వ్యయ నియంత్రణపై చర్యలు అవసరం | On the actions necessary to control the cost | Sakshi
Sakshi News home page

వ్యయ నియంత్రణపై చర్యలు అవసరం

Published Mon, Jun 30 2014 9:57 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

వ్యయ నియంత్రణపై చర్యలు అవసరం - Sakshi

వ్యయ నియంత్రణపై చర్యలు అవసరం

ప్రణాళికలు - వనరుల సమీకరణ
ఆర్థికాభివృద్ధి నేపథ్యంలో వనరుల సమీకరణ, వినియోగం ప్రధానమైనవి. ప్రతి దేశంలో సహజ వనరుల లేదా మానవ వనరుల లభ్యత పరిమితంగా ఉంటుంది. వనరుల కొరత కారణంగా ఉత్పత్తి, పంపిణీ, వినియోగం లాంటి వివిధ ప్రక్రియలను సక్రమంగా నిర్వహించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. రోడాన్ అభిప్రాయంలో... ఆర్థిక వ్యవస్థలో దీర్ఘకాలంగా వృద్ధి స్తంభించిన పరిస్థితుల నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థకు ‘బిగ్‌పుష్’ను కల్పించాల్సిన అవసరం ఉంది.
 
1947లో భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన సమయంలో ఇదే విధమైన బిగ్‌పుష్ ఆవశ్యకత ఏర్పడింది. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఆర్థిక ప్రణాళిక ప్రాము ఖ్యాన్ని గుర్తించారు. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ లక్ష్యాలకు అనుగుణంగా భారత్‌లో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. భారత్‌లో ప్రస్తుత సంస్థాపరమైన ఏర్పాటును దృష్టిలో ఉంచుకొని ఆర్థిక ప్రణాళికలోని ముఖ్యాంశాలను కింది విధంగా పేర్కొనవచ్చు.
 
ప్రభుత్వం స్వదేశీ వనరులు, విదేశాల నుంచి వనరులు సమీకరించడం ద్వారా కొన్ని ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతుంది. తద్వారా ప్రైవేట్ రంగంలో ఉత్పాదక కార్యకలాపాలు మెరుగవుతాయి. రైల్వేలు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు, నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రాధాన్యమిస్తూ ఆయా ప్రాజెక్టులపై ప్రభుత్వ రంగం అధిక పెట్టుబడులను చేస్తుంది. అధిక పెట్టుబడి, అధిక ఫలన కాలంతో కూడుకున్న భారీ పరిశ్రమల ఏర్పాటులోనూ ప్రభుత్వ రంగం ప్రత్యక్షంగా పాల్గొంటుంది.

ప్రైవేట్ ఆర్థిక కార్యకలాపాలు ప్రోత్సహించే క్రమంలో ప్రభుత్వం అనేక ఆర్థిక విధానాలను అవలంభిస్తుంది. పన్నులు, పారిశ్రామిక లెసైన్సింగ్, టారిఫ్ (దిగుమతులపై పన్ను), వేతనాలు, ధరలు, వడ్డీరేటుకు సంబంధించిన ప్రభుత్వ విధానాలు ప్రైవేట్ ఉత్పత్తిదారులను ప్రోత్సహించే విధంగా ఉంటాయి. 1990 తర్వాత కాలంలో సరళీకరణ విధానాల్లో భాగంగా భౌతిక నియంత్రణలను తొలగించి ప్రైవేట్ రంగానికి తగిన ప్రోత్సాహం అందించారు.
 
 ప్రభుత్వరంగ ప్రణాళికలకు ఆర్థిక సాయం:
 పంచవర్ష ప్రణాళికల అమల్లో భాగంగా విత్త వనరుల యాజమాన్యానికి ప్రాధాన్యం ఇచ్చారు. అభివృద్ధి ప్రణాళికకు అవసరమైన వనరులను రెండు మార్గాల ద్వారా సమీకరిస్తున్నారు. వాటిని స్వదేశీ, బహిర్గత ఆధారాలుగా వర్గీకరించవచ్చు. స్వదేశీ ఆధారాల్లో భాగంగా బడ్జెటరీ మిగులు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మిగులు, మార్కెట్ రుణాలు, చిన్న మొత్తాల పొదుపు ముఖ్యాంశాలుగా ఉంటాయి. విదేశీ సహా యాన్ని అంతర్జాతీయ విత్త సంస్థలు, విదేశాల నుంచి సమీకరిస్తారు. సమీకరించిన మొత్తం, వ్యయం మధ్య తేడా ఏర్పడినప్పుడు లోటు బడ్జెట్ (Deficit Financing) ప్రాధా న్యం ఏర్పడుతుంది. ప్రభుత్వ రంగ ప్రణాళికకు అవసరమైన వనరులను మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి మూడు ఆధారాల ద్వారా సమీకరించారు. వాటిని అంతర్గత వనరులు, లోటు బడ్జెట్, విదేశీ సహాయంగా వర్గీకరించొచ్చు.
 
 a) అంతర్గత వనరులు: అంతర్గత వనరుల్లో కరెంట్ రాబడి నుంచి మిగులు, మార్కెట్ రుణాలు, చిన్న మొత్తాల పొదుపు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మిగులు లాంటి అంశాలు ఇమిడి ఉంటాయి. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు సంబంధించి ప్రస్తుత, ప్రణాళికేతర వ్యయం కంటే రాబడి అధికంగా ఉన్నప్పుడు పొదుపు ఏర్పడుతుంది. ఈ మొత్తాన్ని కరెంట్ రాబడి నుంచి మిగులుగా భావిస్తాం. కరెంటు రాబడి నుంచి మిగులు పన్ను రాబడిపై ఆధారపడి ఉంటుంది. ప్రభుత్వ రంగం వనరుల సమీకరణలో పన్ను రాబడికి ప్రాధాన్యం ఉంది. భారత్ లాంటి ఆర్థిక వ్యవస్థల్లో ‘స్వచ్ఛంద పొదుపు’నకు ఉన్న అవకాశం తక్కువైనందువల్ల అభివృద్ధి ప్రణాళికకు అవసరమైన నిధులను ఈ మార్గం ద్వారా సమకూర్చలేం.
 
 ఒకవైపు పేదరికం మరోవైపు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగ వ్యయం పెరుగుదల మూలధన సంచయనం పెంపునకు అవరోధంగా ఉంది. అభివృద్ధి ప్రణాళికల్లో మార్కెట్ రుణాలు కూడా వనరుల సమీకరణలో ప్రాధాన్యం పొందాయి. ప్రణాళికల ప్రారంభం నుంచే వనరుల సమీకరణలో మార్కెట్ రుణాల ఆవశ్యకతను ప్రణాళికా సంఘం గుర్తించింది. ప్రభుత్వం మార్కెట్ రుణాలపై ఆధారపడటమనేది బ్యాంకింగ్ రంగంలో వాణిజ్య బ్యాంకులు నిర్వహించే ఔఖను బట్టి ఉంటుంది. దీని ఆధారంగా వాణిజ్య బ్యాంకులు ప్రభుత్వ సెక్యూరిటీలపై పెట్టుబడులు పెడతాయి. లైఫ్ ఇన్సూరెన్‌‌స కార్పొరేషన్, ప్రావిడెంట్ ఫండ్ నుంచి కూడా ప్రభుత్వం రుణాలు సమీకరిస్తుంది.
 
 అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అధిక శాతం ప్రజల పొదుపు సామర్థ్యం తక్కువగా ఉంటుంది. ఎక్కువమంది ప్రజలకు ప్రైవేట్ వ్యాపారాల్లో పెట్టుబడి అవకాశాలు లేకపోవడం, ప్రభుత్వ సెక్యూరిటీలపై తమ పొదుపును పెట్టుబడులుగా మరలించే అవకాశం తక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ప్రజల పొదుపును ప్రభుత్వ రంగానికి సంబంధించిన విత్త సంస్థ ద్వారా ప్రభుత్వం సమీకరించలేకపోయినప్పుడు అభివృద్ధి ప్రక్రియకు అవరోధం ఏర్పడుతుంది. ప్రభుత్వ రంగ ప్రణాళికకు ఆర్థిక సహాయంలో భాగంగా చిన్న మొత్తాల పొదుపు ఆవశ్యకతను ఆర్థిక ప్రణాళికల అమలు ప్రారంభంలోనే ప్రభుత్వం గుర్తించింది. తద్వారా వివిధ ప్రణాళికల్లో అంతర్గత వనరుల సమీకరణలో చిన్న మొత్తాల పొదుపు వాటా క్రమంగా పెరిగింది.
 
 మొదటి ప్రణాళిక ప్రారంభంలో భారత్‌లో ప్రభుత్వం రంగం చాలా చిన్నది. దేశంలో ఐదు ప్రభుత్వ రంగ సంస్థలు * 29 కోట్ల పెట్టుబడులతో కార్యకలాపాలు నిర్వహించేవి. మొదటి, రెండు పంచవర్ష ప్రణాళికల కాలంలో మరో 43 ప్రభుత్వ రంగ సంస్థలను ఏర్పాటు చేశారు.  1991 నాటికి భారత్‌లో 244 ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటు కాగా ప్రస్తుతం వాటి సంఖ్య సుమారు 268కి చేరుకుంది. ప్రభుత్వ రంగ సంస్థల మిగులును ప్రభుత్వ రంగ ప్రణాళికకు ఆర్థిక సహాయంగా ఉపయోగిస్తారు.
 ఛ) విదేశీ సహాయం: ఆర్థిక ప్రణాళికల మొదటి నాలుగు దశాబ్దాల్లో వివిధ అభివృద్ధి పథకాల కోసం అధిక విదేశీ సహాయం పొందిన దేశాల్లో భారత్ ఒకటి. 1989-90 వరకు భారత్  * 83,729 కోట్ల విదేశీ సహాయాన్ని పొందగా ఈ మొత్తంలో * 54059 కోట్లను వినియోగిం చుకుంది. ఈ మొత్తంలో 85 శాతం రుణం రూపంలో ఉండగా, 10 శాతం గ్రాంట్ల రూపంలో, మిగిలిన 5 శాతం ్కఔ 480/665 కింద ఉంది.
 
 ప్రభుత్వ రంగ పెట్టుబడిలో భాగంగా విదేశీ సహాయం వాటా మొదటి మూడు ప్రణాళికల్లో క్రమంగా పెరగగా నాలుగో ప్రణాళిక నుంచి తగ్గింది. నాలుగో ప్రణాళికలో స్థిరత్వంతో కూడిన వృద్ధి లక్ష్య సాధనలో భాగంగా విదేశీ సహాయాన్ని ప్రభుత్వ రంగ పెట్టుబడిలో తగ్గించారు. ఆర్థిక ప్రణాళికల అమలు కాలంలో భారత ఆర్థిక వ్యవస్థలో విదేశీ రుణ భారం పెరిగింది. ప్రణాళికల అమలు కాలంలో అనేక సంవత్సరాల్లో రుణ సర్వీసింగ్ చార్జీల మొత్తం లభించిన విదేశీ సహాయంలో 50 శాతంగా ఉండటాన్ని బట్టి అధిక రుణ భారాన్ని అంచనా వేయొచ్చు.
 
 ఛి) లోటు బడ్జెట్: ఆర్థిక ప్రణాళికల అమలు నేపథ్యంలో వనరుల సమీకరణలో భాగంగా పన్నుల రాబడి, మార్కెట్ రుణాలు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి మిగులు, విదేశీ సహాయం ద్వారా తగిన మొత్తాన్ని సమకూర్చుకోలేని పరిస్థితుల్లో లోటు బడ్జెట్ విధానంపై ప్రభుత్వం ఆధారపడుతుంది. కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లుల అమ్మకం ద్వారా, రాష్ర్ట ప్రభుత్వాలు వేస్ అండ్ మీన్‌‌స అడ్వాన్సులు, రిజర్‌‌వ బ్యాంకు నుంచి ఓవర్ డ్రాఫ్ట్ తీసుకోవడం ద్వారా తమ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ విధానం వల్ల దేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది. ధరల పెరుగుదల స్థిర ఆదాయ వర్గాల ప్రజలపైనే కాకుండా వివిధ ప్రాజెక్టుల వ్యయ అంచనాలపై రుణాత్మక ప్రభావాన్ని చూపిస్తుంది. మొదటి ప్రణాళికలో లోటు బడ్జెట్ *333 కోట్లుగా నమోదు కాగా, ఏడో ప్రణాళికలో *34,669 కోట్లకు, ఇటీవల ప్రణాళికల్లో సుమారు *60,000 కోట్లకు పైగా పెరిగింది.
 
 
 వనరుల సమీకరణ-చర్యలు
 ఎ) పన్నుల ద్వారా ఆదాయం పెంపు: ప్రణాళికా సంఘం అభిప్రాయంలో భారత విత్త వ్యవస్థ రిసోర్స్ బేస్ సరిపోయినంతగా లేనందువల్ల లోటు బడ్జెట్ విధానాన్ని నివారించడం క్లిష్టంగా ఉంది. ప్రత్యక్ష పన్నులకు సంబంధించి ఆదాయ పన్ను, కార్పొరేట్ పన్ను, సంపద పన్నుల ద్వారా అదనపు వనరులు సమీకరించే ప్రయత్నం జరగలేదు. అదనపు వనరులు సమీకరించే నేపథ్యంలో పన్ను ఎగవేతను అరికట్టడంపై దృష్టి సారించారు. మొత్తం వ్యవసాయ ఆదాయంలో వ్యవసాయ ఆదాయం పన్ను వాటా ఒక శాతం కంటే తక్కువగా ఉంది. గత నాలుగు దశాబ్దాలుగా ప్రభుత్వ వ్యవసాయ విధానం వ్యవసాయ ఆదాయాల పెంపునకు దారి తీసింది. ముఖ్యంగా ధనిక రైతుల ఆదాయాల్లో పెరుగుదల ఏర్పడింది. ఈ నేపథ్యంలో వ్యవసాయరంగం నుంచి అదనపు వనరుల పెంపుపై దృష్టి కేంద్రీకరించాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. వ్యవసాయ పన్నులకు సంబంధించి పురోగామి పన్నుల విధానాన్ని అవలంబించాలి.
 
 పరోక్ష పన్నులకు సంబంధించి సేవలపై పన్నును 1994-95లో ప్రవేశపెట్టారు. మొదటగా టెలిఫోన్ సర్వీసులు, సాధారణ బీమా, షేర్ బ్రోకింగ్‌లో ఈ పన్నును ప్రవేశపెట్టారు. 1994-95లో ఈ పన్ను ద్వారా రాబడి రూ.410 కోట్లు కాగా, 2012-13లో రూ.1,32,518 కోట్లకు చేరుకుంది. 1994లో కేవలం మూడు సేవలపై ఈ పన్నును విధించగా 2012 నాటికి దీని పరిధిలోకి వచ్చే సేవల సంఖ్య 119కి పెరిగింది. ప్రణాళికల్లో ప్రభుత్వరంగ పెట్టుబడుల్లో భాగంగా పన్నుల రాబడికి సంబంధించి సేవలపై పన్ను పరిధిని పెంచడం ద్వారా అధిక వనరుల సమీకరణకు ప్రయత్నించాలి.
 
 బి) ప్రభుత్వ రంగ సంస్థల్లో నిధులు: ప్రభుత్వ రంగం సంస్థలు సరిపోయినంతగా మిగులు సాధించడంలో విఫలం చెందుతున్న దృష్ట్యా భారత విత్త వ్యవస్థ రిసోర్స్ బేస్ పెంపునకు అవరోధం ఏర్పడింది. సామర్థ్యాన్ని పూర్తిగా వినియోగించుకోకపోవడం, అసమర్థ యాజమాన్యం, జవాబుదారీతనం లోపించడం, ప్రపంచీకరణ వల్ల పెరిగిన పోటీ వాతావరణం నేపథ్యంలో లాభాలను ఆర్జించే సామర్థ్యం తగ్గుతున్న కారణంగా ప్రభుత్వరంగ సంస్థలు ఆర్జించే మిగులు తగ్గింది. ఇన్వెంటరీల తగ్గింపు, అభిలషణీయ ధరల విధానం అవస్థాపిత సామర్థ్యం పెంపు, వృత్తిపరమైన యాజమాన్యం మెరుగుపర్చుకోవడం లాంటి చర్యల ద్వారా మిగులు ఆర్జించడంపై ప్రభుత్వ రంగ సంస్థలు దృష్టి సారించాలి. కానీ ఇటీవల ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ విధానం వల్ల  ప్రణాళికా పెట్టుబడులకు అవసరమైన వనరులను ఆయా సంస్థల నుంచి సమీకరించడం సాధ్యం కావడం లేదు.
 
 సి) యూజర్ చార్జీల విధింపు: పబ్లిక్ సర్వీసులపై యూజర్ చార్జీల విధింపు ద్వారా ప్రణాళిలకు అవసరమైన పెట్టుబడిని సమీకరించాలి. ముఖ్యమైన అవస్థాపనా సౌకర్యాలను ప్రజలు వినియోగించుకుంటున్నప్పటికీ ప్రతిఫలంగా ఏవిధమైన ఎకనామిక్ చార్జీలు చెల్లించడం లేదు. తద్వారా పబ్లిక్ సర్వీసుల నుంచి రాబడి తగ్గినప్పుడు ప్రణాళికలకు అవసరమైన వనరుల సమీకరణలో సమస్యలు ఏర్పడుతాయి. ముఖ్య సేవలు అయిన విద్యుత్, నీటి సరఫరా, నీటి పారుదల, రవాణా విషయంలో ప్రభుత్వం యూజర్ చార్జీలు విధించడం ద్వారా వనరులను సమీకరించుకోవాలి.
 
 డి) ప్రభుత్వ రంగంలో ఉపాధి: కొంత మంది ఆర్థికవేత్తల అభిప్రాయంలో ప్రభుత్వ రంగంలో మిగులు సిబ్బందిని గుర్తించడం ద్వారా రీడిప్లాయ్‌మెంట్ ప్లాన్‌ను రూపొందించుకోవాలి. ప్రభుత్వరంగంలో ఉపాధిని రెండుశాతం తగ్గించాలని ప్రణాళికా సంఘం అప్రోచ్ పేపర్‌లో సూచించారు. తద్వారా ప్రభుత్వ వ్యయం తగ్గి రెవెన్యూ మిగులుకు అవకాశం ఏర్పడుతుంది.
 
 ఇ) వ్యయ నియంత్రణ: దీంట్లో భాగంగా పదో ప్రణాళిక అప్రోచ్ పేపర్ రెండు అంశాలపై దృష్టి సారించాలని వెల్లడించింది. జీడీపీలో భా గంగా, పెరుగుతున్న సబ్సిడీలను తగ్గించడం తో పాటు కరెంటు వ్యయం పెరుగుదలలో భా గంగా ప్రభుత్వ పింఛన్ చెల్లింపులను పేర్కొంది. ఈ రెండు అంశాలకు సంబంధించి వ్యయ నియంత్రణపై ప్రభుత్వ చర్యలు అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement