సమరాంగుణ | special story to bjp leader Rita Bahuguna | Sakshi
Sakshi News home page

సమరాంగుణ

Published Sun, Feb 19 2017 11:23 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

సమరాంగుణ - Sakshi

సమరాంగుణ

ఏడు విడతలుగా జరుగుతున్న ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో నిన్న ఆదివారం మూడో విడత పోలింగ్‌ ముగిసింది. పోలింగ్‌ జరిగిన 69 నియోజకవర్గాలలోనూ అత్యంత కీలకమైన లక్నో కంటోన్మెంట్‌లో ప్రధానంగా బహుజన సమాజ్‌పార్టీ (బిఎస్పీ), భారతీయ జనతాపార్టీ
(బీజేపి), సమాజ్‌వాది పార్టీ (ఎస్పీ) ల మధ్యే పోటీ నడిచింది. ఈ మూడు పార్టీలలోనూ మళ్లీ బీజేపీ, ఎస్పీల మధ్యే గట్టి ఫైట్‌ జరిగింది. ఇందుకు ఒక కారణం ఈ రెండు పార్టీల అభ్యర్థులూ మహిళలే కావడం. ఇంకో కారణం ఆ ఇద్దరు మహిళలూ సీనియారిటీలో ఒకరు, సీఎం ఇంటి నుంచి ఒకరు ప్రముఖ వ్యక్తులు కావడం! ములాయం సింగ్‌ యాదవ్‌ చిన్న కోడలు అపర్ణ... సమాజ్‌వాది పార్టీ నుంచి, డాక్టర్‌ రీటా బహుగుణ జోషి.. బీజేపీ నుంచి ఒకరితో ఒకరు తలపడ్డారు. కౌంటింగ్‌ మార్చి 11న. ‘ఎన్నికలవారి’ కుటుంబం కనుక అపర్ణ గెలవడంలో ఆశ్చర్యం లేదు. రీటా బహుగుణ ఓడిపోతేనే విశేషం. ఎందుకంటే రీటా... కాంగ్రెస్‌ అనే పెద్దింటి నుంచి వచ్చి, అంతే పెద్దదైన బీజేపీ అనే మెట్టినింట అడుగుపెట్టిన అమ్మాయి.


రీటా బహుగుణ 2016 అక్టోబర్‌ 20న ‘వాస్తవాధీన హస్తరేఖ’ దాటి బీజేపీలోకి వచ్చేశారు. భారత సైనికులు 2016 సెప్టెంబర్‌ 29న వాస్తవాధీన రేఖ దాటి వచ్చిన పాక్‌పై సర్జికల్‌ స్ట్రైక్స్‌ జరిపారు. ఏమిటి కారణం ఈ రెండు ఘటనలకు? సహనం నశించడం! 24 ఏళ్లుగా కాంగ్రెస్‌కు కాపుకాసిన తనను పక్కన పెట్టి, యూపీలో ముఖ్యమంత్రి అభ్యర్థిగా షీలాదీక్షిత్‌ను పార్టీ పైకి తేవడంతో బహుగుణ షాక్‌కు గురయ్యారు.  వెనువెంటనే సహనం కోల్పోకుండా ఉండేందుకు కొంత సమయం తీసుకున్నారు. భారత సైన్యం కూడా అంతే! చూసింది.. చూసింది. పాక్‌ మాట వినకపోవడంతో సహనం కోల్పోయి షాక్‌ ఇచ్చింది. సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసింది. ఏమిటి సంబంధం ఈ రెండు పరిణామాలకు? బీజేపీలో చేరడానికి బహుగుణ చెప్పని కారణం షీలాదీక్షిత్‌ అయితే, చెప్పిన కారణం.. సర్జికల్‌ స్ట్రైక్స్‌! ‘సైనికులు రక్తం చిందిస్తుంటే, మోదీజీ ఆ సైనికుల వెనుక దాక్కున్నారు’ అని కాంగ్రెస్‌ కామెంట్‌ చేసింది. ఆ కామెంట్‌ నచ్చకనే తను బీజేపీలోకి వచ్చినట్టు రీటా బహుగుణ చెప్పుకున్నారు.

ప్రతీకారంలో.. అసమాన ప్రతిభ!
కామెంట్‌లకు తీరిగ్గా చింతించేంత సున్నిత హృదయురాలేమీ కాదు రీటా. కామెంట్‌లకు వెంటనే కోపం తెచ్చుకునేంత అపరిణత మనస్కురాలు కూడా కాదు. రాటు దేలిన పొలిటికల్‌ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ అమెది! ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంతి హెచ్‌.ఎన్‌. బహుగుణ కూతురు ఆమె. ఎంపీ కమలా బహుగుణ ముద్దుల కూతురు ఆమె. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి విజయ్‌ బహుగుణ చెల్లెలు ఆమె. అలహాబాద్‌ మేయర్‌ ఆమె. అఖిలభారత మహిళా కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ ఆమె. జాతీయ మహిళా కౌన్సిల్‌ ఉపాధ్యక్షురాలు ఆమె. ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షురాలు ఆమె. అన్నిటినీ మించి కాంగ్రెస్‌ పార్టీ ఆడకూతురు ఆమె! అయితే ఇవన్నీ అతి ప్రాచీనమైన విషయాలు. ఈ కాంగ్రెస్‌ రాజనీతిజ్ఞురాలు ప్రస్తుతం బీజేపీ కార్యకర్త! ఇప్పుడామె భుజంపై వేసుకున్న కార్యం.. అపర్ణా యాదవ్‌పై గెలిచి, లక్నో కంటోన్మెంట్‌ సీటును  బీజేపీకి బహుమతిగా ఇవ్వడం! బహుగుణ ఇచ్చిన బహుమతిగా అమిత్‌షా మెప్పు పొందడం. కాంగ్రెస్‌ను కుళ్లికుళ్లి చచ్చేలా చేయడం. కానీ ఒక్కసీటు పోయినందుకు కాంగ్రెస్‌ కుళ్లికుళ్లి చస్తుందా? చావదు. రీటాను కోల్పోయినందుకు మాత్రం చస్తుంది. కాంగ్రెస్‌ను వదిలి రీటా వెళ్లిపోవడానికి, మిగతావాళ్లు వెళ్లిపోవడానికీ తేడా ఉంది. ప్రత్యర్థికి ఫినిషింVŠ  టచ్‌ ఇవ్వడంలో రీటా.. కాంగ్రెస్‌ పరిభాషలో ప్రతిభావంతురాలు. యూపీలో ఆ ప్రతిభ ఇప్పుడు కాంగ్రెస్‌ దగ్గర లేదు.

మాటను వదిలితే.. అది బాణమే!
మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రీటా 14 రోజులు జైల్లో ఉన్నారు. ఆ తర్వాత మళ్లీ మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రాహుల్, దిగ్విజయ్‌సింగ్‌లతో పాటు పోలీసు కస్టడీలో ఉన్నారు. రీటా ఎం.ఎ. చదువుకున్నారు. హిస్టరీలో పీహెచ్‌డీ చేశారు. అలహాబాద్‌ యూనివర్సిటీలో ఇప్పటికీ ఆమె మధ్యయుగాల, ఆధునిక కాలాల చరిత్రను  బోధిస్తూ ఉంటారు. ఐక్యరాజ్య సమితి ఆమెకు ‘మోస్ట్‌ డిస్టింగ్విష్డ్‌ ఉమెన్‌ ఇన్‌ సౌత్‌ ఏషియా’ అంటూ ఎక్స్‌లెన్స్‌ అవార్డు కూడా ఇచ్చింది. అయితే రీటా రాజకీయ జీవితంలో ఇవేవీ ఆమె అసలైన పాటవాలు కావు. కాంగ్రెస్‌లోకి రాకముందు ఆమె రాసిన చరిత్ర పుస్తకాలు సైతం పార్టీలో ఆమెకు ఇవ్వని గుర్తింపును.. సుతిమెత్తగా కనిపించే ఆమెలోని సూదంటు స్వరం ఇచ్చింది. ఆ స్వరంలోంచి బాణాల్లా దూసుకొచ్చే మాటలు ఇచ్చాయి. పార్టీలో ఆమెను ప్రముఖురాలిగా చేసిన ఆ మాటలే.. కొన్నిసార్లు ఆమెను చట్టం దృష్టిలో దోషినీ చేశాయి.

మాయావతికి కోటి పరిహారం!
రీటా ప్రసంగం మరీ అంత రెచ్చగొట్టేలా ఏమీ ఉండదు కానీ ఆ గొంతులో ఎంతో సౌమ్యంగా గంధకం మండుతుంది. ఓసారి రీటా ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతల సమస్యలపై మాట్లాడుతున్నారు. రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు ఎక్కువైపోయాయి అన్నారు. అత్యాచార బాధితులకు చేతిలో ఓ పాతిక వేలు పెట్టి మాయావతి చేతులు దులుపుకుంటోంది అన్నారు. అంతవరకు బాగుంది. ఇంకొంచెం ముందుకు వెళ్లారు రీటా. ‘డబ్బు తీసుకోకండి. డబ్బు ఇవ్వబోతే మాయావతి ముఖాన కొట్టండి’ అని అత్యాచార బాధితులకు పిలుపునిచ్చారు. అక్కడితో ఆగలేదు. ‘నీపై కూడా అత్యాచారం జరుగుతుంది. అప్పుడు నీకు మేము కోటి రూపాయల పరిహారం ఇస్తాం’ అని మాయవతిని ఉద్దేశించి అన్నారు! అలా అన్నప్పుడే మొరాదాబాద్‌ జైల్లో రీటా రెండు వారాల పాటు జ్యుడీషియల్‌ రిమాండులో ఉండవలసి వచ్చింది. ఇంకోసారి పశ్చిమ యూపీలోని భట్టా పర్సౌల్‌ గ్రామంలో రైతు సమస్యలపై మాట్లాడుతున్నారు రీటా బహుగుణ. పక్కన రాహుల్, దిగ్విజయ్‌సింగ్‌ కూడా ఉన్నారు. రైతుల ఇక్కట్లకు కారణం మాయావతేనని రీటా అంటున్నారు. రైతుల ఉసురు తీస్తున్న ఈ ప్రభుత్వాన్ని కలుపు మొక్కల్లా ఏరిపారేద్దాం రండి అన్నారు. మీరట్‌ రేంజి పోలీసులు పరుగున అక్కడి వచ్చారు. రీటాను, మిగతా నాయకులను అదుపులోకి తీసుకున్నారు.

ఖాకీ రంగ్‌ కి హాఫ్‌ ప్యాంట్‌ వాలే
మహిళా ఉద్యమాలలో పాల్గొని, మహిళా రిజర్వేషన్‌ల కోసం పట్టుపట్టి, మహిళలకు సమన్యాయం కోసం పోరాడిన రీటా బహుగుణ.. ఒక మహిళ అయిన మాయవతి విషయంలో మాత్రం ఏమాత్రం సహానుభూతితో లేకపోవడం వింతగా అనిపిస్తుంది. ఆ మాటకొస్తే శుక్రవారం వరకు జరిగిన ఎన్నికల ప్రచారంలో రీటా తన రాజకీయ ప్రత్యర్థి అపర్ణతో కూడా అంతే విసురుగా ఉన్నారు! ‘ఆ పిల్లకు సభ్యతగా మాట్లాడ్డం తెలీదు. పొగరుగా ఉంటుంది. నేలపైకి దిగి నడవాలని నా సలహా’ అని అపర్ణ గురించి అన్నారు రీటా. అపర్ణ కూడా తక్కువేం అనలేదు. ‘ఆవిడ ఎంత సభ్యతగా మాట్లాడేవారో నేను విన్నాను. అయినప్పటికీ నేను ఆవిడను గౌరవిస్తాను. పెద్దల్ని గౌరవించడం మన సంప్రదాయం కదా’ అని అంటించారు.

కాంగ్రెస్‌ యు.పి.చీఫ్‌ రాజ్‌ బబ్బర్‌ కూడా రీటాపై అసహనంతో ఉన్నారు. ఆ అసహనం ఆమె కాంగ్రెస్‌ నుంచి వెళ్లిపోయినందుకో, బీజేపీలో చేరినందుకో స్పష్టంగా తెలియనివ్వడం లేదు బబ్బర్‌. ‘ఖాకీ రంగ్‌ కి హాఫ్‌ ప్యాంట్‌ వాలే.. అపర్ణ చేతిలో ఓడిపోవడం ఖాయం’  అని ఆయన కామెంట్‌ చేశారు. అయితే ఓటమికి చలించిపోయే మనిషి కాదు రీటా బహగుణ జోషీ. 2014లో లక్నో నుంచి రాజ్‌నాథ్‌సింగ్‌పై లోక్‌సభకు పోటీ చేసి ఓడిపోయారు. 2009లోనూ అదే నియోజకవర్గంలో లాల్జీ లాండన్‌పై పోటీ చేసి విజయం సాధించలేకపోయారు.

అప్పుడలా.. ఇప్పుడిలా...
రీటా బహుగుణ బీజేపీలో చేరాక ఆర్ణబ్‌ గోస్వామి, మరో ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ çసర్దేశాయ్‌ ఆమెను ఇంటర్వూ్య చేశారు. ‘మోదీజీ రెండేళ్ల పాలననీ, మోదీజీ అచ్ఛేదిన్‌ని, మోదీజీ స్వచ్ఛభారత్‌ని, మోదీజీ గోద్రా దారుణాలను విమర్శించారు. ఇప్పుడేమో మోదీజీకి ప్రత్యామ్నాయం లేదు అంటున్నారు! అకస్మాత్తుగా ఇప్పుడు మోదీజీ మంచివారు ఎలా అయ్యారు? బీజేపీలో మీరెలా చేరారు? అని అడిగారు. అన్నిటికీ రీటా చెప్పిన సమాధానం ఒక్కటే. వాటి అర్థం.. సర్జికల్‌ స్ట్రైక్స్‌ మోదీజీని పునీతుణ్ణి చేశాయని! అయితే ఈ ఎన్నికల్లో రీటా బహుగుణ గెలిస్తే కనుక అదే మాటను ఆమె మరింత స్పష్టంగా చెప్పడానికి ఉత్సాహం కనబరచవచ్చు.   

రీటా బహుగుణ జోషి (67)
జననం    :    1949 జూలై 22
జన్మస్థలం    :    ఉత్తరాఖండ్‌
పార్టీ    :    కాంగ్రెస్‌ (1992–2016) బీజేపీ (2016 నుండి)
ప్రాతినిధ్యం    :    లక్నో కంటోన్మెంట్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే  (2012 నుంచి)
ప్రస్తుతం    :    మళ్లీ అదే స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ.
తల్లిదండ్రులు    :    దివంగతులు బహుగుణ, కమల
తోబుట్టువులు    :    విజయ్, శేఖర్‌
భర్త     :    పి.సి.జోషి (ఇంజనీరు)
సంతానం    :    మయాంక్‌ జోషి

రీటాను గుర్తు పట్టని తివారీ!
గత పార్లమెంటు ఎన్నికలకు (2014) ముందు జరిగిన ఒక ‘రాజకీయ సంఘటన’ను రీటా జీవితంలోని ఒక ఆసక్తికరమైన సందర్భంగా చెప్పుకోవాలి. లక్నో లోక్‌సభ నియోజకవర్గం నుంచి బీజేపీ నుంచి రాజ్‌నాథ్‌సింగ్, కాంగ్రెస్‌ నుంచి రీటా బహుగుణ ఒకరితో ఒకరు తలపడుతున్నారు. యు.పి.కురువృద్ధ కాంగ్రెస్‌ నేత ఎన్‌.డి.తివారీ (88) ఆశీస్సుల కోసం రాజ్‌నాథ్‌సింగ్‌ ఆయన ఇంటికి వెళ్లి, వంగి ఆయన కాళ్లకు నమస్కరించారు. తివారీ ఆయనను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని, తలపై చెయ్యి ఉంచి ‘విజయీభవ’ అని దీవించారు. ఈ సంగతి తెలిసి, మర్నాడే రీటా బహుగుణ తివారీ ఆశీస్సుల కోసం వెళ్లారు. అయితే తివారీ ఆమె ఎవరో  తెలియనట్లుగా ముఖం పెట్టారు! ఆ తర్వాత వాళ్లిద్దరి మధ్యా జరిగిన సంభాషణ ఇది:

తివారీ  :    నేను నీకు ఏ విధంగా సహాయపడగలను?
రీటా:     నేను లక్నో నుంచి పోటీ చేస్తున్నాను. మీ ఆశీస్సుల కోసం వచ్చాను.
తివారీ:     నీ పేరేంటి?
రీటా:     రీటా బహుగుణ జోషీ.
తివారీ:    నీది ఏ పార్టీ?
రీటా:    దాదా.. నేను కాంగ్రెస్‌. నేను మీకు తెలుసు. గత నెలలో కూడా నేను మిమ్మల్ని కలిశాను. నిన్న రాజ్‌నాథ్‌జీ మీ ఆశీస్సుల కోసం వచ్చారని తెలిసి, నేనూ వచ్చాను.
తివారీ:    నిన్న రాజ్‌నాథ్‌ నన్ను కలిశాడా?
రీటా:    అవును.
తివారీ:    నేను అతడిని బ్లెస్‌ చేశానా?
రీటా:    అవునట. అలా అని చెప్పుకుంటున్నాడు. (ఇలా సాగుతోంది సంభాషణ..) తివారీకీ, రీటా తండ్రి హెచ్‌.ఎన్‌.బహుగుణకు పూర్వ స్నేహవైభవం ఉండేది. ఆ వైభవాన్ని రీటా గుర్తు చేశారు. ఆ తర్వాతే ఆయన.. రీటాకు మద్దతు ఇవ్వాలని కోరుతూ తన లెటర్‌ హెడ్‌పై లక్నో ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిజానికి రీటా ఎవరో తివారీకి బాగా గుర్తుందనీ, ఉత్తరాఖండ్‌ టికెట్‌ను తన కొడుకు రోహిత్‌ కు ఇవ్వకపోవడంతో సోనియా గాంధీపై కోపాన్ని ఇలా రీటా మీద ప్రదర్శించారని మీడియా ఊహించింది. ఈసారైతే తివారీ ఆశీస్సుల కోసం వెళ్లలేదు రీటా. (తివారీ కూడా ఆయన కొడుకు రోహిత్‌ శేఖర్‌తో పాటు ఇటీవలే కాంగ్రెస్‌ నుంచి బీజేపీలోకి వచ్చారు.)

తివారీ ఆశీస్సుల కోసం... (ఫైల్‌ ఫొటో)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement