పరిటాల శ్రీరామ్ కు 14 రోజుల రిమాండ్
అనంతపురం: జిల్లాలోని ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ సీపీ మద్దతుదారులపై దాడికి పాల్పడ్డ పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. శ్రీరామ్ ఈ రోజు కనగానపల్లె పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. దీంతో అతన్ని మే 16 తేదీ వరకూ రిమాండ్ లో ఉంచనున్నారు. గత రెండు రోజుల క్రితం జరిగిన వైసీపీ- టీడీపీ నేతల ఘర్షణలో శ్రీరామ్ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఎలకుంట్ల గ్రామస్తులపై దాడి కేసులో రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ సహా 11మంది టీడీపీ కార్యకర్తలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
గత నెల 30న కనగానపల్లి మండలంలోని ఎలకుంట్ల గ్రామంలో ప్రచారానికి వెళ్లిన పరిటాల శ్రీరామ్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్న ఏడుగురిపై రాళ్ల వర్షం కురిపించి తీవ్రంగా గాయపరిచాడు. మళ్లీ గురువారం ఆయన రాప్తాడు మండలంలో కూడా దాదాపుగా 50 వాహనాలు, 200 ద్విచక్ర వాహనాలతో ర్యాలీగా వెళ్లి గ్రామాల్లో నానాహంగామా సృష్టించాడు.