‘సంగం’ సమ్మేళనాలు ఎక్కడ జరిగేవి? | Where Sangam compounds were done? | Sakshi
Sakshi News home page

‘సంగం’ సమ్మేళనాలు ఎక్కడ జరిగేవి?

Published Thu, Oct 2 2014 10:30 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

Where  Sangam compounds were done?

భారతదేశ చరిత్ర,
పారశీక, గ్రీకు దండయాత్రలు

 
భారతదేశంపై విదేశీ దండయాత్రలకు అంకురార్పణ చేసినవారు పారశీకులు. ఇరాన్ దేశాన్ని పూర్వం పర్షియా అని పిలిచేవారు. ఆ దేశానికి చెందిన పారశీకులు క్రీ.పూ. 6వ శతాబ్దంలో భారత వాయవ్య ప్రాంతంపై దండయాత్రలు చేసి సుమారు 200 ఏళ్లు పాలించారు. వీరిలో మొదటిరాజు సైరస్. ఆయన మొదట ‘గాంధార’ను జయించాడు. వీరితోనే ఇండో-పర్షియన్ సంస్కృతి అభివృద్ధి చెందింది. కుడి నుంచి ఎడమకు రాసే ‘ఖరోష్టి లిపి’ పారశీకుల వల్ల భారత్‌లో ప్రవేశించింది. అశోకుడి శిలాశాసనాలు ఈ లిపిలోనే ఉన్నాయి.
 
గ్రీకుల దండయాత్రలు- అలెగ్జాండర్ (క్రీ.పూ. 327-324)
భారతదేశంపై దండయాత్ర చేసిన మొట్టమొదటి యూరోపియన్‌లు గ్రీకులు. వీరు ఇండియా గొప్పతనాన్ని పారశీకుల ద్వారా తెలుసుకున్నారు. క్రీ.పూ. 4వ శతాబ్దంలో మాసిడోనియా (గ్రీక్ రాజ్యం) చక్రవర్తి అయిన అలెగ్జాండర్ ‘అరబేలా యుద్ధం’లో పర్షియా రాజైన మూడో డేరియస్‌ను ఓడించి పర్షియాను ఆక్రమించాడు. ఆ విధంగా పారశీక సామ్రాజ్యంలో భాగంగా ఉన్న భారత వాయవ్య ప్రాంతం గ్రీకుల ఆధీపత్యంలోకి వెళ్లింది.
 ప్రపంచ విజేత కావాలన్న కోరికతో ఉన్న అలెగ్జాండర్ క్రీ.పూ. 327లో భారత్‌పై దండయాత్ర చేశాడు.

ఈ విషయం తెలుసుకున్న తక్షశిల రాజు ‘అంభి’, తన పొరుగురాజైన ‘పోరస్’ (పురుషోత్తముడు)పై శత్రుత్వంతో అలెగ్జాండర్‌ను తమ భూభాగంలోకి ఆహ్వానించాడు. మొదట తక్షశిలను ఆక్రమించిన అలెగ్జాండర్ జీలం, చినాబ్ నదుల మధ్య ప్రాంతాన్ని పాలిస్తున్న పురుషోత్తముడిపై దాడిచేసి అతన్ని బందీగా పట్టుకున్నాడు. ఇక్కడ స్వదేశీ రాజుల మధ్య ఉన్న అనైక్యత అలెగ్జాండర్‌కు కలిసోచ్చింది. వీరోచితంగా పోరాడి ఓడిన పురుషోత్తముడి దేశభక్తిని మెచ్చిన అలెగ్జాండర్ అతని రాజ్యాన్ని అతనికే ఇచ్చి స్వతంత్ర రాజుగా ప్రకటించాడు.

తన కోరిక తీరకుండానే అలెగ్జాండర్ క్రీ.పూ. 324లో తీవ్ర అనారోగ్యంతో ‘బాబిలోనియా’ వద్ద మరణించాడు. ఈ వార్తవిన్న గ్రీస్‌లోని అలెగ్జాండర్ ప్రతినిధి ‘సెల్యూకస్ నికేటర్’ స్వాతంత్య్రం ప్రకటించుకున్నాడు. భారతదేశంలో తన రాయబారిగా ‘మెగస్తనీస్’ను నియమించాడు. మెగస్తనీస్.. ఆనాటి భారతదేశ సాంఘిక, ఆర్థిక పరిస్థితులపై ఇండికా అనే గ్రంథాన్ని రచించాడు.
 
గ్రీకుల దండయాత్రల వల్ల ఇండో-గ్రీకు సంస్కృతి, సంప్రదాయాలు మన దేశంలో నెలకొన్నాయి. గ్రీకుల నాణేల ముద్రణా పద్ధతి, ఖగోళ విజ్ఞానం, శిల్ప శైలి భారత్‌లో ప్రవేశించాయి. అలెగ్జాండర్ దండయాత్ర భారతదేశ చరిత్రలో కచ్చితమైన కాల నిర్ణయం చేయడానికి ఉపకరిస్తుంది.
 
మగధ రాజ్య విజృంభణ
క్రీ.పూ. 6వ శతాబ్దంలో సామాజిక, మత విషయాల్లోనే కాకుండా రాజకీయ రంగంలో కూడా విప్లవాత్మక మార్పులు సంభవించాయి. ‘షోడశ మహాజనపదాల’నే 16 స్వతంత్య్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అవి అంగ, కాశీ, కోసల, మగధ, వజ్జి, మల్ల, చేది, వత్స, కురు, పాంచాల, మత్స్య, శూరసేన, అశ్మక (బోధన్), అవంతి, కాంభోజ, గాంధార. వీటిలో మగధ.. ఇతర రాజ్యాలపై ఆధిపత్యాన్ని నెలకొల్పి భారతదేశ చరిత్రలో మొదటి సామ్రాజ్యంగా అవతరించింది. మగధ రాజధాని రాజగృహ (గిరివ్రజపురం). ఆ కాలంలో మగధ మహాజనపదాన్ని బృహధృదవంశం పాలించేది. ఆ వంశపు చివరి రాజైన రిపుంజయుణ్ణి ఓడించిన హర్యాంక వంశీయులు మగధ సామ్రాజ్యానికి పునాదులను వేశారు.

హర్యాంక వంశస్థాపకుడు బింబిసారుడు. ఇతడు గౌతమ బుద్ధుడికి సమకాలీకుడు. ఆయన తర్వాత అజాత శత్రువు సామ్రాజ్య విస్తరణకు కృషి చేశాడు. అతడు పాటలీపుత్ర నగర నిర్మాత. క్రీ.పూ. 483లో రాజగృహలో మొదటి బౌద్ధసంగీతిని (సమావేశం) నిర్వహించాడు. హర్యాంక వంశ చివరి రాజు ‘నాగదాసకుడి’ని ఓడించి ‘శిశునాగుడు’ శైశునాగవంశాన్ని స్థాపించాడు. అతని వారసుడైన ‘కాలాశోకుడు’ తన రాజధానిని ‘వైశాలి’ నుంచి పాటలీపుత్రానికి మార్చాడు. కాలాశోకుడు క్రీ.పూ. 383లో రెండో బౌద్ధ సంగీతిని ‘వైశాలి’లో నిర్వ లహించాడు.
 తర్వాత మగధలో మహాపద్మనందుడు క్రీ.పూ. 360లో నంద వంశాన్ని స్థాపించి పాలనలోకి వచ్చాడు. నంద వంశస్థులు మగధ సామ్రాజ్యాన్ని బలిష్టం చేశారు. వీరి వంశ చివరి రాజు ‘ధననుదుడు. ఆయనకు అలెగ్జాండర్ సమకాలీనుడని చరిత్రకారుల అభిప్రాయం. కౌటిల్యుడు (చాణక్యుడు) సహాయంతో చంద్రగుప్తుడు క్రీ.పూ. 321లో నందవంశాన్ని నిర్మూలించి మౌర్యవంశ పాలనకు పూనుకున్నాడు.
 
మౌర్య సామ్రాజ్యం
మంచి పరిపాలనదక్షుడైన చంద్రగుప్తుడు తనపై దాడిచేసిన సెల్యూకస్ నికేటర్ (గ్రీకురాజు)ను ఓడించాడు. గ్రీకుల రాయబారిగా మెగస్తనీస్‌ను అంగీకరించాడు. గుజరాత్‌లో సుదర్శన తటాకాన్ని తవ్వించాడు. చంద్రగుప్తుడు తన అవసాన దశలో జైన భిక్షువుగా మారి సల్లేఖన వ్రతం (ఉపవాస దీక్ష)ను ఆచరించి మైసూర్ సమీపంలోని శ్రావణ బెళగొళలో నిర్యాణం (మరణం) చెందాడు. చంద్రగుప్తుడి ప్రధానమంత్రి కౌటిల్యుడు (చాణక్యుడు లేదా విష్ణుశక్తి) సుప్రసిద్ధుడు. అతడు ‘అర్థశాస్త్రం’ గ్రంథాన్ని రాశాడు. అది ప్రాచీన భారత రాజనీతి తత్వానికి మూలాధారం. చంద్రగుప్తుని అనంతరం బిందుసారుడు సింహసనం అధిష్టించాడు. అతని కుమారుడే అశోక చక్రవర్తి.
 
అశోకుడు క్రీ.పూ. 273లో మౌర్య చక్రవర్తి అయి సువిశాల సామ్రాజ్యాన్ని నిర్మించాడు. కళింగ రాజ్యం (ఒడిశా ప్రాంతం)ను ఆక్రమించుకోవడానికి భువనేశ్వర్‌కు సమీపంలోని ‘ధౌలి’ వద్ద క్రీ.పూ. 261లో ‘కళింగ యుద్ధం’ చేశాడు. ఆ యుద్ధంలో గెలిచిన అశోకుడు యుద్ధ మరణాలను, నష్టాలను, క్షతగాత్రులను చూసి పశ్చాత్తాపం చెందాడు. ఉపగుప్తుడనే బౌద్ధ గురువు వద్ద బౌద్ధమతాన్ని స్వీకరించి సత్యం, శాంతి, అహింస, న్యాయం, ధర్మం గురించి వివిధ ప్రాంతాల్లో ప్రచారం చేశాడు.
 
అశోకుడికి ‘దేవానాంప్రియా’, ‘ప్రియదర్శిని’ అనే బిరుదులున్నాయి. శ్రీనగర్ (జమ్మూకాశ్మీర్ రాజధాని) పట్టణాన్ని నిర్మించాడు. సాంద్రీ, బార్హత్, సార్‌నాథ్, అమరావతి స్థూపాలను ప్రతిష్టించాడు. భారత ప్రభుత్వ రాజ చిహ్నంగా ఉన్న ‘మూడు సింహాల’ (అసలు నాలుగు సింహాలు, నాలుగోది వెనుక వైపు ఉంటుంది) కిరీటాన్ని భోపాల్ దగ్గరలోని సార్‌నాథ్ స్థూపం నుంచి గ్రహించారు. ఆ స్థూపం నుంచే బౌద్ధ ధర్మ చక్రాన్ని పోలిన అశోక చక్రాన్ని మన జాతీయ జెండా మధ్యలో పొందుపర్చారు. అశోకుడు క్రీ.పూ. 250లో 3వ బౌద్ధ సంగీతిని పాటలీపుత్రంలో ఏర్పాటు చేశాడు. పరమత సహనమే బౌద్ధమత ధర్మంగా భావించేవాడు. బౌద్ధమత వ్యాప్తికి తన కూతురు సంఘమిత్రను, కుమారుడు మహేంద్రుడిని విదేశాలకు పంపాడు.
 
భారతదేశ చరిత్రలో శిలాశాసనాలు వేయించిన మొదటి చక్రవర్తి అశోకుడు. ఈ శాసనాలు ‘బ్రహ్మీలిపి’లో ఉన్నాయి. అశోకుడు 13వ శిలాశాసనం కళింగ యుద్ధ దుష్ఫలితాలను తెలుపుతుంది. అశోకుడు తన ‘దమ్మ’ (ధర్మ) విధాన సూత్రాలను ప్రజలకు సులభంగా అర్థమయ్యే ప్రాకృత భాషలో శిలాశాసనాల్లో చెక్కించాడు. బౌద్ధ ధర్మం, అశోకుడి దమ్మ విధానం వేర్వేరు. అతడు క్రీ.శ. 232లో చనిపోయాడు. మౌర్యవంశ చివరి రాజైన బృహద్రదున్ని, అతని సేనాని పుష్యమిత్రశుంగుడు వధించి శుంగవంశ పాలనకు ఆద్యుడయ్యాడు.
 
మౌర్యుల పాలన విధానాలను తెలుసుకోవడానికి ముఖ్య ఆధారాలు.. కౌటిల్యుడి ‘అర్థశాస్త్రం, మెగస్తనీన్ ‘ఇండికా’, విశాఖదత్తుడి ‘ముద్రరాక్షసం’ గ్రంథాలు. మౌర్యుల ఆదాయ శాఖకు ముఖ్య అధికారిగా ‘సమాహర్త’, భూమిశిస్తును వసూలు చేసే అధికారిగా ‘గోపుడు’ ఉండేవారు. ఆస్తి తగాదాల పరిష్కారానికి ‘ధర్మస్థియ’, నేర విచారణ కోసం ‘కంటకశోభన’ అనే న్యాయస్థానాలుండేవి.
 
సంగం యుగం
‘సంగం’ అంటే పాండ్యరాజులు ‘మధురై’ (రాజధాని)లో నిర్వహించిన కవి పండిత పరిషత్. క్రీ.పూ. 300 నుంచి క్రీ.శ. 300 సంవత్సరాల మధ్యలో భారత దక్షిణాపథాన్ని పాలించిన చేర, చోళ, పాండ్య రాజ్యాల చరిత్ర, సంస్కృతులను తెలిపే గ్రంథాల రచననను ఆ ‘సంగం’లోని పండితులు చేసేవారు. ఆ మూడు రాజ్యాలను కలిపి ‘తమిళకం’ అంటారు.

చేర రాజ్యం:
కేరళలోని కొచ్చిన్, తిరువాన్ కూర్ ప్రాంతాల్లో చేర రాజ్యం వర్థిల్లింది. సెంగుత్తువాన్ చేరరాజుల్లో ప్రసిద్ధుడు. అతనికి ‘ఎర్రచేర’ అన్న బిరుదు ఉంది. చేరుల రాజధాని ‘వంజి (కరూర్)’. ‘శిలప్పాధికారం’ అనే కావ్యం సెంగుత్తువాన్ విజయాలను వర్ణిస్తుంది.
 
చోళరాజ్యం:
ప్రాచీన చోళ వంశ స్థాపకుడు ‘ఎలార’. కరికాల చోళుడు గొప్పవాడు. వీరి రాజ్యం కావేరి డెల్టా ప్రాంతంలో విస్తరించింది. కరికాలుడు కావేరి పట్టణం (ప్రహార్)ను నిర్మించాడు. కావేరి నదికి ఆనకట్టలు కట్టించి వ్యవసాయాభివృద్ధికి కృషి చేశాడు.

పాండ్యరాజ్యం:
కన్యాకుమారి (తమిళనాడు) ప్రాంతంలో వీరి రాజ్యం వర్థిల్లింది. రాజధాని ‘మధురై’. స్థాపకుడు ముదుకుడిమి పెరువల్లుడి.
తమిళ సాహిత్య రంగంలో సంగం యుగాన్ని ‘స్వర్ణయుగం’గా పేర్కొంటారు. ఆ కాలంలోని ప్రఖ్యాత గ్రంథాలు.

    గ్రంథాలు                రచయితలు
 1. శిలప్పాధికారం     - ఇలాంగో అడిగిల్     - ఇతిహాసం
 2. మణిమేఖలై     - సుత్తన్నై సత్తనార్     - ఇతిహాసం
 3. తొల్కప్పీయం     - తోల్కప్పీయర్     - వ్యాకరణ గ్రంథం
 4. జీవక చింతామణి     - తిరుత్తక్కదేవార్     - వైద్య గ్రంథం
 5. తిరుక్కురల్     - తిరువళ్లువార్     - నీతికావ్యంగతంలో వచ్చిన ప్రశ్నలు
 
 1.    మధురైను రాజధానిగా పాలించిన వారు?
     (కానిస్టేబుల్ - 2012)
     1) పాండ్యులు    2) చోళులు
     3) పల్లవులు    4) రాష్ర్టకూటులు
 2.    అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర ఎప్పుడు చేశాడు?     (ఎస్‌ఐ- 2011)
     1) క్రీ.పూ. 298    2) క్రీ.పూ. 303
     3) క్రీ.పూ. 302    4) క్రీ.పూ. 327
 3.    మగధను మౌర్యులు పాలించిన వెంటనే పాలించిన వారెవరు?    (ఎస్‌ఐ- 2011)
     1) కుషాణులు    2) పాండ్యులు    3) శాతవాహనులు    4) సుంగులు
 4.    ఏ రాజవంశం అత్యంత ప్రాచీనమైంది?
     (ఎస్‌ఐ- 2011)
     1) గుప్తులు    2) కుషాణులు
     3) మౌర్యులు    4) శాతవాహనులు
 5.    ‘ముద్రరాక్షసం’ అనే గ్రంథాన్ని రాసినవారు?    (ఎస్‌ఐ- 2011)
     1) కాళీదాసు    2) శూద్రకుడు
     3) వరాహమిహురుడు   4) విశాఖదత్తుడు
 6.    పురాతన భారత భవన నిర్మాణ రంగంలో ‘ఖరోష్టి’ అనే పదాన్ని ఏ దేశంతో పరిచయ ఫలితంగా ఉపయోగించారు?
     (డిప్యూటీ జైలర్‌‌స- 2012)
     1) చైనా    2) మధ్య ఆసియా
     3) ఇరాన్    4) గ్రీస్
 7.    అశోకుడి శాసనాల్లో తనకు తాను ఏమని సంబోంధించుకున్నాడు?
     (డిప్యూటీ జైలర్‌‌స- 2012)
     1) ధర్మకీర్తి    2) ధర్మవేద
     3) చక్రవర్తి    4) ప్రియదర్శి
 8.    సంగం యుగంలో రచించిన ప్రముఖ తమిళ నీతి కావ్యం?
     (ఎక్సైజ్ కానిస్టేబుల్ - 2012)
     1) మణిమేఖలై    2) తిరుక్కురల్
     3) జీవక చింతామణి   4) ఇండికా
 సమాధానాలు
     1) 1    2) 4     3) 4    4) 3
     5) 4     6) 3     7) 4    8) 2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement