3,50,000.. భారత్ నుంచి గతేడాది (2015-16) అంతర్జాతీయంగా పలు దేశాలకు వెళ్లిన విద్యార్థుల సంఖ్య! 3,60,000.. రానున్న సంవత్సరం (2017) చివరికి భారత్ నుంచి విదేశాలకు వెళ్లనున్న విద్యార్థుల సంఖ్య అని అంచనా!!ప్రస్తుతం ఈ విదేశీ విద్య ఔత్సాహికులను పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆందోళనకు గురి చేస్తోంది. నోట్ల రద్దు సమయంలో పేర్కొన్న పన్ను నిబంధనలు, ఆర్థిక లావాదేవీలపై పరిమితులు విద్యార్థుల స్టడీ అబ్రాడ్ ఆశలపై ఒకరకంగా నీళ్లు చల్లాయంటున్నారు నిపుణులు. విద్యార్థుల విదేశీ విద్య ప్రయత్నాలపై నోట్ల రద్దు ప్రభావం ఎలా ఉంటుందో చూద్దాం..
బ్యాంకు బ్యాలెన్స్ తప్పనిసరి
విదేశీ యూనివర్సిటీలకు చెల్లించాల్సిన ఫీజులు వేల డాలర్లలో ఉంటున్నాయి. వాటిని మన కరెన్సీలోకి లెక్కిస్తే రూ.పది లక్షల నుంచి రూ.15 లక్షల మధ్యలో ఉంటుంది. దీనికి అదనంగా కోర్సు సమయంలో నివాస, జీవన వ్యయా లను భరించే స్థోమత అభ్యర్థికి ఉందని తెలిపే బ్యాంక్ బ్యాలెన్స్‌ను తప్పనిసరిగా చూపాలి. అమెరికా, బ్రిటన్ నుంచి ఐర్లాండ్, సింగపూర్ వంటి అప్‌కమింగ్ డెస్టినేషన్స్‌గా మారుతున్న దేశాల వరకు.. అన్ని దేశాల్లోని వర్సిటీలు, ఇమిగ్రేషన్ శాఖలు ఈ నిబంధనలను విధిస్తున్నాయి. ఇప్పుడు దేశంలో పెద్ద నోట్ల రద్దు తర్వాత డిపాజిట్లు - పరిమితులు, పరిమితి దాటిన డిపాజిట్లు, బ్యాలెన్స్‌లపై ఆర్థిక శాఖ నిబంధనలు కఠినతరం చేసింది. అంటే... ఒకవైపు విదేశీ విద్యకు వెళ్లాలంటే... వర్సిటీలకు లక్షల్లో ఫీజులు చెల్లించాలి, లక్షల్లో బ్యాంక్ బ్యాలెన్‌స చూపాలి. మరోవైపు రూ.2.5 లక్షల పరిమితి దాటిన డిపాజిట్లపై నిఘా ఉంటుందని మన ఆర్థిక శాఖ ప్రకటించడం విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
స్ప్రింగ్ సెషన్.. హైటెన్షన్
ఆయా దేశాల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రారంభమయ్యే స్ప్రింగ్ సెషన్‌లో అడ్మిషన్లు పొందిన విద్యార్థులను పెద్ద నోట్ల రద్దు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. ఇప్పటికే ఫీజులు, ఇతర రుసుములు చెల్లించినా.. భవిష్యత్తులో అయ్యే వ్యయాలకు సరిపడా కరెన్సీ చేతిలో లేకపోవడం సమస్యగా మారింది. విమాన ప్రయాణ ఖర్చులు మొదలు తమ గమ్యస్థానం చేరుకున్నాక అయ్యే వ్యయాలను సమీకరించుకునేందుకు, సమీకరించుకున్నా.. వాటికి సంబంధించి చూపాల్సిన సోర్సెస్ ఆఫ్ ఇన్‌కం, వాటిపై ట్యాక్స్ గురించి ఆందోళన చెందుతున్నారు.
ఫాల్ సెషన్.. అప్లికేషన్ నుంచే...
సెప్టెంబర్/అక్టోబర్ నుంచి ఫాల్ సెషన్ పేరుతో ప్రారంభమయ్యే అడ్మిషన్‌సకు అప్లికేషన్ దశ నుంచే కరెన్సీ రద్దు ప్రతికూలంగా మారింది. దరఖాస్తు, స్టాండర్డ్ టెస్ట్స్ రిజిస్ట్రేషన్ ఫీజులు అన్నీ కలిపితే మన కరెన్సీలో రూ.లక్ష వరకు వెచ్చించాల్సి ఉంటుంది. అయితే రద్దు చేసిన రూ.500, రూ.వెయ్యి నోట్లను తమ బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసినా.. వాటికి సరిపడా కొత్త కరెన్సీ లభించడం లేదు. అంతేకాకుండా విత్‌డ్రా మొత్తాలపైనా ఆంక్షలు అమలవుతున్నాయి. అప్లికేషన్ ఫీజులు, స్టాండర్డ్ టెస్ట్ స్కోర్స్‌కు సంబంధించిన ఫీజులు ఆన్‌లైన్‌లో చెల్లించినా.. టెస్ట్స్ సెంటర్స్‌కు చేరుకొని పరీక్ష రాసేందుకు అయ్యే ప్రయాణ చార్జీలకు సరిపడా కొత్త నగదు కూడా లభించడంలేదంటున్నారు.
ఫారెన్ ఎక్స్ఛేంజ్ ప్రభావం
ఇప్పటికే ఆయా దేశాల్లో అడుగు పెట్టి కోర్సులు అభ్యసిస్తున్నవారిని సైతం కరెన్సీ రద్దు ప్రభావం వెంటాడుతోంది. కొత్త నోట్లు సరిపడా లభించకపోవడంతో.. అధిక శాతం మంది ఆధారపడుతున్న మనీ ఫారెన్ ఎక్స్ఛేంజ్ విధానం కూడా కుంటుపడింది. ఇప్పటివరకు చాలామంది తల్లిదండ్రులు విదేశాల్లోని తమ పిల్లలకు నగదు పంపేందుకు ఫారెన్ ఎక్స్ఛేంజ్ విధానం వెసులుబాటుగా ఉండేది. కానీ ఇప్పుడు సదరు ఫారెన్ ఎక్స్ఛేంజ్ ఏజెన్సీలు పాత నోట్లను అంగీకరించకపోవడం సమస్యగా మారింది.
థర్డ్ పార్టీ హామీ దొరక్క
విదేశీ విద్యకు వెళుతున్న అభ్యర్థులు ఆర్థిక నిధుల రుజువులు, ధ్రువీకరణలకు సంబంధించి థర్డ్‌పార్టీ(తల్లిదండ్రులు కాకుండా ఇతరులు) హామీ పొందేవారు. కానీ నోట్ల రద్దు నేపథ్యంలో థర్డ్‌పార్టీ హామీ ఇచ్చే వారు సైతం వెనుకంజ వేస్తున్నారు. తమ పిల్లల చదువుకు సంబంధించి నిధులు చూపించే స్థోమత ఉన్న తల్లిదండ్రుల్లో సైతం కొత్త నిబంధనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తమ పిల్లల అకౌంట్లలో నగదు జమ చేయడం, దానికి సోర్స్ ఆఫ్ ఇన్‌కం చూపించాల్సి రావడం, లేదంటే భారీ ఎత్తున పన్నులు ఎదుర్కోవాల్సి వస్తుందని మదనపడుతున్నారు.
‘ప్రైవేట్’ రుణాలు దొరకని పరిస్థితి
విదేశాల్లో ఉన్నత చదువులకు అయ్యే వ్యయాల కోసం ఔత్సాహికులు ఎక్కువగా ఆధారపడేది ప్రైవేట్ రుణాలపైనే. అయితే నోట్ల రద్దుతో చెల్లింపులన్నీ చెక్కులు లేదా నగదు రూపంలో ఉండాలనే నిబంధన, దానికి అనుబంధంగా రుణం ఇచ్చిన వ్యక్తికి ఆ మొత్తం ఎలా లభించిందో నిరూపించే సోర్స్ ఆఫ్ ఇన్‌కంను కూడా చూపాల్సి ఉంటుంది. దాంతో ప్రైవేట్ రుణ దాతలు ఇప్పుడు విదేశీ విద్య ఔత్సాహికులకు రుణాలు ఇచ్చేందుకు వెనుకంజ వేస్తున్నారు.
పెరుగుతున్న డాలర్ విలువ
ఇవన్నీ ఒక ఎత్తయితే.. మన రూపాయితో పోల్చితే డాలర్ విలువ పెరుగుతుండటం విద్యార్థులను మరింత ఆందోళనకు గురి చేస్తోంది. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో గత నెలరోజులుగా ఒక డాలర్ మారకం విలువ రూ.67 నుంచి రూ. 69 వరకు కూడా వెళ్ల్లింది. దీని వల్ల ఫీజులకు ఎక్కువ రూపాయలు చెల్లించాల్సి రావడంతోపాటు చూపించాల్సిన ఆర్థిక వనరుల మొత్తాలు పెరుగుతాయి. ఇది విదేశీ విద్య ఔత్సాహికులను నిరాశకు గురిచేస్తుంది. స్టడీ అబ్రాడ్ విద్యార్థులకు ఆర్థిక నిధుల పరంగా ఆయా యూనివర్సిటీలు అమలు చేస్తున్న నిబంధనలను పరిగణనలోకి తీసుకుని.. వారికి ఉపశమనం కలిగించేలా ఆర్థిక శాఖ ప్రత్యేక మార్గదర్శకాలు జారీ చేస్తే బాగుంటుందని ఓ ప్రముఖ బ్యాంక్‌కు చెందిన జీఎం తెలిపారు. ఎడ్యుకేషన్ లోన్ ద్వారా ఆర్థిక వనరులను సమీకరించుకుని వాటిని బ్యాంక్ అకౌంట్‌లో జమచేసి హామీగా చూపించుకుంటే ఎలాంటి ఇబ్బందులూ ఉండవని.. ఇతర మార్గాల ద్వారా సమీకరించుకునే వారిపై నిఘా ఉంటుందని ఆయన అంటున్నారు.
సోర్స్ ఆఫ్ ఇన్‌కం తప్పనిసరి
ప్రస్తుత పరిస్థితుల్లో రూ.2.5 లక్షలకు మించి నగదు లావాదేవీలు నిర్వహించే ప్రతి ఒక్కరూ సోర్స్ ఆఫ్ ఇన్‌కం చూపించాల్సిందే. అది ఆదాయపు పన్ను శాఖ నిబంధనలకు సరితూగేలా ఉంటే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. లేకపోతే నిబంధనల ప్రకారం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. స్టడీ అబ్రాబ్ ఔత్సాహికుల విషయంలో ఇప్పటి వరకు ప్రత్యేక మార్గదర్శకాలు ఏమీ లేవు. కానీ వీరికి కూడా ఈ నిబంధనలు వర్తిస్తాయి.
- కె.రఘురాం, ఐటీఓ, హైదరాబాద్