సుప్రీం కోర్టు
భారత అత్యున్నత న్యాయస్థానం మరోమారు భావ ప్రకటన స్వేచ్ఛకు రక్షగా నిలిచింది. సామాజిక మాధ్యమాల పాలిట రక్కసి చట్టంగా పేరు మోసిన సమాచార సాంకేతిక పరిజ్ఞాన (ఐటీ) చట్టంలోని 66ఎ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమంటూ దాన్ని పూర్తిగా కొట్టిపారేసింది. సుప్రీం కోర్టు ధర్మాసనం తీర్పును సహజంగానే స్వేచ్ఛా ప్రియులంతా ఆహ్వానిస్తున్నారు. వేగంగా విస్తరిస్తున్న ఈ-కామర్స్‌కు చట్టపరమైన నియంత్రణ చట్రాన్ని రూపొందించే లక్ష్యంతో ఐటీ చట్టం వచ్చింది. 2008లో యూపీఏ-2 ప్రభుత్వ హయాంలో అవాంఛనీయ సందేశాల (స్పామ్)ను అరికట్టడం కోసమంటూ ఆ చట్టంలోకి 66ఎ సెక్షన్‌ను ప్రవేశపెట్టారు. అతి వేగంగా వ్యాపిస్త్తున్న సామాజిక మాధ్యమాల్లో అసభ్య, అశ్లీల, అభ్యంతరకర సందేశాలు, సమాచారం స్వేచ్ఛా విహారం చేస్తుండటం ఒక తీవ్ర సమస్యగా మారిన మాట వాస్తవం. దురదృష్టవశాత్తు ఇటీవలి కాలంలో మన ప్రభుత్వాలకు ప్రతి సమస్యకూ పరిష్కారంగా కొత్త చట్టాలను రూపొందించి, మరిన్ని అధికారాలను ప్రభుత్వ యంత్రాంగానికి సమకూర్చడం అలవాటుగా మారింది. 2008లో ప్రవేశపెట్టిన 66ఎ సెక్షన్ కూడా అలాంటిదే. కంప్యూటర్ లేదా మరేదైనా సమాచార సాధనం ద్వారా ఎవరికైనాగానీ ‘చికాకును, అసౌకర్యాన్ని, ముప్పును, ఆటంకాన్ని, అవమానాన్ని, బాధను కలుగజేయాలని, నేరపూరితమైన వేధింపునకు గురిచేయాలని శతృత్వం, ద్వేషం లేదా దురుద్దేశం’తో పంపే సందేశమేదైనా శిక్షార్హమే. మూడేళ్ల వరకు శిక్ష విధించవచ్చు అంటూ అది అత్యంత అనిర్దిష్ట పదజాలంతో దాన్ని నిర్వచించింది. తద్వారా పాలకులకు గిట్టని ఏ విమర్శయినా, అభిప్రాయమైనా శిక్షార్హంగా మార్చింది. 19వ అధికరణం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను హరించే అధికారాలను ప్రభుత్వం కట్టబెట్టుకుంది.
పౌరులందరి భావ ప్రకటన స్వేచ్ఛకు హామీని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 19 (1) అధికరణం వర్తింపుపై 19(2) హేతుబద్ధమైన ఎనిమిది పరిమితులను విధిస్తోంది. వాటితోనే అవాంఛిత సందేశాల సమస్యను ఎదుర్కోవచ్చు. ఇంటర్నెట్‌కు సంబంధించిన సమస్యలన్నింటికి సంబంధించి అత్యంత కీలకమైన అంశం... భద్రతా వ్యవస్థ. దాని స్థానంలో ఎన్ని చట్టాలను తెచ్చినా సమస్య పరిష్కారం కాదు గానీ, దుర్వినియోగం అవుతుంది. అందుకు ఉదాహరణ పాల్ఘర్ యువతులే. బంద్ వంటి పరిస్థితుల వల్ల పౌరులకు కలిగే ఇబ్బందులనే అతి సామాన్యమైన సమస్యపై చేసిన వ్యాఖ్య రెచ్చగొట్టేచర్యగానూ మారింది, వారి అరెస్టుకూ దారి తీసింది! ఆ వ్యాఖ్య, బాల్‌థాకరే మృతి సందర్భంగా చేసినది కావడం వల్లనే ‘నేరమైంద’నేది స్పష్టమే. ఈ జాబితాలోని వారంతా రాజకీయవేత్తలకు ‘చికాకు కలిగించిన’వారు కావడమే విశేషం.
ఈ తీర్పు సందర్భంగా సోషల్ మీడియా కార్యకర్త ఒకరు ‘‘చట్టాన్ని (66ఎ) తయారు చేసింది వారే. ఆమోదించిందీ వారే. అమలుచేసిందీ వారే. అరెస్టులు చేసిందీ వారే. ఇప్పుడు సుప్రీం తీర్పునకు ఆహ్వానం పలుకుతున్నదీవారే, సంబరపడుతున్నదీ వారే’’ అంటూ చేసిన వ్యాఖ్యలో సత్యముంది. 2008లో యూపీఏ ఈ చట్టాన్ని తెస్తున్నప్పుడు నేటి ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ తదితరులు దీన్ని అత్యవసర పరిస్థితి కాలం నాటి సెన్సారింగ్‌తో పోల్చి దుయ్యబట్టారు. కానీ ఆ బిల్లును లోక్‌సభ కేవలం పది నిమిషాల చర్చతో ఆమోదించింది. ఆ రక్కసి చట్టం రక్షణ కోసం చివరి వరకు నేటి ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నిస్తూనే వచ్చింది. సరిగ్గా యూపీఏ చేసిన వాదనలే చేసింది. 66ఎ లేకపోతే లెక్కలేనన్ని వైరస్‌లను, మాల్‌వేర్లను అరికట్టలేమని సైతం వాదించింది. వైరస్‌లను, మాల్‌వేర్లను అరికట్టడానికి కావాల్సింది సాఫ్ట్‌వేర్ రక్షణ వ్యవస్థలు తప్ప కొత్త చట్టాలు కావు. ఐటీ చట్టంలోని 65వ సెక్షన్, హ్యాకర్లు ఇతరుల కంప్యూటర్లు, నెట్‌వర్క్‌లలోకి చొరబడటాన్ని, వాటిలోని సమాచారాన్ని మార్చడం లేదా తస్కరించడం వంటి అన్ని అక్రమాలను చట్టవిరుద్ధమైనవిగా, శిక్షార్హంగా ప్రకటించింది. అయినా రక్షణరంగ రహస్యాలు బయటపడటం వంటి వార్తలు వినవస్తూనే ఉన్నాయి. అత్యంత పటిష్టమైనదిగా భావించే అమెరికా రక్షణ వ్యవస్థ రహస్యాలు బట్టబయలైంది అక్కడి చట్టాలు సరిపోక కాదు. గత ప్రభుత్వంలాగా తాము 66ఎ సెక్షన్‌ను దుర్వినియోగం చేయమంటూ దాని కొనసాగింపునకు అనుమతించాలని సుప్రీం ధర్మాసనాన్ని కోరడం కే్రంద ప్రభుత్వ ఉద్దేశాల పట్ల సందేహాలను రేకెత్తిస్తోంది. చివరి నిమిషం వరకు 66ఎను కాపాడటానికి ప్రయత్నించిన ఐటీ మంత్రి రవి శంకర్‌ప్రసాద్ తాము యూపీఏకు భిన్నంగా అసమ్మతి గళాలను నొక్కడానికి ఐటీ చట్టాన్ని ప్రయోగించమంటూ 65ఎ స్థానంలో మరో చట్టాన్ని తెస్తామని సంకేతించారు.
అందువల్లనే పలువురు హక్కుల కార్యకర్తలు సుప్రీం తీర్పును పాక్షిక విజయం గానే పరిగణిస్తున్నారు. సెక్షన్ 69ఎ ప్రకారం ప్రభుత్వం ఎవరి ఇంటర్నెట్ కార్యకలా పాలపైనైనా నిఘా పెట్టవచ్చు, ఏ వైబ్‌సైైట్‌నైనా నిషేధించవచ్చు. 66ఎను కొట్టేసిన సుప్రీం ధర్మాసనం 69ఎ సెక్షన్‌ను రాజ్యాంగబద్ధమైనదిగానే పరిగణించింది. ‘గూగుల్’, ‘యూట్యూబ్’ వంటి సంస్థలు స్వయం నియంత్రణ పేరుతో తాము సేవలందించే వారందరి సమాచార మార్పిడిపైనా సెన్సారింగ్‌ను అమలుచేయక తప్పని పరిస్థితులను సెక్షన్ 74 కల్పిస్తోంది. ఏ వ్యక్తి సైబర్ నేరానికి పాల్పడబోతున్నా డని భావించినా ఆ వ్యక్తిని వారంటైనా లేకుండా, కారణం చెప్పకుండా నిర్బంధించే టంతటి విస్తృత అధికారాలు ఐటీ చట్టంలోనే ఉన్నాయి. సుప్రీం ధర్మాసనం చెప్పినట్టు ప్రభుత్వాలు మారినా చట్టాలుంటాయి. చట్టాలను రూపొందించేటప్పుడే వాటి దుర్వినియోగానికి వీల్లేని విధంగా రూపొందించడం బాధ్యతాయుతమైన ప్రభుత్వాల కర్తవ్యం. సుప్రీం తీర్పు నేపథ్యంలోనైనా ఐటీ చట్టంలో పౌరుల గోప్యత, భావ ప్రకటనా స్వేచ్ఛలకు భంగకరంగా ఉన్నాయంటున్న అంశాలపైన, దుర్వినియోగానికి అవకాశాలను కల్పించే లొసుగులపైన ఎన్డీఏ ప్రభుత్వం న్యాయ సమీక్షకు పూనుకొని భావ ప్రకటన స్వేచ్ఛ పట్ల చిత్తశుద్ధిని చూపుతుందని అశిద్దాం.