‘ఫారాల’..ఫైట్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇప్పటికే తనకు బీ ఫారాలు ఇవ్వకపోవడంపై అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం పార్టీ పెద్దల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తాజాగా, కొడంగల్ నియోజకవర్గంలోనూ ఇదే అంశంపై మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి రచ్చకెక్కారు. మాజీమంత్రి డీకే అరుణ అండదండలతో నియోజకవర్గానికి సంబంధించిన బీ ఫారాలు త నకు దక్కకుండా పార్టీ నాయకులు రాజకీయం చేస్తున్నారని గుర్నాథ్‌రెడ్డి భగ్గుమంటున్నారు. మాజీఎంపీ విఠల్‌రావు కొడంగల్ నుంచి పోటీచేసే ఉద్దేశంతో సమస్యలు సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వర్గీయులు భావిస్తున్నారు. సలీం, కృష్ణ, విజయ్‌కుమార్ తదితర నేతల వెనక డీకే అరుణ, విఠల్‌రావు ఉన్నారని ఆరోపిస్తున్నారు.
తొమ్మిది పర్యాయాలు ఎమ్మెల్యేగా పోటీచేసిన తనకు బీ ఫారాలు అప్పగించకపోవడం ఇదే తొలిసారి అ ని.. గుర్నాథ్‌రెడ్డి చెబుతున్నారు. మరోవైపు అ లంపూర్ నియోజకవర్గంలోనూ బీ ఫారాల పం చాయితీ ఓ కొలిక్కి రావడం లేదు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న తనను కాదని రెండురోజుల క్రితం పార్టీలో చేరిన చల్లా వెంకట్రాంరెడ్డి బాధ్యతలు అప్పగించడంపై అబ్రహాం గుర్రుగా ఉన్నారు. కేవలం ఒకే నేతకు బీ ఫారాలు అప్పగిస్తే చివరి నిముషంలో పార్టీ మారితే పరువుపోతోందని పీసీసీ నేతలు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన కాంగ్రెస్ జిల్లా బాధ్యులు బీ ఫారాల పంపిణీలో పలువురు నేతలను భాగస్వాములను చేస్తున్నట్లు కనిపిస్తోంది.
పార్టీకి గుర్నాథ్‌రెడ్డి గుడ్‌బై?
కొడంగల్ కాంగ్రెస్ టికెట్‌ను గుర్నాథ్‌రెడ్డికే దక్కేలా చూస్తానని కేంద్ర మంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి భరోసా ఇచ్చినట్లు సమాచారం. అయితే మాజీ మంత్రి డీకే అరుణ పావులు కదుపు తూ స్థానిక నేతలను తనపై ఉసిగొల్పడంపై గుర్నాథ్‌రెడ్డి తీ వ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకటి రెండు రో జుల్లో అనుచరులతో సమావేశమై రాజకీయ భవిష్యత్‌పై ని ర్ణయం తీసుకునే యోచనలో ఉన్నట్లు తెలిసింది. టీఆర్‌ఎస్ లో చేరడమా? స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉండటమా? ఏ దో ఒకటి ఖాయమని ఆయన సన్నిహితులు వెల్లడించారు.
కొడంగల్ నుంచి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే మహేందర్‌రెడ్డి సోదరుడు, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి టీఆర్‌ఎస్ నుంచి పోటీచేస్తారని ప్రచారం జరిగింది. అయితే నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా మరో రెండేళ్ల పదవీకాలం ఉండటంతో ఎమ్మెల్యేగా పోటీచేయాలనే ఆలోచన విరమించుకున్నట్లు తెలిసింది. దీంతో టీఆర్‌ఎస్‌లోకే వెళ్తే తనకు టికెట్ ఖాయమనే ధీమా గుర్నాథ్‌రెడ్డికి ఉన్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌తో చర్చలు ఫలిస్తే రెండు, మూడు రోజుల్లో చేరిక ముహూర్తం ఖరారు కానుంది.