
ఇమ్మనేని కుమార్ కార్తీక్
దండిగా మార్కులు సంపాదించి, కాసులకు కరువులేని కార్పొరేట్ కొలువులో కుదురుకొని, దర్జాగా బతికేద్దామను కుంటారు కొందరు! స్వీయ ఉన్నతితో పాటు, మరో పదిమంది బతుకుకు భరోసా ఇచ్చేలా సొంతంగా వ్యాపార సంస్థను ప్రారంభించాలనుకుంటారు మరికొందరు! ఈ రెండో మార్గాన్ని ఎంచుకునే క్రమంలోనే మేనేజ్‌మెంట్‌వైపు అడుగులు వేస్తున్నానంటున్నారు క్యాట్-2013 టాపర్ ఇమ్మనేని కుమార్ కార్తీక్..
మాది విజయవాడ. పదో తరగతి వరకు వి.పి.సిద్ధార్థ పబ్లిక్ స్కూల్‌లో చదివా. ఇంటర్ డీఏవీ సీనియర్ సెకండరీ స్కూల్‌లో పూర్తిచేశా. ఖరగ్‌పూర్ ఐఐటీలో మెటలర్జికల్ ఇంజనీరింగ్‌లో బీటెక్, ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ చదివా. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఒరాకిల్ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేస్తున్నాను. నాన్న ఈశ్వరరావు చార్టర్డ్ అకౌంటెంట్. అమ్మ నందన గృహిణి. అన్నయ్య చైతన్య కిరణ్ కూడా సీఏ పూర్తిచేసి, ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నారు. నాన్న వ్యక్తిత్వం, కష్టపడి పనిచేసే తత్వం నాకు స్ఫూర్తిగా నిలిచాయి.
పది మందికి తోడుగా:
ఇంజనీరింగ్ డిగ్రీ ద్వారా సబ్జెక్టు పరిజ్ఞానం సొంతమవుతుంది. అయితే ఓ సంస్థను నడిపించేందుకు కావాల్సిన నైపుణ్యాలు బిజినెస్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ అందిస్తుంది. మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తిచేసి, కొందరికి ఉపాధి చూపించాలన్న ఉద్దేశంతోనే ఎంబీఏ దిశగా పయనిస్తున్నా.
ప్రాక్టీస్‌తోనే విజయం:
క్యాట్‌కు సంబంధించి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, వెర్బల్ ఎబిలిటీలపై పట్టుసాధించాలంటే ప్రాక్టీస్‌కు మించిన మార్గం లేదు. ఇంగ్లిష్ దినపత్రికలు, మేగజీన్లు చదవడం వల్ల భాషపై పట్టు చిక్కింది. వేగంగా చదవడం, కొత్త పదాలకు అర్థాలు తెలుసుకునేందుకు వీలైంది. సబ్జెక్టుల మధ్య సారూప్యతను అర్థం చేసుకొని ప్రిపరేషన్ ప్రణాళిక రూపొందించుకున్నాను. వీలైనన్ని ఎక్కువ మోడల్ పేపర్లు సాధన చేయడం కూడా నాకు లాభించింది.
సమయ పాలన ముఖ్యం:
పక్కా టైం మేనేజ్‌మెంట్‌తో ముందుకెళ్తే మంచి స్కోర్ సాధించేందుకు ఏదీ అడ్డంకి కాదనే విషయాన్ని గుర్తించాలి. మన చేతిలో అందుబాటులో ఉన్న సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి. మొదటిసారి ఒకవైపు కాలేజీకి వెళ్తూనే, మరోవైపు క్యాట్‌కు సిద్ధమయ్యాను. రెండోసారి ఉద్యోగం చేస్తూ, పరీక్షకు ప్రిపేర్ అయ్యాను. రోజూ సాయంత్రం కోచింగ్‌కు వెళ్లేవాడిని. వారాంతపు రోజుల్లో అయితే పూర్తిసమయాన్ని కోచింగ్ సెంటర్‌కే కేటాయించాను. రోజూ రాత్రి 7 నుంచి 11 గంటల వరకు ప్రాక్టీస్ చేసేవాణ్ని. కోచింగ్ తప్పనిసరి కాదు. మెటీరియల్ సరిపోతుంది.
ఈ స్కోర్‌ను ఊహించలేదు:
క్యాట్ 2013లో 100 పర్సంటైల్ వస్తుందని ఊహించలేదు. గతంలో చేసిన తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్త వహించడం వల్లే ఈ స్కోర్ సాధించగలిగాను. ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరులలో ఎక్కడ సీటు వచ్చినా మంచిదే. నిత్యం సవాళ్లతో కూడుకున్న మార్కెటింగ్ విభాగమంటే చాలా ఇష్టం. మేనేజ్‌మెంట్ కోర్సును పూర్తిచేసిన తర్వాత మంచి కంపెనీలో ఉద్యోగం చేయడం, తర్వాత సొంతంగా వ్యాపార సంస్థను నెలకొల్పడం నా జీవిత లక్ష్యం.
వేగం+ స్పష్టత= 100 పర్సంటైల్
ప్రాక్టీసు చేసేటప్పుడు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నామో గుర్తించాలి. ఆయా అంశాలకు ఎక్కువ సమయం కేటాయించాలి. ఎప్పటికప్పుడు చేసిన తప్పులను సరిదిద్దుకోవాలి. మోడల్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీసు చేసేటప్పుడు వేగం, కచ్చితత్వం ప్రధానం. అదే విధంగా పరీక్ష సమయంలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవటం ముఖ్యం. మొదట తేలికైన ప్రశ్నలను పూర్తిచేసి, తర్వాత కష్టమైన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు ప్రయత్నించాలి. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా పరీక్ష రాయగలం.
100 శాతం శ్రమించాలి:
సాధనమున పనులు సమకూరు ధరలోన అన్నట్లు.. ప్రాక్టీసు ఒక్కటే విజయానికి దగ్గరి మార్గం. వందశాతం నిజాయితీగా కష్టపడితే క్యాట్‌లో 100 పర్సంటైల్ సాధించడం కష్టమేమీ కాదు.