జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు రెండు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో మొదటి ఘట్టం ఆదివారం జరగనుంది.
సాక్షి, మంచిర్యాల : జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలకు రెండు విడతలుగా జరగనున్న ఎన్నికల్లో మొదటి ఘట్టం ఆదివారం జరగనుంది. జిల్లాలోని మంచిర్యాల, ఆసిఫాబాద్ డివిజన్లలోని 21 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. 263 ఎంపీటీసీ స్థానాలకు 1,176 మంది బరిలో ఉండగా.. 21 జెడ్పీటీసీ పీఠాల కోసం 108 మంది పోరులో నిలిచారు. ఆదివారం పోలింగ్ జరగబోయే ఈ స్థానాల కోసం శుక్రవారంతో ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ డివిజన్ల పరిధిలో పోలింగ్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లను చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఎన్నికలు జరగనున్న రెండు డివిజన్లలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన తర్వాత జరుగుతున్న మొదటి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగించాలని ఆయా పార్టీలతోపాటు అభ్యర్థులు ఉవ్విళ్లూరుతున్నారు. ఆయా పార్టీలు తమ రాజకీయ, పరిపాలన హామీలను ఇప్పటికే ప్రజల ముందు ఉంచాయి. ప్రచార పర్వం ముగిసినందున ఓటర్లు తమనే కరుణిం చే విధంగా నాయకులు వారికి ఆకర్షణల వల విసరనున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో జరి గినట్లే ఈ ఎన్నికల్లో మందు, విందు, డబ్బుల పంపిణీ పెద్ద ఎత్తున జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. కోడ్ ఉల్లంఘనను అరికట్టేలా కృషిచేస్తామని అధికారులు పేర్కొంటున్నప్పటికీ ఆచరణ సాధ్యం కాదేమోననే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.