జాగ్రఫీ
భారతదేశంలో నదీ వ్యవస్థ-2
ద్వీపకల్ప నదీ వ్యవస్థ:
ద్వీపకల్ప భూభాగం పడమర నుంచి తూర్పునకు వాలి ఉంది. దీంతో 90శాతం నదులు పడమరలో జన్మించి తూర్పునకు ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. మిగిలిన 10 శాతంలో కొన్ని ఉత్తర దిశలో ప్రవహించి గంగానదీ వ్యవస్థతోనూ, మరికొన్ని పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలోనూ కలుస్తున్నాయి. అందువల్ల ద్వీపకల్ప నదీ వ్యవస్థను మూడు భాగాలుగా విభజించవచ్చు. అవి
1) తూర్పుగా ప్రవహించి బంగాళాఖాతంలో
కలిసే నదులు
2) పశ్చిమంగా ప్రవహించి అరేబియా
సముద్రంలో కలిసే నదులు
3) ఉత్తర దిశగా ప్రవహించి గంగానది
వ్యవస్థలో కలిసే నదులు
1) తూర్పుగా ప్రవహించే ద్వీపకల్ప నదీ వ్యవస్థ:
ఎ) మహానది:ఛత్తీస్‌గఢ్ దండకారణ్య ప్రాంత ంలో గల రాయ్‌పూర్ జిల్లాలోని షిహావాలో మహానది జన్మించింది. ఇది ఒడిశాలో బంగాళాఖాతంలో కలుస్తోంది. మహానది ఎగువ ప్రాంతంలో టీ కప్పు ఆకృతిలో ఛత్తీస్‌గఢ్ మైదానం ఉంది. ఈ నది పరివాహక ప్రాంతం ఛత్తీస్‌గఢ్, మహారాష్ర్ట, బీహార్, ఒడిశా రాష్ట్రాల్లో ఉంది.
ఉపనదులు: హశ్‌డో, షియోనాథ్, జంక్, ఓంజ్, టెల్, మాడ్.
బి) గోదావరి: ద్వీపకల్ప భూభాగంలో అతి పెద్ద నదీ వ్యవస్థ. దీన్నే వృద్ధగంగ/దక్షిణ గంగ/ భారతదేశ రైన్ నది అని కూడా పిలుస్తారు. దీని పరివాహక ప్రాంతం మహారాష్ర్టలో (48.6 శాతం), ఆంధ్రప్రదేశ్‌లో (23.8 శాతం), మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో (20.7 శాతం), ఒడిశాలో(5.5 శాతం), కర్ణాటకలో (1.4 శాతం) ఉంది. ఇది మహారాష్ర్టలోని నాసిక్ సమీపాన గల త్రయంబకేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లో జన్మించి ఆంధ్రప్రదేశ్‌లోకి బాసర వద్ద ప్రవేశిస్తుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, ఉభయ గోదావరి జిల్లాల ద్వారా ఈ నది ప్రవహిస్తూ, ఏడు శాఖలుగా విడిపోయి బంగాళాఖాతంలో కలుస్తోంది. అందుకే దీన్ని సప్తగోదావరి అని కూడా పిలుస్తారు. అవి గౌతమీ, వశిష్ట, వైనతేయ, తుల్య, భరధ్వాజ, కౌశిక, ఆశ్రేయ. గోదావరి మొత్తం పొడవు 1,465 కిలోమీటర్లు. ఆంధ్రప్రదేశ్‌లో ఈ నది 770 కి.మీ. దూరం ప్రవహిస్తోంది.
ఉపనదులు: మంజీర (కుడివైపు ఉపనది), ప్రాణహిత, వార్థా, వెన్‌గంగ, పెన్‌గంగ, ఇంద్రావతి, కిన్నెరసాని, శబరి, సీలేరు, మాచ్‌ఖండ్, మానేరు, కడెం.
సి) కృష్ణానది: ఇది ద్వీపకల్ప భూభాగంలో 2వ పెద్దనది. దీని పరివాహక ప్రాంతం మహారాష్ర్టలో 27 శాతం, కర్ణాటకలో 44 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 29 శాతం విస్తరించి ఉంది. ఇది మహారాష్ర్టలోని మహాబలేశ్వరం వద్ద పశ్చిమ కనుమల్లో జన్మించి కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ద్వారా ప్రవహిస్తోంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోకి మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ మండలంలోని తంగడి అనే ప్రాంతంలో ప్రవేశిస్తుంది. కర్నూలు, నల్గొండ, గుంటూరు, కృష్ణా జిల్లాల ద్వారా ప్రవహిస్తూ హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. ఈ నది మొత్తం పొడవు 1420 కి.మీ. ఇది ఆంధ్రప్రదేశ్‌లో 720 కి.మీ. దూరం ప్రవహిస్తోంది. విజయవాడకు దిగువన 64 కి.మీల దూరంలో ఇది రెండు పాయలుగా విడిపోతుంది. ఈ రెండు పాయల మధ్యగల ఎత్తై సారవంతమైన మైదానాన్ని దివిసీమ అని పిలుస్తారు.
ఉపనదులు: తుంగభద్ర, భీమ, ఘటప్రభ, మలప్రభ, దూద్‌గంగా, పంచ్‌గంగా, దిండి, మూసి, కొయన, మున్నేరు.
డి) పెన్నా: ఈ నది కర్ణాటకలోని నంది దుర్గ కొండల్లో జన్మిస్తుంది. అనంతపురం జిల్లాలోని హిందూపూర్ సమీపంలో రాష్ట్రంలోకి ప్రవేశించి కడప, నెల్లూరు జిల్లాల ద్వారా ప్రవహిస్తూ ఊటుకూరు అనే ప్రదేశంలో బంగాళాఖాతంలో కలుస్తోంది. దీన్నే పినాకిని అని అంటారు. ఈ నదిని రాయలసీమ జీవనాడిగా కూడా పిలుస్తారు.
ఉపనదులు: జయమంగళ, చిత్రావతి, పాపాఘ్ని, కుందేరు, చెయ్యేరు, సగిలేరు.
ఇ) గుండ్లకమ్మ: ఈ నది ప్రకాశం జిల్లా కంభం చెరువులో జన్మించి వినుకొండ, ఒంగోలుల ద్వారా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తోంది.
ఎఫ్) వంశధార: ఒడిశాలో తూర్పు కనుమల రూపాంతరమైన జయ్‌పూర్ కొండల్లో జన్మించి శ్రీకాకుళం జిల్లాలోని పాతపట్నం వద్ద ఆంధ్రప్రదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అదే జిల్లాలో కళింగపట్నం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. తూర్పు కనుమల్లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే నదుల్లో ఇది అతి పెద్దది.
జి) నాగావళి: దీన్నే లాంగుల్యా నది అని కూడా పిలుస్తారు. ఒడిశాలోని రాయఘడ్ కొండల్లో జన్మించి శ్రీకాకుళం జిల్లాలోని మోపసు బందరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది.
హెచ్) స్వర్ణముఖి: చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి కొండల్లో జన్మించి శ్రీకాళహస్తి మీదుగా నెల్లూరు జిల్లాలో ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తోంది.
ఐ) సువర్ణ రేఖ: ఛత్తీస్‌గఢ్‌లోని చోటానాగ్‌పూర్‌లో జన్మించి జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తూ బంగాళాఖాతంలో కలుస్తోంది.
జె) వైతరణి: ఒడిశాలోని కియోంజార్ పీఠభూమి వద్ద జన్మించి హోన్సు వద్ద బ్రాహ్మణి నదిని కలుపుకొని బంగాళాఖాతంలో కలుస్తోంది.
కె) బ్రాహ్మణి: ఒడిశాలోని కోయల్, శాంకా నదుల కలయిక ద్వారా బ్రాహ్మణి నది ఏర్పడింది. ఒడిశాలోని రూర్కెలా ఇనుము, ఉక్కు కర్మాగారానికి ఈ నది నుంచే నీటిని అందిస్తున్నారు.
ఎల్) కావేరి: కర్ణాటక కూర్‌గ జిల్లాలోని తలైకావేరి అనే ప్రదేశంలో జన్మించి తమిళనాడులోని శ్రీరంగం వద్ద బంగాళాఖాతంలో కలుస్తోంది. దీని పరివాహక ప్రాంతం కర్ణాటకలో 41 శాతం, తమిళనాడులో 56 శాతం, కేరళలో 3శాతం విస్తరించి ఉంది. దీన్నే దక్షిణ గంగా అని పిలుస్తారు. కారణం గంగానదిలా సంవత్సరమంతా దాదాపు పదినెలలు ఈ నదిలో నీటి ప్రవాహం ఉంటుంది.
ఉపనదులు: ఆర్కావటి, లక్ష్మణతీర్థ, హేమంగి, భవాని, కబిని, కుందా.
2) పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియా సముద్రంలో కలిసే నదులు:
ఎ) నర్మద: మధ్యప్రదేశ్‌లోని అమరకంటక్ పీఠభూమిలో జన్మించి సోన్ నదికి వ్యతిరేకదిశలో మహారాష్ర్ట, గుజరాత్‌ల ద్వారా ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ ఖంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. పశ్చిమ దిశలో ప్రవహించి అరేబియాలో కలిసే నదుల్లో ఇది అతి పెద్దది. కపిలధార, దువధార (మార్పుల్) జలపాతాలు ఈ నదిపై మధ్యప్రదేశ్ భూభాగంలో ఉన్నాయి.
ఉపనదులు: తావా, హిరన్, బంజర్, షక్కర్
బి) తపతి: మధ్యప్రదేశ్‌లోని సాత్పురా కొండల్లో ముల్తాయ్ అనే ప్రదేశంలో జన్మించి నర్మదానదికి సమాంతరంగా అదే దిశలో మధ్యప్రదేశ్, మహారాష్ర్ట, గుజరాత్ రాష్ట్రాల ద్వారా ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ ఖంబట్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. అందువల్ల దీన్ని నర్మద చెలికత్తె, నర్మద కవల అని కూడా పిలుస్తారు.
ఉపనదులు: పూర్ణా, బేతుల్, గిర్న, అరుణావతి.
సి) సబర్మతి: రాజస్థాన్ ఉదయపూర్ జిల్లాలోని ఆరావళి పర్వతాల్లో జయసముద్ర సరస్సులో జన్మిస్తోంది. తర్వాత దక్షిణ దిశలో ప్రవహిస్తూ గల్ఫ్ ఆఫ్ ఖంబట్ వద్ద అరేబియాలో కలుస్తుంది.
డి) మహి: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పుట్టి రాజస్థాన్ ద్వారా ప్రవహిస్తూ గుజరాత్‌లో గల్ఫ్ ఆఫ్ ఖంబట్ వద్ద అరేబియాలో కలుస్తోంది.
అలాగే గోవాలోని జూవారీ, మాండోవి నదులు, కర్ణాటకలోని శరావతి, నేత్రావతి నదులు, కేరళలోని పెరియార్, పంబ నదులు పశ్చిమ కనుమల్లో జన్మించి పశ్చిమ దిశలో ప్రవహిస్తూ అరేబియా సముద్రంలో కలుస్తున్నాయి.