కెరీర్ మేనేజ్‌మెంట్ అంటే తెలుసా?! | Do you know career management ? | Sakshi
Sakshi News home page

కెరీర్ మేనేజ్‌మెంట్ అంటే తెలుసా?!

Published Fri, Sep 19 2014 12:35 AM | Last Updated on Sat, Sep 2 2017 1:35 PM

కెరీర్ మేనేజ్‌మెంట్ అంటే తెలుసా?!

కెరీర్ మేనేజ్‌మెంట్ అంటే తెలుసా?!

భవిష్యత్తును మనసుకు నచ్చినట్లుగా తీర్చిదిద్దుకోవడం ఒక కళ. ఇది నిరంతర ప్రక్రియ. ఒక రంగాన్ని కెరీర్‌గా ఎంచుకొని, అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే అలుపెరుగక శ్రమించాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పట్టిన పట్టు విడవకుండా ధైర్యంగా ముందుకు దూసుకుపోయే సామర్థ్యం ఉండాలి. కెరీర్ మేనేజ్‌మెంట్ గురించి తెలుసుకోవడం నేటి యువతకు చాలా అవసరం. కెరీర్‌ను ఎప్పుడు ఎలా తీర్చిదిద్దుకోవాలో కచ్చితంగా తెలిస్తే లాంగ్‌టర్మ్ సక్సెస్ సాధ్యమవుతుంది. కెరీర్ మేనేజ్‌మెంట్ ఒక రకంగా ఫైనాన్షియల్ మేనేజ్‌మెంట్ లాంటిదే. క్రమశిక్షణతో ఒక్కో రూపాయిని పొదుపు చేస్తూ పోతే కొన్నేళ్లకు పెద్దమొత్తంలో ధనం చేతికందుతుంది. ఒక్కో ఇటుకను జాగ్రత్తగా పేరుస్తూ కెరీర్ అనే సుందర భవనాన్ని నిర్మించుకోవాలి. భవిష్యత్తు నిర్మాణ ప్రణాళికను రూపొందించుకొని అమల్లో పెట్టాలి.
 
 జీవితకాల ప్రక్రియ: కెరీర్ మేనేజ్‌మెంట్ అనేది అనుకోగానే ఒక్కరోజులో పూర్తయ్యేది కాదు. ఇది జీవితకాల ప్రక్రియ అనే వాస్తవాన్ని గుర్తించాలి. జీవిత ప్రయాణంలో ఇదొక భాగం. కాబట్టి ఏదైనా సమస్య తలెత్తితే ఈ మేనేజ్‌మెంట్‌కు మధ్యలోనే మంగళం పాడొద్దు. కారును రెగ్యులర్‌గా మెయింటనెన్స్ చేస్తేనే సాఫీగా ప్రయాణం సాగిస్తుంది. లేకపోతే తుప్పుపట్టి పోతుంది. కెరీర్ కూడా ఇంతే.
 
 క్రియాశీల ప్రక్రియ: కెరీర్ మేనేజ్‌మెంట్ క్రియాశీల ప్రక్రియ. మీరు బద్ధకంగా ఇంట్లో కూర్చొని, మీ పనిని ఇంకెవరో పూర్తి చేయాలని చూడకండి. దీనివల్ల వారు కెరీర్‌లో పైకి ఎదుగుతారు, మీరు నష్టపోతారు. కనుక క్రియాశీలకంగా వ్యవహరించండి. మీ పనులను సకాలంలో పూర్తిచేయండి. బాధ్యతలను నెరవేర్చే విషయంలో ఎప్పుడూ వెనుకడుగు వేయొద్దు.
 
 నిర్మాణాత్మక ప్రక్రియ: కెరీర్‌ను జాగ్రత్తగా నిర్మించుకుంటే దాన్నుంచి ప్రయోజనం పొందొచ్చు. లేకపోతే మిగిలేది శూన్యమే. కొందరు అత్యవసరమైన పరిస్థితి వచ్చేదాకా కెరీర్‌ను నిర్మించుకోవడంపై దృష్టి పెట్టరు. మీ విషయంలో ఇలాంటి పొరపాటు జరగకుండా చూసుకోండి. కెరీర్ మేనేజ్‌మెంట్ నిర్మాణాత్మకంగా ఉండాలి. దీనివల్ల ఈ ప్రక్రియ అన్ని అవాంతరాలను ఛేదిస్తూ ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ముందుకు సాగుతుంది.
 
 లక్ష్యాలను నిర్దేశించుకోవాలి: జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నారో స్పష్టంగా నిర్దేశించుకోవాలి. భవిష్యత్తు నిర్మాణంలో ఇది చాలా కీలకం. అంతిమ లక్ష్యాన్ని చిన్నచిన్న లక్ష్యాలుగా విభజించుకోవాలి. వరుస క్రమంలో ఒక్కొక్కటి సాధిస్తూ గమ్యస్థానం చేరుకోవాలి. ఒక్కో లక్ష్యాన్ని సాధించడానికి గడువును నిర్ణయించుకోవాలి. ఆ లోగా పని పూర్తిచేయాలి.
 
 ఎదుగుదలపై సమీక్ష:  జీవితంలో ఎదుగుదల ఏ స్థాయిలో ఉందో, మీరు ఏ దశలో ఉన్నారో ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలి. ప్రగతి ఆశించినట్లుగా లేకపోతే మరింత శ్రమించాలి. కెరీర్ మేనేజ్‌మెంట్‌లో రెగ్యులర్ చెకింగ్ చాలా ముఖ్యం. తాజా అవసరాల రీత్యా కెరీర్ గోల్స్‌ను మార్చుకోవడం లేదా వాటి స్థాయిని పెంచడం వంటివి చేస్తుండాలి. కెరీర్ మేనేజ్‌మెంట్ ప్రారంభంలో కష్టంగానే ఉన్నా ముందుకు సాగుతున్న కొద్దీ సులభతరంగా మారుతుంది. కెరీర్‌లో లక్ష్యాలతోపాటు ఇంటిని కొనుగోలు చేయడం, విదేశీ ప్రయాణం వంటి వ్యక్తిగత లక్ష్యాల సాధనకు కూడా ఇలాంటి మేనేజ్‌మెంట్ అవసరమే.
 
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 డీఎస్సీ-పరీక్ష దృష్ట్యా ‘విజ్ఞానశాస్త్ర స్వభావం’ అధ్యాయం ప్రాధాన్యతను తెలపండి?     - ఎం.రాజేశ్వరి, రాంనగర్
 విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు (ఫిజికల్ సైన్‌‌స మెథడాలజీ)లో ‘విజ్ఞానశాస్త్ర స్వభావం’ అనే అధ్యాయం  ముఖ్యమైంది. గత ప్రశ్న పత్రాలను పరిశీలిస్తే ఈ అధ్యాయం నుంచి   సుమారు 3 ప్రశ్నలు ఇస్తున్నట్లు గమనించ వచ్చు. కాబట్టి అభ్యర్థులు విజ్ఞాన శాస్త్ర నిర్వచనాలు, ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశాలు (యథార్థం, సాధారణీకరణం, భావన, సూత్రం, ప్రాకల్పన మొదలైనవి) ప్రాకల్పనలు- రకాలు- ఉదాహరణలు, విజ్ఞాన శాస్త్ర బోధనా విలువ అనే అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.  ద్రవ్యాత్మక నిర్మాణంలోని అంశాలను, విజ్ఞాన శాస్త్ర బోధనా విలువలను ఉదాహరణలతో అన్వ యించుకుంటూ చదవాలి. బోధనా విలువల ఉపయోగాలపై అవగాహన పెంచుకోవాలి.
 ఇన్‌పుట్స్: ఎ.వి.సుధాకర్,
 సీనియర్ ఫ్యాకల్టీ
 
 కానిస్టేబుల్ పరీక్షలో ‘భారతదేశ నైసర్గిక స్వరూపం’ పాఠ్యాంశం నుంచి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
     - ఉమేశ్ యాదవ్,  బర్కత్‌పుర
 భారతదేశ భూగోళ శాస్త్రంలో ‘నైసర్గిక స్వరూపాలు’ విభాగానికి అత్యంత ప్రాముఖ్యం ఉంది. దీనిలోని హిమాలయాలు, గంగా - సింధు మైదానాలకు సంబంధించి ప్రతి పరీక్షలో కనీసం 1, 2 ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి దీనిలోని ప్రధాన అంశాలైన హిమాలయాల పొడవు, వాటిలోని సమాంతర శ్రేణు లు, ఆ శ్రేణుల్లో ఎత్తయిన శిఖరాలు, కనుమలు, లోయలు, మైదానాలు, దానిలోని భూ స్వరూపాలు మొదలైన అంశాలను అధ్యయ నం చేయాలి. గతంలో వచ్చిన ప్రశ్నల సరళిని పరిశీలిస్తూ మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. దీంతో మంచి మార్కులు సాధించవచ్చు.
 ఇన్‌పుట్స్: ముల్కల రమేష్,
 సీనియర్ ఫ్యాకల్టీ
 
 ఎడ్యూ న్యూస్: క్యాట్-2014తో ఎఫ్‌ఎంఎస్‌లో ప్రవేశాలు
 ప్రతిష్టాత్మక బీస్కూల్స్‌లో ఒకటైన.. ఫ్యాకల్టీ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ (ఎఫ్‌ఎంఎస్), ఢిల్లీ యూనివర్సిటీ.. వచ్చే ఏడాది ప్రారంభం కానున్న ఫుల్‌టైం ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశాలకు కామన్ అడ్మిషన్ టెస్ట్ (క్యాట్) -2014 స్కోర్‌ను పరిగణనలోకి తీసుకోనుంది. దీంతోపాటు గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, పని అనుభవం, అకడమిక్ రికార్డ్ ఆధారంగా ప్రవేశాలు కల్పించనుంది. ఎఫ్‌ఎంఎస్‌లో రెండేళ్ల ఎంబీఏ కోర్సులో మొత్తం 216 సీట్లు అందుబాటులో ఉన్నాయి. త్వరలో ప్రవేశాల ప్రకటనను విడుదల చేస్తారు. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. క్యాట్ కాకుండా మరే ఇతర ప్రవేశపరీక్షను యూనివర్సిటీ నిర్వహించదు. ఈ ఏడాది కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులకు 100 శాతం ప్లేస్‌మెంట్స్ కల్పించింది. ఐఐఎం- ఇండోర్ నిర్వహించే క్యాట్-2014 నవంబర్ 16, 22వ తేదీల్లో జరుగుతుంది. ఈ నెల 30 వరకు క్యాట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. క్యాట్ ఫలితాలను డిసెంబర్ మూడోవారంలో విడుదల చేస్తారు.
 వెబ్‌సైట్: http://fms.edu/
 
 గేట్-2015 దరఖాస్తు గడువు పొడిగింపు
 దేశవ్యాప్తంగా వివిధ ఐఐటీలు, ఎన్‌ఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఐఐఐటీలు, ఇతర యూనివర్సిటీల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పరీక్ష.. గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్ (గేట్)-2015. ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌లో ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ అక్టోబర్ 1 కాగా అక్టోబర్ 14 వరకు గడువును పొడిగించారు.
 
 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో భాగంగా నిర్దేశిత సర్టిఫికెట్లను, ఫొటోను అప్‌లోడ్ చేయాలి. ఫీజును కూడా నెట్ బ్యాంకింగ్/డెబిట్‌కార్డ్/క్రెడిట్ కార్డ్ విధానాల్లో చెల్లించాలి. ప్రింటవుట్ దరఖాస్తును పంపాల్సిన అవసరం లేదు. గేట్-2015ను ఐఐటీ-కాన్పూర్ నిర్వహించనుంది. జనవరి 31, ఫిబ్రవరి 1, 7, 8, 14 తేదీల్లో పరీక్షలు ఉంటాయి. వచ్చే ఏడాది మార్చి 12న గేట్ ఫలితాలు వెలువడే అవకాశముంది. వివిధ ప్రభుత్వ రంగ కంపెనీలు ఎంట్రీ లెవల్ ఉద్యోగాల భర్తీకి గేట్ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
 వెబ్‌సైట్: http://gate.iitk.ac.in/
 
 జాబ్స్, అడ్మిషన్‌‌స అలర్‌‌ట్స
 సెంట్రల్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్
 రాంచీలోని సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
  జూనియర్ ఓవర్‌మెన్: 94
 అర్హతలు: డీజీఎంఎస్ జారీచేసిన ఓవర్‌మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.
  మైనింగ్ సిర్దార్: 238
 అర్హతలు: డీజీఎంఎస్ జారీ చేసిన మైనింగ్ సిర్దార్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి.
  డిప్యూటీ సర్వేయర్: 15
 అర్హతలు: పదో తరగతితో పాటు డీజీఎంఎస్  జారీ చేసిన మైన్స్ సర్వే సర్టిఫికెట్ ఉండాలి.
 నోటిఫికేషన్‌లో నిర్దేశించిన వయోపరిమితి ఉండాలి.
 ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 16
 వెబ్‌సైట్: http://ccl.gov.in
 
 సీడాక్
 హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సీడాక్) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
  ప్రాజెక్ట్ మేనేజర్: 1
  ప్రాజెక్ట్ సర్వీస్ సపోర్ట్: 2
  ప్రాజెక్ట్ అసోసియేట్/ప్రాజెక్ట్ అసిస్టెంట్: 4
  ప్రాజెక్ట్ ఇంజనీర్ (మల్టీమీడియా): 1
 అర్హతలు: సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లొమా ఉండాలి. నిర్దేశిత వయోపరిమితి ఉండాలి.
 దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 1
 వెబ్‌సైట్: http://cdac.in/  
 
 ఐఐఎం - బెంగళూరు
 బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం) పీజీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది.
  పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ పబ్లిక్ పాలసీ అండ్ మేనేజ్‌మెంట్
 కాలపరిమితి: ఏడాది
 అర్హతలు: ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీతో పాటు ఐదేళ్ల అనుభవం ఉండాలి. క్యాట్/ జీఆర్‌ఈ/ జీమ్యాట్‌లో అర్హత అవసరం.
 రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: ఫిబ్రవరి 2, 2015
 వెబ్‌సైట్: http://www.iimb.ernet.in

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement