హస్తవాసి మారదా?
‘ఉపాయం లేనివాణ్ణి ఊళ్లోంచి వెళ్లగొట్టాలి' అంటారు. అందుకే అయిదు రాష్ట్రాల శాసనసభలకు జరిగిన ఎన్నికల్లో జనం కాంగ్రెస్‌ను చావుదెబ్బ కొట్టారు. కేరళ, అస్సాం రాష్ట్రాల్లో ఇంటిదారి పట్టించడంతోపాటు ఇతరచోట్ల సైతం చేతికి చోటు లేదని తేల్చారు. పర్యవసానంగా కాంగ్రెస్‌లో ఇప్పుడు కొందరికి ‘ధైర్యం’ వచ్చింది. ఇలాగైతే ఎలా అన్న ప్రశ్నలు మొలకెత్తడం మొదలైంది. ‘ఓటమిపై ఆత్మ పరిశీలన చేసుకుందామ’ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇచ్చిన పిలుపును పరిహసిస్తూ ‘ఆత్మ పరిశీలనలూ, అంతర్మథనాలూ చాలు. ఇది కార్యాచరణకు దిగవలసిన సమయం’ అని పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ గుర్తుచేశారు. పార్టీకి పెద్దాపరేషన్ అవసరమని కూడా అన్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో మామూలుగా కాదు...కనీవినీ ఎరుగని రీతిలో ఓటమి చవిచూసిన కాంగ్రెస్ పార్టీ... అప్పటినుంచీ అంతూ దరీ తోచక చీకట్లో తడుములాడుతోంది. పార్టీ శ్రేణుల్ని ఉరికించగల సామర్థ్యం ఉన్న సారథి లేక... పదునైన వ్యూహం జాడ కనబడక అక్కడింకా పొద్దుపొడవ లేదు. దిగ్విజయ్ వ్యాఖ్యలు దీనికి తార్కాణం. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి తగిలిన దెబ్బ సామాన్యమైనది కాదు. తమిళనాట ఆ పార్టీది మూడో స్థానం. పశ్చిమబెంగాల్‌లో రెండో స్థానమే అయినా విజయభేరి మోగించిన తృణమూల్‌కు అది ఎన్నో యోజనాల దూరం. వామపక్ష శ్రేణుల దయవల్ల అక్కడ గతంకన్నా రెండు సీట్లు అదనంగా సంపాదించి లాభపడినా... తన ఓట్లను మాత్రం వారికి బదిలీ చేయలేకపోయింది. ఫలితంగా వామపక్షానికి దక్కినవి 33 మాత్రమే! చెప్పుకున్న సంకల్పానికి కట్టుబడి ఒంటరిగా పోటీచేసినా ఇంతకన్నా మెరుగ్గా ఉండేవాళ్లమని ఇప్పుడు సీపీఎం శ్రేణులు బాధపడుతున్నాయి. ‘బెంగాల్ లైన్’తో భంగపడ్డామని భావిస్తున్నాయి. ఆ మూలనున్న చిన్న రాష్ట్రం పుదుచ్చేరి ఒక్కటే తెలిసో, తెలియకో కాంగ్రెస్‌ను ఆదరించింది.
ఈ అయిదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో ఆరుచోట్ల ఉప ఎన్నికలు జరగ్గా అందులో ఒక్కటంటే ఒక్కటే కాంగ్రెస్‌కు లభించింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న యూపీలో పరిస్థితి మరింత ఘోరం. అక్కడ ఉప ఎన్నికలు జరిగిన రెండుచోట్లా ఆ పార్టీ డిపాజిట్లు కోల్పోయింది. కాంగ్రెస్ క్షీణ దశలో ఉందన్న సంగతి ఈ రెండేళ్లుగా అందరికీ తెలుస్తూనే ఉంది. ఈ వ్యవధిలో మొత్తం 9 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా బిహార్ మినహా అన్నిటా ఆ పార్టీ ఓటమే చవిచూసింది.
మూడేళ్లక్రితం రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి చవిచూసినప్పుడు ‘ఈసారి చూసుకోండి... నా తడాఖా’ అని పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ జబ్బలు చరిచారు. ‘ఎవరూ ఊహించని స్థాయిలో పార్టీని ప్రక్షాళన చేస్తాన’ని మాటిచ్చారు. కానీ ఇప్పటికీ దాని జాడ లేదు. ఏడాదిగా రాహుల్ శ్రమిస్తున్నట్టే కనబడుతున్నారు. అయితే అదంతా మాటల శ్రమే. చేతలు మాత్రం సున్నా. వీలైనచోటల్లా ప్రధాని నరేంద్రమోదీపై నోరుచేసుకోవడమే పోరాటమని ఆయన భ్రమపడుతున్నారు. పార్టీ సంస్థాగత యంత్రాంగాన్ని సరిచేయడం సంగతలా ఉంచి తనకంటూ సొంత టీంను ఏర్పాటుచేసుకోవడానికే ఆయనకు సమయం చిక్కడంలేదు. జనం విశ్వాసాన్ని చూరగొనేవరకూ పార్టీ కష్టపడుతూనే ఉంటుందని తాజా ఫలితాల తర్వాత రాహుల్ చెప్పడం బాగానే ఉన్నా... అదెలా ఉంటుందో, ఉండాలో ఆయనకు బోధపడిన సూచనలు కనిపిం చడం లేదు. సోనియాగాంధీ పద్దెనిమిదేళ్లుగా పార్టీ అధ్యక్షురాలిగా ఉన్నారు. అదిగో ఇదిగో అంటూ తాత్సారం చేసి, తారాట్లాడి రాహుల్ ‘పూర్తికాలపు’ బాధ్యతలు స్వీకరించి కూడా మూడేళ్లు కావస్తోంది. కానీ ఆయనింకా రాజకీయాలకు ‘బయటి వ్యక్తి’గానే ఉన్నారు. అస్సాం ఎన్నికల వ్యూహంపై చర్చించేందుకు ఆ రాష్ట్రంనుంచి వచ్చిన పార్టీ యువ నాయకుడు హిమంత్ శర్మకు ఎదురైన అనుభవమే ఇందుకు సాక్ష్యం. పార్టీ వ్యూహం గురించి తాను చెబుతున్న విషయాలను లక్ష్యపెట్టకుండా కుక్కపిల్లతో ఆటల్లో మునిగిన రాహుల్ తీరును చూసి విస్తుపోయిన ఆ నాయకుడు ఇక్కడినుంచి నిష్ర్కమించడం మంచిదని నిర్ణయించుకున్నాడు.
కాంగ్రెస్ పార్టీకి నాయకుల కొరత లేదు. సీఎంలుగా, కేంద్రమంత్రులుగా, ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసినవారు ఆ పార్టీలో బోలెడుమంది ఉన్నారు. అందరితోనూ చర్చిస్తూ ఎవరి శక్తిసామర్థ్యాలేమిటో విశ్లేషించుకుని, ఎవరికి ఏ పని అప్పగించాలో నిర్ణయించుకుని కదిలిస్తే శ్రేణుల్లో కాస్తయినా ఉత్సాహం వస్తుంది. వారిలో ఆత్మ విశ్వాసం ఇనుమడిస్తుంది. ముఠాలుగా విడిపోయి కలహించు కుంటున్నవారిని దారికి తెస్తే పార్టీ ప్రతిష్ట కాస్తయినా నిలబడుతుంది. అందుకు భిన్నంగా వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోయే యూపీలో పార్టీని గట్టెక్కించే బాధ్యతను ఒక కన్సల్టెంటుకు అప్పగిస్తే, అందుకు కొంత ఫీజు చెల్లిస్తే అన్నీ అతగాడే చూసుకుంటాడని రాహుల్ భావించారు. మరి ఇన్ని వేలమంది నేతలంతా ఏం చేస్తారు? ఆయనను ఆకాశానికెత్తే పనిలో నిమగ్నమై ఉంటారు. పార్టీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు నెత్తికెత్తుకున్నప్పుడు తాను మాట్లాడిందేమిటో గుర్తుండి ఉంటే కాంగ్రెస్‌ను రాహుల్ ఈ దుస్థితికి చేర్చేవారు కాదు. రాజకీయాల్లో వారసత్వ సిద్ధాంతానికి తాను వ్యతిరేకమని అప్పట్లో ఆయన చెప్పారు.
పార్టీలన్నిటినీ కొంతమంది వ్యక్తులే శాసిస్తున్నారని, ఈ స్థితి మారాలని పిలుపునివ్వడంతోపాటు కాంగ్రెస్‌లో అలాంటి ధోరణుల్ని అంగీకరించబోనని చెప్పారు. తీరా ఈ మూడేళ్ల ఆచరణా గమనిస్తే వాటన్నిటినీ ఆయన యధాతథంగా కొనసాగిస్తున్నారని అర్ధమవుతుంది. అభ్యర్థుల ఎంపికలోనూ, పార్టీ పదవుల పంపకంలోనూ భజన పరులకే చోటిస్తున్నారని వెల్లడవుతుంది. తప్పులు చేసుకుంటూ పోవడం తప్ప వాటినుంచి నేర్చుకోవాలని, సరిదిద్దుకోవాలని రాహుల్ అనుకోవడం లేదు. బిహార్ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాక బీజేపీ చురుగ్గా కదిలి తన లోపాల్ని సరిచేసుకోగలిగింది. తన వ్యూహాన్ని సవరించుకుంది. ఫలితంగా ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ దిశగా మరికొన్ని అడుగులు వేయగలిగింది. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్ ఎన్నికలు వచ్చే ఏడాది...కర్ణాటక, మేఘాలయ, మిజోరాం ఎన్నికలు ఆ మరుసటి సంవత్సరం రాబోతున్న తరుణం లోనైనా ఇల్లు చక్కదిద్దుకోవాలని కాంగ్రెస్‌కు అనిపించకపోవడం ఆశ్చర్యకరం. ఇలాంటి స్థితిలో ఆ పార్టీకి ఓటమి తప్ప ఒరిగేదేముంటుంది?