టేకు చెట్లు అధికంగా ఉండే అరణ్యాలు? | where are rich teak forests ? | Sakshi
Sakshi News home page

టేకు చెట్లు అధికంగా ఉండే అరణ్యాలు?

Published Wed, Dec 3 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

టేకు చెట్లు అధికంగా ఉండే అరణ్యాలు?

టేకు చెట్లు అధికంగా ఉండే అరణ్యాలు?

ఆవరణ శాస్త్రం, ఆర్థిక వ్యవస్థల దృష్ట్యా భారత దేశంలోని అతి ముఖ్యమైన సహజ వనరుల్లో అడవులు ఒకటి. విలువైన కలప, వంట చెరకు రూపంలో అడవులు ఆకర్షణీయమైన ఆదాయాన్ని సమకూరుస్తున్నాయి. ఆర్థికంగా అనేక విధాలుగా తోడ్పడుతున్నందు వల్ల వీటిని ‘జాతీయ సంపద’గా పరిగణిస్తారు.
 
 భారతదేశ సహజ ఉద్భిజ్జ సంపద
 భారతదేశంలోని వృక్ష సంపదను ఉష్ణోగ్రత, వర్షపాతం, నిమ్నోన్నతాలు ప్రభావితం చేస్తున్నాయి. వీటి ఆధారంగా భారతదేశంలో అడవులను ప్రధానంగా ఐదు రకాలుగా వర్గీకరించవచ్చు. అవి:
 1. సతత హరిత అరణ్యాలు: ఇవి ఉష్ణమండల తేమతో కూడిన సతత హరిత అడవులు, అర్ధసతత హరిత అడవులు అని రెండు రకాలుగా ఉంటాయి. ఇవి 500 - 1500 మీటర్ల ఎత్తులో, 200 సెం.మీ. కంటే ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో పెరుగుతాయి. పశ్చిమ కనుమల దక్షిణ భాగం (కేరళ, కర్ణాటక రాష్ట్రాలు), ఈశాన్య రాష్ట్రాలు (అసోం, మేఘాలయ, త్రిపుర, మణిపూర్, నాగాలాండ్), అండమాన్ నికోబార్ దీవులు మొదలైన ప్రాంతాల్లో ఈ  రకమైన అడవులు పెరుగుతాయి. పశ్చిమ బెంగాల్, ఒడిశా మైదానాల్లోనూ కనిపిస్తాయి.
 ఈ వృక్షాలు చాలా దట్టంగా ఉండి 45-60 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి. రోజ్‌వుడ్ (నల్ల ఇరుగుడుచేవ), నల్లతుమ్మ (్కఅఊ), అయిని, తెల్సూర్, చంపక వృక్షం, టూన్, గుర్‌జాన్, ఐరన్ ఉడ్, ఎబోని, సిమార్, లారిల్  మొదలైనవి ఈ అడవుల్లో పెరిగే ప్రధాన వృక్ష జాతులు.
 ఈ అరణ్యాల కలప చాలా గట్టిగా ఉండటం వల్ల వీటిని ‘కఠినదారు వృక్షాలు’ అంటారు. వీటిని వినియోగించడం కష్టతరమైన పని కాబట్టి వీటి వాణిజ్య విలువ చాలా తక్కువ. వీటిని ఎక్కువగా కలప, కాగితం, అగ్గిపెట్టెలు మొదలైన వాటికి ఉపయోగిస్తారు.
 2. ఆకురాల్చే అడవులు: ఇవి రెండు రకాలుగా ఉంటాయి.
 ఎ) ఉష్ణమండల తేమతో కూడిన ఆకురాల్చే అడవులు: ఇవి 100 - 200 సెం.మీ. వర్షపాతం ఉన్న కొండ ప్రాంతాలు, పీఠభూమి ఉపరితలాల్లో పెరుగుతాయి. ఇవి ముఖ్యంగా పశ్చిమ కనుమలు, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి, శివాలిక్ కొండల ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి పొడవైన వృక్షాలుగా, పొదలు దగ్గర దగ్గరగా దట్టంగా పెరిగే విలక్షణమైన అడవులు. వీటిని ‘రుతుపవన అడవులు’, ‘బహిరంగ తృణ భూములు’ అని కూడా అంటారు. ఈ అడవుల్లోని వృక్షాలు 25-60 మీటర్ల ఎత్తు వరకూ పెరుగుతాయి.
 ఇవి వేడి శుష్క వాతావరణ కాలంలో 6-8 వారాలపాటు ఆకులను రాలుస్తాయి. ఈ అడవుల్లో ‘టేకు’ వృక్షాలు ప్రబలంగా ఉంటాయి. వీటితో పాటు గుగ్గిలం (శివాలిక్ కొండలు), మంచి గంధం (కర్ణాటక), షీషమ్, వెదురు, హుర్రా, ఖైర్ మొదలైన వృక్షాలు పెరుగుతాయి. వీటి ఉత్పత్తులను కలప, కొయ్య సామగ్రి, సబ్బులు, కాగితం పరిశ్రమల్లో ఉపయోగిస్తారు. ఇవి భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.
 బి) ఉష్ణమండల శుష్క ఆకురాల్చే అడవులు: ఇవి 70 - 100 సెం.మీ. వర్షపాతం ఉండే పీఠభూమి, మైదానాల్లో కనిపిస్తాయి. ప్రధానంగా ద్వీపకల్ప పీఠభూమిలో అధికంగా ఉన్నాయి.  గంగా మైదానం, పశ్చిమాన ‘థార్’ ఎడారి వరకు, హిమాలయాలు, పశ్చిమ కనుమలకు మధ్య ఉన్న విశాల భూభాగంలో ఈ అడవులున్నాయి. శుష్క (వేసవి) రుతువుల్లో ఆకులను విస్తారంగా రాల్చడం, వృక్షాలు బోడిగా కనపడటం ఈ అడవుల ముఖ్య లక్షణం. ఈ అడవుల్లో పెరిగే వృక్ష జాతులు - టేకు, వెదురు, గుగ్గిలం, ఖేర్ మొదలైనవి.
 3. ఉష్ణమండల ముళ్ల జాతి అడవులు: ఈ రకమైన అరణ్యాలు ముఖ్యంగా 70 సెం.మీ. కంటే తక్కువ వర్షపాతం ఉండే శుష్క ప్రాంతాల్లో పెరుగుతాయి. పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లోని మైదానాలు, గుజరాత్‌లో కొన్ని ప్రాంతాలు, సముద్రానికి సమీపంగా ఉన్న దక్కన్ పీఠభూమి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి 6-10 మీటర్ల ఎత్తు వరకు పెరిగి ముళ్ల పొదలుగా, గిడసబారిన చెట్లుగా ఉంటాయి. ఈ అడవుల్లో అకేసియా, బ్రహ్మజెముడు, నాగజెముడు లాంటి మొక్కలు సర్వసాధారణంగా ఉంటాయి. ఈ అరణ్యాల్లో తుమ్మ (బాబుల్), నల్లతుమ్మ మొదలైన వృక్ష జాతులు ముఖ్యమైనవి. తేమతో కూడిన పల్లపు భూముల్లో అడవి ఖర్జూరం చెట్లు పెరుగుతాయి.
 ఆకురాల్చే అడవుల్లో ముఖ్యమైన జంతు సంపద ఉత్పత్తి లక్క. ఇది జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికంగా ఉత్పత్తి అవుతోంది. దీన్ని ఎక్కువగా విద్యుత్ నిరోధకంగా, సీల్స్ వేయడానికి ఉపయోగిస్తారు.
 4. మడ అడవులు లేదా టైడల్ అడవులు: ఇవి ముఖ్యంగా బురద, ఒండ్రుతో కూడిన సముద్ర తరంగాలు, పోటుపాట్లకు గురయ్యే ఉప్పు నీటి, మంచి నీటి ప్రాంతాల్లో పెరుగుతాయి. ఇవి ప్రధానంగా తీరాంచల ప్రాంతాలు, గంగా, మహానది, గోదావరి, కృష్ణా డెల్టాల్లోని ఏరులు, దీవుల్లో పెరుగుతాయి. ఇవి 30 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటికి శ్వాసవేర్లు ఉంటాయి. ఈ వేర్లు బురద నుంచి పైకి చొచ్చుకు వచ్చి ఉంటాయి.
 ‘మడ’ చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల వీటిని ‘మడ అడవులు’ అంటారు. ‘బెంగాల్’ డెల్టాలో ‘సుందరి’ వృక్షాలు ఎక్కువగా పెరుగుతాయి. కాబట్టి వీటిని ‘సుందర వనాలు’ అంటారు. పేము, తాటి  వృక్ష జాతులు వీటిలో ముఖ్యమైనవి. ఈ అడవులలోని వృక్షాలు మాంగ్రోవ్ వంశానికి చెందడం వల్ల వీటిని ‘మాంగ్రోవ్ అరణ్యాలు’ అని కూడా అంటారు. ఈ అరణ్యాల కలపను నౌకా నిర్మాణం, న్యూస్ పేపర్ తయారీలో ఉపయోగిస్తారు.
 5. పర్వతీయ అరణ్యాలు: ఇవి రెండు రకాలు.
 ఎ) హిమాలయాల్లోని సమశీతోష్ణ అడవులు: ఇవి ముఖ్యంగా హిమాలయాల్లోని మధ్య హిమాలయ శ్రేణులు (హిమాచల్)లో 1600 - 3000 మీ. ఎత్తు వరకు, 100 - 200 సెం.మీ. వర్షపాతం ఉండే ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయి. వీటిలో ఓక్, తమాల (పొన్న), చెస్ట్‌నట్, వాల్‌నట్, మాపుల్, సంపెంగ జాతి, ఆల్డర్లు లాంటి వెడల్పాటి ఆకులున్న వృక్షాలు పెరుగుతాయి. వీటినే ‘శృంగాకార అరణ్యాలు’ అంటారు.
 బి) ఆల్ఫైన్ అడవులు: ఇవి ముఖ్యంగా 3,500 మీ. కంటే ఎత్తయిన ప్రాంతాల్లో (హిమాద్రి శ్రేణుల్లో) పెరుగుతాయి. వీటిలో ముఖ్యమైన వృక్ష జాతులు - దేవదారు, సిడారు, వెదురు, రోడో డెండ్రాన్లు, విల్లో, బిర్‌‌చ, జునిఫెర్, సిల్వర్ ఫెర్, పైన్ మొదలైనవి.
 ఈ అరణ్యాల్లోని కలపను అగ్గిపెట్టెలు, హస్తకళలు, జిగురు, కర్రగుజ్జు, టర్పంటైన్, రైల్వే స్వీపర్లు మొదలైన వాటిలో ఉపయోగిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో మడ అడవులు ఉన్న ప్రాంతం ‘కోరింగ’.
 
 అటవీ భూమి విస్తరణ
 భారతదేశంలో 2000-01 సంవత్సరం లెక్కల ప్రకారం 6,75,538 చ.కి.మీ. విస్తీర్ణంలో  అటవీ భూమి ఉంది. ఇది దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 20.55 శాతం. 1952 - జాతీయ అటవీ విధానం’ ప్రకారం ఆవరణ సమతౌల్యాన్ని కాపాడటానికి మైదానాల్లో 20 శాతం, పర్వతాలు, కొండ ప్రాంతాల్లో 60 శాతం.. మొత్తం మీద దేశ బౌగోళిక విస్తీర్ణంలో 1/3వ వంతు భూభాగంలో (33.3 శాతం) అడవులు విస్తరించి ఉండాలి. 2000-01 లెక్కల ప్రకారం విస్తీర్ణ పరంగా అత్యధిక అడవులు ఉన్న రాష్ట్రం మధ్యప్రదేశ్ (77,265 చ.కి.మీ.). అత్యల్ప విస్తీర్ణం ఉన్న రాష్ట్రం హర్యానా (1754 చ.కి.మీ.). ఆయా రాష్ట్రాల వైశాల్యంతో పోల్చి చూసినప్పుడు (శాతాల్లో) అడవులు అత్యధికంగా ఉన్న రాష్ట్రం అరుణాచల్‌ప్రదేశ్ (62.1 శాతం), అత్యల్ప అడవులున్న రాష్ట్రం హర్యానా (3.8 శాతం).
 
 ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్‌‌ట - 2013
 దీని ప్రకారం భారతదేశంలో మొత్తం అడవుల విస్తీర్ణం 6,97,898 చ.కి.మీ. ఇది దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో 21.23 శాతం.
     దేశంలో విస్తీర్ణపరంగా అడవులు అధికంగా ఉన్న రాష్ట్రాలు 1) మధ్యప్రదేశ్ (77,522 చ.కి.మీ.) 2) అరుణాచల్ ప్రదేశ్ (67,321 చ.కి.మీ.)
     దేశంలో విస్తీర్ణపరంగా అత్యల్పంగా అడవులున్న రాష్ట్రాలు 1) హర్యానా (1586 చ.కి.మీ.) 2) పంజాబ్ (1772 చ.కి.మీ.)
     ఆయా రాష్ట్రాల వైశాల్యంతో పోల్చి చూసినప్పుడు (శాతాల్లో) దేశంలో అత్యధికంగా అడవుల భూభాగం ఉన్న రాష్ట్రం మిజోరాం (90.38 శాతం). అతి తక్కువ అడవుల భూభాగం ఉన్న రాష్ట్రం పంజాబ్ (3.52 శాతం).
     కేంద్ర పాలిత ప్రాంతాల్లో విస్తీర్ణపరంగా అడవులు అండమాన్ నికోబార్ దీవుల్లో అధికంగా, డామన్ డయ్యూలో అత్యల్పంగా ఉన్నాయి.
     భారత ప్రభుత్వం 1988లో రెండో అటవీ విధానాన్ని ప్రకటించింది.
     2006లో నూతన పర్యావరణ విధానాన్ని తీసుకొచ్చారు.
     {పపంచ పర్యావరణ దినోత్సవం ‘జూన్ 5’.
     సామాజిక అడవులు అనే కార్యక్రమాన్ని భారత ప్రభుత్వం 5వ పంచవర్ష ప్రణాళిక (1974-79)లో ప్రారంభించింది. ఇది 6వ పంచవర్ష ప్రణాళికా కాలంలో (1980-85) లో ఎక్కువగా అమలైంది.
 
 కాంపిటీటివ్ కౌన్సెలింగ్
 పోటీ పరీక్షల కోసం అడవులకు సంబంధించి ఏయే అంశాలను చదవాలి?
     - ఆర్.అలేఖ్య, ఆదిలాబాద్.
 భూగోళ శాస్త్రంలో ‘అడవులు’ పాఠ్యభాగానికి భౌగోళికంగా ప్రత్యేక స్థానం ఉంది. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వాలు ఇస్తున్న ప్రాధాన్యం దృష్ట్యా పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ నుంచి తరచుగా ప్రశ్నలు అడుగుతున్నారు. అందువల్ల ‘భారత దేశ సహజ ఉద్భిజ్జ సంపద’కు సంబం ధించిన అన్ని అంశాలపై పట్టు సాధించాలి.
 దేశంలో ఏయే ప్రాంతాల్లో ఏయే రకమైన అడవులున్నాయి? అవి ఆయా ప్రదేశాల్లోనే పెరగడానికి కారణాలు, వాటిలోని ముఖ్యమైన  వృక్షజాతులు, అటవీ ఉత్పత్తులు - వినియోగిస్తున్న పరిశ్రమలు తదితర అంశాలను క్షుణ్నంగా చదవాలి. వీటి కోసం 6 నుంచి 10 వ తరగతి వరకు ఉన్న సాంఘికశాస్త్ర పుస్తకాలు ఉపయుక్తంగా ఉంటాయి.
 మనదేశంలో ప్రధానంగా ఉష్ణమండల, సమశీతోష్ణస్థితికి చెందిన రకాలైన అడవులు ఉన్నాయి. ఇవి ప్రధానంగా ప్రదేశ ఎత్తు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉన్నాయి. అందువల్ల అభ్యర్థులు ఈ అంశాలన్నింటినీ  అనుసంధానం చేసుకుంటూ అధ్యయనం చేయాలి. భారతదేశ నైసర్గిక స్వరూపంపై పూర్తిగా అవగాహన పెంచు కుంటే చదివిన అంశాలు బాగా గుర్తుంటాయి.  
 
 మాదిరి ప్రశ్నలు
 1.    2001 లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక అడవుల విస్తీర్ణం ఉన్న రాష్ట్రం?
     1) హర్యానా    2) పంజాబ్
     3) ఛత్తీస్‌గఢ్    4) మధ్యప్రదేశ్
 2.    హిమాలయాల్లో 3000 మీటర్ల కంటే ఎత్తయిన ప్రాంతాల్లో పెరిగే అడవులను ఏమంటారు?
     1) టైడల్ అడవులు
     2) ముళ్లజాతి అడవులు
     3) ఆల్ఫైన్ అడవులు
     4) ఆకురాల్చే అడవులు
 3.    టేకు చెట్లు అధికంగా ఉండే అరణ్యాలు?
     1) మడ అడవులు      2) ఆల్ఫైన్ అడవులు
     3) ఆకురాల్చే అడవులు
     4) సతత హరిత అడవులు
 
 సమాధానాలు:
     1) 4;    2) 3;    3) 3.
 
 ముల్కల రమేష్
 సీనియర్ ఫ్యాకల్టీ,
 హరీష్ అకాడమీ, హన్మకొండ.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement