కీలెరిగి వాత... వీలెరిగి చేత అంటారు. దేశంలో సంస్కరణలకు ఆద్యుడిగా, ఆర్థికవేత్తగా ఎన్ని భుజకీర్తులున్నా మన్మోహన్‌సింగ్ చేయ సాహసించని పనిని ఎన్డీయే సర్కారు సునాయాసంగా పూర్తిచేసింది. కీలక రాష్ట్రాలైన మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు పూర్తయిన వెంటనే డీజిల్ ధరలపై ఉన్న నియంత్రణను ఎత్తేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఎప్పుడో ఏడాదికి గానీ ‘ఎన్నికల బాదరబందీ’ లేకపోవడం...అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర పల్టీలు కొడుతుండటం గమనించి చేయదల్చుకున్న పనికి ఇదే సరైన అదునని భావించింది. ఈ నిర్ణయంవల్ల సామాన్యులపై ఎలాంటి భారమూ పడబోదని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రకటనలో వాస్తవం లేకపోలేదు. కనీసం ఇప్పటికైతే అది నూటికి నూరుపాళ్లూ నిజం. సామాన్యులపై భారం పడలేదు సరిగదా... అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా డీజిల్ లీటర్‌కు రూ. 3.37 తగ్గింది కూడా. కనుక నియంత్రణ ఎత్తేయడంపై పెద్దగా వ్యతిరేకతలు, నిరసనలు కూడా వ్యక్తంకాలేదు. అయితే, ఇలా నియంత్రణ ఎత్తేయడమనే చర్య పర్యవసానాలు భవిష్యత్తులో చాలా తీవ్రంగానే ఉంటాయి. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సద్దుమణి గాక ముడి చమురు ధర ఎప్పటిలా ఆకాశాన్నంటితే...దానికి అనుగుణంగా పెరిగే డీజిల్ ధరను తట్టుకోవడం సామాన్యులకు అసాధ్యమవుతుంది. అసలు యూపీఏ ప్రభుత్వమే డీజిల్‌పై నియంత్రణను ఎత్తేయాలనుకుని ఆ పనిని ఒకేసారి చేస్తే తమ భవిష్యత్తు ఏమవుతుందోనన్న బెంగతో వాయిదాల పద్ధతిలో అమలుకు నిరుడు జనవరిలో ద్వారాలు తెరిచింది. సబ్సిడీ పూర్తిగా తొలగేవరకూ నెలకు లీటర్‌కు అర్థరూపాయి చొప్పున పెంచుకుంటూ పోవాలని తీర్మానించింది. అందుకనుగుణంగా డీజిల్ ధర ఇప్పటికి 19సార్లు పెంచింది. ఇలా లీటర్‌కు మొత్తం మీద రూ. 9.50 పెరిగింది.
పెట్రో ధరల నియంత్రణ వ్యవహారం ఆదినుంచీ రాజకీయ చట్రంలో పడి నలుగుతున్నది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట, అధికారంలోకొచ్చాక మరో మాట మాట్లాడటం ప్రధాన రాజకీయ పక్షాలకు అలవాటుగా మారింది. వాజపేయి సర్కారు 2002లో నియంత్ర ణను ఎత్తివే స్తున్నట్టు ప్రకటించగానే అప్పట్లో విపక్షంలో ఉన్న కాంగ్రెస్ విరుచుకుపడింది. తాను అధికారంలోకొచ్చాక 2004లో మళ్లీ నియంత్రణను అమల్లోకి తెచ్చింది. కానీ, 2010లో తిరిగి ఎన్డీయే బాటలోనే వెళ్లింది. పెట్రోల్ ఒక్కదానిపైనా నియంత్రణ ఎత్తేస్తున్నామని, సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉండే డీజిల్, కిరోసిన్, వంటగ్యాస్ జోలికి వెళ్లడంలేదని చెప్పింది. తీరా నిరుడు జనవరిలో డీజిల్‌పై ‘పాక్షికంగా’ నియంత్రణ ఎత్తేస్తున్నామని చిదంబరం ప్రకటించారు. అయితే ఇది కేవలం ‘చిన్న చిన్న సవరణలు’ చేసుకోవడానికి చమురు సంస్థలకిచ్చిన అనుమతి మాత్రమేనని సర్దిచెప్పారు. ఈ ‘చిన్న చిన్న సవరణల’ పర్యవసానమేమిటో ఏడాదిన్నర వ్యవధిలోనే లీటర్‌కు అదనంగా రూ. 9.50 చెల్లించవలసి వచ్చాక సామాన్యులకు అర్థమైంది. ఇప్పుడిక ఎన్డీయే వంతు వచ్చింది. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో చమురు ధరలు పడిపోతున్న ప్రస్తుత తరుణంలోనే డీజిల్‌పై కూడా నియంత్రణను వదులుకోవాలని నిర్ణయించింది. గత మూడు నెలలుగా ముడి చమురు ధర ఎన్నడూ లేనంతగా పతనమైంది. 105 డాలర్లున్న బ్యారెల్ చమురు ధర 83 డాలర్లకు చేరుకుంది. ఫలితంగా పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 7 వరకూ తగ్గింది.
సంపన్నులు వాడే కార్లలో అధికభాగం డీజిల్‌వే కావడంవల్ల దానికిస్తున్న సబ్సిడీ వృథా అవుతున్నదని మాంటెక్ సింగ్ అహ్లూవాలియా వంటి ఆర్థిక నిపుణులు బాధపడతారు. అయితే, డీజిల్ పాత్ర అంతకన్నా కీలకమైనది. దేశంలో నిత్యమూ ఒకచోటునుంచి మరో చోటుకు నిత్యావసరాలను చేరవేసే వాహనాలన్నీ డీజిల్‌తో నడిచేవే. డీజిల్ ధర ఏ కొంచెం పెరిగినా అదంతా నిత్యావసరాల ధరలపై ప్రభావాన్ని చూపి ద్రవ్యోల్బణాన్ని పెంచుతుంది. సామాన్యుల ఆదాయంలో సగభాగం ఆహారావసరాలకు ఖర్చవుతుందంటారు. అలా చూసుకుంటే అధిక ధరల ప్రభావం వారిపై ఎంతగా పడుతుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. పెట్రో ధరలు పెంచే ప్రతిసారీ అందుకు అంతర్జాతీయ పరిస్థితులను కారణంగా చూపడం మన పాలకులకు అలవాటైన విద్య. అయితే, మన పొరుగునున్న పాకిస్థాన్ తదితర దేశాలతో పోల్చినా మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అధికంగా ఉంటాయి. ఎక్కడా లేనివిధంగా పెట్రో ఉత్పత్తులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులే ఇందుకు కారణం. పెట్రోల్‌పై 50 శాతంవరకూ, డీజిల్‌పై 36 శాతంవరకూ విధిస్తున్న పన్నుల ద్వారా ప్రభుత్వాలకు వార్షికంగా దాదాపు రెండు లక్షల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తున్నది. ఈ స్థితిని హేతుబద్ధం చేయాల్సివున్నదని గతంలో రంగరాజన్ కమిటీ నివేదిక స్పష్టంచేసింది. తమ ఆదాయ వనరుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా ఒకే ఒక్క రంగంపై ఇంతగా ఆధారపడటం మంచిదికాదని చెప్పింది.
దిగుమతి చేసుకునే ముడి చమురుపై దాని అసలు ధరకు పన్నులను చేర్చి చమురు సంస్థలకు అమ్ముతున్నది కేంద్రమే. చమురు సంస్థలకు ఇలా ధర పెంచి అమ్ముతూ ప్రజలకు మాత్రం ఫలానా రేటుకు మించి అమ్మరాదని ఇన్నాళ్లూ ఆంక్షలు పెట్టిందీ కేంద్రమే. నష్టాలొస్తున్నాయని ఆ సంస్థలు మొత్తుకుంటే...దాన్ని సాకుగా చూపి నియంత్రణ ఎత్తివేస్తున్నదీ వారే. ఇలా సంక్లిష్టంగా తయారైన చమురు ధర పెంపు ప్రక్రియను హేతుబద్ధీకరిస్తే, అంతర్గత సామర్థ్యాన్ని పెంచుకుని వృథా వ్యయం అరికడితే చమురు సంస్థలకు వచ్చే నష్టాలు అదుపులోకొస్తాయి. ఎన్డీయే సర్కారు ఈ కోణంలో ఆలోచించకపోవడం దురదృష్టకరం.
నియంత్రణ ఎత్తేయడం న్యాయమా?!
Published Tue, Oct 21 2014 11:31 PM | Last Updated on Sat, Sep 2 2017 3:13 PM