ఎన్నికల ముహూర్తం దగ్గరపడేకొద్దీ మహారాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. స్నేహబంధం ఎన్నేళ్లనాటిదని కూడా చూడకుండా పార్టీలు తెగదెంపులకు సిద్ధపడుతున్నాయి. మిత్రులతో కయ్యానికి సై అంటున్నాయి. పాతికేళ్లుగా కలిసున్న బీజేపీ-శివసేనలు ఇక కలిసి నడవబోమని ప్రకటించాయి. అటు అధికారంలో ఉన్న కాంగ్రెస్-ఎన్సీపీలు పదిహేనేళ్ల మైత్రీబంధానికి వీడ్కోలు పలికాయి. కూటమినుంచి ఎన్సీపీ వైదొలగిన పర్యవసానంగా తమ ప్రభుత్వం మైనారిటీలో పడింది గనుక రాజీనామా చేస్తున్నట్టు ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ తెలిపారు. మహారాష్ట్ర రాజకీయాలను గమనిస్తున్నవారు ఇలాంటి పరిణామాలు సంభవించగలవని ముందే అంచనా వేశారు. సమ ఉజ్జీలనుకునేవారిమధ్య ఎప్పుడైనా పోరే తప్ప పొత్తుండదు. కనుక బీజేపీ-శివసేనల బంధం చెదిరిపోవడం వింతేమీ కాదు. గత పాతికేళ్లుగా ఉన్న పరిస్థితులు వేరు. కూటమిలో శివసేనదే ఆధిపత్యం. కేంద్రంలో బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వం ఉన్నా లేకున్నా మహారాష్ట్రలో శివసేన మాటే మొదటినుంచీ చెల్లుబాటవుతున్నది. ఆ కూటమి 1995-2000 మధ్య రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి పీఠం శివసేనదే.
బీజేపీలో ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే వంటి నాయకులు... శివసేనలో బాల్‌ఠాక్రే ఎంతో చాకచక్యంగా వ్యవహరించబట్టే ఈ కూటమి పటిష్టంగా ఉండేదని రాజకీయ నిపుణులు చెప్పే మాట పాక్షిక సత్యమే. మారిన పరిస్థితులు కూడా అందుకు దోహదపడ్డాయని గుర్తించవలసి ఉన్నది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ దేశంలో మిగిలిన ప్రాంతాల్లో వలే మహారాష్ట్రలో కూడా ఊహించని విజయాలు సాధించింది. 48 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ-శివసేన కూటమికి 41 రాగా అందులో బీజేపీకి 23, శివసేనకు 18 లభించాయి. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీకి 47 సీట్లురాగా శివసేనకు వచ్చినవి 46. 1995 నాటి పరిస్థితులు క్రమేపీ మారుతున్నాయని... మరీ ముఖ్యంగా శివసేన చీలిక, బాల్‌ఠాక్రే మరణం తర్వాత ఆ పార్టీకి జనాదరణ క్రమేపీ తగ్గుతున్నదని బీజేపీ ఎప్పటినుంచో అంచనావేస్తున్నది. ఈ అంచనాలకు తోడు నరేంద్ర మోదీ రాకతో మహారాష్ట్రలో తాము ఆధిపత్య స్థానంలోకి వచ్చామన్న అభిప్రాయం బీజేపీకి ఉన్నది. ఇటీవలి వరస సర్వేలు సైతం బీజేపీ- ఎన్సీపీలకు 200 స్థానాలు లభించగలవని అంచనా వేస్తూనే బీజేపీకి అధిక స్థానాలు వస్తాయని చెప్పాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకా కూటమిలో ద్వితీయ శ్రేణి పార్టీగా మిగలడం ఆత్మహత్యా సదృశమని బీజేపీ భావించింది.
వీరిద్దరూ దూరం జరగడంవల్ల బొంబాయి ప్రెసిడెన్సీ మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలుగా ఏర్పడినప్పటి పరిస్థితులు పునరావృతం కావొచ్చునన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి. సంపన్న గుజరాతీలకూ, మర్వాడీలకు వ్యతిరేకంగా శివసేన ఆధ్వర్యంలో సాగిన ఉద్యమాలు, అవి రేకెత్తించిన భావోద్వేగాలు మళ్లీ తలెత్తవచ్చని కొందరి అంచనా. దీనికి తగినట్టు బీజేపీ ఏనాడూ ‘మరాఠీ మను’ల ఇబ్బందులను పట్టించుకోలేదని, అది మొదటినుంచీ గుజరాతీ వ్యాపారులకు, సంపన్నులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నదని శివసేన నేత ఉధవ్ ఠాక్రే ఇప్పటికే అన్నారు. బీజేపీ తరఫున ప్రధానంగా ప్రచారం చేయబోయే ప్రధాని నరేంద్ర మోదీ ఆ రాష్ట్రానికే చెందినవారు గనుక ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాక శివసేన ఈ అస్త్రానికి మరింత పదునుబెట్టే అవకాశం లేకపోలేదు. బీజేపీ-శివసేన కూటమిగా ఉన్నా ముంబైలోని గుజరాతీలు శివసేనకు ఎప్పుడూ అనుకూలంగా లేరని రాజకీయ నిపుణులు అంటారు.
కాంగ్రెస్-ఎన్సీపీల ఎడబాటు పెద్ద లెక్కలోనిది కాదు. కాంగ్రెస్ బంధనాల్లో నుంచి ఎప్పుడు బయటపడదామా అని ఎన్సీపీ మొదటి నుంచీ ఎదురుచూస్తున్నది. అనేకానేక కుంభకోణాలతో నానాటికీ దిగనాసిగా తయారైన కాంగ్రెస్‌తో జట్టు కట్టడం సతీసహగమనం వంటిదేనని ఆ పార్టీ భావిస్తున్నది. దళితులు, ముస్లింలు ఆ పార్టీకి దూరమయ్యారని, స్కాంల కారణంగా మధ్యతరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలు దానిపట్ల విముఖత ప్రదర్శిస్తున్నాయని ఎన్సీపీ అంచనా వేస్తున్నది. అయితే, తెగదెంపులు చేసుకుని బయటికెళ్తే బీజేపీ-శివసేన కూటమిని తట్టుకోలేమని మౌనంగా ఉండిపోయింది. ఎన్నికల ప్రకటనకు ముందు బీజేపీతో కలవాలని తహతహలాడినా శివసేన చెక్ పెట్టడంవల్ల అది సాధ్యంకాలేదు. ఇప్పుడిక బీజేపీ-శివసేన పొత్తుండదని తేలింది గనుక ఒంటరిగా వెళ్లినా తమ గెలుపు అవకాశాలకు ఢోకా ఉండదని తలపోస్తున్నది. కాంగ్రెస్ మాత్రం కోల్పోయిన ప్రతిష్టను ఎంతో కొంత తిరిగి తెచ్చుకోవచ్చునన్న ఆశతో చవాన్‌తో రాజీనామా చేయించింది. మొత్తానికి కాంగ్రెస్, బీజేపీ, శివసేన, ఎన్సీపీలమధ్య ఈ అసెంబ్లీ ఎన్నికల్లో జరగబోయే నాలుగు స్తంభాలాట చివరకు త్రిశంకు సభకు దారితీసే అవకాశాలు లేకపోలేదు. అలాంటి పరిస్థితే ఏర్పడితే సిద్ధాంతాలనూ, ఆదర్శాలనూ పక్కనబెట్టి ఏవో రెండు పార్టీలు అధికారం కోసం చేరువకాక తప్పదు. మహారాష్ట్రకు ఇది కొత్తేమీ కాదు. అతి పెద్ద పార్టీగా తాము అవతరిస్తే శివసేన తమ వెనక నడవక తప్పదని బీజేపీ నేతలు అంచనావేస్తున్నారు. ఒకవేళ ఆ పార్టీ బింకంగా ఉన్నా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో పట్టున్న ఎన్సీపీ చెప్పుకోదగ్గ స్థానాలు తెచ్చుకుని తమకు ఆసరాగా నిలవగలదని వారు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు సైతం రహస్యంగా ఇలాంటి ఆశలే ఉన్నాయి. ఎన్నికల అనంతరం ఎన్సీపీ మళ్లీ చేరువకాక తప్పదనుకుంటున్నది. విషాదమేమంటే ఇన్నిరకాల వ్యూహాలు, ప్రతివ్యూహాల మధ్య రైతుల ఆత్మహత్యలు, స్కాంలు, అధిక దరలు వంటివి చర్చకు రాకుండాపోతున్నాయి. ఎన్నికల ప్రచారం ఊపందుకున్నాక అయినా ఇవి ప్రస్తావనకొస్తాయా అన్నది సందేహమే.
నాలుగు స్తంభాలాట!
Published Sat, Sep 27 2014 11:09 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement