మెడికల్‌కు దీటైన ప్రత్యామ్నాయాలు.. ఏఐపీవీటీ, ఏఐఈఈఏ | AIEEA and AIPVT Exams details | Sakshi
Sakshi News home page

మెడికల్‌కు దీటైన ప్రత్యామ్నాయాలు.. ఏఐపీవీటీ, ఏఐఈఈఏ

Published Thu, Dec 26 2013 2:58 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థుల ముందు ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు ప్రత్యామ్నాయంగా దీటైన అవకాశాలకు వేదికగా నిలుస్తోంది..

ఇంటర్మీడియెట్ బైపీసీ విద్యార్థుల ముందు ఎంబీబీఎస్, బీడీఎస్‌లకు ప్రత్యామ్నాయంగా దీటైన అవకాశాలకు వేదికగా నిలుస్తోంది.. వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ సైన్స్. విస్తరిస్తున్న అవకాశాలు, వ్యవసాయానుబంధ రంగాలకు ప్రాధాన్యత పెరుగుతుండడం, జాబ్ గ్యారంటీ కావడంతో వెటర్నరీ, అగ్రికల్చరల్ సైన్స్ కోర్సును ఎంచుకునే విద్యార్థుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆయా కోర్సుల్లో ప్రవేశం పొందడానికి చక్కని మార్గాలు.. ఏఐపీవీటీ, ఏఐఈఈఏ-యూజీ/పీజీ/ఎస్‌ఆర్‌ఎఫ్. వచ్చే విద్యా సంవత్సరానికి ఈ రెండు పరీక్షలకు నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో సంబంధిత వివరాలు..


 
 ఏఐపీవీటీ
 వెటర్నరీ విద్యా ప్రమాణాలను నిర్దేశించే వెటర్నరీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (వీసీఐ) ప్రతి ఏటా జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ప్రీ-వెటర్నరీ టెస్ట్(ఏఐపీవీటీ)ను నిర్వహిస్తోంది. ఈ పరీక్ష ద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 30కి పైగా రాష్ట్రస్థాయి వెటర్నరీ(జమ్మూ-కాశ్మీర్ మినహా) కళాశాలల్లోని బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హస్బెండరీ (బీవీఎస్సీ - ఏహెచ్) కోర్సులో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు.


 
 పరీక్ష విధానం:
 ఏఐపీవీటీని ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. మల్టిపుల్ చాయిస్, రీజన్ ఎసెర్షన్ విధానం (కారణం తెలపండి) వంటి ప్రశ్నలు వస్తాయి. ప్రశ్నపత్రం ఇంగ్లిష్ మాధ్యమంలో మాత్రమే ఉంటుంది. ఇందులో 200 ప్రశ్నలు ఉంటాయి. వీటికి మూడు గంటల్లో సమాధానాలను గుర్తించాలి. ప్రతి సరైన సమాధానానికి మూడు మార్కుల చొప్పున కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు (నెగెటివ్ మార్కింగ్) చొప్పున తగ్గిస్తారు. వివరాలు.. ఫిజిక్స్ 60 ప్రశ్నలు, కెమి్రస్ట్రీ 60 ప్రశ్నలు, బయూలజీ (బోటనీ అండ్ జువాలజీ) 80 ప్రశ్నలు.

 నోటిఫికేషన్ సమాచారం:
 అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి 50 శాతం(ఎస్సీ/ఎస్టీలకు 40 శాతం)మార్కులతో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బోటనీ, జువాలజీ), ఇంగ్లిష్‌లతో ఇంట ర్మీడియెట్/10+2/ఇండియన్ స్కూల్ సర్టిఫికెట్ ఎగ్జామినే షన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. చివరి సంవత్సరం పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకో వచ్చు. నిబంధనలకనుగుణంగా రిజర్వేషన్లు వర్తిస్తాయి.

వయసు: డిసెంబర్ 31, 2014 నాటికి 17 ఏళ్లు.
 దరఖాస్తుల లభ్యత: జనవరి 6-ఫిబ్రవరి 12, 2014. దరఖాస్తులను నిర్దేశిత విజయా బ్యాంక్ శాఖలు/స్టేట్ వెటర్నరీ కౌన్సిల్/వీసీఐ నుంచి పొందొచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 18, 2014.
 పరీక్ష తేదీ: మే 10, 2014.
 వివరాలకు: www.vci.nic.in

 
 ఉమ్మడిగా..
ఏఐపీవీటీ, ఏఐఈఈఏ-యూజీ ఈ రెండు పరీక్షల్లో అడిగే ప్రశ్నల క్లిష్టత ఆయా కోర్సులకు పేర్కొన్న విద్యార్హతల సిలబస్ ప్రకారమే ఉంటుంది.
ఎంసెట్ ప్రిపరేషన్ ఈ పరీక్షలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇవి జాతీయ స్థాయి పరీక్షలు. కాబట్టి సీబీఎస్‌ఈ సిలబస్‌ను ప్రావూణికంగా తీసుకుని ప్రశ్న పత్రం రూపొందిస్తారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఎంట్రెన్స్‌కు నిర్దేశించిన సిలబస్‌ను పరిశీలించి మన బోర్డ్ సిలబస్‌లో లేని సీబీఎస్‌ఈలోని పాఠ్యాంశాలపై పట్టు సాధించాలి.
పరీక్ష ఆబ్జెక్టివ్‌లో ఉన్నప్పటికీ.. ప్రిపరేషన్‌ను కాన్సెప్ట్ ఆధారితంగా కొనసాగించాలి. ప్రతి పాఠాన్ని చదివేటప్పుడు ప్రశ్నార్హమైన అంశాలను గుర్తించాలి. గత ప్రశ్నాపత్రాలను విధిగా ప్రాక్టీస్ చేయడం వల్ల ప్రశ్నల సరళిపై అవగాహన ఏర్పడుతుంది.
 ఫిజిక్స్‌లో సంబంధిత ఫార్ములాలను తెలుసుకోవడంతోపాటు వాటిని సంబంధిత ప్రాబ్లమ్‌లో అనువర్తించే మెళకువలు కూడా సొంతం చేసుకోవాలి. దీనికి సాధనం ఒక ప్రాబ్లమ్‌ను రెండు మూడు పద్ధతుల్లో ప్రాక్టీస్ చేయడమే. కాన్సెప్ట్‌లో పోలిక ఉన్న టాపిక్స్‌ను ఒకే సమయంలో చదివేలా ప్రణాళిక రూపొందించుకోవాలి.
 కెమిస్ట్రీకి సంబంధించి ఫిజికల్ కెమిస్ట్రీలో లెక్కలతో కూడిన ప్రాబ్లమ్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయూలి. వీలైనంత ఎక్కువగా ఫార్ములా ఆధారిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయూలి. ప్రతి ఫార్ములాకు సంబంధించి ప్రొఫైల్ తయూరు చేసుకుని నిరంతరం వాటిని పరిశీలించాలి. ఆర్గానిక్ కెమిస్ట్రీలో అన్ని రసాయన సమ్మేళనాల ధర్మాలు, తయారీ పద్ధతులపై క్షుణ్నమైన అవగాహన అవసరం. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, కాంపౌండ్స్ తయారీ, ఎలక్ట్రోడ్స్, ఎలక్ట్రోలైట్స్ తదితర విధానాలను టేబుల్ రూపంలో ప్రిపేర్ చేసుకోవాలి.
 జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఎంట్రెన్స్‌లు జ్ఞాపకశక్తి కంటే అవగాహనకే ఎక్కువ ప్రాధాన్యతనిస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి.
 సంబంధిత ఎంట్రెన్స్‌కు సంబంధించి సాధ్యమైనన్ని మాక్ టెస్ట్‌లు రాయాలి. దీని వల్ల సమస్య పరిష్కారంలో వేగంతోపాటు కచ్చితత్వం అలవడుతుంది.
 బోటనీలో ప్రతి ప్రశ్న కూడా ముఖ్యమే. కాబట్టి ప్రతి అంశంపై ఆమూలాగ్రం అవగాహన పొందాలి. పాఠ్యపుస్తకంలోని ప్రతి అంశాన్ని చదవాలి.
 మ్యాథమెటిక్స్‌లో అధిక మార్కుల సాధనకు సెట్స్, రిలేషన్స్-ఫంక్షన్స్, ట్రిగ్నోమెట్రీ, అల్జీబ్రా, జామెట్రీ, వెక్టర్స్, కాలిక్యులస్‌ను బాగా రివిజన్ చేయాలి (ఏఐఈఈఏ- యూజీ).
 రిఫరెన్స్ బుక్స్: ఎన్‌సీఈఆర్‌టీ-11, 12 తరగతి పుస్తకాలు.


 
 ఏఐఈఈఏ-యూజీ, పీజీ, ఎస్‌ఆర్‌ఎఫ్
 ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్).. దేశంలో వ్యవసాయ విద్యను పర్యవేక్షించే అత్యున్నత సంస్థ. ఐసీఏఆర్ ప్రతి ఏటా ఎగ్జామినేషన్ ఫర్ అడ్మిషన్ టు డిగ్రీ, పీజీ, ఎస్‌ఆర్‌ఎఫ్ (ఏఐఈఈఏ- యూజీ, పీజీ, ఎస్‌ఆర్‌ఎఫ్) నిర్వహిస్తోంది. దీని ద్వారా రాష్ట్ర వ్యవసాయ యూనివర్సిటీల్లోని బ్యాచిలర్ డిగ్రీ కోర్సుల్లో 15 శాతం సీట్లను, పీజీ కోర్సుల్లో 25 శాతం సీట్లను, ఎన్‌డీఆర్‌ఐ, ఐఏఆర్‌ఐ వంటి సంస్థల్లో మొత్తం సీట్లను భర్తీ చేస్తారు.
 ఏఐఈఈఏ- యూజీ: ఈ పరీక్ష ద్వారా అడ్మిషన్లు పొందే కోర్సులను ‘స్ట్రీమ్-ఎ, బి’అనే రెండు కేటగిరీలుగా విభజించారు. అవి.. స్ట్రీమ్-ఎ (అగ్రికల్చర్/బయాలజీ): అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, ఫిషరీస్, హోం సైన్స్, సెరికల్చర్, బయో టెక్నాలజీ, ఫుడ్ సైన్స్ కోర్సులు. స్ట్రీమ్-బి (మ్యాథమెటిక్స్): అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్, ఫారెస్ట్రీ, ఫుడ్ సైన్స్, బయోటెక్నాలజీ. కొన్ని యూనివర్సిటీల్లో స్ట్రీమ్-ఎ అభ్యర్థులు.. ఫుడ్ సైన్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ కోఆపరేషన్.. స్ట్రీమ్-బి అభ్యర్థులు.. ఫారెస్ట్రీ/ బయోటెక్నాలజీ కోర్సులను కూడా ఎంచుకోవచ్చు. విద్యార్థులు దరఖాస్తు సమయంలోనే తమకు ఆసక్తిగల ఒక స్ట్రీమ్‌ను ఎంచుకోవాలి.
 అర్హత: 50 శాతం మార్కులతో(ఎస్సీ/ఎస్టీలకు 40 శాతం) ఫిజిక్స్, కెమిస్ట్రీలు తప్పనిసరిగా మ్యాథమెటిక్స్/ బయాలజీ/ హోంసైన్స్/అగ్రికల్చర్‌లతో ఇంటర్ ఉత్తీర్ణత/తత్సమానం/ఇంటర్మీడియెట్ (అగ్రికల్చర్). వయోపరిమితి: ఆగస్టు 31, 2014 నాటికి 17-23 ఏళ్లు.


 
 పరీక్ష విధానం:
 మొత్తం మూడు సబ్జెక్టుల్లో మల్టిపుల్ చాయిస్ విధానంలో 180 ప్రశ్నలకు నిర్వహించే ఈ రాత పరీక్షలో రెండున్నర గంటల వ్యవధిలో సమాధానాలను గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులుంటాయి. ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ప్రశ్నపత్రం ఉంటుంది. స్ట్రీమ్-ఎ, బి రెండింటికి ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులు ఉమ్మడిగా ఉంటాయి. రెండు స్ట్రీమ్‌లలోను ఫిజిక్స్ నుంచి 60, కెమిస్ట్రీ నుంచి 60 ప్రశ్నలు అడుగుతారు. మూడో సబ్జెక్టు కింద స్ట్రీమ్-ఎ విద్యార్థులు బయాలజీ/అగ్రికల్చర్‌లలో ఒక దాన్ని, స్ట్రీమ్-బి విద్యార్థులు మ్యాథమెటిక్స్‌ను ఎంచుకోవాలి. వీటిల్లో కూడా 60 ప్రశ్నలుంటాయి. నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు.


 
 ఏఐఈఈఏ-పీజీ
 ఈ పరీక్షలో అత్యుత్తమ ప్రతిభ చూపిన వారికి జేఆర్‌ఎఫ్ కూడా అందిస్తారు. ఏఐఈఈఏ-పీజీ పరీక్ష ద్వారా అభ్యర్థులు 20 మేజర్ సబ్జెక్టులు, 93 సబ్-సబ్జెక్టులలో ప్రవేశం పొందొచ్చు.
 అర్హత: సంబంధిత అంశంలో 60 శాతం మార్కులతో (ఎస్సీ/ఎస్టీ/శారీరక వికలాంగులు 50 శాతం మార్కులు) బ్యాచిలర్ డిగ్రీ (10+2+3/4/5 విధానంలో). ఎంవీఎస్సీ కోసం బీవీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.
 వయోపరిమితి: ఆగస్టు 31, 2014 నాటికి కనీసం 19 ఏళ్లు.


 
 పరీక్ష విధానం:
 మల్టిపుల్ చాయిస్, క్రాస్ మ్యాచింగ్ అనే రెండు విధానాల్లో ఏఐఈఈఏ-పీజీ పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో 160 ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్‌లో 150 ప్రశ్నలు అడుగుతారు. వీటికి ప్రతి ప్రశ్నకు 4 మార్కుల చొప్పున 600 మార్కులను కేటాయించారు. నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కును తగ్గిస్తారు. క్రాస్ మ్యాచింగ్ పద్ధతిలో 10 ప్రశ్నలు ఉంటాయి. వీటికి ప్రతి ప్రశ్నకు 5 మార్కుల చొప్పున కేటాయించారు. నెగెటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 0.2 మార్కును తగ్గిస్తారు. ప్రశ్నపత్రం ఇంగ్లిష్‌లో మాత్రమే ఉంటుంది.


 
 జేఆర్‌ఎఫ్:
 రాత పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి 475 మందికి వివిధ సబ్జెక్టుల్లో జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్స్ (జేఆర్‌ఎఫ్) ప్రదానం చేస్తారు. వెటర్నరీ సైన్స్ అభ్యర్థులకు నెలకు రూ. 12,000, ఇతర సబ్జెక్టుల వారికి నెలకు రూ.8,640 చొప్పున రెండేళ్లపాటు ఫెలోషిప్ అందజేస్తారు. బుక్స్, ఎక్విప్‌మెంట్ కొనుగోలు, రవాణా ఖర్చుల కోసం ఏడాదికి రూ. 6,000 కాంటింజెన్సీ గ్రాంట్ కూడా ఇస్తారు.
 
 ప్రవేశం కల్పించే ఇన్‌స్టిట్యూట్‌లు:
 ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-న్యూఢిల్లీ, ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-ఇజ్జత్‌నగర్ (ఉత్తర ప్రదేశ్), సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్-ముంబై, నేషనల్ డెయిరీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్-కర్నాల్ (హర్యానా)లలో 100 శాతం సీట్లలో ప్రవేశం కల్పిస్తారు. రాష్ట్రస్థాయి అగ్రికల్చర్ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలైన బెనారస్ హిందూ వర్సిటీ, విశ్వభారతి, నాగాలాండ్ యూనివర్సిటీల్లో ఉన్న సీట్లలో 25 శాతం సీట్లు కేటాయించారు.
 
 ఏఐఈఈఏ-ఎస్‌ఆర్‌ఎఫ్
 అర్హత: సంబంధిత సబ్జెక్ట్‌ల్లో మాస్టర్ డిగ్రీ. వయసు: 21 నుంచి 30 ఏళ్లు. ఎస్‌ఆర్‌ఎఫ్‌ల ఎంపికకు రెండు పద్ధతులను అనుసరిస్తుంది. రాత పరీక్షలో సాధించిన మెరిట్‌కు 75 శాతం వెయిటేజీ, గత అకడమిక్ రికార్డ్‌కు 25 శాతం వెయిటేజీ కేటాయిస్తారు. ఈ రెండు అంశాల ద్వారా రూపొందించిన మెరిట్ లిస్ట్ ఆధారంగా ఎస్‌ఆర్‌ఎఫ్‌ల ఎంపిక ఉంటుంది. ఏఐఈఈఏ-ఎస్‌ఆర్‌ఎఫ్ ద్వారా 14 మేజర్ సబ్జెక్టుల్లో 202 ఎస్‌ఆర్‌ఎఫ్‌లను ఐసీఏఆర్ ప్రదానం చేస్తుంది.
 
 
 ఎంపికైన అభ్యర్థులకు నాన్ వెటర్నరీ సైన్స్ విభాగంలో మొదటి రెండేళ్లు నెలకు రూ.12,000 తర్వాత మూడో ఏడాది నెలకు రూ.14,000 ఫెలోషిప్ అందజేస్తారు. వెటర్నరీ సైన్స్ విభాగంలో మొదటి రెండేళ్లు నెలకు రూ.14,000 తర్వాత మూడో ఏడాది నెలకు రూ.15,000 ఫెలోషిప్ అందజేస్తారు. ఏడాదికి రూ. 10 వేల కాంటింజెన్సీ గ్రాంట్ కూడా ఇస్తారు. ఈ పరీక్ష ద్వారా అన్నీ స్టేట్ అగ్రికల్చరల్/వెటర్నరీ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు, ఐసీఏఆర్ డీమ్డ్-టు-బి-యూనివర్సిటీలు, ఎస్‌హెచ్‌ఐఏటీఎస్-అలహాబాద్, సెంట్రల్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ-ఇంపాల్, విశ్వభారతి, నాగాలాండ్ యూనివర్సిటీలో ప్రవేశం పొందొచ్చు.
 
 రాత పరీక్ష ఇలా:
 రాత పరీక్షలో రెండు పేపర్లు.. పేపర్-1, పేపర్-2 ఉంటా యి. కేవలం ఇంగ్లిష్ మాధ్యమంలోనే ఉంటుంది. పేపర్-1 జనరల్ నాలెడ్జ్. ఇది అన్ని సబ్జెక్టులకు ఉమ్మడి పేపర్. గంటన్నర వ్యవధిలో వంద ప్రశ్నలకు నిర్వహించే పరీక్షకు కేటాయించిన మార్కులు 100. సామాజిక పరిస్థితులపై అభ్యర్థికున్న అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.
 
 అగ్రికల్చర్, డెయిరీంగ్, ఫిషరీస్ మొదలైన సబ్జెక్టుల్లో అవగాహనతోపాటు సమకాలీన సంఘటనలు, రీసెర్చ్ స్కాలర్‌కు ఉపయోగపడే అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఈ పేపర్‌కు 25 శాతం వెయిటేజీ కేటాయించారు.
 పేపర్-2 సబ్జెక్ట్ పేపర్. అభ్యర్థి ఎంచుకున్న సబ్జెక్టుపై ప్రశ్నలు వస్తాయి. ఇందులో ఉండే 200 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. వీటికి రెండున్నర గంటల వ్యవధిలో సమాధానాలను గుర్తించాలి. ఈ పేపర్‌కు 70 శాతం వెయిటేజీ కేటాయించారు.
 
 నోటిఫికేషన్ సమాచారం:
 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రెండు విధాలుగా దరఖాస్తు చేసుకోవచ్చు. సిండికేట్ బ్యాంక్ నిర్దేశిత శాఖల నుంచి లేదా అగ్రికల్చర్ వర్సిటీ/ఐసీఏఆర్ ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి/ఐసీఏఆర్ పేరిట నిర్దేశించిన విధంగా డీడీని పంపి పోస్ట్ ద్వారా కూడా దరఖాస్తును పొందొచ్చు.
 దరఖాస్తుకు చివరి తేదీ: ఫిబ్రవరి 7, 2014.
 రాత పరీక్ష తేదీలు: యూజీ- ఏప్రిల్ 12, 2014.
 పీజీ/ఎస్‌ఆర్‌ఎఫ్-ఏప్రిల్ 13, 2014
 వివరాలకు: www.icar.org.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement