లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా రెండోసారి తంబిదురై | AIADMK's M Thambidurai to be deputy speaker of Lok Sabha | Sakshi
Sakshi News home page

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా రెండోసారి తంబిదురై

Published Thu, Aug 21 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా రెండోసారి తంబిదురై

లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా రెండోసారి తంబిదురై

జాతీయం
 జమ్మూకాశ్మీర్‌లో పర్యటించిన మోడీ
 ప్రధాన మంత్రి నరేంద్రమోడీ ఆగస్టు 12న జమ్మూకాశ్మీర్‌లో పర్యటించారు. లేహ్‌లో నిమూబజ్గో జల విద్యుత్ ప్రాజెక్ట్‌ను, లేహ్-కార్గిల్-శ్రీనగర్ విద్యుత్ సరఫరా వ్యవస్థను ప్రారంభించారు. లేహ్‌లో సైన్యం, వైమానిక దళాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. జమ్ము, కాశ్మీర్‌లో రహదారుల నిర్మాణానికి రూ. 8వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించారు. 1999లో కార్గిల్‌లో పాక్ సైన్యం చొరబాటు తర్వాత ఆ ప్రాంతాన్ని భారత ప్రధాని సందర్శించడం ఇదే తొలిసారి.
 
 జ్యుడీషియల్ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం
 సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు ఉద్దేశించిన జాతీయ జ్యుడీషియల్ నియామకాల కమిషన్ బిల్లు-2014ను ఆగస్టు 13న లోక్‌సభ ఆమోదించింది. దీంతోపాటు కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే 99వ రాజ్యాంగ సవరణ బిల్లును కూడా లోక్‌సభ ఆమోదించింది. ఈ బిల్లును రాజ్యసభ ఆగస్టు 14న ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం ప్రస్తుతం ఉన్న కొలీజియం వ్యవస్థ రద్దవుతుంది. ఆరుగురు సభ్యులు గల జ్యుడీషియల్ నియామకాల జాతీయ కమిషన్ (ఎన్‌జేఏసీ) ఏర్పాటవుతుంది. దీనికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షుడిగా వ్యవహరిస్తారు. ఇద్దరు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తులు, మరో ఇద్దరు ప్రముఖులతోపాటు న్యాయశాఖ మంత్రి సభ్యులుగా ఉంటారు.
 
 పదేళ్ల తర్వాత లోక్‌సభలో ప్రధాని ఓటు
 పదేళ్ల తర్వాత లోక్‌సభలో బిల్లుపై ప్రధానమంత్రి ఓటువేశారు. జడ్జీల నియామకానికి గతంలో నియమించిన కొలీజియం వ్యవస్థ రద్దుచేయడానికి ఉద్దేశించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు అనుకూలంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు13న ఓటు వేయడంతో పదేళ్ల తర్వాత ప్రధానమంత్రి లోక్‌సభలో ఓటుహక్కు వినియోగించుకున్నట్టయింది. గత పదేళ్ల యూపీఏ హయాంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్  రాజ్యసభ సభ్యుడు కావడంతో ఆయన తన పదవీకాలమంతా లోక్‌సభలో ఓటు వేయడం కుదరలేదు.
 
 షహీద్ గౌరవం
 విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన సీఆర్‌పీఎఫ్ జవాన్లు, అధికారులకు షహీద్ గౌరవం కల్పించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
 1000 మందికి 927 మందే
 దేశంలో ఆరేళ్ల లోపు వయసున్న బాలల్లో ప్రతి వెయ్యిమంది బాలురకు 927 మంది బాలికలు మాత్రమే ఉన్నారని, స్వాతంత్య్రం తర్వాత ఈ నిష్పత్తి అత్యధికంగా తగ్గడం ఇదే తొలిసారి అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
 
 క్రీడలు
 చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు పతకం
 చెస్ ఒలింపియాడ్‌లో భారత్ తొలిపతకాన్ని సాధించింది. నార్వేలో జరిగిన టోర్నీ చివరి రౌండ్‌లో భారత పురుషుల జట్టు ఉజ్బెకిస్థాన్‌ను ఓడించి ద్వితీయ స్థానంలో నిలిచింది. అయితే టైబ్రేక్ కారణంగా మూడోస్థానంలో భారత్ కాంస్యం గెలుచుకుంది. కాంస్యం గెలుచుకున్న జట్టులో తెలుగుతేజం లలిత్‌బాబు ఉన్నాడు. 1924లో చెస్ ఒలింపియాడ్ మొదలైన తర్వాత భారత్ పతకం గెలుచుకోవడం ఇదే తొలిసారి.
 
 ప్రపంచ టీమ్ బిలియర్డ్స్‌లో భారత్‌కు స్వర్ణం
 మొదటి ప్రపంచ టీమ్ బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణ, రజత పతకాలు సాధించింది. ఆగస్టు 15న గ్లాస్గోలో జరిగిన ఫైనల్‌లో భారత-బి జట్టు భారత-ఎ జట్టును ఓడించి స్వర్ణం సాధించింది. ఈ విజయంతో పంకజ్ అద్వానీ (10) అత్యధిక ప్రపంచ టైటిల్స్ సాధించిన భారత క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. ఇంతవరకు ఏ క్రీడలో ఏ ఆటగాడూ ఇన్ని ప్రపంచ టైటిల్స్‌ను గెలవలేదు. ఇంతవరకు ఏ క్రీడాకారుడూ ఇన్ని టైటిల్స్‌ను గెలుచుకోలేదు. 28 ఏళ్ల అద్వానీ 8 సార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌ను, రెండు సార్లు ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించాడు.
 
 మదుగలె రికార్డు
 ఐసీసీ మ్యాచ్ రిఫరీ రంజన్ మదుగలె ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. ఇటీవల భారత్-ఇంగ్లండ్‌ల మధ్య ముగి సిన ఐదో టెస్టు ఆయనకు 150వది కావడం విశేషం. తద్వారా టెస్టు క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన తొలి రిఫరీగా మదుగలె రికార్డు సృష్టించారు. 1993లో కరాచీలో పాకిస్థాన్, జింబాబ్వే మధ్య జరిగిన టెస్టుతో ఆయన అంతర్జాతీయ రిఫరీగా మారారు.
 
 చైనాలో ప్రారంభమైన యూత్ ఒలింపిక్స్
 చైనాలోని నాన్‌జింగ్ ఒలింపిక్ స్టేడియంలో ఆగస్టు 16న యూత్ ఒలింపిక్స్ ప్రారంభమయ్యాయి. 12 రోజుల పాటు జరిగే ఈ ఒలింపిక్స్‌లో 200లకు పైగా దేశాలకు చెందిన దాదాపు 3600 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు.
 
 పటౌడీ ట్రోఫీ విజేత ఇంగ్లండ్
 భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆగస్టు 18న ముగిసిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. తద్వారా వరుసగా మూడో సారి (2011, 2012, 2014) పటౌడీ ట్రోఫీని గెలుచుకుంది. అండర్సన్ (ఇంగ్లండ్), భువనేశ్వర్ (భారత్)లకు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.
 
 ఫోర్‌‌బ్స కోటీశ్వరుల జాబితాలో
 షరపోవా అగ్రస్థానం
 రష్యా టెన్నిస్ క్రీడాకారిణి మరియా షరపోవా ఫోర్బ్స్ మహిళ క్రీడాకారుల కోటీశ్వరుల జాబితాలో వరుసగా పదో ఏడాది అగ్రస్థానంలో నిలిచింది. 2013 జూన్- 2014 జూన్ మధ్య కాలంలో వాణిజ్య ఒప్పందాలు, ప్రైజ్ మనీ ద్వారా సుమారు రూ. 148 కోట్లకు పైగా సంపాదనతో మహిళా అథ్లెట్లలో మొదటిస్థానం సాధించింది. చైనా టెన్నిస్ క్రీడాకారిణి లినా రూ. 143 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది.
 
 అంతర్జాతీయం
 పది లక్షల మందిపై ఎబోలా ప్రభావం
 ఎబోలా వైరస్ ప్రభావం పశ్చిమ ఆఫ్రికాలో పది లక్షల మందిపై పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) డెరైక్టర్ జనరల్ మార్గరెట్ చాన్ తెలిపారు. త్వరలోనే ఇది మానవ సంక్షోభంగా మారే అవకాశం ఉందని చాన్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఉన్న ప్రతి నగరానికి ఈ వ్యాధి నుంచి ముప్పు పొంచి ఉన్నట్లు హెచ్చరించారు.
 
 పనామా కాలువ నిర్మాణానికి నూరేళ్లు
 ప్రపంచ జల రవాణా చరిత్రలో కీలక మైలురాయిగా భావించే పనామా కాలువ 2014, ఆగస్టు 15 నాటికి వంద సంవత్సరాలను పూర్తి చేసుకుంది. సరిగ్గా వందేళ్ల క్రితం అంటే 1914, ఆగస్టు 15న ఈ కాలువను అట్లాంటిక్- పసిఫిక్ మహా సముద్రాలను కలుపుతూ ఉత్తర, దక్షిణ అమెరికాల మధ్య ఉన్న పనామా దేశంలో నిర్మించారు. దీని ద్వారా అమెరికా పశ్చిమ తీరానికి, ఐరోపా తీరానికి మధ్య వేల మైళ్ల దూరం తగ్గింది.
 
 
 వార్తల్లో వ్యక్తులు యూపీఎస్సీ చైర్ పర్సన్‌గా రజినీ రజ్‌దాన్
 యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్ పర్సన్‌గా రజినీ రజ్‌దాన్ (64) ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆమె కమిషన్ సభ్యురాలిగా వ్యవహరిస్తున్నారు. డీపీ అగర్వాల్ స్థానంలో రజినీ బాధ్యతలు చేపట్టారు. యూపీఎస్సీ చైర్మన్ పదవీ కాలం ఆరేళ్లు.
 
 లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా తంబిదురై
 లోక్‌సభ డిప్యూటీ స్పీకర్‌గా తమిళనాడుకు చెందిన ఏఐఏడీఎంకే ఎంపీ తంబిదురై ఆగస్టు 13న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తద్వారా లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ పదవిని రెండోసారి చేపట్టిన తొలి నేతగా రికార్డులకెక్కారు. మొదటి సారిగా 1995లో డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. 37 మంది సభ్యులతో ఏఐఏడీఎంకే లోక్‌సభలో మూడో అతిపెద్ద పార్టీగా ఉంది.
 
 వ్యయ నిర్వహణ కమిషన్ సారథి బిమల్‌జలాన్
 వ్యయ నిర్వహణ కమిషన్ చైర్మన్‌గా భారతీయ రిజర్వ్‌బ్యాంక్ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ నియమితులయ్యారు. ఆహారం, ఎరువులు, చమురుపై రాయితీల తగ్గిం పు, ద్రవ్యలోటు కట్టడికి అవసరమైన సూచనలు ఇచ్చేందు కు వ్యయ నిర్వహణ కమిషన్‌ను కేంద్రం ఏర్పాటు చేసింది.
 
 
 అవార్డులు
 మంజుల్ భార్గవకు ఫీల్డ్స్ మెడల్
 భారత సంతతికి చెందిన  మంజుల్ భార్గవకు గణిత శాస్త్రంలో నోబెల్ గా భావించే ఫీల్డ్స్ మెడల్ లభించింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లో అంతర్జాతీయ గణిత కాంగ్రెస్ - 2014లో ఆగస్టు 13న భార్గవ ఈ పురస్కారాన్ని అందుకున్నారు. మంజుల్ భార్గవ్ ప్రస్తుతం ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసున్నారు. ఇరాన్ గణితశాస్త్రవేత్త మరియం మీర్జాఖానీ ఫీల్డ్ మెడల్ అందుకున్న తొలి మహిళగా గుర్తింపుపొందింది.
 
 సల్మాన్ రష్దీకి డెన్మార్క్ సాహిత్య పురస్కారం
 భారత సంతతికి చెందిన బ్రిటన్ రచయిత సల్మాన్ రష్దీకి డెన్మార్క్ అత్యున్నత సాహిత్య పురస్కారం లభించింది. ద హాన్స్ క్రిస్టియన్  అండర్సన్ లిటరేచర్‌గా పిలిచే ఈ పురస్కారాన్ని 2013కు గాను రష్దీకి డెన్మార్క్ యువరాణి మేరీ ఆగస్టు 17న  ఓడెన్స్ నగరంలో అందజేశారు. రెండేళ్లకోసారి ప్రదానం చేసే ఈ అవార్డు కింద 500,000 డేనిస్ క్రోన్‌లు బహుకరిస్తారు.
 
 ఉత్తమ పార్లమెంటేరియన్లు
 రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆగస్టు 12న న్యూఢిల్లీలో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డులను ప్రదానం చేశారు. వివరాలు..2010-అరుణ్ జైట్లీ (బీజేపీ); 2011-కరణ్‌సింగ్ (కాంగ్రెస్); 2012-శరద్ యాదవ్ (జేడీయూ);
 
 మేజర్ ముకుంద్ వరద రాజన్‌కు అశోకచక్ర
 జమ్మూకాశ్మీర్‌లోని షోపియన్ జిల్లాలో ఇద్దరు ఉగ్రవాదులను ఎన్‌కౌంటర్‌లో హతమార్చి, అమరుడైన ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్‌కు శాంతి సమయంలో ఇచ్చే అత్యున్నత శౌర్య పతకం అశోక చక్రను కేంద్రం ప్రకటించింది. అలాగే విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన మరో 12 మందిని దేశ మూడో అత్యున్నత శౌర్య పతకమైన శౌర్య చక్రతో గౌరవించింది. ఈ ఏడాది సాయుధ బలగాల సిబ్బందికి మొత్తం 55 శౌర్య పురస్కారాలను ప్రభుత్వం ప్రకటించింది. వీటిలో ఒక అశోక చక్ర, 12 శౌర్య చక్ర, 39 సేనా పతకాలు, ఒక నవో సేనా పతకం, 2 వాయు సేనా పతకాలు ఉన్నాయి. ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సంద ర్భంగా పతకాలను ప్రదానం చేశారు.
 
 జ్ఞాన్ కొరియన్‌కు గొల్లపూడి శ్రీనివాస్ అవార్డు
 గుజరాతీ సినిమా ‘ద గుడ్ రోడ్’ దర్శకుడు జ్ఞాన్ కొరియన్ కు గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు-2013ను ఆగస్టు 12న చెన్నైలో ప్రదానం చేశారు.
 
 సునీల్‌కుమార్‌కు గ్లోబల్ సౌత్ అవార్డు
 ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన రాజనీతిశాస్త్ర ఆచార్యుడు  సునీల్‌కుమార్ ప్రతిష్టాత్మక గ్లోబల్‌సౌత్ అవార్డుకు ఎంపికయ్యారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికల తీరుతెన్నులపై సునీల్ కుమార్ సమర్పించిన పత్రానికి ఇంటర్నేషనల్ పొలిటికల్ సైన్స్ అసోసియేషన్ ఈ అవార్డును ప్రకటించింది.
 
 
 సైన్‌‌స అండ్ టెక్నాలజీ
 విద్యుత్ ఉత్పత్తిలో రావత్‌భటా రికార్డు
 విద్యుత్ ఉత్పత్తిలో రాజస్థాన్‌లోని రావత్‌భటా అణువిద్యుత్ కేంద్రం కొత్త రికార్డు సృష్టించింది. ఈ కేంద్రంలోని యూనిట్-5 నిరంతరాయంగా ఆగస్టు 11 నాటికి 739 రోజుల పాటు విద్యుత్ ఉత్పత్తి చేసింది. దీంతో ప్రపంచంలో సుదీర్ఘకాలం నిరంతరాయంగా విద్యుత్ ఉత్పత్తి చేసిన రెండో కేంద్రంగా రావత్‌భటా నిలిచింది. కెనడాలోని ఓంటారియోలా పికెరింగ్ న్యూక్లియర్ జనరేటింగ్ స్టేషన్ 1994లో 894 రోజుల పాటు ఆగకుండా విద్యుత్ ఉత్పత్తి చేసింది. సాధారణంగా విద్యుత్ కేంద్రం 300 రోజులు అంతరాయం లేకుండా పనిచేస్తే దాన్ని ఉత్తమ పనితీరు కనబరిచినట్లు పరిగణిస్తారు.
 
 ఆకాశ్ క్షిపణి పరీక్ష విజయవంతం
 స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఆకాశ్ క్షిపణిని ఆగస్టు 13న ఒడిశాలోని చాందీపూర్ నుంచి వైమానిక దళం విజయవంతంగా పరీక్షించింది. ఉపరితలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఈ క్షిపణి 25 కి.మీ దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలదు. 60 కిలోల ఆయుధాలను మోసుకుపోగలదు.
 
 ఐఎన్‌ఎస్ కోల్‌కత జాతికి అంకితం
 స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ కోల్‌కత భారత నావికాదళంలోకి ఆగస్టు 16న చేరింది. దీన్ని ప్రధాని నరేంద్రమోడీ ముంబై నావల్ డాక్‌యార్డ్‌లో జాతికి అంకితం చేశారు. ఐఎన్‌ఎస్ కోల్‌కత గెడైడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుద్ధనౌక. దీన్ని మజగావ్ డాక్‌యార్డ్ నిర్మించింది. దీని బరువు 6,800 టన్నులు. పొడవు 164 మీటర్లు. వెడల్పు 18 మీటర్లు. పూర్తి స్థాయిలో సామాగ్రిని మోసుకెళితే బరువు 7,400 టన్నులు. నౌకలో 4.5 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుంది. ఈ యుద్ధనౌకలో 30 మంది అధికారులు, 300 మంది సిబ్బంది ఉంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement