
చంద్రబాబు ఓ సైకో: వైఎస్ షర్మిల
‘‘చంద్రబాబు నాయుడు ఒక సైకో. తొమ్మిదేళ్ల పాలనలో ఎనిమిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు బకాయిల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు.
కర్నూలు జిల్లా జనభేరి సభల్లో విరుచుకుపడ్డ షర్మిల
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘‘చంద్రబాబు నాయుడు ఒక సైకో. తొమ్మిదేళ్ల పాలనలో ఎనిమిదిసార్లు కరెంటు ఛార్జీలు పెంచారు. కరెంటు బకాయిల కోసం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేశారు. బకాయిలు చెల్లించలేక వేలాదిమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. నిరసనగా రైతులు బషీర్‌బాగ్‌లో ఆందోళన చేస్తే పోలీసుల చేత ఉద్యమకారులను కాల్చి చంపించారు. ఆ కాల్పుల్లో రైతులు చనిపోతే... రైతులను కాల్చిన పోలీసులను పరామర్శించిన సైకో చంద్రబాబు’’ అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల విరుచుకుపడ్డారు.ఆమె బుధవారం కర్నూలు జిల్లాలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కల్లూరు, నందికొట్కూరు, ఆత్మకూరు, వెలుగోడు, నంద్యాలలో రోడ్‌షో, వైఎస్సార్ జనభేరి సభల్లో ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘‘మంచివాడని పిలిచి పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్‌కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు. పార్టీలో మంత్రి పదవి ఇచ్చి చేరదీస్తే.. ఏకంగా సీఎం కుర్చీకే ఎసరుపెట్టారు. ఆయనపై చెప్పులు కూడా వేయించారు. ఆ తర్వాత టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్‌నే పార్టీలో లేకుండా చేసిన పెద్ద సైకో చంద్రబాబు. పేదలకు వైద్యం అందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో యూజర్‌చార్జీలు పెంచి వారి నుంచి వసూలు చేసిన రాక్షసుడు. అంగన్‌వాడీ సమస్యలపై ఆందోళనలు చేస్తే వారిని గుర్రాలచేత తొక్కించిన కీచకుడు.ఎవరో ఒకరు చనిపోతేనే మరొకరికి పింఛను ఇస్తానని చెప్పిన శాడిస్టు. బీజేపీతో పొత్తు పెట్టుకుని ముస్లిం మైనారిటీలను వెన్నుపోటు పొడిచిన నమ్మకద్రోహి. బాబు మాటల్లో నిజం లేదు.. బాబు వాగ్దానాల్లో నిజం లేదు.. బాబు గుండెల్లో నిజాయితీనే లేదు’’ అని నిప్పులు చెరిగారు. దొంగ హామీలతో ప్రజల్లోకి వస్తున్న బాబును కాలర్ పట్టుకొని నిలదీయాలని పిలుపునిచ్చారు. ‘‘వైఎస్సార్ అనే పదం రాజకీయాలకు కొత్త అర్థం తెచ్చిపెట్టింది. రాష్ట్ర దశ, దిశను మార్చేసింది. వైఎస్సార్ ఆశయాల సాధనకోసమే వైఎస్సార్‌సీపీ పుట్టింది. ఫ్యాను గుర్తుపై ఓటేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించండి’’ అని విజ్ఞప్తి చేశారు.