గొప్ప టీమ్ లీడర్ లక్షణాలేంటి?! | What are the qualities in great team leader ? | Sakshi
Sakshi News home page

గొప్ప టీమ్ లీడర్ లక్షణాలేంటి?!

Published Sat, Sep 13 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM

గొప్ప టీమ్ లీడర్ లక్షణాలేంటి?!

గొప్ప టీమ్ లీడర్ లక్షణాలేంటి?!

కార్యాలయంలో ఒక బృందానికి నాయకత్వం వహించడం సులభం కాదు. విజయవంతమైన నాయకుడిగా సహచరులను ముందుకు నడిపిస్తే అనుకున్న ఫలితాలను సాధించొచ్చు. ఒక టీమ్‌లో రకరకాల మనస్తత్వాలున్న వ్యక్తులు ఉంటారు. వారు ఎలా వ్యవహరిస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు! అనేది నాయకుడిపైనే ఆధారపడి ఉంటుంది. లీడర్ సమర్థుడైతే అనుచరులు కూడా అంతే సమర్థంగా పనిచేస్తారు. ఒక వ్యక్తి సక్సెస్‌పుల్ లీడర్‌గా గుర్తింపు, గౌరవ మర్యాదలు పొందాలంటే కొన్ని లక్షణాలు తప్పనిసరిగా ఉండాలి.  
 
 సహచరులను గౌరవించండి
 ఆఫీస్‌లో మీరు టీమ్‌లీడర్ అయితే.. మీతో కలిసి పనిచేసేవారిని గౌరవించండి. చేస్తున్న పనిపై వారి అభిప్రాయాలను తెలుసుకోండి. సూచనలు తీసుకోండి. పనిలో సమస్యలు తలెత్తితే వాటి పరిష్కారానికి సహచరుల సహకారం పొందండి. తమ పనికి గుర్తింపు లభిస్తోందని, తాము ముఖ్యమైన వ్యక్తులమనే భావన వారిలో కలిగేలా వ్యవహరించండి. వారి కృషిని మనస్ఫూర్తిగా ప్రశంసించండి. దీనివల్ల ఉద్యోగుల్లో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. వారి పట్ల ఆసక్తిని ప్రదర్శిస్తూ ఆరోగ్యవంతమైన అనుబంధాన్ని కొనసాగించండి.
 
 ప్రేరణ కలిగించండి
 సహచరులకు సవాళ్లతో కూడిన పనులను అప్పగిస్తూ వారిలో ప్రేరణ నింపండి. స్ఫూర్తిని కలిగించండి. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తే బహుమతులు ప్రదానం చేయండి. తగురీతిలో సత్కరించండి. కార్యాలయంలో మీ పనితీరు, సత్ప్రవర్తనతో జూనియర్లకు ఒక రోల్‌మోడల్‌గా మారండి. వారు మిమ్మల్ని చూసి స్ఫూర్తి పొందేలా వ్యవహరించండి. మీరు ఎలాంటి నాయకుడనేది దీన్ని బట్టే తెలిసిపోతుంది.
 
 అర్థమయ్యేలా వివరించండి
 మీరు రూపొందించిన ప్రణాళిక విజయవంతం కావాలంటే.. అది బృంద సభ్యులకు సరిగ్గా అర్థం కావాలి. దానితో వారు అనుసంధానమవ్వాలి. కాబట్టి మీ ఆలోచనలను అర్థమయ్యేలా వివరించండి. లక్ష్యాలను చేరడానికి దారి చూపండి. టీమ్ నుంచి మంచి ఔట్‌పుట్ రావాలంటే లీడర్ నైపుణ్యాలు మెరుగవ్వాలి.
 
 జవాబుదారీతనం
 సహచరులకు కొత్త బాధ్యతలను, విధులను అప్పగించడం ద్వారా వారిలో జవాబుదారీతనం పెంచండి. విధుల్లో సొంతంగా నిర్ణయాలు తీసుకొని, ఫలితాలను సాధించేలా వారిని ప్రోత్సహించండి. దీంతో వారిపై వారికి నమ్మకం పెరిగి భవిష్యత్తులో మంచి ఉద్యోగులుగా రాటుతేలుతారు.
 
 జూనియర్లను విశ్వసించండి
 భవిష్యత్ లక్ష్యాలను జూనియర్లతో పంచుకోండి. చేపట్టాల్సిన బాధ్యతలను వారికి పంచండి. లక్ష్యాలు సాధించడానికి కార్యాచరణ ప్రణాళికను వారి సహకారంతో రూపొందించండి. అందులో వారిని భాగస్వాములను చేయండి. సహచరులను సంపూర్ణంగా విశ్వసించండి. నాయకుడు ఎల్లప్పుడూ ఆశావహ దృక్పథంతో ముందుకు సాగాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement