క్విక్ రివ్యూ.. | Social Studies Bit Bank for Quick Review | Sakshi
Sakshi News home page

క్విక్ రివ్యూ..

Published Thu, Feb 13 2014 2:21 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

Social Studies Bit Bank for Quick Review

భూగోళ శాస్త్రం
 
 మెక్‌మోహన్ రేఖ: భారత్, చైనాల మధ్య గల సరిహద్దు రేఖ.
 భారతదేశం.. ఉత్తరం నుంచి దక్షిణంగా 3,200 కి.మీ. పొడవు; తూర్పు నుంచి పశ్చిమగా 3,000 కి.మీ. వెడల్పుతో వ్యాపించి ఉంది.
 ఉపఖండం: సాధారణ ఖండానికి ఉండే విశిష్ట లక్షణాలున్న ప్రాంతం.
 భారత సరిహద్దు ప్రాంతంలోని చిట్టచివరి ప్రదేశాలు:
 ఉత్తరం: హిమాలయ పర్వతాలు
 దక్షిణం:     కన్యాకుమారి (తమిళనాడు)
 పశ్చిమం: రాణ్‌ఆఫ్‌కచ్ (గుజరాత్)
 తూర్పు: మయన్మార్, చైనా
 కనుమ: పర్వతశ్రేణుల్లో రాకపోకలకు వీలుగా ఏర్పడిన సన్నని సహజ మార్గం. ఉదా: కైబర్, కారకోరం, షిప్కిలో.
 డూన్: హిమాచల్ పర్వతాలను, శివాలిక్ కొండలను వేరుచేస్తూ వరుసగా ఉన్న సన్నని, సమతలం ఉన్న దైర్ఘ్యలోయ. ఉదా: డెహ్రాడూన్, కోట్లీడూన్, పాట్లిడూన్.
 భాబర్: గులకరాళ్లతో ఏర్పడిన సచ్ఛిద్ర మండలం.
 రే/ కల్లార్: శుష్క ప్రదేశాల్లోని చవుడు, లవణీయ, స్ఫటికీయ భూభాగం.
 బృహత్ మైదానాల్లో గల ప్రధాన నదీ వ్యవస్థలు: 1. గంగానదీ వ్యవస్థ. 2. సింధు నదీ వ్యవస్థ. 3. బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ.
 టెరాయి: గులకరాళ్లతో కూడిన భాబర్ మండలం కిందుగా ప్రవహించే హిమాలయ నదులు తిరిగి ఉపరితలానికి వచ్చి, ప్రవహించడం వల్ల ఏర్పడే చిత్తడి ప్రదేశం.
 రుతుపవనాలు: భారత ఉపఖండం, హిందూ మహాసముద్రాల మధ్య రుతువులను అనుసరించి పవనాలు వీయడాన్ని, వెనుకకు మరలడాన్ని రుతుపవనాలు అంటారు.
 ఖండాంతర్గత శీతోష్ణస్థితి: తీర ప్రాంతం నుంచి భూబాగానికి ఎక్కువ దూరం వెళ్తే తీవ్ర వాతావరణ పరిస్థితులు ఉండే స్థితి.
 మృత్తికలు 6 రకాలు: 1. ఒండ్రు 2. నల్లరేగడి 3. ఎర్ర 4. లాటరైట్ 5. పర్వత 6. ఎడారి మృత్తికలు.
 జనసాంద్రత: సగటున ఒక చదరపు కిలోమీటరు విస్తీర్ణంలో నివసించే జనసంఖ్య
 అధిక గ్రామీణ జనాభా: అధిక గ్రామీణ జనాభా హిమాచల్‌ప్రదేశ్‌లో ఉంటే, అధిక నగర జనాభా మహారాష్ట్రలో ఉంది.
 బహుళార్థ సాధక పథకం: నీటిపారుదల, విద్యుదుత్పాదన,వరద నియంత్రణం,నౌకాయానాభివృద్ధి, మత్స్య అభివృద్ధి వంటి బహుళ ప్రయోజనాలను ఆశించి, నదులపై నిర్మించిన ఆనకట్టలతో కూడిన నదీలోయ పథకం.
 జీవకాలువలు: నదికి అడ్డంగా ఆనకట్టను నిర్మించడం వల్ల ఆ నది నీరు సంవత్సరమంతా ప్రవహించడానికి వీలున్న కాలువలు.
 వరద కాలువలు: వర్షాకాలపు వరదనీటిపై పూర్తిగా ఆధారపడి ఉండే కాలువలు.
 జల విద్యుచ్ఛక్తి: ఆనకట్టలపై నుంచి వేగంగా జాలువారే నీటి శక్తిద్వారా టర్బైన్‌లను తిప్పడం వల్ల విడుదలయ్యే విద్యుత్.
 వాణిజ్య పంటలు: జీవనానికే కాక అధిక లాభార్జనకై పండించే పంటలు.
 ముఖ్యమైన వాణిజ్య పంటలు: పత్తి, జనుము, తేయాకు, కాఫీ, చెరకు, రబ్బరు, పొగాకు మొదలైనవి.
 వివిధ వ్యవసాయ అభివృద్ధి పథకాలు:
 1.కమ్యూనిటీ అభివృద్ధి పథకం (కమ్యూనిటీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ -ఇఈ్క)
 2.చిన్నరైతుల అభివృద్ధి సంస్థ (స్మాల్ ఫార్మర్స్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ -ఎస్.ఎఫ్.డి.ఎ)
 3.సాంద్ర వ్యవసాయ అభివృద్ధి పథకం (ఐఅఈ్క)
 4.సాంద్ర వ్యవసాయ ప్రాంత పథకం (ఐఅఅ్క)
 
 హరిత విప్లవం: పంటల ఉత్పత్తుల పెరుగుదలకు అవసరమైన అధిక దిగుబడినిచ్చే పంట రకాలను అభివృద్ధి చేయటం కోసం నిర్దిష్టమైన పంట మొక్కలను పెంచడం.
 ఖనిజాలు నాలుగు రకాలు: లోహ ఖనిజాలు, అలోహ ఖనిజాలు, ఇంధన ఖనిజాలు, అణు ఖనిజాలు.
 సంప్రదాయ శక్తివనరులకు భిన్నమైన మార్గాల ద్వారా శక్తి సమస్యను పరిష్కరించేందుకు భారత ప్రతిస్థాపక యోగ్యశక్తి అభివృద్ధి సంస్థ (IREDA)ను 1987లో స్థాపించారు.
 దేశంలో ఉపయోగించినా, ఎగుమతి చేసేందుకు మిగులుగా ఉన్న ఖనిజాలు: ఇనుప ధాతువు, మాంగనీస్, అభ్రకం మొదలైనవి.
 దేశంలో స్వయం సమృద్ధికి సరిపడు ఖనిజాలు: బొగ్గు, అల్యూమినియం, పాలరాయి, సున్నపురాయి.
 దేశంలో కొరతగా ఉన్న, ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న ఖనిజాలు: పెట్రోలియం, రాగి, వెండి, జింక్ మొదలైనవి.
 పారిశ్రామిక ప్రాంతం: ఒక పరిశ్రమ భారీగా లేదా వివిధ రకాల పరిశ్రమలు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమైన ప్రాంతం.
 ఇనుము, ఉక్కు పరిశ్రమకు కావాల్సిన ముడిపదార్థాలు: ఇనుప ఖనిజం, మాంగనీస్, క్రోమైట్, కోకింగ్ బొగ్గు, సున్నపురాయి లేదా డోలమైట్.
 రోడ్డు మార్గాలు 4 రకాలు: జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులు, జిల్లా రహదారులు, గ్రామ పంచాయతీ రహదారులు.
 మన దేశంలోని ముఖ్యమైన ప్రసార సాధనాలు: తపాలా, టెలిగ్రాఫ్, టెలిఫోన్, వైర్‌లెస్ ఫోన్, ఫ్యాక్స్, ఎలక్ట్రానిక్ మెయిల్.
 భారతీయ రైల్వేలు ఎదుర్కొంటున్న సవాళ్లు: విద్యుదీకరణ, గేజ్ మార్పిడి.
 అంతర్జాతీయ విమానాశ్రయాలున్న నగరాలు: ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, చెన్నై, తిరువనంతపురం, హైదరాబాద్.
 నౌకాశ్రయం: ఎగుమతులు, దిగుమతులకు వీల్లేకుండా నౌకలు వచ్చి ఆగడానికి మాత్రమే సౌకర్యం ఉండే ప్రదేశం.
 ఓడరేవు: సముద్రాల నుంచి భూభాగాన్ని, భూభాగం నుంచి సముద్రాలను కలిపే ముఖద్వారం. ఇది సరుకుల ఎగుమతి, దిగుమతులకు వీలుగా ఉంటుంది.
 విదేశీ వాణిజ్యం: ఒక దేశం ఇతర దేశాలతో చేసే వాణిజ్యం.
 విదేశీ వాణిజ్య సరళి: విదేశీ వాణిజ్యంలో ఎగుమతుల గమ్యాన్ని, దిగుమతుల ఆరంభాన్ని తెలియజేసే విధానం.
 అటవీ ఆధార పరిశ్రమలు: అటవీ ఉత్పత్తులపై ఆధారపడి పనిచేసే పరిశ్రమలు.
 ఉదా: కాగితం, బీడీలు,అగ్గిపెట్టెలు, రంగులు.
 
 
 చరిత్ర
 రెడ్‌షర్‌‌ట్స దళం: ఇటలీ ఏకీకరణకు గారిబాల్డి 1000 మంది విప్లవ సైనికులతో ఏర్పాటు చేసిన దళం.
 కార్బోనరీ: నేపుల్స్(ఇటలీ)లో ప్రారంభమై, ఇటలీ అంతటా వ్యాపించిన మొట్టమొదటి రహస్య విప్లవ సంఘం.
 యంగ్ ఇటలీ: ఇటలీలో జోసెఫ్ మజ్జీని ఏర్పాటు చేసిన రహస్య విప్లవ సంఘం.
 రిసోర్జిమెంట్: ఇటలీలో కౌంట్‌కవూర్ ప్రారంభించిన వార్తాపత్రిక.
 బిస్మార్‌‌క విధానం: క్రూరమైన బలప్రయోగం (బ్లడ్ అండ్ ఐరన్).
 పారిస్ కమ్యూన్ ఫ్రాన్‌‌స (క్రీ.శ. 1871): ప్రపంచంలో ఏర్పాటైన మొట్టమొదటి కమ్యూనిస్ట్ ప్రభుత్వం. దీన్ని ఫ్రెంచ్ సైన్యం తీవ్రంగా అణిచివేసింది.
 ప్రథమ ఇంటర్నేషనల్ క్రీ.శ. 1864: ప్రపంచ కార్మికులను ఏకం చేయడానికి కారల్ మార్‌‌క్స లండన్‌లో నిర్వహించిన అంతర్జాతీయ శ్రామికుల సమావేశం.
 కారల్ మార్‌‌క్స రచనలు: కమ్యూనిస్ట్ మేనిఫెస్టో,  దాస్ కాపిటల్.
 ఏమ్స్ టెలిగ్రామ్: బిస్మార్‌‌క (ప్రష్యా ప్రధానమంత్రి) తమ రాజు ఏమ్స్ నగరం నుంచి పంపిన ఈ టెలిగ్రామ్‌ను ఉద్దేశపూర్వకంగానే మార్చి నెపోలియన్-3 (ఫ్రాన్‌‌స)పై యుద్ధం ప్రకటించాడు. ప్రష్యా గెలవడంతో జర్మనీ ఏకీకరణ (క్రీ.శ. 1871) పరిసమాప్తమైంది.
 నల్లమందు యుద్ధాలు (క్రీ.శ. 1839-42, క్రీ.శ. 1857-58): భారత్‌లో పండించిన నల్లమందును ఇంగ్లండ్, చైనాకు దొంగతనంగా రవాణా చేసి, వ్యాపారం చేసేది. ఈ విషయంలో చైనా, ఇంగ్లండ్‌ల మధ్య జరిగిన సంఘర్షణల ఫలితమే నల్లమందు యుద్ధాలు.
 సామ్రాజ్యవాదం: బలమైన రాజ్యాలు తమ రాజకీయ, ఆర్థిక అవసరాలను తీర్చుకోవడంలో భాగంగా బలహీన దేశాల్లో వలసలను ఏర్పర్చుకోవడానికి పోటీపడుతూ పెంచుకునే శత్రుత్వం.
 ఇండోనేషియాలోని దీవులు: జావా, సుమత్రా, బాలి
 దక్షిణాఫ్రికాలో స్థిరపడిన డచ్‌వారిని బోయెర్‌‌స అని, ఆంగ్లేయులను ఔట్‌లాండర్‌‌స అని పిలుస్తారు.
 బోల్షివిక్ పార్టీ స్థాపకుడు (1903): లెనిన్
 రస్‌పుటిన్: అధముడైన రష్యన్ సన్యాసి. ఈయన రష్యా జార్ (రాజు) నికోలస్- ఐఐపై చూపిన దుష్ర్పభావాల వల్ల 1905లో రష్యన్ విప్లవం చెలరేగింది
 రష్యా జాతీయ అసెంబ్లీని ‘డ్యూమా’ అని పిలుస్తారు
 బాల్కన్ రాజ్యాలు: బోస్నియా, సెర్బియా, రుమేనియా, ఆల్బేనియా, మాంటేనెగ్రో. ఈ దేశాల్లో నివసిస్తున్న క్రైస్తవులు తమ రాజు టర్కీసుల్తాన్ పాలనపై తిరుగుబాటు చేయడం వల్ల ముస్లిం పాలన అస్తవ్యస్తమైంది. ఈ బాల్కన్ సమస్య కూడా మొదటి ప్రపంచ యుద్ధానికి కారణమైంది.
 రెండో ప్రపంచయుద్ధ కాలం: సెప్టెంబర్ 1, 1939 నుంచి ఆగస్ట 14, 1945 వరకు
 రెండో ప్రపంచయుద్ధ తక్షణ కారణం: హిట్లర్ (జర్మనీ) పోలెండ్‌పై దాడి.
 ఫాసిస్ట్‌పార్టీ: ఇటలీలో ముస్సోలినీ స్థాపించాడు.
 స్పానిష్ అంతర్యుద్ధం (1937): స్పెయిన్‌లో కమ్యూనిస్ట్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా జనరల్ ఫ్రాంకో నాయకత్వంలో ఫాసిస్ట్ శక్తులు తిరుగుబాటు చేశాయి.
 పునరుద్ధరణ: జపాన్‌లో భూస్వామ్య పాలనను గద్దె దింపిన విప్లవకారులు చక్రవర్తి మీజీ అధికారాన్ని పునరుద్ధరించారు.
 ప్రచ్ఛన్న యుద్ధం: రెండు విరుద్ధ అగ్రరాజ్యాల కూటముల (అమెరికా, రష్యా) మధ్య ఏర్పడిన యుద్ధ వాతావరణం.
 ట్రూమన్ సిద్ధాంతం(1947): యూరప్‌లో కమ్యూనిజం విస్తరణను అడ్డుకోవడానికి ట్రూమన్ (అమెరికా అధ్యక్షుడు) రూపొందించిన ప్రతిపాదన. దీన్ని గ్రీస్, టర్కీలకు సైనిక, ఆర్థిక సహాయాన్ని అందించడానికి ప్రతిపాదించాడు.
 బ్రస్సెల్స్ సంధి(1948): రష్యా ఆధిపత్యాన్ని యూరప్‌లో నిరోధించడానికి యూరప్ దేశాలు చేసుకున్న ఒప్పందం.
 అలీన విధానం: రెండు అగ్రరాజ్య కూటములకు దూరంగా ఉంటూ ప్రపంచ శాంతిని కాంక్షించే దేశాల విధానం, వీటిని మూడో ప్రపంచ దేశాలుగా పిలుస్తారు. ఈ విధానం భారత విదేశాంగ విధానం ప్రధాన లక్ష్యం.
 బాండుంగ్ సదస్సు-1955: ఆసియా, ఆఫ్రికా దేశాల మొదటి సదస్సు. ఇది ఇండోనేషియాలోని బాండుంగ్‌లో జరిగింది.
 సింధూ నాగరికత విలసిల్లిన కాలం: క్రీ.పూ. 3000 నుంచి క్రీ.పూ. 1500 వరకు.
 వేదాలు: నాలుగు. అవి.. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం.
 గుప్తుల కాలంనాటి దేవాలయాలు: దేవ్‌గఢ్ రాతి ఆలయం (ఝాన్సీ), భితర్‌గావ్ ఇటుకల ఆలయం (ఉత్తరప్రదేశ్), సారనాథ్ రాతి ఆలయం.
 శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించిన ఆలయాలు: విఠలస్వామి ఆలయం, హజరారామస్వామి ఆలయం.
 భక్తి ఉద్యమం: హిందూ మతంలోని మూఢ విశ్వాసాలను సంస్కరించడమే భక్తి ఉద్యమకారుల ప్రధాన ధ్యేయం. వారు ముస్లిం మతంలోని ఆదర్శనీయమైన, ఆచరణీయమైన అంశాలకు ప్రభావితులయ్యారు.
 సైమన్ కమిషన్ (1927): 1919 మింటో-మార్లే చట్టంలోని సంస్కరణల పనితీరును పరిశీలించి సూచనలు చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం నియమించిన కమిషన్. దీనిలో తమకు సభ్యత్వం లేకపోవడంతో భారతీయులు బహిష్కరించారు.
 రౌలత్ చట్టం (1919): ఈ చట్టం ఏ వ్యక్తినైనా ఎలాంటి విచారణ చేయకుండానే వారిని జైల్లో పెట్టే అధికారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. ఇది భారతీయుల హక్కులను కాలరాసింది.
 రక్షక కవాట సిద్ధాంతం: వ్యతిరేకుల భావాలను సానుకూలంగా నియంత్రించి వారిని సంతృప్తి పర్చడం ఈ సిద్ధాంతం లక్ష్యం.
 డ్రైన్ సిద్ధాంతం: ఈ సిద్ధాంతం బ్రిటిష్ వలస ప్రభుత్వం, భారతదేశ సంపదను ఎలా ఆర్థిక దోపిడిని చేస్తుందో తెలుపుతుంది.
 తీన్‌కథియా పద్ధతి: చంపారన్ (బీహార్) రైతులు నీలి మందు పంటను పండించి బ్రిటిష్ తోటల యజమానులు నిర్ణయించిన ధరకు వారికే అమ్మే దోపిడీ విధానం. గాంధీజీ కృషి వల్ల ఈ పద్ధతి రద్దయింది.
 
 
 అర్థశాస్త్రం
ఒక నిర్వచనీయ పద్ధతిలో ఉత్పత్తి, ఉపాధి, సదుపాయాలున్న భారీ పరిశ్రమలు, వ్యవసాయరంగాలను వ్యవస్థీకృత రంగంగా పిలుస్తారు.
ఉదా: వాహనాలు, రసాయనాలు, యంత్ర పరికరాలు, ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్, వస్త్రాల పరిశ్రమలు.
అవ్యవస్థీకృత రంగం: ఉద్యోగాలు, జీతాల స్థాయిలో ఒక నియమిత పద్ధతిలేని కుటీర, చిన్న తరహా, అల్ప పరిశ్రమలను అవ్యవస్థీకృత రంగంగా పిలుస్తారు.
ఉదా: కుటీర, అల్ప, చిన్న తరహా పరిశ్రమలయిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమలు, చేనేత, బీడీ, అగర్‌బత్తిల తయారీ, చేతిపనులు, కళాకారులు తదితర వృత్తులు.
ఆర్థిక వ్యవస్థలు 3 రకాలు. అవి
1. పెట్టుబడి దారీ ఆర్థిక వ్యవస్థ: ఇందులో ప్రైవేటు ఆర్థిక వ్యవస్థలుంటాయి. అత్యధిక లాభాలను ఆర్జిస్తాయి.
2. సామ్యవాద ఆర్థిక వ్యవస్థ: ప్రభుత్వమే ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజలకు అవసరమైన వస్తుసరఫరా చేస్తుంది.
3. మిశ్రమ ఆర్థిక వ్యవస్థ: ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలు రెండూ కలిసుంటాయి.
 భూమి ఒడంబడిక పద్ధతులు:
1. జమిందారీ పద్ధతి: జమిందార్లు కౌలుదార్ల నుంచి తమ ఇష్టం వచ్చినంత శిస్తువసూలు చేయడం.
2. మహల్వారీ పద్ధతి: శక్తిమంతమైన చిన్న కుటుంబాల సమూహం ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం.
3. రైత్వారీ పద్ధతి: రైతులే నేరుగా ప్రభుత్వానికి పన్ను కట్టడం.
పేదరికం: ప్రజలు తమ కనీస అవసరాలు కూడా తీర్చుకోలేని స్థితి.
 ద్రవ్యోల్బణం: డబ్బు విలువ తగ్గుతూ, సాధారణ ధరల స్థాయిలో నిరంతర పెరుగుదలను ద్రవ్యోల్బణం అంటారు.
 దారిద్య్రరేఖ: కనీస అవసరాలను తీర్చే వస్తువులను, కనీస భౌతిక పరిమాణాన్ని వాటి ధరలతో గుణించి కనీస తలసరి వినియోగ వ్యయాన్ని నిర్ణయించడం.
 నిరుద్యోగం: వాడుకలో ఉన్న వేతనాలతో అవసరమైనన్ని ఉద్యోగాలు ప్రజలకు లభించని స్థితి.
 సంపూర్ణ పేదరికం: కనీస అవసరాలను తీర్చే వస్తువులను కూడా కనీస మొత్తాలలో ధర చెల్లించి కొనుగోలు చేయలేకపోవడం.
 సాపేక్ష పేదరికం: జనాభాలో అత్యధిక ఆదాయం ఉన్న 5 నుంచి 10 శాతం ప్రజల ఆదాయ స్థాయిలను, చాలా అల్ప ఆదాయం ఉన్న 5 నుంచి 10 శాతం ప్రజల ఆదాయ స్థాయిలను పోల్చే విధానం.
 మానవాభివృద్ధి సూచిక: ప్రజల జీవన ప్రమాణం, సాధారణ ఆరోగ్య స్థాయి, అక్షరాస్యతరేటు, విద్య, పారిశుద్ధ్య సదుపాయాలతో పాటు తలసరి ఆదాయంతో కూడిన మిశ్రమ అభివృద్ధి సూచిక.
 
 ఆర్థిక వ్యవస్థలోని 3 ముఖ్యాంశాలు
 1.ప్రాథమిక రంగం (వ్యవసాయరంగం): వ్యవసాయం, తోటల పెంపకం, గనుల తవ్వకం, చేపలు పట్టడం మొదలైనవి.
 2.ద్వితీయ రంగం(పారిశ్రామిక రంగం): చిన్నతరహా, భారీ పరిశ్రమలు, నిర్మాణ రంగం మొదలైనవి.
 3.తృతీయరంగం(సేవల రంగం): బ్యాంకింగ్, వాణిజ్యం, సమాచార, ప్రసార సాధనాలు, కంప్యూటర్ సేవలు మొదలైనవి.
 యాజమాన్య విధానం ఆధారంగా భారతీయ పరిశ్రమలను 3 రంగాలలో విభజించారు.
 1. ప్రభుత్వరంగం 2. ప్రైవేట్ రంగం 3. విదేశీరంగం పెట్టుబడి పరిమాణాన్ని అనుసరించి పరిశ్రమలను మూడు రకాలుగా వర్గీకరించారు.
 
 1. భారీతరహా పరిశ్రమలు
 2. చిన్న తరహా పరిశ్రమలు 3. అల్ప లేదా మరీ చిన్న తరహా పరిశ్రమలు
 ఉత్పాదకత ఆధారంగా పరిశ్రమలను నాలుగు విభాగాలుగా వర్గీకరిస్తారు. 1. మౌలిక పరిశ్రమలు 2. ఉత్పాదక వస్తు పరిశ్రమలు 3. మధ్య తరహా పరిశ్రమలు 4. వినియోగదారుల వస్తు పరిశ్రమలు.
 ఆర్థిక ప్రణాళిక: నిర్దిష్ట కాలపరిమితితో నిర్ణయించుకున్న లక్ష్యాలను సాధించేందుకు హేతుబద్ధంగా, కేంద్రీకృత, ఆర్థిక నిర్ణయాధికారం ద్వారా సమన్వయం చేసే వ్యూహాలను ఆర్థిక ప్రణాళిక అంటారు.
 భారత ప్రణాళికల విజయాలు: నికర దేశీయోత్పత్తిలో పెరుగుదల-ఆహార ధాన్యాల ఉత్పాదకతలోనూ, మౌలిక ఉత్పాదక వస్తు పరిశ్రమల వృద్ధిలో స్వయం సమృద్ధి సాధన-అవస్థాపన సౌకర్యాల వృద్ధి- పారిశ్రామిక రంగం బలపడటం.
 భారత ప్రణాళికల వైఫల్యాలు: ఆదాయ అసమానతలు పెరగడం-పేదరికం, నిరుద్యోగ నియంత్రణలో వెనుకంజ-అసంపూర్ణ భూసంస్కరణలు.
 భారత ప్రణాళికల సాధారణ లక్ష్యాలు: జాతీయాదాయం పెంచుట- ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుచుట-పారిశ్రామికీకరణను వేగవంతం చేయుట-ఉపాధిని పెంచుట-ఆదాయ అసమానతలు తగ్గించుట.
 
 
 పౌరశాస్త్రం
 గణతంత్ర రాజ్యం: ప్రజలతో ప్రత్యక్షంగా గాని లేదా పరోక్షంగా గానీ ఎన్నికై దేశాధ్యక్షుడిగా (రాష్ర్టపతి) ఉన్నదేశం.
 సమాఖ్యవాదం: రాజ్యాంగం ద్వారా కేంద్ర, రాష్ట్రాలకు అధికారాలను స్పష్టంగా విభజించి, పంపిణీ చేయడం.
 సామాజిక న్యాయం: దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా ప్రజలందరికీ సమాన పంపిణీ చేసి సమాజ సంక్షేమానికి తోడ్పడడం.
 జాతీయ సమైక్యత: దేశంలోని ప్రజలంతా ఒకటే అనే భావన.
 ప్రజాస్వామ్యం: ప్రజలే తమను తాము పరిపాలించుకోవడం.
 ఎన్నికల సంఘం: దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించే స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ.
 డెమోక్రసీ: డెమోస్ (ప్రజలు), క్రేషియా (పరిపాలనా) అనే గ్రీకు పదాల సమ్మేళనం.
 ప్రత్యక్ష ఎన్నికలు: ప్రజలు ఓటువేసి ప్రత్యక్షంగా తమ ప్రతినిధులను ఎన్నుకోవడం.
 పరోక్ష ఎన్నికలు: ప్రజలతో ఎన్నికైన ప్రతినిధులు మరో అధికార పదవికి ప్రతినిధిని ఎన్నుకోవడం.
 సాధారణ ఎన్నికలు: ప్రతి అయిదు సంవత్సరాలకు ఒకసారి నియత కాలికంగా జరిగే ఎన్నికలు.
 మధ్యంతర ఎన్నికలు: అయిదు సంవత్సరాలు నిండకముందే మధ్యంతరంగా జరిగే ఎన్నికలు.
 సార్వత్రిక వయోజన ఓటింగ్ హక్కు: 18 సంవత్సరాలు నిండిన ప్రతివారికి ఓటు వేసే హక్కు.
 రాజకీయ పార్టీలు: ఉమ్మడి రాజకీయ విశ్వాసాలు, ఆసక్తులు కలిగి రాజకీయాధికారాన్ని సంపాదించడానికి సంఘంగా ఏర్పడిన వ్యక్తుల సమూహం.
 బాలల హక్కులు: జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి హక్కు, భాగస్వామ్య హక్కు.
 హెబియస్ కార్పస్ రిట్: అకారణంగా అరెస్ట్ అయిన వారిని రక్షించడానికి అత్యున్నత న్యాయస్థానాలు జారీ చేసే ఆదేశం.
 జీవించే హక్కు: అమల్లో వున్న చట్టాల నుంచి ఒక వ్యక్తి రక్షణ పొంది, స్వేచ్ఛగా జీవించే హక్కు.
 కులతత్వం: ఒక కులంవారు మరో కులం వారిని వివక్షతతో చూడడం.
 మతతత్వం: ఒక మతం వారు మరో మతం వారిని అవమానిస్తూ, అసహ్యించుకుంటూ సంకుచితత్వం కలిగి వుండడం.
 ప్రాంతీయతత్వం: ఒక ప్రత్యేక ప్రాంతం తన భాష, ఆచార వ్యవహారాలు, సంస్కృతి, ఆర్థికాంశాలు, జీవన విధానాలను పరిరక్షించుకోవాలనే తీవ్రమైన ఆకాంక్షను వెల్లడించడం.
 సార్‌‌క దేశాలు (8): ఇండియా, నేపాల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, మాల్దీవులు, అఫ్గానిస్థాన్.
 నూతన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ (1973): పేద (అలీన) దేశాల డిమాండ్‌ను గౌరవించి యూఎన్‌ఓ ఏర్పాటు చేసిన ఆర్థిక వ్యవస్థ.
 విల్లీబ్రాంట్ కమిషన్ 1980: పేద, ధనిక దేశాల మధ్య ఆర్థిక వ్యత్యాసాలను తగ్గించడానికి వ్యూహాలను రూపొందించింది.
 వీటో అధికారం: వ్యతిరేకించే అధికారం. భద్రతామండలిలోని ఐదు శాశ్వత సభ్య దేశాలకు ఈ అధికారం ఉంది.
 పర్యావరణం: మానవాభివృద్ధి, పరిసరాలను ప్రభావితం చేసే అంశాలతో కూడిన ఆవరణం.
 ముఖ్యమైన మానవహక్కులు: జీవించే హక్కు, పనిహక్కు, విద్యాహక్కు, మత స్వాతంత్య్రపు హక్కు.
 పంచశీల ఒప్పందం (1954): భారత్- చైనాల మధ్య జరిగింది.
 యూఎన్‌ఓ ప్రధాన అంగాలు (6): సాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక, సామాజిక మండలి, ధర్మకర్తృత్వమండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, కార్యదర్శి వర్గం.
 యూఎన్‌ఓ ప్రత్యేక అనుబంధ విభాగాలు: ఐఎల్‌ఓ, ఎఫ్‌ఏఓ, యునెస్కో, ఐబీఆర్‌డీ, డబ్ల్యూటీఓ, యునిసెఫ్.
 
 మ్యాప్ పాయింటింగ్
 పేపర్-1:
 చరిత్ర పాఠ్యాంశాలలోని ప్రదేశాలను ప్రపంచ పటంలో గుర్తించాలి. ఇచ్చిన ఐదు ప్రదేశాలలో.. ఒకటి మహాసముద్రం/సముద్రం/సరస్సు/నది. రెండోది ఆసియాలోని దేశం/ రాజధాని. మూడోది యూరప్‌లోని దేశం/రాజధాని. నాలుగోది ఆఫ్రికాలోని దేశం. ఐదవది అమెరికా ఖండంలోని దేశం/ ముఖ్యపట్టణం/దేశ రాజధాని.  
 
 పేపర్-2:
 భూగోళశాస్త్ర పాఠ్యాంశంలోని ప్రదేశాలను, భారతదేశ పటంలో గుర్తించాలి. భౌగోళిక సరిహద్దులు, నదులు, శిఖరాలు, ఓడరేవులు, రాష్ట్రాలు, రాజధానులు, ముఖ్య పట్టణాలు, సరస్సులు, సముద్రాలు, దీవులు, జాతీయ రహదారులు, రైలు మార్గాలు, ప్రాజెక్టులు, ఖనిజ నిక్షేపాలున్న ప్రదేశాలను అడుగుతారు.
 
 గుర్తుంచుకోవాల్సిన జాగ్రత్తలు:
 మ్యాప్‌లో పాయింటింగ్ చేసేటప్పుడు మొదట పెన్సిల్‌తో ఆయా ప్రదేశాలను గుర్తించాలి.
 తర్వాత అదే సరైన జవాబుగా నిర్ధారించుకొని పెన్నుతో గుర్తించండి. అలా చేయడం వల్ల కొట్టివేతలతో ఆ ప్రదేశం స్థానం మారకుండా ఉంటుంది.
 గుర్తించిన ప్రదేశంలో డాట్ (చుక్క)ను కొద్దిగా పెద్దగా పెట్టి, అక్కడే కాకుండా బాణం గుర్తుతో సూచించి ఆ ప్రదేశం పేరును స్పష్టంగా విడివిడిగా రాయాలి.
 చివరగా మ్యాప్‌ను, ఆబ్జెక్టివ్ పేపర్‌ను (పార్ట్-బి) ప్రధాన సమాధాన పత్రంతో (పార్ట్-ఎ) కలిపి దారంతో జాగ్రత్తగా ముడి వేయాలి.
 
 
 ఇలా రాయాలి
 1 మార్కు ప్రశ్నలు
 ప్రతి పాఠ్యాంశం చివరన ఇచ్చిన ప్రశ్నల నుంచే కాక జనరల్‌గా పాఠ్య విషయం నుంచి కూడా ప్రశ్నలు అడుగుతారు.
 ముఖ్యాంశాలను ప్రశ్నలుగా మార్చి ఇస్తారు. అందుకోసం ముఖ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఒకరకంగా ముఖ్యాంశాలన్నీ చదివితే పాఠాన్ని అవగాహన చేసుకున్నట్లే. అంతేకాకుండా ప్రతి పాఠ్యంశంలోని పాఠంలో అపాస్ట్రాఫ్ (‘’) కామాలున్న నూతన పదాలను, నిర్వచనాలను ఒక మార్కు ప్రశ్నలుగా మార్చి పరీక్షల్లో అడుగుతారు.
 ఉదా: కల్లార్ అంటే ఏమిటి?
 వీటికి రెండు లేదా మూడు పాయింట్లు సమాధానం రాయాలి. చాలా మంది విద్యార్థులు పరీక్షల్లో సమాధానాలు రాసేటప్పుడు ప్రశ్నలు రాయరు. అలాంటప్పుడు పై ప్రశ్నను ఉదాహరణగా తీసుకుంటే:
 ్ధ కల్లార్ అంటే (అంటూ సమాధానం రాయాలి)
 అలాగే ఆంగ్ల అక్షరాలతో కూడిన అబ్రివియేషన్ పదాలను విస్తరించండి అని ప్రశ్నలు అడుగుతారు.
 ఉదా: SWAPO (స్వాపో)ను విస్తరించండి?
    NATO (నాటో) అంటే?
 
 2 మార్కుల ప్రశ్నలు:
 దాదాపు పుస్తకంలోని ప్రశ్నలనే పరీక్షల్లో అడుగుతారు. వీటికి 4 లేదా 5 పాయింట్లతో సమాధానాలు రాయాలి.
 ఉదా: భారత ప్రణాళికల సాధారణ లక్ష్యాలను తెలపండి?
 జ. భారత ప్రణాళికల సాధారణ లక్ష్యాలు:
 జాతీయాదాయం పెంచడం
 ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం
 పారిశ్రామికీకరణను వేగవంతం చేయడం
 ఉపాధిని పెంచడం
 ఆదాయ, అసమానతలను తగ్గించడం
 
 4 మార్కుల ప్రశ్నలు:
 ప్రతి ప్రశ్నకు సమాధానాన్ని సైడ్ హెడ్డింగ్‌తో ప్రారం భించి, పాయింట్ల రూపంలో విడివిడిగా రాస్తే ఎక్కువ మార్కులు పొందొచ్చు. రెండు చిన్న ప్రశ్నలను కలిపి 4 మార్కుల ప్రశ్నగా కూడా అడగవచ్చు. అదేవిధంగా పెద్ద ప్రశ్నను విడదీసి 2 మార్కుల ప్రశ్నలుగా కూడా అడిగే అవకాశం ఉంది.
 సమాధానాలను పాయింట్ల వారీగా ఇలా రాయాలి.
 4 మార్కుల ప్రశ్నలకు 8 నుంచి 10 పాయింట్ల సమాధానం రాయాలి.
 2 మార్కుల ప్రశ్నలకు 4లేదా 5 పాయింట్ల సమాధానం రాయాలి.
 1 మార్కు ప్రశ్నలకు 2 లేదా 3 పాయింట్ల సమాధానాన్ని రాయాలి.
 రాసిన సమాధానంలోని ముఖ్యాంశాలను అండర్‌లైన్ చేయండి. అలాగే సమాధానంలో ఏదైనా సంస్థ, పుస్తకం, పార్టీ, పత్రిక, వ్యక్తుల పేర్లు ఉన్నట్లయితే వాటికి రెండు వైపులా ‘’అపాస్ట్రాఫ్ ‘’కామా (‘’)లను పెట్టి రాయండి.
 ఎరుపు రంగు పెన్‌ను ఉపయోగించకండి. బ్లాక్/బ్లూ పెన్నులను మాత్రమే వాడండి. పూర్తి సమాధానాన్ని ఒక రంగు పెన్నుతో రాసి, సైడ్‌హెడ్డింగ్‌ను ఇంకో రంగుపెన్నుతో రాయాలి.
 జవాబులను రాసేముందు ప్రశ్నల సంఖ్యను కరెక్ట్‌గా రాయాలి.
 చివరి 30 నిమిషాల ముందు ఇచ్చే ఆబ్జెక్టివ్ బిట్స్ పేపర్‌లో ప్రతి బిట్ (ప్రశ్న)కు ఏదైనా ఒక్క సమాధానమే రాయాలి. ఒకవేళ రాసిన దానిని కొట్టివేయాల్సి వస్తే ణ గుర్తు ఆ సమాధానంపై రాసి, కరెక్ట్ సమాధానాన్ని దాని పక్కన రాయాలి.
 బిట్ పేపర్‌కు సమాధానాలు రాస్తున్నప్పుడు ప్రధాన ప్రశ్నపత్రంలోని ప్రశ్నలకు సంబంధించి కొన్ని పాయింట్స్ గుర్తుకు రావొచ్చు. ఆ సందర్భంలో వాటిని వెంటనే ప్రధాన సమాధాన పత్రంలో వాటికి సంబంధించిన జవాబులకు జత చేయాలి.  
 చివరగా బిట్ పేపర్ సమాధానాలు రాసిన తర్వాత, ప్రధాన సమాధాన పత్రాన్ని, తర్వాత మ్యాప్ పాయింటింగ్ పేపర్‌ను, ఆ తర్వాత ఆబ్జెక్టివ్ పేపర్‌ను జతచేసి దారంతో జాగ్రత్తగా, గట్టిగా ముడివేయాలి.
 
 ఆల్ ద బెస్ట్..
 
 ఈ వారం భవిత
 ‘కరెంట్ అఫైర్స్’ శీర్షిక
 నేటి సాక్షి ‘విద్య’ పేజీలో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement