ఎన్నికల ఫలితాలను అంచనా వేసే.. పోల్ అనలిస్ట్
భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికలంటే ప్రజలకు, పార్టీలకు నిజంగా ఒక పండగే. ఎన్నికల వేళ ఊరూవాడ హోరెత్తిపోతుంటాయి. గెలుపోటములపై ఊహాగానాలకు అంతే ఉండదు. ఏ పార్టీ అధికారంలోకి రానుందనే ఉత్కంఠ అందరిలో ఉంటుంది. ఇదే సమయంలో ప్రజల దృష్టిని తమ వైపునకు తిప్పుకొనే నిపుణులు కొందరు ఉంటారు. టీవీ చానళ్లు, పత్రికల్లో తమ విశ్లేషణలతో జనంలో రోజురోజుకీ ఆసక్తిని పెంచుతుంటారు. వారే.. ఎన్నికల విశ్లేషకులు(పోల్ అనలిస్ట్‌లు). ఎలక్షన్ల సమయంలో వీరి హవా కొనసాగుతుంటుంది. తమ జాతకాలను తెలుసుకొనేందుకు పార్టీలు, నాయకులు పోల్ అనలిస్ట్‌లను ఆశ్రయిస్తుంటారు. అందుకే దీన్ని కెరీర్‌గా మార్చుకుంటే అవకాశాలకు, ఆదాయానికి లోటు ఉండదు.
న్యూస్ చానళ్లు, పత్రికల్లో కొలువులు
పోల్ అనలిస్ట్‌లకు ఎన్నికల సీజన్‌లో చేతినిండా పని దొరుకుతుంది. ఇది పార్ట్‌టైమ్ వృత్తి లాంటిది. ఎన్నికలు లేనప్పుడు ఇతర రంగాల్లో ఉపాధి పొందొచ్చు. డేటా విశ్లేషణపై పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి మార్కెట్ రీసెర్చ్, కన్జ్యూమర్ అండ్ బ్రాండింగ్ రీసెర్చ్, ఎవాల్యుయేషన్ రీసెర్చ్ విభాగాల్లో ఉద్యోగావకాశాలు పొందొచ్చు. ఎన్నికల విశ్లేషకులకు వార్తా చానళ్లు, పత్రికల్లో కొలువులు లభిస్తాయి. రాజకీయ పార్టీలు కూడా వీరిని నియమించుకుంటాయి. న్యూస్ చానళ్ల సంఖ్య పెరుగుతుండడంతో వీరికి అవకాశాలు విస్తరిస్తున్నాయి. అనలిస్ట్‌లు ఓపీనియన్/ఎగ్జిట్ పోల్స్ డేటాతోపాటు ఓటర్ల అభిప్రాయాలను స్వయంగా సేకరించి, తుది ఫలితాలను అంచనా వేయాల్సి ఉంటుంది. కులం, మతం, పట్టణ, గ్రామీణ ప్రాంతాల వారీగా ఓటింగ్ ట్రెండ్‌ను పరిశీలించాలి. ఎన్నికల్లో ఏయే అంశాలను ఓటర్లను ప్రభావితం చేయనున్నాయి, ఏ స్థానంలో ఏ పార్టీ విజయం సాధించనుందో ఊహించగలగాలి. ఎన్నికలకు సంబంధించి ప్రజల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. వాటన్నింటికీ సమాధానాలు చెప్పే సామర్థ్యం అనలిస్ట్‌లకు ఉండాలి. దేశంలో ప్రతిఏటా ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికల జరుగుతూనే ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అనలిస్ట్‌ల అవసరం ఉంటుంది.
కావాల్సిన నైపుణ్యాలు:
పోల్ అనలిస్ట్‌లకు ఓటర్ల నాడిని పట్టుకోగల నైపుణ్యం ఉండాలి. ప్రజాభిప్రాయాన్ని సరిగ్గా గుర్తించగల నేర్పు అవసరం. ఎండా వానలను లెక్కచేయక క్షేత్రస్థాయిలో మారుమూల ప్రాంతాల్లో పనిచేయడానికి శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి. ప్రలోభాలకు లొంగక నీతి, నిజాయతీలతో పనిచేస్తే మంచి గుర్తింపు లభిస్తుంది.
అర్హతలు:
ఎన్నికల విశ్లేషకులుగా మారాలనుకుంటే.. గ్రాడ్యుయేషన్‌లో ఉత్తీర్ణులైతే సరిపోతుంది. స్టాటిస్టిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ కోర్సులను అభ్యసిస్తే మెరుగ్గా రాణించడానికి వీలుంటుంది. ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ స్థాయిల్లో ఈ కోర్సులు చదవొ చ్చు. పోల్ అనలిస్ట్‌లు డేటా అనాలిసిస్‌పై తప్పనిసరిగా పట్టు సాధించాలి.
వేతనాలు:
పోల్ అనలిటిక్స్‌కు ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.25 వేల వేతనం అందుతుంది. కొంత అనుభవం సంపాదిస్తే రూ.50 వేలు పొందొచ్చు. సీనియర్ లెవెల్‌కు చేరుకుంటే రూ.70 వేలు సంపాదించు కోవచ్చు. ప్రతిభాపాటవాలు ప్రదర్శిస్తే అధిక ఆదాయం లభిస్తాయి.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
ఎన్నికల విశ్లేషణపై మనదేశంలో ప్రత్యేకంగా కోర్సులను రూపొందించలేదు. అయితే, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్, సోషియాలజీ, స్టాటిస్టిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ కోర్సులను అభ్యసించినవారు పోల్ అనలిస్ట్‌లుగా పనిచేయొచ్చు. భారత్‌లో దాదాపు అన్ని ప్రముఖ యూనివర్సిటీలు ఈ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. విదేశాల్లో పోల్ అనాలిసిస్‌పై కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులను అందిస్తున్న కొన్ని విదేశీ యూనివర్సిటీలు..
యూనివర్సిటీ ఆఫ్ ఎస్సెక్స్-యూకే
వెబ్‌సైట్: www.essex.ac.uk
యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్-యూఎస్
వెబ్‌సైట్: www.umich.edu
యూనివర్సిటీ ఆఫ్ నెబ్రాస్కా-లింకన్, యూఎస్
వెబ్‌సైట్: www.unl.edu