పొత్తు పొడిచింది!
Published Mon, Apr 7 2014 1:08 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
అరండల్‌పేట(గుంటూరు),న్యూస్‌లైన్ :రేపు మాపు అంటూ వాయిదా వేస్తూ వస్తున్న బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు ఎట్టకేలకు ఖారారైంది. అయితే అనూహ్యంగా జిల్లాలో బీజేపీకి నరసరావుపేట కేటాయించడంతో టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ఇక్కడనుంచి మాజీ మంత్రి కోడెల శివప్రసాద్ పోటీ చేయాలనుకున్నారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని బీజేపీకి అప్పగించడంపై కోడెల తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి నుంచి బీజేపీ ఎలా పోటీచేస్తుందంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఇక్కడి నుంచి పోటీచేసినా సహకరించమంటూ తేల్చిచెపుతున్నారు. ఇదే సమయంలో జిల్లాలో కేవలం ఒక్కసీటు మాత్రమే కేటాయించడంపై బీజేపీ శ్రేణులు సైతం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. జిల్లాలో కనీసం మూడు సీట్లు కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీకి జిల్లాలో ఎక్కడా సహకరించేది లేదని వారు తేల్చిచెప్పడం కొసమెరుపు.
బీజేపీకి సహకరించని టీడీపీ..
1999, 2004లలో టీడీపీ, బీజేపీల మధ్య కుదిరిన పొత్తులో భాగంగా రెండుసార్లు మంగళగిరి నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయించింది. బీజేపీ తరఫున 1999లో యడ్లపాటి రఘనాథబాబు, 2004లో తమ్మిశెట్టి జానకిదేవీలపై కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి మురుగుడు హనుమంతరావు రెండుసార్లు పోటీ చేసి గెలుపొందారు. గతంలో సైతం టీడీపీ శ్రేణులు బీజేపీకి సహకరించలేదు. దీంతో ఆ పార్టీ అభ్యర్థి ఓడిపోయారు. అయితే ప్రస్తుతం ప్రజల్లో తమకు బలం ఉందని, తమ బలంపైనే టీడీపీ అభ్యర్థుల గెలుపు ఓటములు ఆధారపడి ఉంటాయని వారు ఘంటాపథంగా చెబుతున్నారు. అలాగే దేశం, రాష్ట్రంలో మారిన రాజకీయ పరిస్థితుల్లో భాగంగా మోడీ హవా తమకు కలిసి వస్తుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నారు. నరసరావుపేటతో పాటు గుంటూరు పశ్చిమ, సత్తెనపల్లి టిక్కెట్లు సైతం తమకు కేటాయించేలా అధిష్టానంపై మరోసారి వత్తిడి తీసుకువస్తామని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇదే సమయంలో నరసరావుపేట అసెంబ్లీకి బీజేపీ అభ్యర్థిగా యడ్లపాటి రఘనాథబాబు, నలబోలు విష్ణుల్లో ఒకరిని ఎంపిక చేస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
టీడీపీ తహతహ..
రాష్ట్ర విభజనకు సహకరించిన బీజేపీతో టీడీపీ పొత్తు కుదుర్చుకోవడంపై లౌకికవాదులు తప్పు పడుతున్నారు. వాస్తవానికి ఈ సార్వత్రిక ఎన్నికల్లో తొలి నుంచి బీజేపీతో పొత్తుకు టీడీపీ తహతహలాడటంపై ప్రజలు మండిపడుతున్నారు. మరోసారి బీజేపీతో పొత్తు పెట్టుకొనేది లేదని 2009లో తేల్చిచెప్పిన చంద్రబాబు తాజాగా ఇప్పుడు పొత్తులకు వెళ్లడంపై ముస్లిం, మైనారిటీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తన నైజాన్ని మరోసారి నిరూపించుకున్నారన్న విమర్శలు పెద్దఎత్తున వస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ అభ్యర్థుల్లో సైతం గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. బీజేపీతో పొత్తుతో ముస్లిం, మైనారిటీల ఓట్లు తమకు దూరమయ్యే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
Advertisement
Advertisement