ఇంజనీరింగ్ విద్యార్థి కెరీర్‌ను ప్రభావితం చేసే అంశాల్లో కీలకమైంది.. ప్రాజెక్ట్ వర్క్. ప్రస్తుతం నియామక ప్రక్రియలో అకడమిక్ నాలెడ్జ్‌తోపాటు ప్రాక్టికల్ స్కిల్స్‌కు రిక్రూటింగ్ ఏజెన్సీలు పెద్ద పీట వేస్తున్నాయి.. ఇంజనీరింగ్ కోర్సు నాలుగేళ్లు అధిక శాతం థియరీ ఆధారితం కావడంతో.. ప్రాక్టికల్‌గా విద్యార్థి ప్రతిభను అంచనా వేయడానికి ప్రాజెక్ట్ వర్క్ దోహదపడుతుంది.. ఈ నేపథ్యంలో ప్రాజెక్ట్ వర్క్‌ను ప్రభావవంతంగా చేయడానికి సూచనలు..
ఇంజనీరింగ్ విద్యార్థులు నాలుగో సంవత్సరం రెండో సెమిస్టర్‌లో ప్రాజెక్ట్ వర్క్ చేపడతారు. వ్యక్త్తిగతంగా లేదా ఇద్దరి నుంచి నలుగురు వరకు విద్యార్థులు ఒక బృందంగా ఏర్పడి ప్రాజెక్ట్‌ను నిర్వహిస్తారు. కోర్సులో భాగంగా అంత కాలం నేర్చుకున్న అంశాలపై విద్యార్థులకు ఉన్న అవగాహనను ప్రాక్టికల్‌గా ఏవిధంగా అన్వయించుకోగలుగుతున్నారనే నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు ఉద్దేశించింది ప్రాజెక్ట్ వర్క్. భవిష్యత్ దిశగా ప్రాక్టికల్ ఎక్స్‌పోజర్‌కు కూడా ప్రాజెక్ట్ వర్క్ చక్కని వేదికగా ఉపయోగపడుతుంది.
పక్కాగా:
ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడానికి పక్కా ప్రణాళిక రచించుకోవాలి. ఇందుకోసం చేసే సన్నాహకాలు పక్కాగా ఉండాలి. ఎటువంటి ప్రాజెక్ట్ చేపట్టాలి? ప్రాజెక్ట్ ఉద్దేశం? వ్యక్తిగతంగా చేయాలా లేదా ఒక గ్రూప్‌గా నిర్వహించాలా? ప్రాజెక్ట్ వల్ల ఏవరికి ప్రయోజనం? తదితర అంశాలపై స్పష్టత పొందాలి.
సొంత ఆలోచనతో:
ప్రాజెక్ట్ వర్క్ క్రమంలో కీలకమైంది.. టాపిక్ ఎంపిక. ఎటువంటి టాపిక్‌ను ఎంచుకోవాలనే విషయంలో స్పష్టత లేక విద్యార్థుల్లో ఒక రకమైన అయోమయమైన స్థితి నెలకొని ఉంటుంది. దీంతో ఎటువంటి ప్రాధాన్యత లేని అంశాన్ని ఎంచుకుని ప్రాజెక్ట్ వర్క్‌ను పూర్తి చేస్తారు. ఇది ఏవిధంగానూ వారి భవిష్యత్ అవకాశాలను ప్రభావితం చేయదు. ఇటువంటి ప్రాజెక్ట్స్‌తో సమయం వృథా తప్ప ఎటువంటి ప్రయోజనం ఉండదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాబట్టి ప్రాజెక్ట్ వర్క్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పరిధి చిన్నదైనా సొంత ఆలోచనలతో పూర్తి చేయడం మంచిది. కాపీ లేదా డౌన్‌లోడ్ చేయడం ద్వారా ప్రాజెక్ట్ వర్క్ చేయకూడదు.
వాస్తవాలను పరిగణనలోకి తీసుకుంటూ:
ప్రాజెక్ట్ వర్క్ ఎంపిక సమయంలో ఉన్నత విద్య, ఉద్యోగం అనే అంశాలను దృష్టిలో ఉంచుకుని.. వాటికనుగుణంగా ఉండే అంశాన్ని ఎంచుకోవడం ప్రయోజనకరంగా ఉంటుంది. అదే సమయంలో ఆసక్తిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఎందుకు ప్రాజెక్ట్ చేస్తున్నాం? ఏవిధంగా చేయాలనుకుంటున్నాం? ఈ అంశాన్ని ఎంచుకోవడం వెనక ఉన్న కారణం? దీని వల్ల ఎవరికి ప్రయోజనం? వంటి ప్రశ్నలకు సమాధానాలను ఇవ్వగలిగితే దాన్ని నాణ్యమైన ప్రాజెక్ట్‌గా పేర్కొనవచ్చు.
పుస్తకాల నుంచి బయటికి వచ్చి వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ ప్రాక్టికల్‌గా ఆలోచించాలి. అప్పుడే నాణ్యమైన టాపిక్ స్ఫూర్తినిస్తుంది. అదే సమయంలో ఎంచుకున్న అంశం ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా ఉండేలా జాగ్రత్త పడాలి. కొత్త నైపుణ్యాలు పెంచుకోవడానికి అవకాశమున్న ప్రాజెక్ట్‌ను ఎంపిక చేసుకోవాలి. ఇండస్ట్రీ రిలవెంట్ ప్రాజెక్ట్ వర్క్‌ను చేపట్టడం ఉత్తమం.
టాపిక్ ఎంపికలో సభ్యులందరూ సమష్టి నిర్ణయం తీసుకోవాలి. ఈ నేపథ్యంలో గ్రూప్ సభ్యులు సమష్టితత్వాన్ని అలవర్చుకోవాలి. బాధ్యతలను గుర్తెరిగి ప్రవర్తించాలి. ఎవరు ఏ అంశాన్ని చేపట్టాలి అనే విషయంలో స్పష్టత కలిగి ఉండాలి. మరో కీలకాంశం.. సూపర్‌వైజర్/మెంటర్‌ను ఎంచుకోవడం. ఈవిషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడంలో మెంటర్ పాత్ర కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్రెషర్‌గా ప్రాజెక్ట్ వర్క్‌పై అంతగా అవగాహన ఉండదు. కాబట్టి ఏమి చేయాలి? ఏమి చేయకూడదు? అనే అంశంలో సదరు మెంటర్ అనుభవం ఉపయుక్తంగా ఉంటుంది.
సోర్సెస్:
ప్రాజెక్టు ఎంపికలో ఇంటర్నెట్‌ను మంచి వనరుగా వినియోగించుకోవచ్చు. కొన్ని ఐఐటీలు ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలను వాటి వెబ్‌సైట్లలో పొందుపరుస్తాయి. వాటిని వినియోగించుకోవచ్చు. అందులో విస్తృత సమాచారం అందుబాటులో ఉంటుంది. కొన్ని కంపెనీలైతే కేవలం ప్రాజెక్ట్ వర్క్/ఇంటర్న్‌షిప్స్‌ను దృష్టిలో ఉంచుకుని మాత్రమే ప్రకటనలను విడుదల చేస్తుంటాయి. వాటి ఆధారంగా కూడా ప్రాజెక్ట్ వర్క్ చేపట్టవచ్చు.
కొన్ని కంపెనీలు కాలేజీల్లోని ఫ్యాకల్టీలను ప్రాజెక్ట్ వర్క్ కోసం ఆశ్రయిస్తుంటాయి. వీటి నుంచి కూడా టాపిక్‌ను ఎంచుకోవచ్చు. కొంతమంది ప్రొఫెసర్లకు ఏఐసీటీఈ, డీఎస్‌టీ, యూజీసీ నుంచి రీసెర్చ్ వర్క్‌లు వస్తాయి. అలాంటి వారి వద్ద ప్రాజెక్ట్ వర్క్ చేయొచ్చు. అలా కాకుండా క్షేత్ర స్థాయి పరిస్థితులను అవగాహన చేసుకోవడం ద్వారా టాపిక్ ఎంపికలో స్పష్టత తెచ్చుకోవచ్చు. ఈక్రమంలో కాలేజ్‌ను కూడా చక్కని వేదికగా వినియోగించుకోవచ్చు. కాలేజీలు లేదా చదువుతున్న బ్రాంచ్ ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారంగా ఒక ఫోన్ అప్లికేషన్‌ను రూపొందించవచ్చు.
ఉన్నత విద్య/ఉద్యోగం:
ప్రాజెక్ట్ టాపిక్ ఎంపిక.. ఇంజనీరింగ్ కోర్సు తర్వాత మనం ఏ దిశగా అడుగులు వేయాలనుకుంటున్నామో దాని ఆధారంగా ఉండడం ప్రయోజనకరం. ఈ క్రమంలో ఉన్నత విద్య దిశగా ఆలోచన ఉంటే.. సంబంధిత బ్రాంచ్ హెచ్‌ఓడీ లేదా ఫ్యాకల్టీ నుంచి సలహాను తీసుకోవాలి. ఎందుకంటే భవిష్యత్‌లో ఎంటెక్/పీహెచ్‌డీ పరంగా ఎటువంటి సబ్జెక్ట్‌కు డిమాండ్ ఉండొచ్చు. కెరీర్ పరంగా అవకాశాలు? అనే విషయంలో సమగ్ర అవగాహన ఉంటుంది. ఒక వేళ ఉద్యోగమే లక్ష్యంగా ఉంటే మాత్రం ఏదైనా కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్‌ను పూర్తి చేయడం ప్రయోజనకరం. కొన్ని కంపెనీలు విద్యార్థులకు రియల్ టైమ్ ప్రాజెక్ట్ చేసే అవకాశాన్ని ఇస్తున్నాయి. ఒక సూపర్‌వైజర్ పర్యవేక్షణలో ఇండిపెండెంట్ మాడ్యుల్స్‌పై పని చేసే అవకాశం కల్పిస్తున్నాయి. తద్వారా సంబంధిత రంగంలో వాస్తవంగా ఎదుర య్యే సవాళ్లను పరిశీలించే అవకాశం లభిస్తుంది.
ఆఫర్ కంపెనీలోనే:
ప్రస్తుతం క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కారణంగా చాలా కాలేజీల్లోని విద్యార్థుల చేతిలో ప్రాజెక్ట్ వర్క్ కంటే ముందే జాబ్ ఆఫర్ లెటర్స్ ఉంటున్నాయి. ఇటువంటి విద్యార్థులు ఆఫర్ లెటర్ ఇచ్చిన కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ పూర్తి చేయడం ప్రయోజనకరం. తద్వారా పని చేయబోయే కంపెనీలోని క్షేత్ర స్థాయి పరిస్థితులను అవగాహన చేసుకోవచ్చు. కొన్ని కంపెనీలు ప్లేస్‌మెంట్ ఆఫర్ ఇచ్చిన విద్యార్థులకు తమ కంపెనీలో ప్రాజెక్ట్ వర్క్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కాబట్టి వీటిని కూడా సద్వినియోగం
చేసుకోవాలి.
సమగ్రంగా:
సరైన ప్రాజెక్ట్‌ను ఎంచుకోవడంతోపాటు దాన్ని పూర్తి చేయడం అనేది కూడా కీలక అంశం. ఈ విషయంలో ప్రాజెక్ట్ గైడ్, సూపర్ వైజర్, ప్రొఫెసర్లు, సీనియర్ల సలహాలు తీసుకోవాలి. ప్రాజెక్ట్‌ను కొన్ని అంశాలకే పరిమితం చేయకుండా సమగ్రంగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకు సాఫ్ట్‌వేర్ ప్రాజెక్ట్స్‌ను తీసుకుంటే.. ఆ సబ్జెక్ట్‌కు సంబంధించి ఏదో ఒక అంశానికి మాత్రమే అధిక శాతం మంది విద్యార్థులు పరిమితం అవుతున్నారు.
తద్వారా ప్రాజెక్ట్ అసంపూర్తిగా మిగిలిపోతుంది. అలాకాకుండా ఒక అంశానికి సంబంధించి కీలకమైన డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్ వంటి అన్ని అంశాలను కవర్ చేసే విధంగా ప్రాజెక్ట్ వర్క్ ఉండాలి. ఎందుకంటే విద్యార్థి దశ నుంచి ఉద్యోగిగా అడుగుపెట్టడంతోనే టెక్నికల్‌గా అన్ని రకాల బాధ్యతలను చేపట్టే విధంగా నైపుణ్యాలను కలిగి ఉండాలని సాఫ్ట్‌వేర్ కంపెనీలు భావిస్తున్నాయి.
ఇదే అంశాన్ని ఇంటర్వ్యూలో ఎక్కువగా పరిశీలిస్తున్నాయి. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు వచ్చే కంపెనీలన్నీ సృజనాత్మకంగా ఆలోచించే విద్యార్థుల కోసం అన్వేషిస్తుంటాయి. నియామక ప్రక్రియకు సంబంధించి ఇంటర్వ్యూ దశ లేదా ప్రజెంటేషన్ దశలో రిక్రూటర్లు విద్యార్థుల్లో ఇదే నైపుణ్యాన్ని నిశితంగా పరిశీలిస్తుంటారు. అందరికీ భిన్నంగా నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ సృజనాత్మక ఆలోచనతో ప్రాజెక్ట్ వర్క్‌ను పూర్తి చేస్తే ఉద్యోగావకాశాలు మరింత మెరుగవుతాయి.
నిరంతర అధ్యయనం:
ప్రాజెక్ట్ వర్క్ సమయంలో నిరంతర అధ్యయనం చేయాలి. పరిశ్రమలోని సంబంధిత రంగంలోని వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి. అంకితభావంతో పనిచేయాలి. సమస్యలకు అక్కడి సీనియర్లకు పరిష్కార మార్గాలను చూపాలి. వాటన్నిటినీ నోట్స్ రూపంలో రాసుకోవాలి. ప్రాజెక్ట్‌ను పూర్తిచేసేందుకు సమష్టిగా కష్టపడాలి. కొత్త విషయాలను నేర్చుకోవడానికి ప్రయత్నించాలి.
సరికొత్త టెక్నాలజీ గురించి బృంద సభ్యులతో చర్చిస్తూ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. అందుకు సంబంధించిన సందేహాలుంటే బుక్స్, ప్రొఫెసర్ల సహాయంతో నివృత్తి చేసుకోవాలి. ప్రాజెక్ట్ వర్క్ సమయంలో చొరవ, పరిజ్ఞానం ఉన్న వారికి ఆ తర్వాత అదే సంస్థ ఉద్యోగం ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువ.
ప్రజెంటేషన్:
ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్రాజెక్ట్ గైడ్, ప్రొఫెసర్లను సంప్రదించి..టైటిల్ పేజీ, అబ్‌స్ట్రాక్ట్, అక్‌నాలెడ్జ్‌మెంట్స్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ తదితర అంశాలను పొందుపరుస్తూ ప్రామాణిక నమూనాలో రిపోర్ట్‌ను సిద్ధంచేసి కళాశాలలో సమర్పించాలి. ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం ఒక ఎత్తయితే.. దాన్ని ప్రభావవంతంగా ప్రజెంట్ చేయడం మరో ఎత్తు. చేసిన ప్రాజెక్ట్‌కు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టి ప్రాజెక్ట్‌కు గ్రేడింగ్ లేదా వెయిటేజీ ఇస్తారు. కెరీర్‌లో దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది.
ప్రయోజనాలు
ప్రస్తుతం కొన్ని రకాల కంపెనీలు ఉద్యోగుల నియామక ప్రక్రియలో నూతన ఒరవడిని పాటిస్తున్నాయి. ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించని ప్రొడక్ట్ డెవలప్‌మెంట్ కంపెనీలు, సర్వీసెస్ కంపెనీలు ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థి చూపిన ప్రతిభ ఆధారంగా మాత్రమే ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. ఉద్యోగుల నియామక ప్రక్రియలో భాగంగా..విద్యార్థులకు తమ కంపెనీలో ప్రాజెక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ ప్రాజెక్ట్ వర్క్‌లో విద్యార్థి ప్రతిభను మూల్యాంకనం చేసి ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నాయి. ఈ మొత్తం ప్రక్రియ ‘ప్రీ ప్లేస్‌మెంట్ ఆఫర్’ పేరుతో ప్రాచుర్యంలో ఉంది.
కోర్ బ్రాంచ్ విద్యార్థులు ఆఫ్ క్యాంపస్ పద్ధతిలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే సమయంలో.. ఎంపిక ప్రక్రియలో ప్రాజెక్ట్ వర్క్ నిర్ణయాత్మక పాత్రను పోషిస్తుంది.
కొన్ని సంస్థలు పూర్తిగా విద్యార్థులు నిర్వహించిన ప్రాజెక్ట్ వర్క్ ఆధారంగానే ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తున్నాయి.
ముఖ్యంగా క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ అంతగా లేని కాలేజ్ విద్యార్థులు ప్రాజెక్ట్ వర్క్ మీద ఎక్కువగా దృష్టి సారించాలి. చక్కటి ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తే ఉద్యోగం సాధించే అవకాశాలు మెరుగవుతాయి.
సబ్జెక్ట్‌పై పట్టు ఉన్నత విద్య దిశగా ఆలోచిస్తున్న విద్యార్థికి లాభం చేస్తుంది. కోర్సు పూర్తయ్యాక ఏ రంగంలో ప్రవేశించాలో నిర్ణయం తీసుకోవడానికీ దోహదపడుతుంది.
సక్సెస్‌ఫుల్ ప్రాజెక్ట్‌కు ఐదు సూత్రాలు
1. ప్రాజెక్ట్ వర్క్‌కు ఎటువంటి టాపిక్ ఎంచుకోవాలనే విషయంలో స్పష్టతతో ఉండాలి. ఉన్నత విద్య, ఉద్యోగం, ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలాధారంగా టాపిక్‌ను ఎంచుకోవాలి.
2. ప్రాజెక్ట్ వర్క్‌ను విజయవంతంగా పూర్తి చేయడంలో మెంటర్ పాత్ర కీలకం. ఎందుకంటే ఫ్రెషర్‌గా ప్రాజెక్ట్ వర్క్‌పై అంతగా అవగాహన ఉండదు. కాబట్టి ఈ అంశంలో మెంటర్ అనుభవం ఉపయుక్తంగా ఉంటుంది.
3. ప్రాజెక్ట్‌ను కొన్ని అంశాలకే పరిమితం కాకుండా ..ఆ అంశానికి సంబంధించి డిజైన్, డెవలప్‌మెంట్, టెస్టింగ్ వంటి అన్ని అంశాలను కవర్ చేసే విధంగా ఉండాలి.
4. ప్రాజెక్ట్ వర్క్ సమయంలో నిరంతర అధ్యయనం చేయాలి. పరిశ్రమలోని వాస్తవ పరిస్థితులను పరిశీలించాలి. వాటన్నిటినీ నోట్స్ రూపంలో రాసుకోవాలి.
5. ప్రాజెక్ట్ వర్క్ పూర్తయిన తర్వాత టైటిల్ పేజీ, అబ్‌స్ట్రాక్ట్, అక్‌నాలెడ్జ్‌మెంట్స్, టేబుల్ ఆఫ్ కంటెంట్స్ తదితర అంశాలను పొందుపరుస్తూ ప్రామాణిక నమూనాలో రిపోర్ట్‌ను సిద్ధంచేసి కళాశాలలో సమర్పించాలి.
ఆన్‌లైన్ సోర్సెస్:
ఐఈఈఈ వెబ్‌సైట్: www.ieee.org
ఏసీఎం వెబ్‌సైట్: www.acm.org
సైన్స్ డెరైక్ట్ వెబ్‌సైట్: www.sciencedirect.com
ఇల్స్‌వేర్ వెబ్‌సైట్: www.elsevier.co.in