స్టడీ అబ్రాడ్..
విదేశాల్లో చదువుకొని, ఉన్నతవిద్యా పట్టా పొంది సుస్థిర కెరీర్‌ను సాధించాలని ఎంతో మంది లక్ష్యంగా నిర్దేశించుకుంటారు. అయితే చాలా మంది ఆర్థిక సమస్యల కారణంగా ‘స్టడీ అబ్రాడ్’కు దూరమవుతారు. కానీ, ఓర్పూ, నేర్పూ ఉంటే విదేశాల్లో చదువుకుంటూ, ఖర్చులకు అవసరమైన డబ్బును పార్ట్‌టైమ్ ఉద్యోగాల ద్వారా సమకూర్చుకోవచ్చు. ఈ క్రమంలో పార్ట్‌టైమ్ కొలువును ఎలా సంపాదించాలి? ఏ దేశంలో ఎన్ని గంటలు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకునే వెసులుబాటు ఉంది? వంటి అంశాలపై ప్రత్యేక కథనం..
విదేశాల్లో పార్ట్‌టైమ్ ఉద్యోగానికి దరఖాస్తు చేసే ముందు ఆర్థిక ప్రయోజనాలతోపాటు మరెన్నో అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా అది భవిష్యత్‌లో ఉద్యోగపరంగా ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవాలి. ఆ ఉద్యోగం వల్ల భాషా నైపుణ్యాలు మెరుగుపడతాయా? కోర్సు పూర్తయిన వెంటనే ఉద్యోగ సాధనకు ఉపయోగపడుతుందా? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఆ తర్వాత పార్ట్‌టైమ్ వర్కర్‌గా అభ్యర్థికి ఉన్న హక్కులు, పాటించాల్సిన నియమ, నిబంధనలు వంటి అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి.
ఏ దేశంలో? ఎన్ని గంటలు?
ఆస్ట్రేలియాలో యూనివర్సిటీ పనిదినాల్లో ప్రతి రెండు వారాలకు 40 గంటలు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకోవచ్చు. సెలవుల్లో ఎన్ని గంటలైనా చేయొచ్చు.
కెనడాలో ఏదైనా కోర్సులో తొలి ఆరు నెలలు పూర్తిచేసినవారిని మాత్రమే పార్ట్‌టైమ్ వర్క్ చేసేందుకు అనుమతిస్తారు. క్యాంపస్‌లో వారానికి 20 గంటలు, సెమిస్టర్ బ్రేక్స్‌లో ఫుల్‌టైమ్ పనిచేసుకోవచ్చు.
అమెరికాలో ఇక్కడ అంతర్జాతీయ విద్యార్థులకు కఠిన నిబంధనలను అమలు చేస్తున్నారు. అండర్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ పార్ట్‌టైమ్ జాబ్ చేసేందుకు ఆప్షన్లు ఉండవు. రెండేళ్ల వ్యవధి గల కొన్ని ఉన్నత విద్య కోర్సుల విద్యార్థులకు ఫస్టియర్‌లో ఆన్ క్యాంపస్ వర్క్‌కు అనుమతి ఇస్తారు. సెకండియర్‌లో సంబంధిత అధికారి అనుమతి మేరకు ఆఫ్ క్యాంపస్ వర్క్ చేసుకోవచ్చు. అయితే వారానికి 20 గంటలు మాత్రమే పనిచేయాలి.
బ్రిటన్‌లో సెమిస్టర్ టైమ్‌లో వారానికి సగటున 20 గంటలు, సెమిస్టర్ బ్రేక్స్‌లో ఫుల్‌టైమ్ పనిచేయొచ్చు.
సింగపూర్‌లో వారానికి 16 గంటలు పార్ట్‌టైమ్ వర్క్ చేసుకోవచ్చు.
మలేషియాలో ఏడు రోజులకు మించి సెలవులు ప్రకటించినప్పుడు వారానికి 20 గంటలు పార్ట్‌టైమ్ జాబ్ చేసుకోవచ్చు.
నిబంధనలు-హక్కులు
విద్యార్థులు స్టూడెంట్ వీసాతో పార్ట్‌టైమ్ వర్క్ చేయడానికి అనుమతించే నియమ నిబంధనలు, పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. ఇవి ఒక్కో దేశంలో ఒక్కో రకంగా ఉంటాయి.
పనిచేసే చోట ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడని ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు కనీస వేతనం, బ్రేక్స్, విశ్రాంతి సమయం, వ్యక్తిగత భద్రత.
ప్రయత్నాలు ఎప్పుడు ప్రారంభించాలి?
కొత్త దేశంలో, కొత్త క్యాంపస్ వాతావరణంలో ఇమిడేందుకు, కొంత సమయం కేటాయించాలి. వర్సిటీలో చేరిన 3, 4 నెలల తర్వాతపార్ట్‌టైమ్ జాబ్ ప్రయత్నాలు చేయడం మంచిది. ఈలోపు కోర్సు సిలబస్‌పై పూర్తిస్థాయిలో అవగాహన ఏర్పరచుకోవాలి. పార్ట్‌టైమ్ జాబ్ ప్రయత్నంలో భాగంగా రెజ్యూమె ఎంత బాగా ఉంటే ఉద్యోగం వచ్చే అవకాశం అంత బాగుంటుంది. కరిక్యులం విటేలో అనవసర వివరాలను పొందుపరచొద్దు. విద్యార్హతలు, నైపుణ్యాలు, పూర్వానుభవం గురించి తెలపాలి. భవిష్యత్ లక్ష్యాలను పేర్కొనాలి. వీటన్నింటినీ చక్కటి భాషలో సూటిగా, స్పష్టంగా పొందుపరచాలి.
పార్ట్‌టైమ్ జాబ్ ఎక్కడ చేయాలి?
విద్యార్థులు ఉన్న ప్రాంతంలోనే పార్ట్‌టైమ్ జాబ్‌ను వెతుక్కోవడం మంచిది. క్యాంపస్‌లో ఉండేవారు ఆన్ క్యాంపస్ అవకాశాల కోసం ప్రయత్నించాలి. ఉదాహరణకు కంప్యూటర్ సెంటర్లు, కేఫ్‌టీరియాలు. అయితే అధిక శాతం మంది వీటి కోసమే ప్రయత్నించడం వల్ల పోటీ ఎక్కువగా ఉంటుంది. అమెరికా లాంటి దేశాల్లో అయితే ఇంటర్నేషనల్ స్టూడెంట్స్.. ఆన్ క్యాంపస్ మినహా వేరేచోట పార్ట్‌టైమ్ వర్క్ చేయడానికి వీల్లేదు. కేఫ్‌లు, రెస్టారెంట్లు, బార్లు కూడా పార్ట్‌టైమ్ ఉద్యోగానికి బెస్ట్. నైపుణ్యాలను బట్టి బార్ స్టాఫ్‌గా, వెయిటర్‌గా చేరొచ్చు. ఈ రెండూ దొరక్కపోతే కిచెన్‌లో పనిచేసేందుకైనా ప్రయత్నించొచ్చు.
రెస్టారెంట్లలో పని అధిక శాతం సాయంత్రం వేళల్లో ఉంటుంది. బార్లలో కూడా నైట్ షిఫ్టుల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. దాంతో మార్నింగ్ క్లాస్‌లకు వెళ్లడం కష్టమవుతుంది. ఫలితంగా మొత్తం స్టడీ సైకిలే దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల సరైన ఉద్యోగాన్ని ఎంపిక చేసుకోవాలి. కమ్యూనికేషన్ స్కిల్స్‌పై పట్టుంటే పార్ట్‌టైమ్ జాబ్ కోసం కాల్ సెంటర్లలోనూ ప్రయత్నించొచ్చు. ఇందులోనైతే వేతనాలు కూడా రీజనబుల్‌గా ఉంటాయి. శారీరక శ్రమ తక్కువ గా ఉండటమే కాకుండా ఆఫీస్ వాతావరణంలో పనిచేస్తున్న భావన కూడా కలుగుతుంది.
ఇంటర్న్‌షిప్ కోసం
కోర్సు, స్పెషలైజేషన్‌కు తగిన ఇంటర్న్‌షిప్ కోసం కూడా ప్రయత్నించొచ్చు. ఇంటర్న్‌గా పనిచేస్తే భవిష్యత్‌లో మంచి అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. వర్క్‌ప్లేస్‌లో నిపుణుల పనితీరును పరిశీలిస్తూ వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఆయా సంస్థలే రెగ్యులర్ ఉద్యోగం కల్పించే అవకాశం కూడా ఉంది. వ్యవసాయ రంగంలోనూ ప్రయత్నించొచ్చు. అడ్మినిస్ట్రేషన్, ట్యుటోరియల్, టూరిజం, రిటైల్ (క్లాత్‌స్టోర్లు, డిపార్ట్‌మెంట్ స్టోర్లు, సూపర్ మార్కెట్లు)పైనా దృష్టిసారించవచ్చు. అందిపుచ్చుకునే చొరవ ఉండాలేగానీ అవకాశాలకు కొదవలేదు.
సోషల్ నెట్‌వర్కింగ్
ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో వివరాలు పొందుపరిచేటప్పుడు ‘పార్ట్‌టైమ్ జాబ్ కోసం ప్రయత్నిస్తున్నాను’ అని పేర్కొనాలి. సరైన ‘వేకెన్సీ గ్రూప్స్’లో సభ్యులుగా చేరడం, యూనివర్సిటీ పేజీలను ‘లైక్’ చేస్తుండటం వంటి వాటివల్ల అవకాశాలు మెరుగవుతాయి. సంప్రదాయ ప్రయత్నాలతో పోల్చితే సోషల్ మీడియా సైట్లలో జాబ్ సెర్చింగ్ ప్రక్రియ పది రెట్లు వేగంగా జరుగుతుంది.
యూనివర్సిటీ కెరీర్ టీమ్‌లను సంప్రదించి ఆన్ క్యాంపస్, ఆఫ్ క్యాంపస్ పార్ట్‌టైమ్ జాబ్ ఆప్షన్ల గురించి తెలుసుకోవాలి. విద్యార్థులకు ఉద్యోగాలు చూపించడమే లక్ష్యంగా ఆయా బృందాలు పనిచేస్తాయి. వార్తాపత్రికల్లోని జాబ్ లిస్టింగ్‌లను రోజూ చెక్ చేసుకోవాలి. స్టూడెంట్ జాబ్స్, ఈ4ఎస్ తదితర పాపులర్ పార్ట్‌టైమ్ జాబ్ వెబ్‌సైట్లను బ్రౌజ్ చేస్తుండాలి.
వేతనాలు
పార్ట్‌టైమ్ జాబ్‌కి లభించే వేతనం వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. దేశం, ఉద్యోగ స్వరూపం, పనిచేసే గంటలు తదితర అంశాల ఆధారంగా వేతనాలు ఉంటాయి.
ఆర్థిక వెసులుబాటు కోసం తాత్కాలికంగా పార్ట్‌టైమ్ జాబ్ చేసినా.. అంతిమంగా విద్యార్థుల దృష్టి స్టడీపైనే ఉండాలి. స్టడీని, వర్క్‌ను సమన్వయం చేసుకుంటూ లక్ష్యాలను సాధించాలి.