లోతైన విశ్లేషణ.. విజయానికి మార్గం | In-depth analysis to way of success | Sakshi
Sakshi News home page

లోతైన విశ్లేషణ.. విజయానికి మార్గం

Published Sat, Nov 8 2014 10:17 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

In-depth analysis to way of success

 సుమారు అయిదు వేల ఏళ్ల చరిత్ర... అనేక పోరాటాలు... ఎన్నో ముఖ్యమైన సంఘటనలు... సమాజంపై ప్రభావం చూపిన వ్యక్తులు తదితర అంశాలతో కూడిన చరిత్రను అధ్యయనం చేస్తూ ఉంటే ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటుంది. అభ్యర్థులకు హిస్టరీ పట్ల మక్కువ పెరగడానికి ప్రధాన కారణమిదే. విశాల పరిధి ఉన్నప్పటికీ చదివేటప్పుడు ఎంతో కుతూహలాన్ని కలిగిస్తూ సులభంగా అర్థమయ్యే స్వభావం హిస్టరీకి ఉంది. దీంతో నాన్ ఆర్‌‌ట్స అభ్యర్థులు కూడా చరిత్రపై సులువుగా పట్టు సాధించగలుగుతున్నారు. తద్వారా మంచి మార్కులు సాధిస్తున్నారు.

 భారత దేశ చరిత్ర
 ప్రస్తుత పోటీ పరీక్షలకు సంబంధించి జయాపజయాల్లో జనరల్ స్టడీస్ కీలకపాత్ర పోషిస్తోంది. జనరల్ స్టడీస్ (జీఎస్)లోని ప్రధాన అంశాల్లో చరిత్ర ఒకటి. గ్రూప్-1 ప్రిలిమ్స్, గ్రూప్-2 తదితర పరీక్షల్లో హిస్టరీ నుంచి 25 - 30 ప్రశ్నలు తప్పనిసరిగా వస్తున్నాయి. జనరల్ స్టడీస్‌లోని మిగిలిన సబ్జెక్టులతో పోలిస్తే హిస్టరీ పరిధి విశాలమైంది.
 
 ప్రిపరేషన్ ప్లాన్
 ప్రధాన నియామక పరీక్షల సిలబస్‌లలో చరిత్రకు సంబంధించి స్వాతంత్య్ర ఉద్యమాన్ని ప్రత్యేక దృష్టితో చదవాలని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర మూడింటికీ సమాన ప్రాధాన్యమిస్తూ ప్రిపరేషన్ కొనసాగించాలి. మిగిలిన విభాగాలతో పోలిస్తే ఆధునిక భారతదేశ చరిత్ర నుంచి రెండు లేదా మూడు ప్రశ్నలు అధికంగా వస్తున్నాయి.

 సన్నద్ధతలో భాగంగా గత ప్రశ్నపత్రాలను  తప్పనిసరిగా పరిశీలించాలి. ముఖ్యంగా ఇటీవల నిర్వహించిన వివిధ పరీక్షల్లోని ప్రశ్నల సరళిని తెలుసుకోవాలి. ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయో గుర్తించడం ద్వారా కీలక అంశాలకు అధిక సమయం కేటాయించి తగినట్లుగా పునశ్చరణ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. దీంతో మెరుగైన ఫలితాలు సాధించవచ్చు.

 ప్రశ్నల సరళి: చరిత్రలో సాధారణంగా రెండు రకాలుగా ప్రశ్నలు అడుగుతున్నారు.
 ఎ. నేరుగా అడిగే ప్రశ్నలు: వీటినే ఏక పద సమాధాన ప్రశ్నలు లేదా ఫ్యాక్ట్ బేస్డ్ ప్రశ్న లుగా పేర్కొనవచ్చు.
 ఉదా (1): మొదటిసారిగా ‘గోత్రా’ అనే పదాన్ని ఏ వేదంలో ప్రస్తావించారు?
     1) సామవేదం           2) రుగ్వేదం
     3) అధర్వణ వేదం    4) యజుర్వేదం
     సమాధానం: 2
 ఉదా (2): నలంద విశ్వ విద్యాలయ స్థాపకుడుఎవరు?
     1) నలందుడు              2) అశోకుడు
     3) హర్షవర్ధనుడు    4) కుమార గుప్తుడు
     సమాధానం: 4
 ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గుర్తించాలంటే విషయ పరిజ్ఞానం ఉంటే సరిపోతుంది.
 బి.    ఇన్ డెరైక్ట్‌గా అడిగే ప్రశ్నలు: వీటిని కాన్సెప్ట్ ఆధారిత ప్రశ్నలు అంటారు.
 ఉదా (1):    కిందివాటిలో బుద్ధుడి బోధనలు ప్రదానంగా దేనికి సంబంధించినవి?
     1) భగవంతుడిపై విశ్వాసం
     2) క్రతువులు నిర్వహించడం
     3) ఆలోచన, ప్రవర్తనల్లో శుద్ధత
     4) విగ్రహారాధన
 సమాధానం: 3
 ఉదా (2):    దాదాబాయి నౌరోజీకి సంబంధించి కిందివాటిలో సరైంది ఏది?
     ఎ.    భారతదేశంలో బ్రిటిషర్ల ఆర్థిక దోపిడీని బట్టబయలు చేయడం
     బి.    భారత ప్రాచీన గ్రంథాల ఆధారంగా భారతీయుల్లో ఆత్మ విశ్వాసాన్ని పునరుద్ధరించడం
     సి.    సాంఘిక దురాచారాలు రూపుమాపడానికి కృషి చేయడం
     డి.    పార్శీ మత అభివృద్ధికి కృషి చేయడం
     1) ఎ మాత్రమే             2) ఎ, బి
     3) ఎ, బి, సి               4) డి మాత్రమే
 సమాధానం: 3
 ఉదా (3):    జూన్ 3, 1947 మౌంట్ బాటన్ ప్రణాళికలో లేని అంశం?
     1) సమాఖ్య ప్రభుత్వ నిర్మాణం
     2)    రాజ్యాంగ నిర్మాణానికి సంబంధించిన మార్గదర్శకాలు
     3)    {బిటిషర్ల నుంచి భారతీయులకు అధికార మార్పిడి
     4)    దేశంలో జరుగుతున్న మత ఘర్షణలను నిరోధించడం
 సమాధానం: 4
 ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే సబ్జెక్ట్ పట్ల పూర్తి అవగాహన ఉండాలి. బిట్స్ రూపంలో ఉండే మెటీరియల్‌ను కాకుండా విషయంపై పూర్తి అవగాహనను కలిగించే, లోతైన అధ్యయనానికి ఆస్కారముండే ప్రామాణిక పాఠ్య పుస్తకాలను చదవాలి. ఒక అంశాన్ని చదివేటప్పుడే దాన్నుంచి ఏయే కోణాల్లో ప్రశ్నలు వచ్చే అవకాశముందో అంచనా వేసుకుంటూ చదవడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
 భారతదేశ చరిత్రను మూడు భాగాలుగా విభజించారు. అవి: ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక భారతదేశ చరిత్ర. ఈ మూడు విభాగాల్లోనూ తప్పనిసరిగా, తరచుగా ప్రశ్నలు వచ్చే పాఠ్యభాగాల గురించి తెలుసుకుందాం...
     
       ప్రాచీన భారతదేశ చరిత్ర
 ప్రాచీన భారతదేశ చరిత్రలో సింధూ, వేద నాగరికత, జైన, బౌద్ధ మతాలు, మౌర్యులు, గుప్తులపై ప్రశ్నలు తప్పనిసరిగా ఉంటున్నాయి. మిగిలిన పాఠ్యాంశాల నుంచి ప్రశ్నలు అరుదుగానే వస్తున్నాయి. కాబట్టి ప్రాచీన భారతదేశ చరిత్రపై అవగాహన కోసం శిలాయుగాల నుంచి గుప్తుల అనంతర యుగం వరకు చదివినప్పటికీ పైన పేర్కొన్న అంశాలపై ప్రధానంగా దృష్టి సారించాలి. గతంలో ఈ విభాగం నుంచి వచ్చిన కొన్ని ప్రశ్నలను పరిశీలిద్దాం..
 1.    సింధూలోయ నాగరికతను మొదటగా కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్త?
     1) చార్లెస్ మాసన్                       2) జాన్ మార్షల్
     3) అలెగ్జాండర్ కన్నింగ్‌హామ్     4) మార్టిమమ్ వీలర్
 సమాధానం: 1
 2.    డబ్బును రుణంగా ఇవ్వడమనే భావనను తొలిసారిగా ప్రస్తావించిన గ్రంథం ఏది?
     1) అధర్వణ వేదం    2) యజుర్వేదం     3) గోపథ బ్రాహ్మణం     4) శతపథ బ్రాహ్మణం
 సమాధానం: 4
 3.    అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేసిన సంవత్సరం?
     1) క్రీ.పూ. 327    2) క్రీ.పూ. 303     3) క్రీ.పూ. 302    4) క్రీ.పూ. 298
 సమాధానం: 1
 4.    కవిరాజుగా పేరుగాంచిన వారెవరు?
     1) మొదటి కుమార గుప్తుడు     2) మొదటి చంద్రగుప్తుడు
     3) చంద్రగుప్త విక్రమాదిత్య     4) సముద్ర గుప్తుడు
 సమాధానం: 4
 5.    హర్షుని కాలంలో అధికంగా వ్యాప్తిలో ఉన్న దురాచారం?
     1) పరదా పద్ధతి                            2) బాల్య వివాహాలు
     3) కులాంతర వివాహాలపై నిషేధం      4) సతీ సహగమనం
 సమాధానం: 2
     
  మధ్యయుగ భారత చరిత్ర
 హర్షుడి అనంతర కాలం నుంచి మొగలులు, శివాజీ వరకు ఉన్న మధ్యయుగ భారత చరిత్రలో ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అంశాలు.. తొలిమధ్య యుగం, ఢిల్లీ సుల్తానత్, భక్తి ఉద్యమాలు, విజయనగర సామ్రాజ్యం మొదలైనవి. మిగిలిన అంశాలపై ప్రశ్నలు అరుదుగా ఉంటాయి.
 1.    చోళుల పాలనలోని విభాగమైన పెద్ద గ్రామాన్ని ఏమని పిలిచేవారు?
     1) కుర్రమ్            2) కొట్టమ్
     3) నాడు           4) తణియార్
 సమాధానం: 2
 2.    చాళుక్యుల చిత్రకళ లభిస్తున్న ప్రాంతం?
     1) అజంతా     2) ఐహోల్
     3) ఎల్లోరా          4) హంపి
 సమాధానం: 2
 3.    గజనీ మహమ్మద్‌తోపాటు వచ్చిన ముస్లిం పండితుడు?
     1) ఇబన్ బతూతా    2) ఆల్బెరూనీ
     3) అమీర్ ఖుస్రో    4) ఫెరిష్టా
 సమాధానం: 2
 4.    ఇక్తాదారీ వ్యవస్థను ప్రారంభించిన సుల్తాన్ ఎవరు?
     1) బాల్బన్    2) ఐబక్
     3) ఇల్‌టుట్ మిష్    4) అల్లావుద్దీన్ ఖిల్జీ
 సమాధానం: 3
 5.    హిందూస్థానీ సంగీతాన్ని అధికంగా ప్రభావితం చేసింది?
     1) అరబ్ - పర్షియన్ సంగీతం      2) పర్షియన్ సంగీతం
     3) యూరోపియన్ సంగీతం         4) మధ్యాసియా సంప్రదాయాలు
 సమాధానం: 2
 6.    రామానుజుడు బోధించినది?
     1) అహింస    2) భక్తి
     3) జ్ఞానం       4) వేదాలు
 సమాధానం: 2
 7.    వివాహ పన్నును ఉపసంహరించుకున్న విజయనగర రాజు?
     1) శ్రీకృష్ణ దేవరాయలు
     2) రెండో దేవరాయలు
     3) అచ్యుత రాయలు 4) సదాశివ రాయలు
 సమాధానం: 1
 
        ఆధునిక భారత చరిత్ర
 ఈ విభాగంలో స్వాతంత్రోద్యమానికి అధిక ప్రాధాన్యమిస్తూ చదవాలి. అధిక ప్రశ్నలు వచ్చే అవకాశమున్న విభాగం కూడా ఇదే. రాజకీయాధికార సాధన, పరిపాలన, బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాట్లు, సామాజిక, మత సంస్కరణోద్యమాలు, జాతీయోద్యమం మొదలైనవాటిపై ప్రత్యేక దృష్టి సారించాలి. ఈ విభాగం నుంచి అధికంగా అభ్యర్థుల అవగాహనను పరిశీలించేవిధంగా ప్రశ్నల కూర్పు ఉంటుంది. కింది ప్రశ్నలు గమనించండి..
 1.    గాంధీజీ ఎరవాడ జైలులో 1932లో దేనికి వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేశారు?
     1)    రామ్‌సే మెక్డోనాల్డ్ కమ్యూనల్ అవార్డు
     2)    సత్యాగ్రాహిలపై బ్రిటిషర్ల అణచివేత
     3)    గాంధీ - ఇర్విన్ ఒప్పంద ఉల్లంఘన
     4)    కలకత్తాలోని మతకలహాలు
 సమాధానం: 1
 2.    హంటర్ కమిషన్‌ను దేనిపై విచారణకు నియమించారు?
     1) జలియన్ వాలాబాగ్ దుర్ఘటన     2) ఖిలాఫత్ ఆందోళన
     3) బార్డోలీ సత్యాగ్రహం                    4) చౌరీ-చౌరా సంఘటన
 సమాధానం: 1
 3.    బంకించంద్ర ‘ఆనంద్‌మఠ్’ రచించిన
     సంవత్సరం?
     1) 1895    2) 1892    3) 1885    4) 1882
 సమాధానం: 4
 4.    1873లో ‘సత్యశోధక్ సమాజ్’ను స్థాపించిందెవరు?
     1) లోకాహిత వాది 2) ఆర్.జి. భండార్కర్        3) జ్యోతిబా పూలే     4) రామానంద తీర్థ
 సమాధానం: 3
 5.    భారత్‌లో మిలిటెంట్ జాతీయవాదానికి ఎవరిని ఆద్యుడిగా భావిస్తారు?
     1) వి.డి. సావర్కర్    2) భాయ్ రాంసింగ్
     3) భగత్‌సింగ్ 4) వాసుదేవ బల్వంత్ ఫాడ్కే
 సమాధానం: 4
 6.    జాతీయోద్యమంలో అతి తక్కువగా
     పాల్గొన్న వర్గం ఏది?
     1) పెట్టుబడి దారులు 2) రాజ్యాధినేతలు
     3) ప్రభుత్వాధికారులు 4) రైతులు
 సమాధానం: 2
 7.    మూడో మైసూర్ యుద్ధంలో టిప్పు సుల్తాన్‌కు వ్యతిరేకంగా పోరాడింది?
     1)    ఆంగ్లేయులు, కర్ణాటిక్ నవాబ్, హైదరాబాద్ నిజాం
     2)    ఆంగ్లేయులు, మరాఠాలు, హైదరాబాద్ నిజాం
     3)    ఆంగ్లేయులు, మరాఠాలు, కర్ణాటిక్ నవాబ్
     4)    ఆంగ్లేయులు, హైదరాబాద్ నిజాం, మైసూర్ రాజా
 సమాధానం: 2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement