ఎలక్షన్ సెల్
‘కమల’వికాస వ్యూహకర్తల్లో కీలకమైన వ్యక్తి అరుణ్ జైట్లీ. ఢిల్లీలో సంపన్న కుటుంబంలో జన్మించారు. తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాది. తండ్రి నుంచి ఆ వృత్తిని వారసత్వంగా స్వీకరించారు అరుణ్. విద్యార్థి దశ నుంచే రాజకీయాలపైనా ఆసక్తి పెంచుకున్నారు. సంఘ్ పరివార్ విద్యార్థి విభాగమైన ఏబీవీపీ సభ్యత్వం స్వీకరించారు. లా చదివేప్పుడు 1974లో ఢిల్లీ వర్సిటీ విద్యార్థి యూనియన్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఎమర్జెన్సీ కాలంలో 19 నెలలు నిర్బంధంలో గడిపారు. జయప్రకాశ్ నారాయణ్ చేపట్టిన అవినీతి వ్యతిరేక ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. జేపీ ఏర్పాటు చేసిన విద్యార్థి, యువజన సంఘం జాతీయ కమిటీకి కన్వీనర్‌గా కొనసాగారు. పౌరహక్కుల ఉద్యమంలోనూ చురుగ్గా పాల్గొన్నారు. 1977లో జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్‌లో చేరారు. తొలినాళ్లలో న్యాయవాదిగా దుమ్మురేపారు. వీపీ సింగ్ సర్కారు జైట్లీని అదనపు సొలిసిటర్ జనరల్‌గా నియమించింది. బోఫోర్స్ కుంభకోణం కేసు విచారణలో పాలుపంచుకున్నారు.
వుులాయుంసింగ్ యూదవ్, మాధవురావు సింధియా, శరద్ యాదవ్... ఇలా పార్టీలకతీతంగా పలువురు ప్రముఖ నేతలు జైట్లీ కక్షిదారుల జాబితాలో ఉన్నారు. న్యాయవాదిగానైనా, నాయకుడిగానైనా జైట్లీ అసలు బలం అధ్యయనశీలతే. కేసులను గెలిపించడంలోనే గాక ప్రత్యర్థుల విమర్శలను సమర్థంగా తిప్పికొట్టడంలోనూ అది అడుగడుగునా కనిపిస్తుంది. బీజేపీ జాతీయ కార్యవర్గంలో 1991 నుంచే కొనసాగుతున్న జైట్లీ ఎన్నడూ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఎన్డీఏ హయాంలో కేంద్రంలో పలు కీలక శాఖలను నిర్వహించారు. అదే ఏడాది నవంబర్‌లో కేబినెట్ హోదా పొందారు. ఉపరితల రవాణా శాఖను విభజించి, కొత్తగా ఏర్పాటు చేసిన షిప్పింగ్ శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. పలు రాష్ట్రాల్లో బీజేపీ ఎన్నికల బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. గుజరాత్‌లో మోడీ హ్యాట్రిక్ విజయాలతో పాటు దక్షిణాదిలో తొలిసారిగా కర్ణాటకలో ‘కమల’ వికాసం వెనక కూడా జైట్లీ పాత్ర ఉంది. కేంద్ర న్యాయ మంత్రిగా ఉన్న కాలంలో లోక్‌సభ నియోజక వర్గాల సంఖ్యను 2026 దాకా మార్చే వీల్లేకుండా 84వ రాజ్యాంగ సవరణ, పార్టీలను ఫిరాయించే చట్టసభ్యులపై చర్యలు తీసుకునేందుకు వీలుగా 91వ సవరణ తెచ్చారు. బీజేపీకి పదేళ్లుగా దూరమైన అధికారాన్ని తిరిగి సాధించి పెట్టడమే లక్ష్యంగా ప్రచార వ్యూహాల రూపకల్పనలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. పంజాబీ కుంటుంబంలో జన్మించిన జైట్లీ
ఈ లోక్‌సభ ఎన్నికల్లో అవుృత్‌సర్ నుంచి పోటీచేస్తున్నారు.
ప్రస్థానం
అరుణ్ జైట్లీ (రాజ్యసభలో ప్రతిపక్ష నేత)
జననం: 1952 డిసెంబర్ 28
చదువు: బీకామ్ (ఆనర్స్), ఎల్‌ఎల్‌బీ
నమ్మిన సిద్ధాంతం: ‘సంఘ’ సిద్ధాంతమే
రాజకీయాల్లోకి రాకముందు: న్యాయవాది