ఎన్నికల తర్వాత బాబు ఉండడు
అందుకే ఎలాగైనా అధికారంలోకి రావాలని అడ్డగోలు అబద్ధాలు ఆడుతున్నాడు: జగన్
ఈవేళ కూడా బాబు అధికారం కోసం
సెల్ ఫ్రీ.. టీవీ ఫ్రీ.. ఆల్ ఫ్రీ అంటున్నాడు
నేను ఆయనలా అబద్ధాలు ఆడను.. విశ్వసనీయతలేని రాజకీయాలు చేయలేను
కృష్ణా, గుంటూరు జిల్లాల వైఎస్సార్ జనభేరి సభల్లో ప్రసంగించిన జగన్
‘వైఎస్సార్ జనభేరి’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు వయసు 65 సంవత్సరాలు. ఈ ఎన్నికలు అయిపోయిన తరువాత తానుండడు... తన పార్టీ ఉండదని ఆయనకు తెలుసు. అందుకే అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్నాడు. విశ్వసనీయతలేని రాజకీయాలు చేస్తున్నాడు. ఏదైనా చేసి, ఏమైనా చెప్పి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నాడు..’’ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. ‘‘చంద్రబాబు నాయుడు అధికారం కోసం, పదవుల కోసం ఏ గడ్డి అయినా తింటాడు. ఎన్ని అబద్ధాలైనా ఆడగలడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడుతాడు.. అధికారం పోయిన తరువాత మళ్లీ అధికారం కోసం రకరకాల అబద్ధాలు ఆడుతుంటాడు.
ఇదే చంద్రబాబు ఎన్నికల వేళ రాబోయే రోజుల్లో మీ దగ్గరకు వస్తాడు. మీటింగులు పెడతాడు. అప్పుడు మీరు ఒక మాట అడగండి. చంద్రబాబూ.. ఇవాళ అన్నీ ఫ్రీగా ఇస్తానని చెప్తున్నావు... మరి తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు వీటిలో ఒక్కటంటే ఒక్కటీ ఎందుకు చేయలేకపోయావని గట్టిగా నిలదీయండి. ఎందుకయ్యా ఇలా అబద్ధాలు ఆడతావు అని ప్రశ్నించండి?’’ అని జగన్ ప్రజలకు సూచించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం ఆయన కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా గన్నవరం, గుంటూ రు పట్టణాల్లో నిర్వహించిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో మాట్లాడారు. ప్రసంగాల సారాంశం ఆయన మాటల్లోనే..
వైఎస్ వెళ్లిపోయాక నిజాయితీ కరువైంది..
‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి దాదాపు ఐదు సంవత్సరాల క్రితం మన మధ్య నుంచి వెళ్లిపోయారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కంటే ముందు అనేక మంది ముఖ్యమంత్రులను చూశాం.. ఆయన తరువాత కూడా ముఖ్యమంత్రులను చూశాం.. కానీ వైఎస్ మాత్రమే ‘ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలి’ అని ఈ రాష్ట్రానికే కాదు దేశానికే చాటి చెప్పారు. ఆ దివంగత నేత మన మధ్య లేకపోయినా.. ప్రతి గుండెలో ఆయన బతికే ఉన్నాడు. ఈ రోజున మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. దివంగత నేత మన మధ్య నుంచి వెళ్లిపోయిన తరువాత ఈ రాజకీయ వ్యవస్థలో నిజాయితీ అన్నదే లేకుండా పోయింది. ఆయన చనిపోయిన తరువాత విశ్వసనీయత అనే పదం టార్చిలైటు పట్టి వెతికినా ఎక్కడా కనిపించడం లేదు.
చంద్రబాబును నిలదీయండి..
త్వరలో మీ దగ్గరకు వచ్చి అన్నీ ఫ్రీ అంటూ హామీలిచ్చే చంద్రబాబును అక్కడే నిలదీయండి. చంద్రబాబు నాయుడూ అప్పట్లో ఎన్నికలకు వెళ్లేముందు రెండు రూపాయలకు కిలో బియ్యం ఇస్తానని చెప్పావు.. ఆ తర్వాత ఎన్నికలు అయిపోయాక ప్రజలతో నాకేం పని ఉందని ఇదే రెండు రూపాయల బియ్యాన్ని ఐదుంపావలా చేయలేదా అని ప్రశ్నించండి. ఎన్నికలకు వెళ్లేముందు అక్క చెల్లెమ్మల ఓట్ల కోసమని మద్యపానాన్ని నిషేధిస్తానని చెప్పావు.. ఎన్నికలు అయిపోయాక మద్యపానం నిషేధిస్తే రాష్ట్రం అంతా దివాళా తీస్తుందని ‘ఈనాడు’ దినపత్రికలో పెద్దపెద్ద అక్షరాలతో రాయించావు. అలా రాయించిన మూడు రోజుల్లోనే ప్రతి గ్రామంలో బెల్టుషాపులు తెచ్చింది నీవు కాదా? అని నిలదీయండి.
తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటూ పేదోడి పిల్లలు ఎలా చదువుతున్నారో తెలుసుకున్నావా? ఇంజనీరింగ్ చదవాలంటే సంవత్సరానికి రూ.30 వేలు ఖర్చవుతుంది. ఆ రూ.30 వేలు కట్టాలంటే తల్లిదండ్రులు పొలమో, ఇల్లో అమ్ముకుంటే తప్ప చదివించలేని పరిస్థితి. ఈ పరిస్థితిని నీవు ఎప్పుడైనా తెలుసుకున్నావా చంద్రబాబూ అంటూ ప్రశ్నించండి. చంద్రబాబు నాయుడి హయాంలో ఏ పేదవాడికైనా గుండెపోటు వచ్చినా, యాక్సిడెంట్ అయినా, క్యాన్సర్ వచ్చినా ఆ పేదవాడు డాక్టర్ దగ్గరకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండేది.
డాక్టర్ దగ్గరకు వెళితే రూ. 2 లక్షలో... రూ.3 లక్షలో, రూ.5 లక్షలో అవుతుందని డాక్టర్ చెప్పినప్పుడు రెండ్రూపాయలు, మూడు రూపాయలు, ఐదు రూపాయల వడ్డీలకు అప్పు తెచ్చినప్పుడు నీవు ఏం చేశావు చంద్రబాబూ అని నిలదీయండి. తొమ్మిదేళ్ల చంద్రబాబు పరిపాలనలో వరుసగా కరువులొచ్చినప్పుడు రైతులందరూ కూడా కరెంటు చార్జీలు తగ్గించండి, కరెంటు ఉచితంగా ఇవ్వండి, రుణాల మీద వడ్డీ మాఫీ చేయండి అని గట్టిగా అడిగితే, నిరాహార దీక్షలు చేస్తే బషీర్‌బాగ్‌లో రైతన్నలను పిట్టల్లా కాల్చలేదా చంద్రబాబు నాయుడూ అని నిలదీయండి.
ఒక రోజు సెల్ఫోన్లు.. మరో రోజు టీవీలు..
ఈవేళ కూడా చంద్రబాబు అధికారంలోకి రావడానికి రకరకాల అబద్ధాలు చెబుతున్నాడు. ఒక రోజు సెల్ఫోన్లు ఫ్రీగా ఇస్తానని చెప్తాడు. ఒక రోజు టీవీలు ఫ్రీగా ఇస్తానంటాడు. ఇంకోరోజు రైతు రుణాలు మాఫీ అంటాడు. ఒక రోజు అక్కాచెల్లెళ్ల రుణాల మాఫీ అంటాడు. మరో రోజు మీరెవరూ ఇంటినుంచి బయటకు రావొద్దు.. మీ ఇంటికే అన్ని ఫ్రీగా ఇస్తానని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. ఒక విషయం మీకు స్పష్టంగా చెప్పదలుచుకున్నా. నేను చంద్రబాబు నాయుడిలా అబద్ధాలు ఆడలేను. చంద్రబాబు నాయుడిలా విశ్వసనీయతలేని, నిజాయితీ లేని రాజకీయాలు చేయలేను. ఎందుకంటే చంద్రబాబు కంటే నేను పాతిక సంవత్సరాలు చిన్నవాణ్ణి. మరో 30 సంవత్సరాలు విశ్వసనీయతతో కూడిన రాజకీయాలు చేయాలి.
దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నుంచి నాకు వచ్చిన వారసత్వం ఏదైనా ఉందంటే అది విశ్వసనీయత. ఒక్కటైతే చెబుతున్నాను. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపైన ఐదు సంతకాలు పెట్టబోతున్నాను. దీంతో పాటు అదనంగా ఆరు పనులను చేపట్టబోతున్నాను. ఈ పదకొండు పనులతో ఈ రాష్ట్ర దశ, దిశ మార్చుతాను. చెప్పినవే కాదు.. చెప్పనివీ చేస్తాను. ఈ రోజు ఎన్నికల్లో ఒకవైపున విశ్వసనీయత, నిజాయితీ ఉన్నాయి. మరో వైపున కుళ్లు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు ఉన్నాయి. ఈ రెండింటి మధ్య పోటీ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో విశ్వసనీయత, నిజాయితీలకు ఓటు వేద్దాం.. వైఎస్సార్ సువర్ణయుగాన్ని మళ్లీ తీసుకొద్దాం.’’
ఐదు సంతకాలు.. ఆరు పనులు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజున అదే వేదికపైన ఐదు సంతకాలు పెట్టబోతున్నాను. వాటితోపాటు మరో ఆరు పనులు కూడా చేయబోతున్నాను. వీటితో రాష్ట్ర దశ, దిశ మారుస్తానని మాటిస్తున్నాను.
వాటిలో మొదటి సంతకం అక్క చెల్లెమ్మల కోసం చేస్తాను. అక్కచెల్లెమ్మలు ఈ రోజు కూరగాయలు అమ్ముకుంటున్నారు. ఇతరత్రా పనులు చేస్తున్నారు. వంద నూటా యాభై రూపాయల కోసం పనులకు వెళ్తున్నారు. బతుకుదెరువు కోసం పిల్లలను బడి మాన్పించి పనులకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితి లేకుండా చేసేందుకు ‘అమ్మ ఒడి’ పథకం తీసుకొస్తున్నాను. మీ పిల్లలను బడికి పంపించండి. వారిని ఇంజినీర్లుగా, డాక్టర్లుగా నేను చేస్తాను. ప్రతీ స్కూలులోనూ ఇంగ్లీషు మీడియం పెడతాను. బడికి పంపించే ప్రతీ పిల్లాడికి రూ. 500 చొప్పున ఇద్దరు పిల్లలకు వెయ్యి నెల నెలా తల్లి బ్యాంకు ఖాతాలో జమ చేస్తాను. ఆ వెయ్యి రూపాయలుంటే బతుకుపై భయం ఉండదు.
ఇక రెండో సంతకం అవ్వా తాతల కోసం పెడతాను. వారు ఆరోగ్యం సహకరించక పోయినా పనులకు వెళ్తున్నారు. వైఎస్ పుణ్యాన రూ. 200 పెన్షన్ వస్తుందని, కానీ అది సరిపోవడం లేదంటున్నారు. వారికి రూ. 700 పెన్షన్ ఇస్తాను. వారికి మంచి మనవడిగా ఉంటాను. మూడో సంతకం రైతన్నల కోసం. పండించిన పంటలకు రేటు ఉండటంలేదు. వారికి మద్దతు, గిట్టుబాటు ధర ఇస్తూ రూ.3 వేల కోట్లతో స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను. కరవు, వరద వచ్చినా వారికి అండగా ఉండేందుకు మరో రూ. 2 వేల కోట్లతో నిధిని ఏర్పాటు చేస్తాను.
నాలుగో సంతకం మళ్లీ అక్క చె ల్లెమ్మల కోసమే. డ్వాక్రా రుణాలు తీసుకున్న వారు ప్రతి నెలా ఒకటో తేదీన కట్టకపోతే వడ్డీ మీద వడ్డీ వసూలు చేస్తున్నారు బ్యాంకర్లు. ఈ కష్టాలు తప్పించేందుకు డ్వాక్రా రుణాలను మాఫీ చేస్తాను. ఏ వార్డుకు వెళ్లినా, ఏ గ్రామానికి వెళ్లినా రేషన్, ఆరోగ్యశ్రీ కార్డులు, ఇల్లు లేదనే పరిస్థితి ఇప్పటికీ వింటున్నాను. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో ఒక ఆఫీసు తెరుస్తాను. అడిగిన వారికి 24 గంటల్లో ఏ కార్డైనా అందజేస్తాను. ఐదో సంతకం ఈ ఫైలుపైనే చేస్తాను.
ఆరో పని చేయబోతున్నా. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు దేశంలోనే 47 లక్షల ఇళ్లు నిర్మిస్తే.. వైఎస్ఆర్ ఒక్క రాష్ట్రంలోనే 48 లక్షల ఇళ్లు కట్టారు. 2019 నాటికి ఎవరూ ఇల్లు లేదు అని అనకుండా చేస్తాను. ఏడాదికి 10 లక్షలు, ఐదేళ్లలో 50 లక్షల ఇళ్లు కట్టి ప్రతి నిరుపేదకూ నీడనిస్తాను. 50 లక్షల ఇళ్లే కాదు 50 లక్షల పట్టాలు కూడా మహిళల పేరుమీద ఇవ్వబోతున్నాను. అవసరం వచ్చినప్పుడు లక్షకు పైగా విలువ చేసే ఆ ఇంటిపట్టాను బ్యాంకులో పెట్టి రూ. 30 వేలు రుణం పావలా వడ్డీ కింద తీసుకునే వెసులుబాటు కల్పించేలా బ్యాంకర్లతో మాట్లాడతాను.
ఏడో కార్యక్రమం.. ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ గర్వపడే విధంగా గొప్పగా అమలు చేస్తాను. గుండెపోటు వచ్చినా... యాక్సిడెంట్ అయి ఆపరేషన్ చేసినా.. డాక్టర్లు రెండు, మూడు, ఒక్కోసారి ఆరు నెలలు విశ్రాంతి తీసుకోవాలంటారు. కానీ ఇంటికి వెళ్లిన పేషెంటు పని చేయలేని పరిస్థితుల్లో పస్తులు ఉంటున్నారు. ఈ పరిస్థితిని మార్చుతాను. విశ్రాంతి సమయంలో నెలకు రూ. 3 వేల చొప్పున ఇచ్చి వారిని ఆదుకుంటాను.
ఎనిమిదో పనికింద మరోటి చేస్తాను. ఈ రోజు ఊళ్లల్లో ఐదారు గంటలు కూడా కరెంటు ఉండటంలేదు. రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. నాలుగు గంటల కరెంటు కూడా ఇవ్వడంలేదు. 2019 నాటికి కరెంటు కోతలు లేని రాష్ట్రాన్ని నిర్మిస్తాను. పగటి పూటే రైతులకు ఏడు గంటల నాణ్యమైన కరెంటు ఇస్తాను.
ఈ రోజు వస్తున్న కరెంటు బిల్లులు చూస్తుంటే.. ఏది బిల్లో, ఏది సర్ చార్జ్నో అర్థంకాని పరిస్థితి. రూ.500, రూ.600 వస్తున్న బిల్లులు కట్టలేక పేదలు దొంగ కరెంటు వాడుతున్నారు. ఆ పరిస్థితిని తప్పించేందుకు పేదలకు ఒక టీవీ, రెండు ఫ్యాన్లు, మూడు లైట్లు వెలిగించుకునేందుకు ఖర్చయ్యే 150 యూనిట్ల క రెంటు రూ. 100కే అందించడాన్ని తొమ్మిదో పనిగా చేస్తాను.
ఏ గ్రామంలోనూ బెల్టుషాపులు లేకుండా చేస్తాను. అక్రమ మద్యం నియంత్రించేందుకు ప్రతీ గ్రామం నుంచి 10 మంది మహిళలను ఆడ పోలీసులుగా నియమిస్తాను. తాగాలనుకునే వారికి నియోజకవర్గంలో ఒకేచోట మద్యం షాపు ఉంటుంది. ప్రభుత్వమే దీన్ని నడుపుతుంది. రేట్లు షాక్ కొట్టేలా ఉంటాయి. శ్రీమంతులు తాగాలనుకుంటే స్టార్ హోటళ్లలో తాగొచ్చు. అట్నుంచి అటే నేరుగా ఆసుపత్రులకు కూడా వెళ్లొచ్చు. పేదలకు మాత్రం ఆరోగ్యం గ్యారంటీ నేనిస్తాను.
ఇంకో కార్యక్రమం కింద చదువుకున్న వారికి ఉద్యోగం వస్తుందన్న ధీమా ఇస్తాను. చంద్రబాబులా ఇన్ని కోట్లు అన్ని కోట్లు ఉద్యోగాలు ఇస్తానని చెప్పను. కానీ గత నాలుగు సంవత్సరాలుగా నన్ను చూశారు. ఇళ్లు విడిచి రాత్రనక పగలనక కష్టపడడం చూశారు. ఎండనక వాననక తిరిగే విధానాన్ని చూశారు. తమ పిల్లలను చదివించే ప్రతీ తల్లికీ, చదువుకునే ప్రతీ పిల్లాడికి ఒకటి చెబుతున్నాను. నా సొంత తమ్ముడి కోసం ఉద్యోగం వెతక వలసి వస్తే ఏ విధంగా నేను కష్టపడతానో అదే స్థాయిలో ప్రతీ పిల్లాడి కోసం కష్టపడతాను.