టి.అనూష్ బాబు
లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పంతో పాటు దారిలో ఎదురయ్యే చేదు అనుభవాలను తట్టుకునే మనోనిబ్బరం కూడా చాలా అవసరం.. అప్పుడే ఎంతటి కఠిన లక్ష్యమైనా మనకు దాసోహమవుతుందంటున్నారు కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక (కామ్‌డెక్) పీజీసెట్ ఫస్ట్ ర్యాంకర్ టి.అనూష్‌బాబు. ఆయన విజయ ప్రస్థానం ‘భవిత’తో పంచుకున్నారు..
మాది కాకినాడ. నాన్న కృష్ణ పూల వ్యాపారి. అమ్మ వెంకటరమణ గృహిణి. తమ్ముడు గౌతమ్ ఎన్‌ఐటీలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేసి, ప్రస్తుతం వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. తమ సంతానంలో ఒక్కరైనా డాక్టర్ కావాలనే కోరిక అమ్మానాన్నల్లో ఉండేది. అక్క అంతగా ఆసక్తి చూపలేదు. నాకు మాత్రం చిన్నప్పటి నుంచి జీవశాస్త్రం సబ్జెక్టు అంటే చాలా ఇష్టం. దీంతో అమ్మానాన్న నన్ను గొప్ప డాక్టర్‌ను చేయాలని అనుకున్నారు. ఆ దిశగా నన్ను ప్రోత్సహించారు.
ఇంటర్మీడియెట్ తర్వాత మెడిసిన్‌లో సీటు రాకపోవడం వల్ల రెండేళ్లు విరామం వచ్చింది. ఈ సమయంలో కొందరు ‘ఎన్ని సార్లు దండయాత్ర చేస్తావంటూ’ సూటిపోటి మాటలనేవారు. అయితే అమ్మానాన్నల ప్రోత్సాహం, మంచి ర్యాంకుతో నిట్‌లో సీటు సంపాదించిన తమ్ముడి స్ఫూర్తితో కష్టపడి చదివాను. ఎంసెట్‌లో 2,196 ర్యాంకు వచ్చింది. కానీ, సీటు కేటాయింపు ఆలస్యం కావడంతో, కర్ణాటక సెట్‌లో 1160 ర్యాంకు రావటంతో అటు వెళ్లిపోయాను.
మెడిసిన్ దిశగా అడుగులు:
మంగళూరులోని కేఎస్ హెగ్డే మెడికల్ అకాడమీలో ఎంబీబీఎస్‌లో చేరాను. ఐదున్నరేళ్ల ఈ కోర్సును 67.5 శాతం మార్కులతో పూర్తిచేశాను. ఎంత మంచి స్కోర్‌తో ఎంబీబీఎస్ పూర్తిచేసినా, పోస్టు గ్రాడ్యుయేషన్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చేయకపోతే ప్రయోజనం ఉండదు. అందుకనే ఎంబీబీఎస్ ఫస్టియర్ నుంచే సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు ప్రయత్నించా. ఏ ఏడాది కోర్సులను ఆ ఏడాదే పూర్తిచేశాను. పీజీ చేయడానికి జిప్‌మర్ ఎంట్రన్స్ కోసం బాగా శ్రమించా. అయితే ఆ పరీక్షను సరిగా రాయలేకపోయా. ఆ ప్రిపరేషన్ కామ్‌డెక్ పీజీసెట్‌కు ఉపయోగపడింది. ఇందులో 180 మార్కులకు 145 మార్కులు సాధించి మొదటి ర్యాంకు చేజిక్కించుకున్నాను.
పటిష్ట ప్రణాళిక తోడుగా:
ఎంబీబీఎస్ సీటు సాధించే క్రమంలో ఎదురైన ఆటుపోట్లను దృష్టిలో ఉంచుకొని, పీజీ సీటు కోసం మొదటి నుంచి ఏకాగ్రతతో చదివాను. ఎంబీబీఎస్ పూర్తికాగానే పీజీ సీటు సంపాదించడం తపస్సు లాంటిది. సీటు రాకుంటే పడే వేదన వర్ణనాతీతం. మధ్యలో విరామం లేకుండా పీజీ పూర్తిచేయాలి. ఒకసారి మార్గం తప్పితే, గాడిలో పడటం చాలా కష్టం. అందుకే రోజూ 14 గంటల పాటు చదివేవాణ్ని. పీజీ ఎంట్రన్స్‌లో 19 సబ్జెక్టులుంటాయి. అందువల్ల అందుబాటులో ఉన్న సమయాన్ని, సబ్జెక్టుల వారీగా విభజించుకొని చదివాను.
‘‘అమ్మానాన్న ఇచ్చిన ప్రోత్సాహం వల్లే మొదటి ర్యాంకు సాధించగలిగాను. పీజీ రేడియాలజీలో చేయాలా? లేదంటే జనరల్ మెడిసిన్‌లో చేయాలా? అనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఒకవేళ జనరల్ మెడిసిన్‌లో చేరితే, అంకాలజీ స్పెషలైజేషన్ తీసుకుంటాను. పరిశోధనల రంగంపైనా ఆసక్తి ఉంది’’
- టి.అనూష్‌బాబు