
అధికారులకు చుక్కలు చూపించిన అభ్యర్థి!
ముంబై: ఎన్నికలొచ్చాయంటేచాలు ఓటర్ల దష్టిలో పడేందుకు అభ్యర్థులు రకరకాల జిమ్మిక్కులు చేస్తుంటారు. కొందరు భారీగా జనాన్ని సేకరిస్తారు. మరికొందరు బ్యానర్లు, పోస్టర్లు, కటౌట్లు, ప్రవేశ ద్వారాలను పెద్దసంఖ్యలో ఏర్పాటు చేస్తారు. ఇలా చేస్తే ఓటర్లను బాగా ఆకట్టుకోవచ్చని వారు భావిస్తుంటారు. అయితే నాసిక్‌లో ఓ అభ్యర్థి నామినేషన్ దాఖలు చేసే సమయంలో డిపాజిట్ రూపంలో చెల్లించాల్సిన 12,500 వేల రూపాయల నగదును ఏకంగా చిల్లర నాణేల రూపంలో చెల్లించి అందరినీ ఆకట్టుకున్నాడు. వాటిని లెక్కించేందుకు సంబంధిత అధికారులకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది.
తొలివిడతలో లోక్‌సభకు జరిగే ఎన్నికలకు నామినేషన్ వేయడానికి శనివారం చివరి రోజు. నాసిక్‌లోని ఓ నియోజక వర్గం నుంచి బహుజన్ స్వరాజ్య మహాసంఘ్ పార్టీ అభ్యర్థి ప్రమోద్ నాథేకర్ శనివారం నామినేషన్ దాఖలు చేశారు. అధికారులకు చుక్కలు చూపించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం జనరల్ కోటా నుంచి పోటీ చేసేవారు రూ.25 వేలు, రిజర్వేషన్ కోటా నుంచి పోటీచేసే వారు రూ.12,500 డిపాజిట్ చెల్లించాలి. ప్రమోద్ రూ.12,500 చిల్లర నాణేలను జిల్లా అధికారి కార్యాలయంలో సమర్పించారు. 5,954 నాణేలతో మూటగట్టిన సంచిని చూసిన అధికారులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. చిల్లర తీసుకోకూడదనే నిబంధన ఏదీ లేదు. అందువల్ల అధికారులు ఆ చిల్లరను తీసుకోక తప్పలేదు. అందులో రూపాయి మొదలుకుని రూ.10 వరకు అన్ని చిల్లర నాణేలు ఉన్నాయి. గతంలో వచ్చిన ‘గల్లీత్ గోంధల్ ఢిల్లీత్ ముజ్రా’ అనే చిత్రంలో చిల్లర నాణేలు సమర్పించి ఆ అభ్యర్థి ఓటర్లను ఆకట్టుకున్నారు. ఈ చిత్రంలో చూపించిన విధంగానే ప్రమోద్ చిల్లర నాణేలు సమర్పించి ఉండొచ్చని భావిస్తున్నారు.
కాగా చిల్లర లెక్కింపు పూర్తయ్యేంత వరకు మిగతా అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయలేకపోయారు.
ప్రమోద్ సమర్పించిన చిల్లర నాణేలు:
రూపాయి నాణేలు - 2,500
రెండు రూపాయల నాణేలు - 2,500
ఐదు రూపాయల నాణేలు - 908
పది రూపాయల నాణేలు - 46