సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసిం ది. అసెంబ్లీ, లోక్‌సభ బరిలో ఉన్న అభ్యర్థులెవరో తేలింది.
సాక్షి, కడప : సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం బుధవారంతో ముగిసిం ది. అసెంబ్లీ, లోక్‌సభ బరిలో ఉన్న అభ్యర్థులెవరో తేలింది. కడప లోక్‌సభ బరిలో 14 మంది, రాజంపేట లోక్‌సభ బరిలో తొమ్మిది మంది రంగంలో నిలిచారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు 143 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 44 మంది అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు.
కడప అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 36 మంది అభ్యర్థులు 55 సెట్ల నామినేషన్లను దాఖలు చేయగా, ఉపసంహరణ అనంతరం 14 మంది మాత్రమే పోటీలో నిలిచారు. జిల్లాలో అత్యధికంగా రాజంపేట నియోజకవర్గంలో 20 మంది పోటీలో ఉన్నారు. అత్యల్పంగా జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాల్లో 12 మంది చొప్పున పోటీలో ఉన్నారు.
అసెంబ్లీ బరిలో నామినేషన్లు ఉపసంహరించుకున్న వారిలో ప్రొద్దుటూరు బరిలో ఉన్న ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, ఆయన సతీమణి లక్ష్మిప్రసన్న ఉన్నారు.
కడప అసెంబ్లీకి సంబంధించి జై సమైక్యాంధ్ర అభ్యర్థి సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. అలాగే బీజేపీ, టీడీపీ పొత్తులో భాగంగా కడప అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించారు. అయితే చివరి క్షణంలో తెలుగుదేశం అభ్యర్థిగా దుర్గాప్రసాద్‌రావును రంగంలో నిలిపారు. అయితే కడప అసెంబ్లీ బరిలో టీడీపీ అభ్యర్థి నామినేషన్ ఉపసంహరించుకోకపోవడంతో ఇద్దరూ బరిలో ఉన్నారు.