క్లరికల్ కొలువును కైవసం చేసుకోవాలంటే? | preperation plans for ibps exam | Sakshi
Sakshi News home page

క్లరికల్ కొలువును కైవసం చేసుకోవాలంటే?

Published Thu, Aug 21 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 PM

preperation plans for ibps exam

బ్యాంకులో ఉద్యోగం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కష్టపడి చదువుతున్న ఔత్సాహికులను మరో అవకాశం తలుపుతట్టింది! ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్).. క్లరికల్ కేడర్ పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్ష నిర్వహణకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి కుర్రకారు బ్యాంకింగ్ రంగంలో సుస్థిర కొలువులు సాధించి, బంగారు భవితకు బాటలు వేసుకోవాలంటే ఐబీపీఎస్ పరీక్షలో మెరుగైన స్కోర్ సాధించాలి. దీనికోసం సన్నద్ధత ప్రణాళికపై స్పెషల్ ఫోకస్..
 
వివిధ బ్యాంకుల్లో క్లర్క్ లేదా తత్సమాన ఉద్యోగాల భర్తీకి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) తాజాగా నోటిఫికేషన్ (సీడబ్ల్యూఈ క్లర్క్-4) విడుదల చేసింది. దీనిద్వారా భర్తీచేసే ఉద్యోగాల సంఖ్య కచ్చితంగా తెలియకపోయినా,ఖాళీలు భారీగానే ఉంటాయని అంచనా.
అర్హత: ఏదైనా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ లేదా తత్సమాన అర్హత ఉండాలి. కంప్యూటర్‌ను ఉపయోగించగలిగే పరిజ్ఞానం తప్పనిసరిగా అవసరం.
 
స్థానిక అధికారిక భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం రావాలి.వయో పరిమితి: 20- 28 ఏళ్ల మధ్య ఉండాలి. (ఆగస్టు 1, 2014 నాటికి). ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు; ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల మినహాయింపు ఉంటుంది.ఎంపిక విధానం: ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. పరీక్ష, ఇంటర్వ్యూకు వెయిటేజీ 80:20 నిష్పత్తిలో ఉంటుంది. సీడబ్ల్యూఈ-4 స్కోర్ కార్డు 2016, మార్చి 31 వరకు చెల్లుబాటవుతుంది.
 
ఆన్‌లైన్ పరీక్ష విధానం:
మొత్తం 200 మార్కులకు ఆన్‌లైన్ విధానంలో పరీక్ష ఆబ్జెక్టివ్ పద్ధతిలో నిర్వహిస్తారు. కాల వ్యవధి రెండు గంటలు. ప్రశ్నపత్రంలో ఐదు విభాగాలుంటాయి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ మినహా, మిగిలిన విభాగాల ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమంలో ఉంటాయి. నెగిటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.25మార్కుల కోత ఉంటుంది.
 
 విభాగం     గరిష్ట మార్కులు
 రీజనింగ్     40
 ఇంగ్లిష్ లాంగ్వేజ్     40
 న్యూమరికల్ ఎబిలిటీ     40
 జనరల్ అవేర్‌నెస్ (బ్యాంకింగ్ రంగానికి ప్రాధాన్యం)    40
 కంప్యూటర్ నాలెడ్జ్     40
 మొత్తం    200
 
 ముఖ్య తేదీలు:
 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 12, 2014.
 ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు: సెప్టెంబర్ 1, 2014.
 ఆన్‌లైన్ పేమెంట్: 12.8.2014- 1.9.2014.
 ఆఫ్‌లైన్ ఫీ పేమెంట్: 14.8.2014-3.9.2014.
 పరీక్షల తేదీలు: 6-12-2014; 7-12-2014,
 13-12-2014, 14-12-2014, 20-12-2014,
 21-12-2014, 27-12-2014.
 పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్.
 వెబ్‌సైట్: www.ibps.in.
 
ఐబీపీఎస్ ద్వారా క్లరికల్ నియామకాలు చేపడుతున్న బ్యాంకులు: అలహాబాద్ బ్యాంక్, ఆంధ్రా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కార్పొరేషన్ బ్యాంక్, దేనా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్‌సీస్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, సిండికేట్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యునెటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, విజయా బ్యాంక్.
 
ప్రిపరేషన్ ప్రణాళిక
నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం పట్టుదలతో చదివితే సాధ్యం కానిది లేదు. ఐబీపీఎస్ క్లరికల్ కేడర్ పరీక్షకు ఇంకా వంద రోజులకుపైగా సమయం ఉంది. అందువల్ల తొలిసారి పరీక్ష రాస్తున్న అభ్యర్థులు కూడా శ్రమించి, విజయాన్ని చేజిక్కించుకోవచ్చు.
 
రీజనింగ్: అభ్యర్థి పరిశీలనా శక్తిని, తార్కిక విశ్లేషణ, మానసిక సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు రీజనింగ్ విభాగాన్ని ప్రవేశపెట్టారు.వెర్బల్ రీజనింగ్: అనాలజీ, కోడింగ్ అండ్ డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, ిసీటింగ్ అరేంజ్‌మెంట్స్, సిరీస్ కంప్లీషన్, డెసిషన్ మేకింగ్, స్టేట్‌మెంట్ రీజనింగ్.
 
నాన్ వెర్బల్ రీజనింగ్: అనాలజీ, సిరీస్ కంప్లీషన్, క్లాసిఫికేషన్.రోజూ కనీసం ముఖ్యమైన అంశాల ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తే రీజనింగ్‌లో మంచి స్కోర్ సాధించవచ్చు. దీనికోసం షార్ట్‌కట్స్‌ను ఉపయోగించే నేర్పును సొంతం చేసుకోవాలి.
 
ఇంగ్లిష్ లాంగ్వేజ్: కాంప్రెహెన్షన్, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పరీక్షించే లక్ష్యంతో ఈ విభాగంలో ప్రశ్నలుంటాయి. ప్రధానంగా రీడింగ్ కాంప్రెహెన్షన్; స్పాటింగ్ ఎర్రర్; క్లోజ్ టెస్ట్; జంబుల్డ్ సెంటెన్సెస్‌పై ప్రశ్నలు ఇస్తారు.ాలా మంది అభ్యర్థులు రోజూ న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్‌లపై ఎక్కువ దృష్టిసారించి, ఇంగ్లిష్‌ను విస్మరిస్తుంటారు. ఇది మంచిది కాదు. ముఖ్యంగా తెలుగు మీడియం అభ్యర్థులు ఇంగ్లిష్‌ను తేలిగ్గా తీసుకోకూడదు. రోజూ కాంప్రెహెన్షన్ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడం వల్ల వేగంతో పాటు తేలిగ్గా సమాధానాలు గుర్తించగల నైపుణ్యం సొంతమవుతుంది.
 
న్యూమరికల్ ఎబిలిటీ:
ఈ విభాగంలో టైమ్ అండ్ వర్క్; సింప్లిఫికేషన్; పార్ట్‌నర్‌షిప్స్; సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రస్ట్; డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్; లాస్ అండ్ ప్రాఫిట్; టైమ్ అండ్ డిస్టెన్స్; రేషియోస్; వాల్యూమ్ అండ్ సర్ఫేస్ ఏరియా; పెర్ముటేషన్ అండ్ కాంబినేషన్; నంబర్ సిస్టమ్; సర్డ్స్ అండ్ ఇండిసెస్; అలిగేషన్ అండ్ మిక్చర్స్; హైట్స్ అండ్ డిస్టెన్సెస్ తదితర అంశాలు ముఖ్యమైనవి. ఎక్కువగా వచ్చే సూక్ష్మీకరణ (సింప్లిఫికేషన్)కు సంబంధించిన ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు గుర్తించాలంటే వేగంగా కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు చేయగలగాలి. న్యూమరికల్ ఎబిలిటీ విభాగంలో పూర్తిస్థాయి మార్కులు సాధించేందుకు ప్రాక్టీస్ ఒక్కటే మార్గం. షార్ట్‌కట్స్‌ను ఉపయోగించి సమస్యలను సాధించడాన్ని అలవరచుకోవాలి. తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ సమస్యలకు సమాధానాలు గుర్తించేలా సాధన చేయాలి.
 
జనరల్ అవేర్‌నెస్:
బ్యాంకింగ్ అవేర్‌నెస్; కరెంట్ అఫైర్స్; ఎకనమిక్ అవేర్‌నెస్; క్రీడలు; అవార్డులు; భారత రాజ్యాంగం; అధునాత సాంకేతిక పరిజ్ఞానం; పొరుగు దేశాలు- వర్తమాన సంఘటనలు; కొత్త నియామకాలు, కొత్త ఆవిష్కరణలు; పుస్తకాలు-రచయితలు తదితర అంశాలపై దృష్టిసారించాలి.
 
జనరల్ అవేర్‌నెస్ విభాగంలో 50 శాతానికి పైగా ప్రశ్నలు బ్యాంకింగ్ రంగానికి చెందినవి ఉంటాయి. అందువల్ల బ్యాంకింగ్ రంగ పదజాలం, ఈ రంగంలో చోటుచేసుకున్న కొత్త పరిణామాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యకలాపాలు, పరపతి విధానాలు తదితర అంశాలను చదవాలి. వీటితో పాటు జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల గురించి తెలుసుకోవాలి.
 
కంప్యూటర్ పరిజ్ఞానం:
బ్యాంకింగ్ రంగంలో కంప్యూటర్ల వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ విషయంలో అభ్యర్థి సామర్థ్యాన్ని అంచనా వేసేలా ప్రశ్నలు ఉంటాయి.ఇవి సాధారణంగా బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ హార్డ్‌వేర్; సాఫ్ట్‌వేర్ అండ్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్, విండోస్; మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అప్లికేషన్స్; కీబోర్డ్ షార్ట్‌కట్స్; ఇంటర్నెట్, నెట్‌వర్కింగ్‌కు సంబంధించివై ఉంటున్నాయి. అందువల్ల వీటికి సంబంధించిన అంశాలపై దృష్టిసారించాలి. స్వల్ప సమయంలో అధిక మార్కులు సాధించేందుకు వీలుకల్పించే విభాగమిది. ప్రముఖ దినపత్రికల్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రత్యేక పేజీలను చదవడం వల్ల ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలపై అవగాహన ఏర్పడుతుంది.
 
ప్రాక్టీస్‌తోనే విజయం సాధ్యం
ఎంత బాగా చదివినా, మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయకపోతే ఫలితం ఉండదు. అందువల్ల సబ్జెక్టుల వారీగా మోడల్ పేపర్లు ప్రాక్టీస్ చేయాలి. చివరి నెల రోజుల్లో రోజుకు కనీసం ఒక ఆన్‌లైన్ మాక్ టెస్ట్ రాసి, తమ సామర్థ్యాన్ని అంచనా వేసుకోవాలి. ఏ విభాగంలో బలహీనంగా ఉన్నారో తెలుసుకొని, ఆ సబ్జెక్టుపై ఎక్కువ దృష్టిసారించాలి. ఫ్యాకల్టీ సహాయంతో తెలియని అంశాలపై స్పష్టత ఏర్పర చుకోవాలి. జనరల్ అవేర్‌నెస్ కోసం ఏదైనా ప్రామాణిక దినపత్రికను చదివి, సొంతంగా నోట్స్ రాసుకోవాలి. బ్యాంకు పరీక్షలో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించే మరో అంశం టైమ్ మేనేజ్‌మెంట్. దీన్ని అలవరచుకునేందుకు టైమ్ పెట్టుకొని, మోడల్ పేపర్లను సాధన చేయాలి. షార్ట్‌కట్స్‌ను ఉపయోగిస్తూ తక్కువ సమయంలో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ప్రాక్టీస్ చేయాలి.
 - ఇ.త్రినాథ్‌రెడ్డి, ఐబీపీఎస్ క్లరికల్ విజేత. (యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా)
 
టిప్స్
ప్రిపరేషన్‌లో తొలుత సబ్జెక్టుల వారీగా బేసిక్స్‌పై పట్టు సాధించాలి. తర్వాత క్లిష్టమైన కాన్సెప్టులపై దృష్టిసారించాలి.రోజువారీ ప్రిపరేషన్ ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు ప్రిపరేషన్‌లో లోటుపాట్లను సమీక్షించుకోవాలి.క్లిష్టమైన అంశాలపై స్నేహితులతో చర్చించాలి. దీనివల్ల కాన్సెప్టులు ఎక్కువ కాలం గుర్తుంటాయి. రోజూ తప్పనిసరిగా దినపత్రికలు చదవాలి. దీనివల్ల ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్, కంప్యూటర్ అవేర్‌నెస్ విభాగాలతో పాటు ఇంటర్వ్యూలో మంచి స్కోర్ సాధించేందుకు వీలవుతుంది.భావ సారూప్యం గల స్నేహితులతో కలిసి కనీసం రోజుక ఒక మోడల్ పేపర్‌ను ప్రాక్టీస్ చేయాలి.
 
దీనివల్ల తెలియని విషయాలను, కొత్త షార్ట్‌కట్స్‌ను తెలుసుకునేందుకు అవకాశముంటుంది.న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్‌కు సంబంధించి రోజుకు కనీసం మూడు షార్ట్‌కట్స్‌ను నేర్చుకోవాలి. ఇంగ్లిష్‌కు సంబంధించి కొత్త పదాలతో వాక్యాలను నిర్మించడం ప్రాక్టీస్ చేయాలి.పరీక్షలో తొలుత జనరల్ అవేర్‌నెస్ లేదా కంప్యూటర్ అవేర్‌నెస్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఎందుకంటే ఈ విభాగాలను తక్కువ సమయంలోనే పూర్తిచేయొచ్చు. న్యూమరికల్ విభాగంలో తొలుత సింప్లిఫికేషన్ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement