స్టడీ అబ్రాడ్ | Study Abroad | Sakshi
Sakshi News home page

స్టడీ అబ్రాడ్

Published Fri, Sep 9 2016 3:40 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 PM

స్టడీ అబ్రాడ్

స్టడీ అబ్రాడ్

 ప్రముఖ దేశాలు, కోర్సుల వివరాలు..
  విదేశీ చదువు.. పరదేశీ కొలువు... కొన్నేళ్ల కిందట సగటు భారతీయ విద్యార్థికి తీరని కల. ప్రస్తుతం ప్రపంచీకరణ నేపథ్యంలో పెరిగిన ప్రజల జీవన ప్రమాణాలు, లభిస్తున్న ఆర్థిక వనరుల దృష్ట్యా అందరికీ విదేశీ విద్య అందుబాటులోకి వచ్చింది! దీంతో ఇష్టమైన కోర్సు చదవడానికి భారతీయ యువత రెక్కలు తొడిగిన పక్షిలా విదేశీ విద్య వైపు విహరిస్తూ, అక్కడే మంచి కొలువులు సాధిస్తోంది. అంతర్జాతీయ విద్యార్థుల అవసరాలకనుగుణంగా వివిధ దేశాల్లోని యూనివర్సిటీలు ప్రవేశ ప్రక్రియను సులభతరం చేస్తున్నాయి. ప్రధానంగా మన దేశం నుంచి ఇంజనీరింగ్, సెన్సైస్, బిజినెస్ మేనేజ్‌మెంట్, మెడిసిన్ కోర్సుల్లో ఉన్నతవిద్య కోసం విదేశాలకు వెళ్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ముఖ్యమైన దేశాల్లో అందుబాటులో ఉన్న కోర్సులు, వాటిని అందిస్తున్న ప్రముఖ యూనివర్సిటీలపై ఫోకస్..
 
 యునెటైడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా
 విదేశీ విద్య అనగానే ఎక్కువ మంది యూఎస్‌ఏ వైపు చూస్తారు. గత మూడు, నాలుగు దశాబ్దాల నుంచి భారత్, చైనా, దక్షిణ కొరియా, దక్షిణాసియాలకు చెందిన ఎక్కువ శాతం విద్యార్థులు ఉన్నతవిద్య కోసం అమెరికాకు వెళ్తున్నారు. అమెరికాలో హార్వర్డ్, స్టాన్‌ఫోర్డ్, ప్రిన్స్‌టన్, ఎంఐటీ వంటి ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలతోపాటు దాదాపు 4000 యూనివర్సిటీలు ఉన్నాయి. ప్రపంచం నలుమూలల నుంచి అమెరికాకు ఏటా 9 లక్షల మంది విద్యార్థులు వెళ్తున్నట్లు అంచనా. అమెరికా యూనివర్సిటీల్లో బోధనా విధానం, ఆకర్షణీయమైన ఉపకార వేతనాలు, ప్రోత్సాహకాలు, కోర్సు పూర్తయిన తర్వాత మంచి ప్యాకేజీతో ఉద్యోగ అవకాశాలు లభించడానికి అవకాశం ఉండటం కూడా ప్రపంచంలో ఎక్కువ మంది అమెరికా వెళ్లడానికి ప్రధాన కారణం.  ముఖ్యమైన కోర్సులు:  బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, సోషల్ సెన్సైస్, ఫిజికల్ అండ్ లైఫ్ సెన్సైస్.
 
  ప్రముఖ యూనివర్సిటీలు: మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హార్వర్డ్ యూనివర్సిటీ, స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ, ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, కాలిఫోర్నియా యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీ, మిచిగాన్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ షికాగో, కార్నెగీ మిలన్ యూనివర్సిటీ.
 
  యూకే
 ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలకు నెలవైన యూకే ప్రపంచవ్యాప్తంగా విద్యార్థులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. యూకేలో ఉన్నతవిద్య కోసం ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 5 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటుండగా వీరిలో భారత్ నుంచి దాదాపు 25 వేల మంది విద్యార్థులు ఉంటున్నట్లు అంచనా. సాధారణంగా మాస్టర్స్ డిగ్రీ వ్యవధి రెండేళ్లు కాగా అధిక శాతం యూనివర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌లు ఫాస్ట్‌ట్రాక్ కోర్సుల పేరుతో ఏడాది వ్యవధిలోనే పీజీ కోర్సులను అందిస్తున్నాయి. అంతర్జాతీయ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉండటం ఇక్కడికి వెళ్లే విద్యార్థుల సంఖ్య పెరగడానికి కారణం. బ్రెగ్జిట్ ప్రభావంతో అకడమిక్ ఫీజులు కూడా తగ్గే అవకాశం ఉన్నందువల్ల విద్యార్థుల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉంది.
  ముఖ్యమైన కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, సోషల్ సెన్సైస్, ఫిజికల్ అండ్ లైఫ్ సెన్సైస్, ఫైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్.
 
  ప్రముఖ యూనివర్సిటీలు: యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్, ఇంపీరియల్ కాలేజ్-లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్‌ఫర్డ్, కింగ్స్ కాలేజ్ లండన్, యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ బ్రిస్టల్, యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్, యూనివర్సిటీ ఆఫ్ గ్లాస్గో, యూనివర్సిటా ఆఫ్ వార్విక్.
 
 ఆస్ట్రేలియా
 అమెరికా, యూకేల తర్వాత భారతీయ విద్యార్థులు అధిక ప్రాధాన్యం ఇస్తున్న దేశం ఆస్ట్రేలియా. వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్, నాణ్యమైన విద్యకు కేరాఫ్ ఈ దేశం. ఉన్నత విద్య, స్కాలర్‌షిప్‌లకు కూడా అక్కడి ప్రభుత్వం చాలా ప్రాముఖ్యం ఇస్తోంది. స్టూడెంట్ వీసా నిబంధనలను సరళీకృతం చేయడం, పోస్ట్ స్టడీ వర్క్ పేరుతో అక్కడే ఉద్యోగం చేసే అవకాశం కల్పించడం విద్యార్థులు ఆస్ట్రేలియా వైపు వెళ్లడానికి ప్రధాన కారణం. వివిధ దేశాల నుంచి ఆస్ట్రేలియాకు ఏటా దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు వెళుతున్నట్లు అంచనా.
 
  ముఖ్యమైన కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, హెల్త్ ప్రొఫెషన్స్, ఫుడ్, హాస్పిటాలిటీ అండ్ పర్సనల్ సర్వీసెస్.
 
  ప్రముఖ యూనివర్సిటీలు:
  ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్
  యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్‌లాండ్, యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్,
  మొనాష్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వెస్టర్న్ ఆస్ట్రేలియా, యూనివర్సిటీ ఆఫ్ వోలన్‌గాంగ్, యూనివర్సిటీ ఆఫ్ అడిలైడ్, విక్టోరియా యూనివర్సిటీ.
 
 కెనడా
 ప్రపంచం నలుమూలల నుంచి కెనడాకు ఏటా సుమారు 3 లక్షల మంది విద్యార్థులు వెళ్తున్నట్లు అంచనా. ఈ దేశ  యూనివర్సిటీల నుంచి పొందిన డిగ్రీకి యూఎస్, ఆస్ట్రేలియా దేశాల డిగ్రీలతో సమ ప్రాధాన్యం ఉంటుంది. అక్కడ తక్కువ ఖర్చుతోనే నాణ్యమైన విద్య లభిస్తుంది. కెనడా విదేశీ విదార్థులకు స్టడీ వీసాతోపాటు వర్క్‌పర్మిట్ వీసా కూడా మంజూరు చేస్తోంది. చదువుకుంటూనే సొంత ఖర్చుల కోసం విద్యార్థులు వారానికి 20 గంటల పాటు పార్ట్‌టైం జాబ్ చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత కూడా రెండేళ్ల వరకు పనిచేసుకునే వెసులుబాటు కల్పించింది అక్కడి ప్రభుత్వం. పని అనుభవం ఉన్న ఉన్నత విద్యావంతులు పర్మినెంట్ రెసిడెన్సీకి దరఖాస్తు చేసుకునే సౌకర్యం కూడా ఉంది. ముఖ్యమైన కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సెన్సైస్, లైఫ్ సెన్సైస్, హోటల్ మేనేజ్‌మెంట్, జర్నలిజం, లిబరల్ ఆర్ట్స్.
 
  ప్రముఖ యూనివర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ టొరొంటో, యూనివర్సిటీ ఆఫ్ బ్రిటిష్ కొలంబియా, మెక్‌గిల్ యూనివర్సిటీ, మెక్ మాస్టర్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ మాంట్రియల్, యూనివర్సిటీ ఆఫ్ అల్‌బెర్టా, యూనివర్సిటీ ఆఫ్ విక్టోరియా, యూనివర్సిటీ ఆఫ్ ఒటావా, యూనివర్సిటీ ఆఫ్ కాల్గరీ.
 
 న్యూజిలాండ్
 గత ఐదేళ్లలో ఉన్నత విద్య కోసం న్యూజిలాండ్ వెళ్లే భారతీయల సంఖ్య దాదాపు 400 శాతం పెరిగింది. అక్కడ ఉన్న విదేశీ విద్యార్థుల్లో భారతీయులే అధికం. ఇతర దేశాలతో పోల్చితే తక్కువ ఖర్చుతోనే ఉన్నతవిద్యను పూర్తిచేయొచ్చు. కోర్సు పూర్తయ్యాక స్టూడెంట్ వీసాతోనే ఏడాది కాలపరిమితితో చాలా విద్యాసంస్థలు ‘స్టూడెంట్ జాబ్ సెర్చ్’ అనే సర్వీస్‌ను అందిస్తున్నాయి. పూర్తిచేసిన కోర్సుకు సంబంధించిన ఉద్యోగం సాధిస్తే న్యూజిలాండ్ పర్మినెంట్ రెసిడెన్సీ (పీఆర్) కూడా సులువుగా లభిస్తుంది.
 
  పీఆర్ వచ్చిన తర్వాత ఇంకా ఉన్నతవిద్య అభ్యసించాలనుకునేవారికి అక్కడి ప్రభుత్వం తిరిగి చెల్లించే నిబంధనలతో ఎడ్యుకేషన్ లోన్ సదుపాయం కూడా కల్పిస్తోంది. ముఖ్యమైన కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, సోషల్ సెన్సైస్, ఫిజికల్ అండ్ లైఫ్ సెన్సైస్, మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్. ప్రముఖ యూనివర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ ఆక్లాండ్, యూనివర్సిటీ ఆఫ్ ఒటాగో, యూనివర్సిటీ ఆఫ్ కాంటెర్‌బరీ, విక్టోరియా యూనివర్సిటీ ఆఫ్ వెల్లింగ్టన్, మాసే యూనివర్సిటీ, వ్యకాటో యూనివర్సిటీ, లింకన్ యూనివర్సిటీ, ఆక్లాండ్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ.
 
 జర్మనీ
 ఉచిత లేదా అతి స్వల్ప ఫీజులతో ఉన్నతవిద్యను అందిస్తున్న దేశం జర్మనీ. ఆ దేశ ప్రభుత్వ విధానాల ప్రకారం చాలా యూనివర్సిటీలు ఫీజులు లేకుండానే లేదా సెమిస్టర్‌కు 500 యూరోల స్వల్ప ఫీజుతో ప్రవేశం కల్పిస్తున్నాయి. ఎలాంటి ఫీజు వసూలు చేయని ఇన్‌స్టిట్యూట్‌లలో చేరిన విద్యార్థులు సెమిస్టర్ కంట్రిబ్యూషన్ పేరుతో ప్రతి సెమిస్టర్‌కు 150 యూరోల నుంచి 250 యూరోల వరకు చెల్లించాల్సి ఉంటుంది. జర్మనీ యూనివర్సిటీల్లో దాదాపు 12 శాతానికి పైగా విదేశీ విద్యార్థులే ఉన్నారు. ఎలాంటి కాలపరిమితి లేకుండా వర్క్ వీసా సదుపాయం అందుబాటులో ఉండటం.. కోర్సు పూర్తయ్యాక 18 నెలలపాటు జర్మనీలో ఉండి ఉద్యోగాన్వేషణ సాగించేందుకు అవకాశం కల్పించడం జర్మనీకి సంబంధించిన ప్రత్యేకాంశాలు.  ముఖ్యమైన కోర్సులు: సెన్సైస్, ఇంజనీరింగ్, బిజినెస్ మేనేజ్‌మెంట్, హ్యుమానిటీస్, లా, ఎకనామిక్స్, సోషల్ సెన్సైస్. ప్రముఖ యూనివర్సిటీలు: ఆర్‌డబ్ల్యూటీహెచ్ ఆచెన్, టీయూ మునిచ్, యూనివర్సిటీ ఆఫ్ డిస్‌బర్గ్ ఎస్సెన్, టీయూ చెమిట్చ్, టీయూ హంబర్గ్-హర్‌బర్గ్, టీయూ డర్మ్‌స్టాట్, యూనివర్సిటీ ఆఫ్ బాన్, యూనివర్సిటీ ఆఫ్ స్టట్‌గార్ట్, టీయూ కైసర్స్‌లాటెర్న్, యూనివర్సిటీ ఆఫ్ డార్ట్‌మండ్.
 
 చైనా
 అంతర్జాతీయంగా వైద్యవిద్యకు పేరొందిన దేశం చైనా. గతంలో కేవలం చైనీస్ భాషలోనే బోధించే ఇన్‌స్టిట్యూట్‌లు ప్రస్తుతం ఇంగ్లిష్‌లోనూ బోధిస్తుండటం, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యం ఇవ్వడం  లాంటి అంశాలతో చైనా అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షిస్తోంది. వైద్య విద్యతోపాటు ఇతర ప్రొఫెషనల్ కోర్సులకు కూడా చైనాలో మంచి డిమాండ్ ఉంది. ముఖ్యంగా చైనాలోని చాలా మెడికల్ కాలేజీలు ప్రవేశ పరీక్ష కూడా నిర్వహించకుండా అడ్మిషన్లను సులభతరం చేయడంతో విద్యార్థులు ఎక్కువగా ఆ దేశానికి వెళ్తున్నారు. ముఖ్యమైన కోర్సులు: మెడిసిన్, హ్యుమానిటీస్, బిజినెస్ మేనేజ్‌మెంట్, ఇంజనీరింగ్, సోషల్ సెన్సైస్. ప్రముఖ యూనివర్సిటీలు: పెకింగ్ యూనివర్సిటీ, టి సింఘు్యవా యూనివర్సిటీ, ఫుడాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ చైనా, నాన్‌జింగ్ యూనివర్సిటీ, ఝెజియాంగ్ యూనివర్సిటీ, షాంఘై జియోటాంగ్ యూనివర్సిటీ, సన్- యెట్- సెన్ యూనివర్సిటీ.
 
 సింగపూర్
 నాణ్యమైన విద్యకు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన దేశం సింగపూర్. ముఖ్యంగా మేనేజ్‌మెంట్ కోర్సుల విషయంలో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి పొందింది. సింగపూర్ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్.. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చైనాలోని ఝెజియాంగ్ యూనివర్సిటీలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా ఇక్కడ చేరిన విద్యార్థులకు యు.ఎస్, చైనా సర్టిఫికెట్లు పొందే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. భారతీయ సంస్కృతికి దగ్గరగా ఉండటం, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువగా ఉండటం మన దేశ విద్యార్థులను సింగపూర్ వైపు దృష్టి సారించేలా చేస్తున్నాయి.
  ముఖ్యమైన కోర్సులు: బిజినెస్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్, ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, లా. టాప్ యూనివర్సిటీస్: నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, సింగపూర్ మేనేజ్‌మెంట్ యూనివర్సిటీ, నాన్‌యాంగ్ టెక్నలా జికల్ యూనివర్సిటీ, కార్నెల్-నాన్‌యెంగ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ అండ్ మేనేజ్‌మెంట్.
 
 విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే
 విద్యార్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సినవి..

  జీఆర్‌ఈ, టోఫెల్, పీటీఈ, జీమ్యాట్, ఐఈఎల్‌టీఎస్, శాట్ లాంటి పరీక్షల్లో స్కోరు ఉండాలి.  దరఖాస్తుతోపాటు కవరింగ్ లెటర్  అప్లికేషన్ ఫీజు  స్టేట్‌మెంట్ ఆఫ్ పర్పస్  లెటర్ ఆఫ్ రికమండేషన్  సర్టిఫికెట్లు  ఫైనాన్షియల్ స్టేట్‌మెంట్స్ పాస్‌పోర్ట్  స్పాన్సర్ లెటర్స్, స్పాన్సరర్స్ ఆదాయపు పన్ను స్టేట్‌మెంట్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement