షేర్ల వ్యాపారానికి స్టాక్ బ్రోకర్!
స్టాక్ ఎక్స్ఛేంజ్, బులియన్ మార్కెట్, షేర్లు, సెన్సెక్స్, నిఫ్టీ.. ఇవి మనం తరచుగా వినే పదాలు. సంప్రదాయ పొదుపు పథకాల కంటే షేర్లలో పెట్టుబడులతో అధిక రాబడి ఉంటుందని ఆర్థిక నిపుణులు సలహాలు ఇస్తుంటారు. అయితే, షేర్లు, అందులో పెట్టుబడులపై చాలామందికి ఏమాత్రం అవగాహన ఉండదు. షేర్ల ఫలాలు పొందాలనుకునే క్లయింట్ల తరఫున ఆర్థిక లావాదేవీలు నిర్వహించడానికి స్టాక్ బ్రోకర్లు ఉంటారు. ప్రపంచంలో ధనం చెలామణిలో ఉన్నంతకాలం స్టాక్ బ్రోకర్లకు చేతినిండా పని, మంచి ఆదాయం లభిస్తాయని నిపుణులు అంటున్నారు.
పేరు ప్రఖ్యాతలు, ఆదాయం, అవకాశాలు: స్టాక్ బ్రోకర్లు తమ క్లయింట్లకు సురక్షితమైన పెట్టుబడి పథకాలను సూచించాల్సి ఉంటుంది. వారి తరఫున షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పథకాల్లో పెట్టుబడులు పెట్టాలి. షేర్ల కొనుగోలు, అమ్మకం వంటి కార్యకలాపాలు స్వయంగా చేపట్టాలి. ఈ వ్యవహారాలను నిర్వహించినందుకు క్లయింట్ల నుంచి ఆకర్షణీయమైన కమీషన్ పొందొచ్చు. స్టాక్ బ్రోకర్లు తమ పనితీరుతో క్లయింట్లకు లాభాలను ఆర్జించి పెడితే పేరుప్రఖ్యాతలు వస్తాయి. అవకాశాలు, ఆదాయం పెరుగుతాయి. తాజా గ్రాడ్యుయేట్లు/పోస్టు గ్రాడ్యుయేట్లకు స్టాక్ బ్రోకరేజీ సంస్థల్లో అసిస్టెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్/రిలేషన్‌షిప్ మేనేజర్‌గా కొలువులు అందుబాటులో ఉన్నాయి. బ్రోకరేజీ కంపెనీలో సబ్-బ్రోకర్, ఫ్రాంచైజీగా కూడా చేరొచ్చు.
కావాల్సిన నైపుణ్యాలు: స్టాక్ బ్రోకర్‌కు మార్కెట్ పల్స్‌ను సరిగ్గా గుర్తించే నేర్పు ఉండాలి. ఆర్థిక లావాదేవీల్లో నమ్మకం ప్రధానం. క్లయింట్ల మనోభావాలు దెబ్బతినకుండా, మార్కెట్‌లో కంపెనీ స్థానం దిగ జారకుండా జాగ్రత్తగా వ్యవహరించాలి. స్టాక్ బ్రోకర్ పొరపాటు నిర్ణయాలు తీసుకుంటే క్లయింట్ల జీవితాలు తారుమారవుతాయి. కాబట్టి విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా సదా అప్రమత్తంగా ఉండాలి. ఈ వృత్తిలో ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి.
అర్హతలు: మన దేశంలో బ్రోకరేజీ సంస్థలు ఎంబీఏ (ఫైనాన్స్) కోర్సు చదివినవారిని అసిస్టెంట్ రిలేషన్‌షిప్ మేనేజర్, రిలేషన్‌షిప్ మేనేజర్‌గా నియమించుకుంటున్నాయి. కాబట్టి ఈ కోర్సు పూర్తిచేస్తే స్టాక్ బ్రోకర్‌గా స్థిరపడొచ్చు. దీంతోపాటు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ చేస్తున్న ఫైనాన్షియల్ మార్కెట్స్ సర్టిఫికేషన్, బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ చేస్తున్న డెరివేటివ్ ఎక్స్ఛేంజ్ సర్టిఫికేషన్ కూడా పూర్తిచేస్తే అర్హతలను పెంచుకొని, మంచి అవకాశాలను అందుకోవచ్చు.
వేతనాలు: స్టాక్ బ్రోకర్లకు పనితీరును బట్టి ఆదాయం చేతికందుతుంది. ఎంబీఏ(ఫైనాన్స్) కోర్సు చేసిన రిలేషన్‌షిప్ మేనేజర్ సంవత్సరానికి రూ.2.4 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు సంపాదించుకోవచ్చు. నాన్-ఫైనాన్స్ రిలేషన్‌షిప్ మేనేజర్‌కు ఇంతకంటే కొంత తక్కువ ఆదాయం లభిస్తుంది. సంస్థ పరిధిని బట్టి ఇందులో మార్పులుంటాయి. రిలేషన్‌షిప్ మేనేజర్‌గా కెరీర్‌ను ప్రారంభించినవారు మెరుగైన పనితీరుతో టీమ్ లీడర్, జోనల్ మేనేజర్‌గా పదోన్నతులు పొందొచ్చు.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు:
బీఎస్‌ఈ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్-ముంబై. వెబ్‌సైట్:www.bseindia.com
నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్-ముంబై. వెబ్‌సైట్: www.nseindia.com
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.icsi.edu
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఛార్టెర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: www.icai.org
ఎన్‌సీఎఫ్‌ఎం అకాడమీ-హైదరాబాద్.
వెబ్‌సైట్: www.ascncfmacademy.com
ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగొచ్చు
‘‘భారతీయ స్టాక్ మార్కెట్ అభివృద్ధి పథంలో పయనిస్తోంది. స్టాక్ బ్రోకర్‌లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడుతోంది. ఫైనాన్స్, మార్కెట్లపై ఆసక్తి ఉన్న ఇంటర్మీడియెట్, డిగ్రీ అభ్యర్థులు ఈ కోర్సులను అభ్యసించొచ్చు. షేర్లు, డిబెంచర్లు, ప్రభుత్వ సెక్యూరిటీలు, బాండ్ల అమ్మకాలు, కొనుగోళ్ల ప్రక్రియలో స్టాక్ బ్రోకర్‌దే ప్రధాన పాత్ర. వ్యక్తులు లేదా సంస్థలకు సంబంధించిన ఈ క్రయవిక్రయాల విషయంలో స్టాక్‌బ్రోకర్... డీలర్‌గా, అడ్వైజర్‌గా, అనలిస్ట్‌గా పనిచేస్తాడు. ఈ కెరీర్‌లో ప్రవేశించిన వారు ఉద్యోగాలకే పరిమితమవ్వాల్సిన అవసరం లేదు. మార్కెట్ స్థితిగతులపై పూర్తి అవగాహన ఏర్పడితే ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా ఎదగడానికి మంచి అవకాశం ఉంటుంది’’
- ఎ.ఎస్.చక్రవర్తి, ఎన్‌సీఎఫ్‌ఎం అకాడమీ, హైదరాబాద్
పోటీ పరీక్షల్లో ‘దిక్కులు’ టాపిక్‌పై ఎలాంటి ప్రశ్నలు వస్తాయి?
వీటిని సులభంగా సాధించడానికి సూచనలివ్వండి.
- జి.అరుణ్, నారాయణగూడ
ఎస్సై, కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్షలతోపాటు ఇతర కాంపిటీటివ్ ఎగ్జామ్‌లన్నింటి దృష్ట్యా ‘దిక్కులు’ పాఠ్యాంశం అత్యంత ప్రాధాన్యమైంది. ప్రతి పోటీ పరీక్షలోనూ ఈ అంశం నుంచి కనీసం రెండు లేదా మూడు ప్రశ్నలు తప్పనిసరిగా కనిపిస్తాయి. పటం సహాయంతో వీటిపై వచ్చే ప్రశ్నలను సులభంగా సాధించవచ్చు. ఇలాంటి ప్రశ్నలు ఎదురవగానే ముందుగా కాగితంలో ఏదో ఒక మూలన పై నుంచి కిందికి సవ్యదిశలో ‘ఉఈతూఆదనైపవా’ కోడ్‌తో వరుసగా దిక్కులన్నింటినీ గుర్తించాలి. తర్వాత దత్తాంశంలోని వివరాల ఆధారంగా పటం గీయాలి. వ్యక్తి ప్రయాణిస్తున్న దిశ ఆధారంగా కుడివైపు లేదా ఎడమవైపు తిరిగితే ఏ దిశలో ఉంటాడో జాగ్రత్తగా గుర్తించాలి. వీటిపై వచ్చే ప్రశ్నలను సులభంగా సాధించడానికి తోడ్పడే మరో అంశం ‘పైథాగరస్ సిద్ధాంతం’. దీనికి సంబంధించి లంబకోణ త్రిభుజం ఏర్పరిచే భుజాల కొలతలైన (3, 4, 5), (5, 12, 13), (12, 16, 20) లాంటివాటిని గుర్తుంచుకుంటే సమస్యను మరింత వేగంగా సాధించవచ్చు.
ఇన్‌పుట్స్: బి రవిపాల్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ
బయాలజీ మెథడ్స్‌లో ప్రశ్నల ప్రాధాన్యం ఏమిటి? - ఆర్.సౌందర్య, కాప్రా
డీఎస్సీ, టెట్ పరీక్షల్లో మెథడాలజీ ప్రశ్నలు కీలక పాత్ర పోషిస్తాయి. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించడం వల్ల పోటీలో ముందు నిలిచే అవకాశం ఉంది. గతంలో నిర్వహించిన డీఎస్సీ పరీక్షలో మెథడాలజీ నుంచి 16 మార్కులకుగాను 32 ప్రశ్నలు ఇచ్చారు. ఒకవేళ టెట్‌ను కొనసాగిస్తే దాంట్లోనూ ఈ విభాగం నుంచి 20 మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కంటెంట్ నుంచి 44 మార్కులకుగాను ఇచ్చే 88 ప్రశ్నలకు చాలా మంది అభ్యర్థులు కచ్చితమైన సమాధానాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కంటెంట్‌కు సంబంధించిన చాలా ప్రశ్నలు పదో తరగతి, కొన్ని ప్రశ్నలు ఇంటర్మీడియెట్ స్థాయిలో ఉండటం, డిగ్రీ స్థాయి అభ్యర్థులు పుస్తకాలను పదే పదే చదవడం వల్ల ఎక్కువ మార్కులు తెచ్చుకోగలుగుతున్నారు. కంటెంట్‌పై ప్రశ్నలు జ్ఞాన సంబంధమైనవి (నాలెడ్‌జ బేస్‌డ్) కావడం వల్ల పుస్తకాలను క్షుణ్నంగా చదివిన అభ్యర్థులు ఎక్కువ మార్కులు సాధిస్తారు. అందువల్ల మెథడాలజీలో పట్టు సాధించిన వారికి మంచి ర్యాంకు వస్తుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
ఇన్‌పుట్స్: ఎస్.పి.డి.పుష్పరాజ్, సబ్జెక్ట్ నిపుణులు
జాబ్స్, అడ్మిషన్‌స అలర్‌ట్స
నేషనల్ రీసెర్చ్ సెంటర్
ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ
న్యూఢిల్లీలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ ప్లాంట్ బయోటెక్నాలజీ కింద పేర్కొన్న ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
టెక్నికల్ అసిస్టెంట్ టి-3
అర్హతలు: అగ్రికల్చర్ సెన్సైస్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ. తగిన అనుభవం
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 25
వెబ్‌సైట్: www.nrcpb.org
సీఆర్‌పీఎఫ్
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
సబ్ ఇన్‌స్పెక్టర్: 42
విభాగాలు: స్టాఫ్ నర్స్, రేడియోగ్రాఫర్
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్: 87
విభాగాలు: ఫిజియో థెరపిస్ట్, ఫార్మాసిస్ట్, లేబొరేటరీ టెక్నీషియన్, ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, డెంటల్ టెక్నీషియన్.
హెడ్ కానిస్టేబుల్: 19
విభాగాలు: జూనియర్ ఎక్స్‌రే అసిస్టెంట్, లేబొరేటరీ అసిస్టెంట్, ఎయిర్ కండీషనింగ్ ప్లాంట్ టెక్నీషియన్, స్టీవార్డ్.
కానిస్టేబుల్: 46. విభాగాలు: వార్డ్‌బాయ్/ గర్ల్, కుక్.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 7
వెబ్‌సైట్: http://crpf.nic.in
ఇండియన్ నేవీ
ఇండియన్ నేవీ.. షార్ట్ సర్వీస్ కమిషన్ పైలట్/ అబ్జర్వర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
పైలట్/అబ్జర్వర్
అర్హతలు: మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులతో ఇంటర్, 60 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. డీజీసీఏ జారీ చేసిన సీపీఎల్ ఉండాలి.
ఎంపిక: సర్వీస్ సెలక్షన్ బోర్డు ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 3
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in
నర్సింగ్
డెరైక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ - తెలంగాణ (డీఎంఈ) జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది.
కాలపరిమితి: మూడున్నరేళ్లు
అర్హత: 40 శాతం మార్కులతో ఇంటర్ బైపీసీ ఉత్తీర్ణత.
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా.
రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: అక్టోబర్ 13
వెబ్‌సైట్: http://dme.tg.nic.in/
ఎడ్యూ న్యూస్: ఆసియాలో టాప్ బి-స్కూల్.. ఐఐఎం-కలకత్తా
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)-కలకత్తా ఆసియాలో టాప్ బిజినెస్ స్కూల్ (బి-స్కూల్)గా గుర్తింపు సాధించింది. ఫైనాన్షియల్ టైమ్స్ మాస్టర్స్ ఇన్ మేనేజ్‌మెంట్ గ్లోబల్ ర్యాంకింగ్స్-2014లో స్థానం పొంది తన ప్రత్యేకతను చాటుకుంది. తన ఫ్లాగ్‌షిప్ కోర్సు పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్(పీజీపీ) ద్వారా ప్రపంచవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే ర్యాంకింగ్‌సలో 6 స్థానాలను మెరుగుపర్చుకుంది. నాన్-యూరోపియన్ బి-స్కూల్స్‌లో టాప్ ర్యాంక్ పొందింది. ఫైనాన్షియల్ టైమ్స్ ర్యాంకింగ్స్ టాప్ 70లో కేవలం ఐదు నాన్- యూరోపియన్ బి-స్కూల్స్‌కు మాత్రమే స్థానం దక్కింది. భారత్ నుంచి ఐఐఎం-కలకత్తాతో పాటు ఐఐఎం-అహ్మదాబాద్‌కు మాత్రమే ర్యాంక్(16) లభించింది. దేశంలో ప్రముఖ బి-స్కూల్స్‌లో ఒకటైన ఐఐఎం-కలకత్తా ఇప్పటికే అసోసియేషన్ ఆఫ్ ఎంబీఏస్ (ఏఎం బీఏ), అసోసియేషన్ టూ అడ్వాన్స్ కాలేజీయేట్ స్కూల్స్ ఆఫ్ బిజినెస్ (ఏఏసీఎస్‌బీ) అక్రిడి టేషన్లను, సీఈఎంఎస్ సభ్యత్వాన్ని పొందింది.
భారత్‌లో పెరుగుతున్న ఉన్నత విద్యావంతులు
భారతదేశంలో ఉన్నత విద్యనభ్యసించేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహం లభిస్తుండడమే ఇందుకు కారణం. 2008లో ఉన్నత విద్యకోసం కళాశాల లు/విశ్వవిద్యాలయాల్లో చేరినవారి నిష్పత్తి 11 శాతం కాగా 2013 నాటికి అది 16 శాతానికి చేరింది. 2021 నాటికి ఈ నిష్పత్తి 21 శాతానికి చేరుతుందని అంచనా. ఫ్రాస్ట్ అండ్ సలివన్ పరి శోధనలో ఈ విషయం వెల్లడైంది. 2009లో విద్యారంగానికి ప్రభుత్వాలు భారీగా నిధులు కేటాయించాయి. దీనివల్ల కొత్తగా ఉన్నతవిద్యలో 2 మిలియన్ల సీట్లు అందుబాటు లోకి వచ్చాయి. అయితే, ప్రస్తుత అవసరాలు తీరాలంటే 10 మిలియన్ల సీట్లు కావాలని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో కొత్త సీట్లను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని సూచి స్తున్నారు. ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థల ఆర్థిక తోడ్పాటు, మౌలిక సదుపాయాలు మెరుగుపడు తుండడం, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వంటివాటితో భారత్‌లో ఉన్నత విద్యా రంగం అభివృద్ధి చెందుతున్నట్లు పరిశోధనలో తేలింది. విదేశీ విద్యార్థులు కూడా భారత్‌వైపు అధికంగా దృష్టి సారిస్తున్నట్లు స్పష్టమైంది.
జాబ్ స్కిల్స్
ఇంటర్వ్యూలో చిన్న అంశాలదే పెద్ద పాత్ర మౌఖిక పరీక్ష అంటే కేవలం ప్రశ్నలు, సమాధానాలే కాదు. ఇందులో ప్రతి చిన్న అంశం అభ్యర్థి భవితవ్యాన్ని నిర్దేశిస్తుంది. మీరు ధరించిన దుస్తులు, మీ నడవడిక, హావభావాలు, మీరు మాట్లాడే ప్రతి మాట, మీ ప్రతి కదలికను రిక్రూటర్ నిశితంగా పరిశీలిస్తారు. ఇంటర్వ్యూలో రిక్రూటర్ ఏయే అంశాలను గమనిస్తారో కచ్చితంగా ఎవరూ చెప్పలేరు. సంస్థను, ఉద్యోగాన్ని బట్టి ఇవి వేర్వేరుగా ఉండొచ్చు. కానీ, కొన్ని ఉమ్మడి అంశాలు మాత్రం ఉంటాయి. అభ్యర్థులు వాటి గురించి తెలుసుకుంటే అందుకనుగుణంగా సన్నద్ధం కావొచ్చు.
ఆలస్యం వద్దు: మౌఖిక పరీక్షకు ఆలస్యంగా హాజరైతే అవకాశాలు దెబ్బతింటాయి. అలాగని చాలాముందుగా చేరుకొని నిరీక్షించడం కూడా సమర్థనీయం కాదు. ఈ విషయంలో సమతూకం పాటించాలి. నిర్దేశిత సమయం కంటే 5-10 నిమిషాలు ముందుగా ఇంటర్వ్యూ కార్యాలయానికి చేరుకోవడం మంచిది. ఇలా చేరుకోవడానికి ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. రిక్రూటర్‌తో కరచాలనం ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? అనేదానిపై ముందుగా స్నేహితులతో కలిసి ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ఇంటర్వ్యూలో తడబాటుకు గురయ్యేందుకు ఆస్కారం ఉండదు.
వేషధారణ ప్రొఫెషనల్‌గా: శరీరానికి నప్పని దుస్తులు వేసుకుంటే మీకు ఇబ్బందిగా, చూసేవారికి ఎబ్బెట్టుగా ఉంటుంది. రిక్రూటర్ దృష్టిని ఆకర్షించి, మంచి మార్కులు కొట్టేయాలనుకుంటే ప్రొఫెషనల్‌గా కనిపించే దుస్తులనే ధరించండి. మీకు సౌకర్యవంతంగా ఉండేవాటినే ఎంచుకోండి. బిగుతైన బట్టలు వేసుకుంటే నడిచేందుకు, కూర్చునేందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే రంగురంగుల ఫ్యాషన్లను దూరం పెట్టండి. మహిళలు చీర ధరించడం ఉత్తమం. అలంకరణ అతిగా లేకుండా చూసుకోవాలి. ఇంటర్వ్యూ గదిలోకి అడుగుపెట్టేటప్పుడు చేతిలో అనవసరమైన సంచులు, వస్తువులు ఉండొద్దు. తక్కువ బరువుండే ఒక ఫైల్ మాత్రమే తీసుకెళ్లాలి. అందులో మీ రెజ్యూమె, ఇతర ధ్రువపత్రాలు ఉండాలి. కొందరు మాట్లాడుతుంటే చిత్రవిచిత్రమైన శబ్దాలు వారి నోటి నుంచి వెలువడుతుంటాయి. పదాల కోసం తడుముకుంటూ ఇలా శబ్దాలు చేస్తుంటారు. దీనివల్ల అభ్యర్థిపై రిక్రూటర్‌కు చిన్నచూపు ఏర్పడుతుంది. కనుక స్పష్టంగా మాట్లాడండి. సమాధానం వెంటనే తట్టకపోతే.. ప్రశ్న అర్థం కాలేదు, మరోసారి అడుగుతారా? అంటూ రిక్రూటర్‌ను అభ్యర్థించండి. వారు అడిగేలోగా సమాధానం మనసులో సిద్ధం చేసుకోండి.
సెల్‌ఫోన్‌తో జాగ్రత్త: ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు మీరు నోట్స్ రాసుకోండి. రిక్రూటర్ చెప్పే ముఖ్యమైన పాయింట్లను ఒక చిన్న నోట్‌బుక్‌లో రాయండి. దీనివల్ల మీరు సీరియస్ అభ్యర్థి అని, ఉద్యోగంపై మీకు నిజంగా ఆసక్తి ఉందని రిక్రూటర్ గుర్తిస్తారు. ఇంటర్వ్యూలో మీ సెల్‌ఫోన్ మోగితే ఏం జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాట్లాడుతున్నప్పుడు మధ్యలో ఫోన్ మోగడం రిక్రూటర్‌కు ఆగ్రహం కలిగిస్తుంది. కాబట్టి గదిలోకి అడుగుపెట్టడానికి ముందే ఫోన్‌ను సెలైంట్ మోడ్‌లో ఉంచండి. స్విచ్ఛాఫ్ చేయడం ఇంకా మంచిది.