మంచిర్యాల అర్బన్, న్యూస్‌లైన్ : ఎన్నికల పుణ్యమాని జిల్లాలో మద్యం కొరత ఏర్పడింది. మందు బాబులకు మద్యం దొరకని పరిస్థితి. తక్కువ ధర మద్యం దొరుకకపోవడంతో జేబులు ఖాళీ అయ్యే పరిస్థితి ఏర్పడింది. నిత్యం పగలే కళకళలాడే మద్యం దుకాణాలు బోసిపోతున్నాయి. రిటైల్ వైన్ దుకాణాల్లో తక్కువ ధర మద్యం లేకపోవడంతో మందుబాబులు నిర్వాహకులతో వాదనకు దిగుతున్నారు. దీంతో చీకటి పడగానే దుకాణాలను మూసి వేస్తున్నారు. మద్యం రాజకీయ పార్టీలకు అమ్మి మద్యంను బ్లాక్ చేస్తున్నారని మద్యం బాబులు ఆరోపిస్తున్నారు. కోల్‌బెల్ట్ ప్రాంతంలో తక్కువ ధర మందు అమ్ముడవుతుంది. చీప్‌లిక్కర్, ఐబీ, ఎంసీ, రాయల్‌స్టాగ్, బ్లెండర్ స్ప్రైడర్ మందు దొరకడం లేదు. రిటేల్ దుకాణాల్లో మద్యం లేకపోగా బార్ షాపుల్లో మద్యం లభిస్తుండడంతో మందు ప్రియులు డబ్బులు లెక్క చేయకుండా బార్‌లో మద్యం తాగుతున్నారు.
బీర్లకు పెరిగిన డిమాండ్
వేసవి కాలం కావడం పెపైచ్చు మద్యం అందుబాటులో లేకపోవడంతో బీర్లకు గిరాకీ పెరిగింది. సహజంగానే వేసవిలో బార్లలో గిరాకీ ఉంటుంది. అభ్యర్థులు వారి వెంట తిరిగే వారికి ధర ఎక్కువైన కొనుగోలు చేస్తున్నారు. కాగా, మద్యం వ్యాపారులు బెల్ట్ దుకాణాలకు మద్యం నిల్వలు డంప్ చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్థానిక ఎన్నికలతోపాటు సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తుండడంతో ముందస్తుగానే మద్యం నిల్వలు పెట్టారని అందుకే మద్యం దుకాణాల్లో తక్కువ ధర మద్యంకు కొరత ఏర్పడిందనే వాదనలు లేకపోలేదు.
మద్యం ఎందుకు దొరకడం లేదు
మద్యం విచ్చలవిడి అమ్మకాలను నియంత్రించాలనే ఎన్నికల కమిషన్ నిర్ణయంతో కొరత ఏర్పడిందని మద్య నిషేధశాఖ అధికారులు వాదిస్తున్నారు. 2012-13 సంవత్సరంలో మార్చిలో మద్యం వ్యాపారులు ఎంత కొనుగోలు చేశారో ఈ ఏడాది అంతే మద్యం కొనుగోలు చేయవలసి ఉంటుంది. దీంతో ఎన్నికల సందర్భంగా అధికంగా మద్యం కొనుగోలు చేయడం కుదరడం లేదు. దీంతో నిర్ధేశిత కోటా మద్యంను సరఫరా చేస్తున్నారు. పైగా రోజు మద్యం నిలువలను కలెక్టర్‌కు స్థానిక మద్య నిషేధశాఖ అధికారులు పంపిస్తున్నారు. అధికారుల నిఘా కారణంగా పెద్ద మొత్తంలో ఎవరికి మద్యం అమ్మరాదు.
మద్యం కొరత
Published Tue, Mar 25 2014 2:35 AM | Last Updated on Tue, Oct 9 2018 5:27 PM
Advertisement