ఆ ప్రశ్నలు అటెంప్ట్ చేయొద్దు | don't attempt those types of questions | Sakshi
Sakshi News home page

ఆ ప్రశ్నలు అటెంప్ట్ చేయొద్దు

Published Sat, Aug 23 2014 10:44 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

ఆ ప్రశ్నలు అటెంప్ట్ చేయొద్దు - Sakshi

ఆ ప్రశ్నలు అటెంప్ట్ చేయొద్దు

ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్‌పై యూపీఎస్సీ ప్రకటన
సివిల్స్ ప్రిలిమ్స్ 2014కు సర్వం సిద్ధం
పరీక్షకు హాజరుకానున్న 60 వేలకుపైగా తెలుగు విద్యార్థులు

 
జాతీయ స్థాయిలో నిరసనలు.. ఆందోళనలు.. ఇంగ్లిష్ మీడియం ప్రశ్నలపై ఆగ్రహావేశాలు.. వెరసి.. ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగం ప్రశ్నలను తదుపరి దశ మెయిన్స్‌కు మెరిట్ జాబితాలో పరిగణనలోకి తీసుకోబోమని యూపీఎస్సీ ప్రకటించింది. సివిల్స్ ప్రిలిమ్స్ పేపర్-2లోని ఈ విభాగం ప్రశ్నలను అసలు అటెంప్ట్ చేయొద్దని స్పష్టం చేసింది.  ఈ నేపథ్యంలో.. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్- 2014కు సర్వం సిద్ధమైంది.
 
మెయిన్స్‌కు మెరిట్ జాబితా ఇలా:

మెయిన్స్ పరీక్షకు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసే క్రమంలో ఇంగ్లిష్ లాంగ్వేజ్  కాంప్రహెన్షన్ విభాగాన్ని పరిగణనలోకి తీసుకోబోమని తేల్చేసిన యూపీఎస్సీ.. మెరిట్ జాబితా విషయంలో నిర్దిష్ట విధానాలను ప్రకటించింది.  సివిల్స్ ప్రిలిమ్స్ ఒక్కో పేపర్ 200 మార్కులకు చొప్పున రెండు పేపర్లు మొత్తం 400 మార్కులకు జరుగుతుంది. ఇందులో 200 మార్కులకు నిర్వహించే పేపర్-1లో పొందే మార్కులు.. అదే విధంగా మరో 200 మార్కులకు జరిగే పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగం ప్రశ్నలకు(ఇంగ్లిష్‌లో మాత్రమే ముద్రితమై ఉంటాయి) కేటాయించిన మార్కులను మినహాయించగా పొందిన  మొత్తం మార్కుల సగటు ఆధారంగా మెయిన్స్‌కు అర్హుల జాబితాను రూపొందించనుంది.
 
ఆ మినహాయింపుపై భిన్నాభిప్రాయాలు:
పేపర్-2లోని ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగం నుంచి అడిగే ప్రశ్నలను అటెంప్ట్ చేయొద్దని,  ఈ విభాగానికి కేటాయించిన మార్కులను మెయిన్స్‌కు మెరిట్ జాబితా ఎంపికలో పరిగణనలోకి తీసుకోబోమని యూపీఎస్సీ స్పష్టం చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా హిందీయేతర, నాన్-మ్యాథ్స్ అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. 8 నుంచి 9 ప్రశ్నలతో దాదాపు 22 మార్కులకు అడిగే ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగాన్ని అటెంప్ట్ చేయొద్దనే ప్రకటనతో.. ఇప్పటికే ప్రిపరేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులు తాము మెరుగైన మార్కులు సాధించే అవకాశం కోల్పోయామని నిరుత్సాహానికి గురవుతున్నారు. ముఖ్యంగా డేటా ఇంటర్‌ప్రిటేషన్, న్యూమరికల్ స్కిల్స్ వంటి మ్యాథమెటిక్స్ విభాగాలను కష్టంగా భావించే అభ్యర్థులు.. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌లోనైనా మార్కులు సాధించొచ్చనే ఉద్దేశంతో ఉంటారని.. తాజా నిర్ణయం వారికి అశనిపాతంగా మారిందని పలువురి అభిప్రాయం.
 
హైదరాబాద్‌లో 38వేల మందికిపైగా..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్  రెండు రాష్ట్రాల నుంచి మొత్తం 62, 247 మంది తెలుగు అభ్యర్థులు సివిల్స్ ప్రిలిమ్స్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. వీరిలో తెలంగాణ రాష్ట్రంలోని ఒకే ఒక పరీక్ష కేంద్రం హైదరాబాద్ నుంచి 38, 098 మంది హాజరు కానుండటం గమనార్హం. గతేడాది 38, 982 మంది హైదరాబాద్‌ను సెంటర్‌గా ఎంపిక చేసుకున్నారు.
 
కొత్తగా ఏపీలో విజయవాడ:
గతేడాది వరకు ఉమ్మడి రాష్ట్రంలోని హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో యూపీఎస్సీ సివిల్స్ పరీక్ష కేంద్రాలు ఉండేవి. ఈ సంవత్సరం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పడిన నేపథ్యంలో కొత్తగా విజయవాడలోనూ పరీక్ష నిర్వహిస్తున్నారు. తొలిసారే ఈ నగరంలో 31 సెంటర్లలో మొత్తం 14, 640 మంది అభ్యర్థులు హాజరవుతుండటం గమనార్హం. ఇదే సమయంలో విశాఖపట్నం కేంద్రంలో అభ్యర్థుల సంఖ్య గత ఏడాదితో పోల్చితే తగ్గింది. ఈ నగరంలో మొత్తం 1,710 మంది అభ్యర్థుల కోసం ఏర్పాట్లు చేశారు. గత సంవత్సరం ఈ సంఖ్య 7754. గతంలో విజయవాడ కేంద్రంగా లేకపోవడంతో శ్రీకాకుళం జిల్లా మొదలు గుంటూరు వరకు అభ్యర్థులకు విశాఖపట్నం మాత్రమే అవకాశంగా ఉండేది. తిరుపతి కేంద్రంలో మొత్తం 7,796 మంది అభ్యర్థులు హాజరవనున్నారు.
 
సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ విభాగాన్ని రద్దు చేయడం వల్ల ఆ విభాగంలో మార్కులు సాధించాలనుకునే అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారనడంలో సందేహం లేదు. కానీ.. పరీక్షకు అంతా సిద్ధమైంది. కాబట్టి విద్యార్థులు పరీక్ష హాల్లో సరైన సమయ పాలన పాటించాలి. వాస్తవానికి ఇప్పటి వరకు పేపర్-2లో అభ్యర్థులకు ఒక్కో ప్రశ్నకు సగటున 70 సెకన్ల సమయం అందుబాటులో ఉండేది.
 
ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ ప్రశ్నల రద్దు నేపథ్యంలో ఆ సమయాన్ని ఇతర విభాగాలకు బదిలీ చేసుకుని సరైన సమయ పాలన పాటించాలి.
 
కాసింత పరిశీలన దృక్పథం, తార్కిక విశ్లేషణతో సమాధానాలు రాబట్టగలిగే డెసిషన్ మేకింగ్, లాజికల్ రీజనింగ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. రీడింగ్ కాంప్రహెన్షన్‌లో కూడా కొద్దిపాటి పరిశీలనతో సులభంగా సమాధానాలు ఇవ్వొచ్చు.
 
అదే విధంగా పేపర్-1 జనరల్ స్టడీస్‌లోనూ సమయ పాలన కీలకం. సగటున ఒక్కో ప్రశ్నను 90 సెకన్లలో సమాధానం ఇచ్చే విధంగా వ్యవహరించాలి.
 
చాలా మంది అభ్యర్థులు చేస్తున్న పొరపాటు.. మొదటి పేపర్ తర్వాత తాము సరిగా రాయలేదనో లేదా మరో ఛాన్స్ ఉంది కదా.. అనే ఆలోచనలతో రెండో పేపర్‌కు గైర్హాజరవుతున్నారు. ఇది సరికాదు. ఒక్క పేపర్ రాసినా.. రెండు పేపర్లు రాసినా అందుబాటులోని అటెంప్ట్‌లలో ఒకటి కోల్పోయినట్లే. ఒకట్రెండు ప్రశ్నలకు సమాధానాలు తెలియకపోయినా నిరుత్సాహానికి గురి కాకుండా.. ఆశావాహ దృక్పథంతో పరీక్ష హాల్లో అడుగు పెట్టాలి.
 
ఆర్. సి. రెడ్డి, డెరైక్టర్, ఆర్.సి. రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్, హైదరాబాద్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement