టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేకే... | KCR Slams Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేకే...

Published Thu, Apr 10 2014 2:38 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేకే... - Sakshi

టీఆర్‌ఎస్‌ను ఎదుర్కోలేకే...

* ఇద్దరు ‘నాయుళ్ల’ పొత్తు కుట్ర: కేసీఆర్  
* తెలంగాణ అభివృద్ధి బాధ్యత మాదే
* ‘బాబు’కు ఇంకా ఇక్కడేం పని..
* ఆయన ఆంధ్రాకు పోయి అభివృద్ధి చేసుకోవాలి
* పొన్నాల లక్ష్మయ్య ఏమైనా చేసేటోడా?
* ఆయన బతుకు ఇంతేనని విమర్శ
* మేనిఫెస్టో అమలు చేసి చేసి తీరుతామని స్పష్టీకరణ

 
 గజ్వేల్ /నంగునూరు/మెదక్, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకునే కుట్రలో భాగంగా ఇద్దరు నాయుళ్లు(చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడు) కలిశారని, వారి కుట్ర ఫలితంగా టీడీపీ-బీజేపీ మధ్య పొత్తు కుదిరిందని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆరోపించారు. బీజేపీ కార్యకర్తల నుంచి నిరసన వెల్లువెత్తినా... ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి వ్యతిరేకించినా జబర్‌దస్త్‌గా మంత్రాంగాన్ని నడిపారన్నారు. తాను నమ్మే కోనాయిపల్లి వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేస్తున్నానని, రాజకీయ అవినీతిని అంతం చేసి మంచి పాలన అందిస్తానని ప్రజలకు ఆయన హామీ ఇచ్చారు. బుధవారం మెదక్ జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లిలో తన ఇష్టదైవం వెంకటేశ్వరునికి పాదాల చెంత నామినేషన్ పత్రాలు ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హెలికాప్టర్‌లో వెళ్లి సంగారెడ్డిలో మెదక్ ఎంపీ స్థానానికి, గజ్వేల్‌లో అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ కోనాయిపల్లి, గజ్వేల్‌లోని ప్రజ్ఞా గార్డెన్స్‌లో మాట్లాడారు.
 
 నీళ్లకోసం కుట్ర చేస్తుండ్రు...

 టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రాంతంలోని నదులపై ప్రాజెక్టులు నిర్మిస్తుందని, అదే జరిగితే ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు నీరు రావనే భయంతోనే కొందరు కుట్ర చేస్తున్నారని కేసీఆర్ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు అప్రమత్తమై కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. ‘ఆంధ్రాబాబుకు ఇంకా ఇక్కడేం పని... నువ్వు సిపాయి అయితే ఆంధ్రాకు పోయి అభివృద్ధి చేసుకో’ అని సూచించారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పొత్తులొద్దని మొత్తుకున్నా, వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు ఎన్నికల్లో చేతులెందుకు కలపాల్సి వచ్చిందో చెప్పాలన్నారు. దేశంతో సంకీర్ణయుగం నడుస్తోందని కేంద్రంలో మన పెత్తనం సాగించాలంటే 16 ఎంపీ సీట్లు గెలవాలన్నారు. లేకుంటే కత్తి ఒకనికిచ్చి యుద్ధం మనం చేసినట్లుంటదని వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికల్లో సీమాంధ్ర పార్టీలకు అధికారమిస్తే గాడిదకు గడ్డేసి ఆవుకు పాలు పితికినట్టుంటుందన్నారు.
 
 సిద్ధిపేటకు చుక్ చుక్ రైలు

 తాను అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నానని వాఖ్యానించిన టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చే శారు. కోనాయిపల్లి వెంకన్న సాక్షిగా హామీ ఇస్తున్న..మేనిఫెస్టోను అమలుచేసి చూపిస్తానని కేసీఆర్ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ మిగతా పార్టీల్లాగా గాల్లో లెక్కలతో మేనిఫెస్టోను రూపొందించలేదన్నారు. ఆర్థిక రంగ నిపుణులతో చర్చించిన తర్వాతే మేనిఫెస్టో తయారుచేశామన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేళ్లలోపు సిద్దిపేటకు చుక్‌చుక్ రైలు కూత వినిపిస్తానన్నారు.
 
 ఇవేకాకుండా గోదావరి జలాలతో సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాలకు 2 లక్షల నుంచి 3 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణవ్యాప్తంగా 24 జిల్లాలను ఏర్పాటు చేసి సిద్దిపేటను జిల్లా కేంద్రంగా చేసి తీరుతానన్నారు. కార్యక్రమంలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, టీఆర్‌ఎస్ నాయకులు లక్ష్మీకాంతారావు, భూంరెడ్డి, ఎలక్షన్‌రెడ్డి, డాక్టర్ యాదవరెడ్డి, చెట్టి సురేష్‌గౌడ్, జహంగీర్, గాడిపల్లి భాస్కర్, టీఆర్‌ఎస్వీ జిల్లా అధ్యక్షుడు మాదాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
 
 బొక్కినవన్నీ కక్కిస్తాం
 రాష్ట్రంలో అవినీతి పెరగడంతో ఐఏఎస్‌లు, మంత్రులు, ఎంపీలను జైళ్లల్లో పెట్టాల్సిన దౌర్భాగ్య స్థితి నెలకొందన్నారు. కాంట్రాక్టర్లు సీఎం కార్యాలయాల్లో తిరుగుతూ వేల కోట్లు దోచుకుంటున్నారని, అలాంటప్పుడు అధికారులు, ఈ వ్యవస్థ ఎందుకంటూ మండిపడ్డారు. టీడీపీ పాలనలో దోచుకున్న వేల కోట్ల సొమ్మును తాము అధికారంలోకి రాగానే కక్కించి వారిని శిక్షిస్తామన్నారు. రాజకీయ అవినీతిని అంతం చేస్తేనే సుపరిపాలన సాధ్యమవుతుందని, టీఆర్‌ఎస్‌కు అధికారమిచ్చి మన తలరాతలు మార్చుకుందామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement