖ్యంగా వుంటామని ఈమధ్య తాలిబన్ ప్రతినిధి ప్రకటించాడు. కశ్మీర్ భారత్‌లో అంతర్భాగమని కూడా ఆయన చెప్పాడు. తాలిబన్ విధాన నిర్ణాయక కమిటీ షురా పాకిస్తాన్‌లోని క్వెట్టాలో వుంటుంది గనుక ఈ ప్రకటనను ఎంతవరకూ నమ్మవచ్చునో ఎవరికీ తెలియదు. ఒకవేళ తాలిబన్‌ల అభిప్రాయం అదే అయినా... పాక్ చిచ్చుపెట్టకుండా మౌనంగా వుంటుందా అన్నది ప్రశ్న. అయితే ఎటూ అఫ్ఘాన్‌లో అధికారం చేజిక్కించుకోబోతున్నది కనుక మన దేశం తాలిబన్ సంస్థతో ఏదో మేరకు అంగీకారానికి రాక తప్పదు. వారినుంచి కశ్మీర్‌కు ఉగ్రవాద బెడద లేకుండా చేయగలగటం అన్నది భారత్ ప్రస్తుత కర్తవ్యం. వారితో సైనికంగా తలపడితే అది పాక్‌కు మరింత సన్నిహితమవుతుంది. ఒకపక్క ఇరుగుపొరుగు దేశాలతో మన సంబంధాలు అంతంతమాత్రం. నేపాల్ సైతం భారత్‌పై గుర్రుగా వుంది. ఈ పరిస్థితుల్లో తాలిబన్ రూపంలో మరో సమస్య తలెత్తకుండా చూడటం ముఖ్యం. తమ గడ్డపై ఉగ్రవాదులకు ఆశ్రయమీయబోమని ఈమధ్యే తాలిబన్ ప్రతినిధి ఆన్‌లైన్ సదస్సులో చెప్పాడు. ఇప్పటికే మన దేశం అఫ్ఘాన్ పునర్ని ర్మాణానికి 300 కోట్ల డాలర్లు వ్యయం చేసింది. భారత్‌తో సుహృద్భావ సంబంధాలుంటే అటువంటి సహకారం కొనసాగుతుందన్న అభిప్రాయం తాలిబన్‌లకు కలగజేస్తే అది ప్రయోజనకరం కావొచ్చు. ఏదేమైనా అఫ్ఘాన్ విషయంలో భారత్ ఆచితూచి అడుగేయక తప్పదు.
Comments
Please login to add a commentAdd a comment