వాలెట్ వాడుతుంటే!
వాలెట్ వాడుతుంటే!
Published Thu, Dec 1 2016 12:32 AM | Last Updated on Mon, Sep 4 2017 9:32 PM
ప్రస్తుతం దేశంలో పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అష్టకష్టాలు పడుతూ బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. పాల ప్యాకెట్ల మొదలు పప్పు దినుసుల వరకు.. మంచి నీళ్లు మొదలు.. మెడికల్ షాపు, ఆసుపత్రుల వరకు.. ఎక్కడికెళ్లినా అందరిదీ ఒకటే సమస్య. అందరూ నగదు కోసం తిరుగుతున్నారు. మరోవైపు ఇదే సమయంలో.. డిజిటల్ వాలెట్/మొబైల్ వాలెట్/ఈ-వాలెట్ కంపెనీలు మాత్రం పండగ చేసుకుంటున్నాయి. ఇప్పటికే చాలా కంపెనీలు గణనీయమైన వృద్ధిని నమోదు చేశాయి. పనిలో పనిగా వినియోగదారులను ఆకర్షించడానికి విన్నూతమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డిజిటల్ వాలెట్ లావాదేవీల గురించి తెలుసుకుందాం...
సర్వం జేబులో..!
డబ్బులు పాకెట్‌లో కాకుండా మొబైల్ వాలెట్‌లో ఉంచుకోవడం నేటి ట్రెండ్. ఆన్‌లైన్ షాపింగ్ చేయడానికి, బిల్లులు చెల్లించడానికి, హోటల్ బిల్లులు కట్టడానికి డిజిటల్ వాలెట్లు ఒక సులభమైన మార్గం. మొబైల్ నెంబర్, ఈ-మెయిల్ ఐడీ ఉంటే చాలు.. పేటీఎం, మొబిక్విక్ లాంటి మొబైల్ వాలెట్స్, ఎయిర్‌టెల్ వంటి టెలికాం బేస్డ్ మొబైల్ వాలెట్‌లలో నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. మీ అకౌంట్‌లోని అమౌంట్‌ని మొబైల్ వాలెట్స్ ద్వారా వేర్వేరు అవసరాలకు వినియోగించుకోవచ్చు. ముఖ్యంగా యువత షాపింగ్, హోటల్స్, సినిమాలు, క్యాబ్ బుకింగ్ ఇలా అన్నీ వాలెట్స్ నుంచే కానిచ్చేస్తున్నారు. క్రెడిట్, డెబిట్ కార్డుల నుంచి మొబైల్ వాలెట్‌లోకి సులభంగా నగదు బదిలీ చేసుకునే సదుపాయం ఉండటం కూడా ఇందుకు ప్రధాన కారణం.
ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం వాలెట్లు మూడు రకాలు
1. CLOSED
క్లోజ్డ్ వాలెట్స్ అంటే.. కంపెనీలు సొంతంగా అందించేవి. బిగ్ బాస్కెట్, ఓలా, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఉబర్ వంటి చాలా ఆన్‌లైన్ సంస్థలు సొంత వాలెట్లను అందిస్తున్నాయి. వీటిలో డబ్బు వేసుకుని సదరు సంస్థ అందించే సేవలు, ఉత్పత్తులను మాత్రమే కొనాలి/వినియోగించాలి. ఇవి పూర్తిగా ఆయా సంస్థల పరిధిలో ఉంటాయి కాబట్టి వీటికి ఆర్‌బీఐ అనుమతి అవసరం లేదు. ఆయా సంస్థలు తమ వాలెట్ల ద్వారా జరిపే లావాదేవీలకు అత్యధిక డిస్కౌంట్ ఇస్తుంటాయి. వీటిలో వేసుకునే డబ్బుకు పరిమితి ఉండదు. ఎంతైనా వేసుకోవచ్చు. ఒకసారి డిపాజిట్ చేసిన డబ్బును విత్ డ్రా చేయడానికి వీలుండదు. దీనిపై ఎలాంటి వడ్డీ రాదు.
2. SEMI CLOSED
ఈ వాలెట్లలో డబ్బులు వేస్తే ఇతర ఆన్‌లైన్ సైట్లలోనూ వినియోగించవచ్చు. అయితే ఈ వాలెట్ నిర్వహిస్తున్న కంపెనీకి ఏయే సంస్థలతో ఒప్పందాలు ఉన్నాయో వాటిలో మాత్రమే లావాదేవీలు జరపాలి. పేటీఎం, మొబిక్విక్, పేయూ, సిట్రస్ క్యాష్, ఫ్రీచార్జ్ తదితర వాలెట్లన్నీ ఈ కోవకు చెందినవే. ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం.. ఈ వాలెట్ల ద్వారా అత్యవసర చెల్లింపులు చేయొచ్చు. అయితే ఈ వాలెట్లలో బిల్లు చెల్లింపులు, డిపాజిట్ల పరిమితి గరిష్టంగా పది వేలు మాత్రమే. పదివేలకు మించి లావాదేవీలు వీటి ద్వారా నిర్వహించలేం. వీటిలోనూ ఒకసారి డిపాజిట్ చేస్తే తిరిగి తీసుకోలేం. వీటిపై ఎలాంటి వడ్డీ రాదు.
3. OPEN VALLETS
ఇవి ఓ రకంగా బ్యాంక్ ఖాతాల్లాంటివే. వీటి ద్వారా డబ్బుల డిపాజిట్, విత్ డ్రా, చెల్లింపులు చేయొచ్చు. వీటిలో డిపాజిట్ చేసిన సొమ్మును ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవచ్చు. వీటిని బ్యాంకులు మాత్రమే జారీ చేస్తాయి. ఉదాహరణకు వోడాఫోన్ ఎంపైసా. దీన్ని ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి వోడాఫోన్ నిర్వహిస్తోంది. ఎయిర్‌టెల్ మనీ, టాటా టెలీ ఎం రూపీ కూడా బ్యాంకులతో ఒప్పందం చేసుకున్నవే. అయితే వీటి ద్వారా నిర్వహించే లావాదేవీల విలువ రూ.50 వేలకు మించకూడదు.
Advertisement
Advertisement