మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లలో స్థానిక ఎన్నికల ప్రచారం జోరందుకుంది. మొదటి విడత ఏప్రిల్ 6న ఎన్నికలు జరిగిన ఈ డివిజన్లలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉండడం, ప్రతీ ఇంటికి వెళ్లి ఓటర్లను మచ్చిక చేసుకోవడంపై అన్ని పార్టీల అభ్యర్థులు దృష్టి సారించారు. వెళ్లిన ఇంటికే మళ్లీ మళ్లీ వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. మర్చిపోవద్దని, గుర్తుంచుకోండని వంగి వంగి దండాలు పెడుతూ ఓట్లు అడుతున్నారు. గతంలో మాదిరిగా హంగు.. ఆర్భాటం లేకుండానే ప్రచారం చేస్తున్నారు.
అధికారులు ఎన్నికల కోడ్‌ను పకడ్బందీగా అమలు చేస్తుండడంతో ప్రచారానికి ఎక్కువ మందిని తీసుకెళ్లితే వారి ఖర్చు తమ ఖాతాలో పడుతుందని భయపడుతున్నారు. ఒక్కో అభ్యర్థి వెంట పది మంది కంటే ఎక్కువగా ఉండడం లేదు. అభ్యర్థులు ఓటు వేయాలని అడుగుతూ గడప గడపకూ వెళ్తున్నారు. బహిరంగ సభలు ఏర్పాటు చేయాలంటే అనుమతి కోసం పోలీసుస్టేషన్లు, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరగడం, ఏదైనా జరగరానిది జరిగితే అభ్యర్థే పూర్తి బాధ్యత వహించాల్సి రావడంతో సభలు, సమావేశాల నిర్వహణకు జంకుతున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులతోపాటు స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం సాగుతుండడంతో గ్రామాల్లో ప్రశాంత వాతావరణం నెలకొంది.
కానీ అదే అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తుండడంతో ఇంట్లో పనులు చేసుకోలేక పెద్దలు, పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు, పాఠశాలకు వెళ్లి వచ్చి హోంవర్క్ చేసుకుంటున్న విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. ఎండ వేడి రోజు రోజుకు పెరుగుతుండడంతో ఉదయం 10గంటల్లోపు, మళ్లీ సాయంత్రం 4గంటల తర్వాత అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. వేసవి కావడంతో విద్యార్థులకు ఒంటిపూట బడులు ఉంటున్నాయి. ఉదయం 8గంటలకు బడికి వెళ్లేందుకు విద్యార్థులు సిద్ధం అవుతుండగా.. ఉదయం ఏదు గంటల నుంచే ప్రచారం మొదలవుతోంది.
‘నేను ఎంపీటీసీగా పోటీ చేస్తున్న మీ ఓటు, మీ ఇంట్లో వాళ్ల ఓట్లు నాకే వేయాలి’, ‘నేను జెడ్పీటీసీగా బరిలో ఉన్న మీ ఓట్లన్నీ నాకే వేసి గెలిపించాలి’ అంటూ అభ్యర్థిస్తున్నారు. దీంతో పిల్లలను బడికి సిద్ధం చేస్తున్న తల్లిదండ్రులు సమయాన్ని వృథా చేస్తున్నారు. సాయంత్రం హోంవర్కు చేసుకునేందుకు సిద్ధమైన విద్యార్థులకు ఇదే ప్రచారం ఇబ్బందిగా మారింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులు ప్రతీ ఇంటికి వెళ్లి కాలింగ్ బెల్ నొక్కడం, లేదంటే గడియను తట్టడం చేస్తున్నారు. ఇలా ఒకరు వెళ్లిన తర్వాత ఒకరు వస్తుండడంతో తలుపుల గడియ తీయలేక తల్లిదండ్రులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. విరామం లేకుండా పోతోంది.
పల్లెల్లో ఊపందుకున్న ప్రచారం
Published Tue, Apr 1 2014 12:45 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement