అంతలోనే నరేంద్రమోదీ కథ అడ్డం తిరిగిందా? నాలుగు మాసాల క్రితం ప్రభంజనం సృష్టించిన మోదీ ఇంత వేగంగా సమ్మోహన శక్తిని కోల్పోయాడా? పది రాష్ట్రాలలో మూడు లోక్‌సభ స్థానాలకూ, 33 అసెంబ్లీ స్థానాలకూ జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ దాదాపు సగం స్థానాలు కోల్పోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? సార్వత్రిక ఎన్నికలలో భాజపా ఘనవిజయాలు సాధించిన ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలలో కమలనాథులకు బలమైన ప్రతికూల పవనాలు వీచడం వెనుక కారణాలు ఏమిటి? కేంద్రంలో మోదీ సర్కార్ పనితీరు పట్ల వైముఖ్యమా? రాష్ట్రాలలో బీజేపీ నేతల నిర్వాకమా? లేకపోతే భాజపా కొత్త సారథి అమిత్ షా వైఫల్యమా?
మొన్నటి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసి గెలిచిన భాజపా సభ్యులు అసెంబ్లీ స్థానాలకు రాజీనామా చేసిన కారణంగా అవసరమైన ఉప ఎన్నికలలో భాజపా, దాని మిత్రపక్షాలు అవలీలగా గెలుపొందుతాయని అందరూ ఊహించారు. చావుదెబ్బ తిన్న కొద్ది మాసాలకే సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు లేచినిలబడతాయని కానీ, సీట్లు గెలుచుకుంటాయని కానీ ఎవ్వరూ అనుకోలేదు. లోక్‌సభ ఎన్నికలలో భాజపా విజయం విస్తృతి ఎంత అనూహ్యమో ఈ ఉప ఎన్నికలలో ఆ పార్టీ ఓటమి సైతం అంతే ఆశ్చర్యకరం. లోక్‌సభ ఎన్నికలలో భాజపా అద్భుత విజయానికి ప్రధాన కారణం మోదీ అసాధారణ ప్రచార వ్యూహం అయితే, రెండవ ముఖ్యకారణం కాంగ్రెస్ దయనీయ స్థితి. పదేళ్ల అస్తవ్యస్త పరిపాలన, కుంభకోణాల ఫలితంగా దిగజారిన ఆత్మవిశ్వాసం, పేలవంగా సాగిన ఎన్నికల ప్రచారంతో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు పోలింగ్‌కు పూర్వమే పరాజయాన్ని అంగీకరించాయి. యూపీఏ ప్రభుత్వ వైఫల్యాలనూ, అవినీతి చరిత్రనూ ఎండగడుతూ నరేంద్రమోదీ శక్తిమంతంగా సాగించిన ఎన్నికల ప్రచార హోరు, ప్రసార, ప్రచార సాధనాలను అత్యంత చాకచాక్యంగా ఆయన వినియోగించుకున్న తీరు భాజపాకు అపూర్వమైన ఫలితాలు సాధించిపెట్టాయి. నాలుగు నెలల కిందటి వాతావరణం వేరు. అప్పటి ఎన్నికలలో ఓటర్లు జాతీయ ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయాలో నిర్ణయించారు. చాలా స్పష్టమైన, నిర్మాణాత్మకమైన, అర్థవంతమైన తీర్పు ఇచ్చారు. జాతీయ స్థాయిలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడటానికి దారి చూపించారు. రాష్ట్రాలలో గత వారం జరిగిన ఎన్నికలపైన ఆయా రాష్ట్రాలలోని రాజకీయ వాతావరణం, అక్కడి ప్రజల మధ్య నలుగుతున్న చర్చనీయాంశాలు ప్రభావం చూపించాయి.
అన్నిటికంటే ముఖ్యంగా ఉప ఎన్నికలలో వివిధ పార్టీలు అనుసరించిన వ్యూహాలు ఫలితాలను నిర్ణయించాయి. ఈ వ్యూహాలు సార్వత్రిక ఎన్నికలలో విజయాన్ని లేదా పరాజయాన్ని ఆయా పార్టీలు అర్థం చేసుకున్న విధానం ప్రకారం రూపొందుతాయి.
ఎన్నికలలో పరాజయాన్ని అర్థం చేసుకోవడం తేలిక. విజయాన్ని అర్థం చేసుకోవడం కష్టం. అమిత్ షా యూపీలో తన ఘనవిజయాన్ని అపార్థం చేసుకున్న కారణంగానే ఆ రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రచార బాధ్యతను మతతత్వం మూర్తీభవించిన యోగి ఆదిత్యనాథ్‌కు అప్పగించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో సృష్టించిన మతావేశ పూరితమైన వాతావరణం, మతప్రాతిపదికపైన ప్రజల సమీకరణం కారణంగా యూపీలో మొత్తం 80 లోక్‌సభ స్థానాలలోనూ 71 స్థానాలను భాజపా కైవసం చేసుకున్నదని భ్రమించిన భాజపా ప్రేమోగ్రవాదం (లవ్‌జిహాద్) పేరుమీద చేసిన ప్రమాదకరమైన ప్రచారాన్ని ప్రజలు హర్షించలేదు. మోదీ నియోజకవర్గం వారణాసి సరిహద్దులోని అసెంబ్లీ స్థానంలో సైతం ఎస్‌పీ గెలుపొందింది. భాజపా ఓడిపోయినంత మాత్రాన యూపీ ముఖ్యమంత్రి చెప్పుకున్నట్టు మతశక్తులు పరాజయం పాలై లౌకికశక్తులు విజయం సాధించాయని భావించనక్కరలేదు. ఎస్‌పీ గెలుపొందిన మాట వాస్తవమే కానీ ఆ పార్టీ లౌకికపార్టీ అని చెప్పుకునే అర్హత... నిరుడు ముజఫర్‌నగర్‌లో మతకలహాలు చెలరేగినప్పుడు అఖిలేశ్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు అభిశంసించినప్పుడే కోల్పోయింది. ఈ ఎన్నికల్లో బీఎస్పీ పోటీచేయకపోవడం కూడా ఎస్పీకి లాభించిందని భావించాలి. గుజరాత్‌లోని తొమ్మిది భాజపా స్థానాలలో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం కొత్త ముఖ్యమంత్రి ఆనందినీ బెన్‌ను ఆ రాష్ట్ర ప్రజలు పూర్తిగా ఆమోదించ లేదనీ, మోదీ హస్తినకు వెళ్లడాన్ని పూర్తిగా జీర్ణించుకోలేదనీ భావించాలి. ఇక రాజస్థాన్‌లో నాలుగు స్థానాలలో మూడింటిని అధికార పార్టీ కోల్పోవడానికి కారణం ముఖ్యమంత్రి వసుంధరా రాజే సింధియా పాలన తీరుతెన్నుల పట్ల ప్రజలు ప్రదర్శించిన ఆగ్రహంగా గుర్తించాలి. కొన్ని మాసాల కిందటే మొత్తం 200 అసెంబ్లీ స్థానాలలో 163 స్థానాలు కైవసం చేసుకొని ఘనవిజయం సాధించిన వసుంధర పదకొండు మందికే కేబినెట్‌ను పరిమితం చేయడం, తన చేతిలో 47 శాఖలు పెట్టుకోవడం, ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేయడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలుసుకోవాలి.. మోదీ, ములాయంసింగ్ యాదవ్, సరికొత్త రాష్ట్రం ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఖాళీ చేసిన లోక్‌సభ స్థానాలను వారి పార్టీ అభ్యర్థులే గెలుచుకోవడంలో ఆశ్చర్యం లేదు. మెదక్ లోక్‌సభ స్థానంలో విజయబావుటా ఎగురవేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి తన ప్రాబల్యాన్ని నిలుపుకున్నట్టు నిరూపించుకున్నది. అదే విధంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలుగుదేశం తన పార్టీకి చెందిన నందిగామ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకున్నది.
ఈసారి వైఎస్సార్‌సీపీ రంగంలో లేకపోవడం అక్కడ టీడీపీకి ఎక్కువ మెజారిటీ రావడానికి కారణమయింది. దేశవ్యాప్తంగా జరిగిన ఉపఎన్నికల ఫలితాలు భాజపాకు మొదటి హెచ్చరిక చేశాయి, వాపును బలుపుగా భావించరాదనీ, ప్రభంజనం ఒకసారి వచ్చి వెళ్లిపోయేదే కానీ శాశ్వతంగా ఉండదనీ భాజపా నేర్చుకోవలసిన మొదటి పాఠం. క్షేత్రస్థాయిలో బలం పెంచుకోకుండా ప్రతిసారీ అదృష్టం వరిస్తుందని ఆశించడం అత్యాశ. యూపీలో మతభావనలు రెచ్చగొట్టడం ద్వారా సమాజాన్ని మతప్రాతిపదికపైన చీల్చిన ఫలితంగా లోక్‌సభ ఎన్నికలలో యూపీలో ఘనవిజయం సాధించినట్టు భాజపా అంచనా వేసుకోవడం శుద్ధతప్పు అని కూడా గ్రహించాలి. వ్యూహాత్మకంగా మోదీ అభివృద్ధి మంత్రాన్ని ప్రచారం చేస్తూ అమిత్ షా మతావేశాన్ని రాజేసే కార్యక్రమాలను పరోక్షంగా అనుమతిస్తూ సాగించిన జమిలి వ్యూహం విజయానికి కారణం కాదనీ, ఆత్మవిశ్వాసం ఉట్టిపడే మోదీ సకారాత్మక ప్రచారం, ఆత్మన్యూనతకు లోనైన కాంగ్రెస్ పేలవమైన పోరాటం సార్వత్రిక ఎన్నికలలో భాజపాకి కనీవినీ ఎరుగని విజయం అందించాయని అధికారపార్టీ అగ్రనాయకత్వం అర్థం చేసుకోవాలి. ఘోరపరాజయం పాలైనప్పటికీ సర్వస్వం కోల్పోలేదనీ, పార్టీని పునర్నిర్మించుకునే అవకాశం ఉన్నదనీ కాంగ్రెస్ పార్టీకి ఉప ఎన్నికలలో సందేశం ఉంది.
కంగుతిన్న కమలనాథులు
Published Tue, Sep 16 2014 11:44 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement