పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా గత రెండు నెలలుగా దేశ రాజధానిలోని షహీన్‌బాగ్‌లో సాగుతున్న ఆందోళన సుప్రీంకోర్టు జోక్యంతో కొత్త మలుపు తిరిగిందని చెప్పాలి. ఆందోళనలు జరుగుతుంటే, నిరసనలు పెల్లుబుకుతుంటే సమస్యలను వినడానికి పాలకులు సిద్ధపడాలి. ఆందోళనకారులు చేస్తున్న డిమాండ్లలో సహేతుకమైనవి వుంటే నెరవేర్చడానికి, లేనిపక్షంలో నచ్చజెప్పడానికి ప్రయత్నించాలి. వారి కోర్కెలు అసమంజమైనవైతే కనీసం ఆ సంగతైనా చెప్పాలి. మొత్తానికి సమస్యలున్నాయని భావించే వారితో మాట్లాడాలి. అది ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రాథమిక లక్షణం. ఈమధ్య ఒక చానెల్‌తో మాట్లాడిన సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆందోళనకారులతో చర్చించడానికి సిద్ధంగా వున్నామని ప్రకటించినప్పుడు అందరూ హర్షించారు. తాము అమిత్ షా కార్యాలయానికి వెళ్లి చర్చిస్తామని ఉద్యమకారులు కూడా ప్రకటించారు. ఒక ప్రతినిధి బృందంగా వెళ్లే ప్రయత్నం చేస్తే వారికి అనుమతి లభించేదేమో.
కానీ ఉద్యమకారులు ఆ ప్రతిపాదన తిరస్కరించి దాదాపు అయిదు వేలమందితో ఊరేగింపుగా వెళ్తామని ప్రకటించారు. పోలీసులు అనుమతించకపోవడంతో అది కాస్తా మూలనబడింది. ఈ దశలో సర్వోన్నత న్యాయస్థానం తీసుకున్న చొరవ ప్రశంసనీయమైనది. ఉద్యమకారులతో చర్చించడం కోసం సీనియర్ న్యాయవాది సంజయ్ హెగ్డే, న్యాయవాది సాధనా రామచంద్రన్, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ వాజత్ హబీబుల్లాలతో ఒక కమిటీని ఏర్పాటు చేయడంతోపాటు వారంలోగా ఉద్యమకారులతో చర్చించి నివేదిక అందజేయాలని జస్టిస్ కిషన్ కౌల్, జస్టిస్ కేఎం జోసెఫ్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు చేసిన వ్యాఖ్యలు గమనించదగ్గవి. నిరసన తెలియజేయడానికి పౌరులకుండే హక్కును ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలూ గుర్తించాయని చెబుతూ, దానిని అనుమతించాల్సిందేనని ధర్మాసనం తెలిపింది. అది పౌరులకుండే ప్రాథమిక హక్కని కూడా వివరించింది. అయితే నిరసన ఎక్కడ తెలియజేయాలన్న విచక్షణ ఉండాలని అభిప్రాయపడింది. ప్రజలు నిత్యం ఉపయోగించే రహదారిని దిగ్బంధించి నిరసనలు కొనసాగించడం ఆందోళనకరమని వ్యాఖ్యానించింది. కోర్కెలు ఎంత సమంజసమైనవి అయినా రహదారుల దిగ్బంధం చేస్తూ పోయే ధోరణి ఎంతవరకూ సబబని ప్రశ్నించింది. సుప్రీంకోర్టు ఆత్రుత అర్ధం చేసుకోదగిందే. షహీన్‌బాగ్ నిరసనకారులు అంబులెన్స్‌లను సైతం అనుమతించడం లేదన్న సొలిసిటర్ జనరల్ ఫిర్యాదు విపరీతమైనదే కావొచ్చుగానీ, అక్కడ రహదారి దిగ్బంధించడం వల్ల సమీప ప్రాంతాలవారు సమస్యలు ఎదుర్కొంటున్నారన్న మాట వాస్తవం.
షహీన్‌బాగ్ నిరసనకు ఒక విలక్షణత ఉంది. ఈ ఉద్యమానికి సారథ్యం వహిస్తున్నది మహిళలే అయినా, వారిలో ప్రముఖులనదగ్గవారెవరూ లేరు. ఇందులో పాల్గొంటున్న వేలాదిమందిలో అత్యధికులు మహిళలు. వారిలో ముస్లిం మహిళలు ఎక్కువ. నెలల పిల్లలున్న తల్లుల నుంచి వృద్ధ మహిళల వరకూ అనేకులు అందులో పాలుపంచుకుంటున్నారు. వందేళ్లుగా ఎన్నడూ లేనంత స్థాయిలో చలి ఢిల్లీని వణికించినప్పుడు కూడా వారంతా రాత్రింబగళ్లు నిరసన శిబిరంలోనే ఉండిపోయారు. నిరసనల ఉద్దేశం ప్రధానంగా పదిమందికీ తమ గోడు వినబడాలన్నదే. సమస్యేమిటో అందరికీ తెలిస్తే, అర్థమైతే ప్రభుత్వాలపై ఒత్తిళ్లు వస్తాయని, తమ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయని ఉద్యమంలో పాలుపంచుకునేవారు భావిస్తారు. పరిష్కారం సంగతి వదిలేస్తే షహీన్‌బాగ్ నిరసనోద్యమకారులు కోరుకుంటున్నదేమిటో దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరికీ తెలిసిందన్నది వాస్తవం. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశంలోని పలు నగరాలు, పట్టణాల్లో సైతం ధర్నా శిబిరాలు వెలిశాయి. ఆ ఆందోళనలపైనా, కేంద్రం తీసుకున్న నిర్ణయాల్లోని సహేతుకతపైనా అన్ని స్థాయిల్లో అనుకూలంగా, వ్యతిరేకంగా అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. తమకున్న మత విశ్వాసాలతో సంబంధం లేకుండా అనేకులు వాటిపై తమ వైఖరేమిటో చెబుతున్నారు. పలు రాష్ట్ర ప్రభుత్వాలు తాము ఎన్‌ఆర్‌సీ, సీఏఏలను అనుమతించబోమని, ఎన్‌పీఆర్‌ను ఒప్పుకునేది లేదని ప్రకటించడాన్ని ఈ నేపథ్యంలోనే చూడాలి. అదీగాక అస్సాంలో ఎన్‌ఆర్‌సీ నిర్వాకమేమిటో తెలిశాక అందరిలోనూ సందేహాలు అలుముకున్నాయి. కనుక షహీన్‌బాగ్ నిరసనల ఉద్దేశం నెరవేరిందని చెప్పాలి.
ప్రజల్ని ఒప్పించడం లేదా వారడుగుతున్న డిమాండ్లను పరిశీలించి ఏదో ఒక నిర్ణయం తీసుకోవడమనేది ప్రభుత్వాల చేతుల్లోనే వుంటుంది. ప్రజలద్వారా ఎన్నికై అధికారంలోకొచ్చినవారికి అలాంటి నిర్ణయాలు తీసుకోవడమనేది ఒక అధికారం మాత్రమే కాదు...బాధ్యత కూడా. సుప్రీంకోర్టు ఇలాంటి అంశాల్లో కేవలం ఒక సంధానకర్తగా, దోహదకారిగా మాత్రమే వ్యవహరించగలదు. ఈ విషయంలో ధర్మాసనానికి స్పష్టత ఉంది. అందుకే చర్చలు జరిపే బాధ్యతను కార్యనిర్వాహకవర్గం తీసుకుని ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా మరో మాట కూడా చెప్పింది. ‘ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఇందులో విఫలమైతే ఏం చేయాలన్నది అధికారులకే విడిచిపెడతాం’ అని తేటతెల్లం చేసింది. నిరసనలు చేస్తున్నవారు ఇంతక్రితం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌ను కలుసుకున్నారు. తమ కోర్కెలు వివరించారు. కానీ ఏం చేయాలన్నా కేంద్ర ప్రభుత్వమే చేయగలదు. షహీన్‌బాగ్ నిరసనలు శాంతియుతంగా సాగుతున్నాయి. కనుక వారితో చర్చించేందుకు కేంద్రానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. అలాగే డిమాండ్లు నెరవేరేవరకూ ఉద్యమాన్ని ఆపకూడదని ఆందోళనకారులు అనుకుంటే సుప్రీంకోర్టు సూచించిన విధంగా నిరసన వేదికను మరో చోటకు మార్చుకోవడానికి వారు సిద్ధపడాలి. ఆ అవసరం లేకుండా చర్చల ద్వారా ఈ సమస్యకొక పరిష్కారాన్ని సాధించగలిగితే అది పాలకుల గౌరవాన్ని పెంచుతుంది.
Comments
Please login to add a commentAdd a comment