రాష్ట్రీయం
తెలంగాణ రాష్ట్ర పండుగలుగా బోనాలు, బతుకమ్మ బోనాలు, బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్ర పండుగలుగా గుర్తించినట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 16న ప్రకటించింది. ఇక నుంచి ఈ రెండు పండుగలను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిధులను సమకూరుస్తుంది.
ఏపీలో త గ్గిన అటవీ విస్తీర్ణం
ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో 281 చదరపు కిలోమీటర్ల మేర అడవుల విస్తీర్ణం తగ్గిందని జూన్ 10న విడుదలైన ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నివేదిక పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని 46,389 చ.కి.మీ. అడవుల్లో 281 చ.కి.మీ. అడవులు క్షీణించినట్లు నివేదిక తెలిపింది. దేశంలో మైనింగ్ కోసం ఎక్కువగా అడవులను వినియోగిస్తున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని నివేదిక వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ నుంచి కొత్తగా ఏర్పడిన తెలంగాణలో అత్యధిక అటవీ భూమి ఉంది.
తెలంగాణ డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డి
తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి (టీఆర్‌ఎస్) ఏకగ్రీవంగా ఎన్నిక య్యారు.
జాతీయం
విక్రమాదిత్య జాతికి అంకితం
దేశంలో అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 14న గోవాలో జాతికి అంకితం చేశారు. ఈ యుద్ధనౌక పొడవు 282 మీటర్లు, బరువు 44,500 టన్నులు. ఇది 20 అంతస్తుల ఎత్తు మూడు ఫుట్‌బాల్ కోర్టులంత సైజు అంత ఉంటుంది. 45 రోజులపాటు పూర్తిగా సముద్రంలోనే గడిపే సామర్థ్యం దీని సొంతం. గతేడాది దీన్ని రష్యా నుంచి కొనుగోలు చేశారు
దేశంలో 1.75 లక్షల మంది లక్షాధికారులు
మనదేశంలో 2013 నాటికి 1.75 లక్షల మంది లక్షాధికారుల కుటుంబాలు ఉన్నట్లు బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ తన 14వ వార్షిక నివేదికలో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక మిలియనీర్ కుటుంబాలు ఉన్న జాబితాలో మనదేశం 15వ స్థానంలో నిలిచింది. ‘రైడింగ్ ఏ వేవ్ ఆఫ్ గ్రోత్: గ్లోబల్ వెల్త్ 2014’ పేరుతో విడుదల చేసిన నివేదికలో ఆ సంస్థ పలు విషయాలు వెల్లడించింది. 2013లో ప్రపంచ ప్రైవేటు ఆర్థిక సంపద 14.6 శాతం మేర పెరిగి 152 లక్షల కోట్ల డాలర్లకు చేరుకున్నట్టు వివరించింది. లక్షాధికారుల కుటుంబాలు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో 2012లో 16వ స్థానంలో ఉన్న భారత్.. 2013కి వచ్చేసరికి ఒక స్థానం మెరుగుపరుచుకుందని పేర్కొంది. 2018 నాటికి భారతదేశం ఏడో సంపన్న దేశంగా నిలిచే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా 2012లో 1.37 కోట్ల మిలియనీర్ కుటుంబాలు ఉండగా, ఆ సంఖ్య 2013లో 1.63 కోట్లకు చేరుకుంది. అమెరికాలో అత్యధికంగా 71 లక్షల మిలియనీర్ కుటుంబాలున్నాయి. చైనాలో 2012లో 15 లక్షల లక్షాధికారి కుటుంబాలు ఉండగా, 2013లో ఆ సంఖ్య 24 లక్షలకు చేరుకుంది.
భారత ఆర్థిక వ్యవ స్థపై ప్రపంచ బ్యాంకు అంచనా
భారత ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 5.5 శాతం వృద్ధి చెందవచ్చని ప్రపంచ బ్యాంకు భావిస్తోంది. గతేడాది 4.7 శాతం వృద్ధి సాధించింది. వచ్చే ఏడాది 6.3 శాతం, 2016లో 6.6 శాతం వృద్ధి రేటును భారత్ సాధించే అవకాశం ఉంది’ అని ప్రపంచ బ్యాంకు నివేదిక తెలిపింది. ఆర్థికాభివృద్ధి విషయంలో వర్ధమాన దేశాలకు నిరాశ ఎదురవుతుందని ఆ దేశాలు ఈ సంవత్సరం 5.3 శాతం పురోగతి సాధిస్తాయని గత జనవరిలో వేసిన అంచనాను బ్యాంక్ ప్రస్తుతం 4.8 శాతానికి కుదించింది. ఈ దేశాలు వచ్చే ఏడాది 5.4 శాతం, 2016లో 5.5 శాతం వృద్ధి సాధించవచ్చని తెలిపింది. చైనా ప్రభుత్వ యత్నాలు సఫలమైతే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది 7.6 శాతం విస్తరిస్తుందని అంచనా వేసింది. ఆసియా దేశాల్లో వృద్ధి రేట్లు తక్కువ స్థాయిలో ఉంటాయని పేర్కొంది. ఈ ఏడాది గడిచేకొద్దీ ప్రపంచ ఆర్థిక పురోగతి జోరందుకుంటుంది. గ్లోబల్ ఎకానమీ ఈ ఏడాది 2.8 శాతం, వచ్చే ఏడాది 3.4 శాతం, 2016లో 3.5 శాతం వృద్ధిచెందుతుంది.
నర్మదా డ్యామ్ ఎత్తు పెంపునకు అనుమతి
గుజరాత్‌లో వివాదాస్పద నర్మదా డ్యామ్ ఎత్తును 121.92 మీటర్ల నుంచి 138.72 మీటర్లకు(455 అడుగులకు) పెంచుకునేందుకు నర్మదా నియంత్రణ అథారిటీ(ఎన్‌సీఏ) జూన్ 12న అనుమతి మంజూరు చేసింది. 1961 ఏప్రిల్ 5న జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసిన ఈ డ్యామ్.. ముంపు ప్రాంతాలు, పునరావాస సమస్యలతో ఆలస్యమవుతూ వచ్చింది. ఇప్పుడిప్పుడే ప్రాజెక్టు పూర్తవుతోంది. ఎనిమిదేళ్ల కిందట డ్యామ్ ఎత్తును 121.92 మీటర్లకు పెంచుకునేందుకు ఎన్‌సీఏ అనుమతి ఇవ్వగా.. అది సరిపోదని, మరింత పెంచాలని గుజరాత్ ప్రభుత్వం చాలా కాలంగా కోరుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 1,450 మెగావాట్ల జలవిద్యుత్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌లకు పంపిణీ చేస్తారు. దీని ద్వారా గుజరాత్‌లో 17.92 లక్షల హెక్టార్లకు, రాజస్థాన్‌లో 2.46 లక్షల హెక్టార్లకు నీరందే అవకాశముంటుంది. ప్రపంచంలోనే ఇది రెండో అతిపెద్ద కాంక్రీటు గ్రావిటీ డ్యామ్(పరిమాణంలో). మొదటిది అమెరికాలోని గ్రాండ్ కూలీ ప్రాజెక్టు. అలాగే ఇది ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్పిల్ వే డిశ్చార్జి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
విద్యుత్ ఉత్పత్తిలో ఆర్‌ఏపీఎస్-5 రికార్డు
విద్యుత్ ఉత్పత్తిలో రాజస్థాన్ అణు విద్యుత్ కేంద్రం (ఆర్‌ఏపీఎస్)-5వ రియాక్టర్ అంతరాయం లేకుండా 678 రోజులపాటు పని చేసి ఆసియా స్థాయిలో రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జూన్ 11 నాటికి ప్రతి రోజు 220 మెగావాట్ల పూర్తి సామర్థ్యంతో పనిచేసింది. ఇటువంటి సామర్థ్యాన్ని ఆసియాలోనే తొలిసారి ఒక అణు రియాక్టర్ ప్రదర్శించింది. ఆర్‌ఏపీఎస్-5 ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్. 2009, డిసెంబర్ 22న దీన్ని గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. 2010, ఫిబ్రవరి 4 నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభించింది. గతంలో తారాపూర్ అణు విద్యుత్ కేంద్రంలోని 160 మెగావాట్ల రెండో యూనిట్ 2009, జూలై నుంచి 2011, మార్చి వరకు 590 రోజులపాటు నిరంతరాయంగా పని చేసింది.
అంతర్జాతీయం
ప్రధాని తొలి విదేశీ పర్యటన
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జూన్ 15, 16 తేదీల్లో భూటాన్‌లో పర్యటించారు. ప్రధానమంత్రి ఇరు దేశాల సంబంధాలను ‘బీ4బీ’(భూటాన్ కోసం భారత్, భారత్ కోసం భూటాన్)గా ఆయన అభివర్ణించారు. ఈ పర్యటనలో మోడీ ఆ దేశ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యెల్ వాంగ్‌చుక్, ప్రధాని షెరింగ్ తోబ్గేలతో శాంతి భద్రతలు, పర్యాటకం తదితర అంశాలపై చర్చలు జరిపారు. అభివృద్ధికి చేయూతలో భాగంగా భారత్ రూ.70కోట్ల వ్యయంతో నిర్మించిన భూటాన్ సుప్రీంకోర్టు భవన సముదాయాన్ని మోడీ ప్రారంభించారు. ఈ పర్యటనలో మోడీ భూటాన్ పార్లమెంట్ సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. ఇరుదేశాల భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 600 మెగావాట్ల సామర్థ్యంగల ఖోలాంగ్చు జలవిద్యుత్ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేశారు.
డబ్ల్యూఏలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం
ఇంజనీరింగ్ స్టడీస్, ఇంజనీర్ల మొబిలిటీకి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందం వాషింగ్టన్ అగ్రిమెంట్(డబ్ల్యూ ఏ) లో జూన్ 13న భారత్‌కు శాశ్వత సభ్యత్వం లభించింది. దీంతో భారతీయ డిగ్రీలకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు లభించడంతోపాటూ అమెరికా తదితర దేశాల్లో ఉద్యోగాలకు భారతీయ ఇంజనీర్లు సులువుగా వెళ్లేందుకు అవకాశాలు విస్తృతమవుతాయి. 1989లో కుదిరిన ఈ ఒప్పందంపై 17 దేశాలు సంతకాలు చేశాయి. ఇంజనీరింగ్ డిగ్రీ కార్యక్రమాలకు అధికారిక గుర్తింపునిచ్చే సంస్థల మధ్య కుదిరిన ఈ అంతర్జాతీయ ఒడంబడికను వాషింగ్టన్ అకార్డ్‌గా పేర్కొంటారు. ఇందులో తాత్కాలిక సభ్యత్వం కలిగి ఉన్న భారత్ గత ఏడేళ్లుగా శాశ్వత సభ్యత్వం కోసం ప్రయత్నిస్తోంది.
ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా రూవెన్
ఇజ్రాయెల్ అధ్యక్షుడిగా రూవెన్ రివ్లిన్‌ను ఆ దేశ పార్లమెం ట్ జూన్ 10న ఎన్నుకుంది. షిమోన్ పెరెస్ స్థానంలో రూవె న్ జూలై 24న బాధ్యతలు స్వీకరిస్తారు. రూవెన్ గతంలో స్పీకర్‌గా,కమ్యూనికేషన్ల మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు.
జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా కుతెస
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ జూన్ 11న తన 69వ సమావేశానికి ఉగండాకు చెందిన సామ్ కంబా కుతెసను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. కుతెస ఉగండా ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
వార్తల్లో వ్యక్తులు
నూతన ఏజీ ముకుల్ రోహత్గీ
నూతన అటార్నీ జనరల్ (ఏజీ)గా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ జూన్ 12న నియమితులయ్యూరు. ఆయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారు. ఈ మేరకు న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. జి.ఇ.వాహనవతి స్థానంలో భారత 14వ ఏజీగా రోహత్గీ బాధ్యతలు స్వీకరిస్తారు.
భారత శాస్త్రవేత్తకు అత్యున్నత పురస్కారం
బ్రిటన్‌లో భారత సంతతికి చెందిన భౌతిక శాస్త్రవేత్త
తేజిందర్ విర్దీకి బ్రిటన్ రాణి ఎలిజబెత్ -2 అత్యున్నతమైన ‘నైట్‌హుడ్’ పురస్కారాన్ని ప్రకటించారు. లార్జ్ హాడ్రన్ కొలైడర్ (దైవకణం) పరిశోధనలో చూపిన ప్రతిభకు ఈ పురస్కారం దక్కింది. లండన్‌లోని ఇంపీరియల్ కాలేజిలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తేజిందర్ శాస్త్రరంగానికి విశేష సేవలు అందించారు.
ఒబామా కొలువులో మరో భారతీయ శాస్త్రవేత్త
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొలువులో మరో భారతీయుడికి గౌరవం దక్కింది. భారత-అమెరికన్ శాస్త్రవేత్త సేతురామన్ పంచనాథన్ అమెరికా జాతీయ సైన్స్ ఫౌండేషన్‌లో కీలక స్థానానికి ఎంపికయ్యారు. ఆయన్ను ప్రఖ్యాత జాతీయ సైన్స్ బోర్డు సభ్యుడిగా నియమించారు. సేతురామన్ మద్రాస్ యూనివర్సిటీ వివేకానంద కాలేజీ నుంచి 1981లో భౌతికశాస్త్రంలో పట్టా పొందారు. ఐఐటీలో ఎంటెక్ చేసి చెన్నైలోని ఇంటర్నేషనల్ సాఫ్ట్‌వేర్ ఇండియా లిమిటెడ్ కంపెనీలో డేటా కమ్యూనికేషన్ ఇంజనీర్‌గా పనిచేశారు.
కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా శక్తికాంత్ దాస్
కేంద్ర రెవెన్యూశాఖ కార్యదర్శిగా రాజీవ్ ఠాక్రు స్థానంలో 1980 బ్యాచ్ ఐఏఎస్ అధికారి శక్తికాంత్ దాస్(57)ను ప్రభుత్వం నియమించింది. దాస్ ప్రస్తుతం ఎరువుల శాఖ కార్యదర్శిగా ఉన్నారు.
క్రీడలు
పురుషుల ప్రపంచ హకీ కప్ విజేత ఆస్ట్రేలియా
పురుషుల ప్రపంచ హకీ కప్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. జూన్ 15న ద హేగ్‌లో జరిగిన ఫైనల్లో నెదర్లాండ్స్‌ను ఓడించింది. అర్జెంటీనా మూడో స్థానం దక్కించుకుంది. మహిళల విభాగంలో ఆస్ట్రేలియాను ఓడించి నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది.
ప్రపంచకప్ షూటింగ్‌లో జీతూకు రజతం
భారత పిస్టల్ షూటర్ జీతూ రాయ్.. ప్రపంచకప్ షూటింగ్‌లో రజత పతకం సాధించాడు. జూన్ 11న జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్ ఫైనల్స్‌లో జీతూ రెండో స్థానంలో నిలిచాడు. స్పెయిన్‌కు చెందిన పాబ్లో కారెరా స్వర్ణం దక్కించుకున్నాడు.
ప్రారంభమైన సాకర్ వరల్డ్‌కప్
20వ ఫుట్‌బాల్ ప్రపంచకప్ బ్రెజిల్‌లోని సావోపాలో నగరంలో జూన్ 12న ప్రారంభమైంది. జూలై 13 వరకు ఈ టోర్నమెంట్ జరుగుతుంది. 32 దేశాలు పాల్గొంటున్న ఈ టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో బ్రెజిల్-క్రొయేషియాతో తలపడింది. ఈ ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ రూ. 3417 కోట్లు. విజేత జట్టుకు దక్కే మొత్తం రూ.207 కోట్లు. రన్నరప్ జట్టుకు లభించే మొత్తం రూ. 148 కోట్లు. ఫుట్‌బాల్ ప్రపంచకప్‌ను పురస్కరించుకుని భారత్‌లో రూ.5, రూ.25ల ప్రత్యేక స్టాంపులను విడుదల చేశారు. న్యూఢిల్లీ ప్రధానమంత్రి నరేంద్ర మోడి చేతుల మీదుగా జూన్ 12న వీటిని ఆవిష్కరించారు. ఇప్పటివరకు 19 ప్రపంచకప్ టోర్నమెంట్లు జరిగాయి. 1930లో జరిగిన తొలి ప్రపంచ కప్‌లో 13 జట్లు పాల్గొన్నాయి. అత్యధిక సార్లు ప్రపంచ కప్ గెలిచిన జట్టు బ్రెజిల్ (5). గత ప్రపంచకప్ 2010లో దక్షిణాఫ్రికాలో జరిగింది. ఇందులో స్పెయిన్ విజేతగా నిలిచింది.
ఫోర్బ్స్ జాబితాలో ధోని
ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక సంపాదనతో తొలి 100 స్థానాల్లో నిలిచిన క్రీడాకారులతో ఫోర్బ్స్ వెబ్‌సైట్ జాబితా రూపొందించింది. ఇందులో భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి స్థానం దక్కింది. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది జూన్ దాకా 12 నెలల కాలంలో ధోని రూ. 177 కోట్లు ఆర్జించి దేశంలోకెల్లా అత్యధిక ఆర్జన గల క్రీడాకారుడిగా ఈ జాబితాలో 22వ స్థానంలో నిలిచాడు. భారత్ నుంచి ఈ జాబితాలో నిలిచిన ఏకైక క్రీడాకారుడు ధోనియే. ఈ జాబితాలో అమెరికా బాక్సర్ మేవెదర్ అగ్రస్థానం (రూ. 621 కోట్లతో)లో నిలిచాడు. టైగర్ వుడ్స్ (రూ. 591 కోట్లతో) రెండో స్థానం పొందాడు.
ఆసియా బిలియర్డ్స్ చాంప్ కొఠారి
ఆసియా బిలియర్డ్స్ చాంపియన్‌షిప్‌లో భారత జాతీయ చాంపియన్ సౌరవ్ కొఠారి విజేతగా నిలిచాడు. చండీగఢ్‌లో జూన్ 13న జరిగిన ఫైనల్లో కొఠారి అలోక్ (భారత్)ను ఓడించాడు.
హాకీ మ్యాచ్ సమయం 60 నిమిషాలు
ఇప్పటిదాకా 70 నిమిషాలున్న హాకీ మ్యాచ్ నిడివి 60 నిమిషాలకు కుదించా లని అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) నిర్ణయించింది. ప్రతి 15 నిమిషాలకు విరామం చొప్పున నాలుగు భాగాలుగా 60 నిమిషాల పాటు మ్యాచ్ సాగుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఇంచియాన్‌లో జరిగే ఆసియా క్రీడల నుంచి ఈ సమయాన్ని అమలు చేస్తున్నట్లు ఎఫ్‌ఐహెచ్ అధ్యక్షుడు లియాండ్రె నెగ్రె జూన్ 15న ప్రకటించారు.
ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య జాతికి అంకితం
Published Thu, Jun 19 2014 1:06 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 AM
Advertisement
Advertisement