
హ్యాట్రిక్ ఓటమి తప్పదా?
హైదరాబాద్: సీమాంధ్రలో ఎన్నికల ఫలితాలు విడుదలకు ముందే చంద్రబాబు నాయుడు ఓటమి అంగీకరించారా అంటే అవుననే సమాధానం వస్తోంది. పోలింగ్ సరళి పరిశీలించిన తర్వాత టీడీపీ అధినేతకు దిగులుపట్టుకున్నట్టు కనబడుతోంది. సీమాంధ్రలో 'సీలింగ్ ఫ్యాన్' ప్రభంజనం ఖాయమని నిన్న జరిగిన ఎన్నికల పోలింగ్ సరళి స్పష్టం చేస్తోందన్న వార్తల నేపథ్యంలో 'సైకిల్' నాయకుడు నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. 'హ్యాట్రిక్ ఓటమి' తప్పదన్న భావన చంద్రబాబులో కనిపిస్తోంది. మూడో ఓటమిని తప్పించుకునేందుకు 'నమో' జపం చేసినా, 'పవన్' దండకం వల్లించినా ప్రయోజనం లేకపోయిందన్న వ్యక్తమయింది.
పోలింగ్ ముగిసిన దాదాపు గంట తర్వాత విలేకరుల సమావేశం ఏర్పాటుచేసిన చంద్రబాబు తమ పార్టీ గెలుస్తుందని ధీమాగా చెప్పలేకపోయారు. పైపెచ్చు ప్రధాన ప్రత్యర్థి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలకే ఎక్కువ సమయం కేటాయించారు. పోలింగ్ మరుసటి రోజు మళ్లీ విలేకరుల సమావేశం పెట్టి మళ్లీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఓటమి భయంతోనే ఆయన ఇలా మాట్లాడుతున్నట్టు కనబడుతోంది. పోలింగ్ సరళి చూసిన తర్వాత అధినేత చంద్రబాబే జావగారిపోవడంతో తెలుగు తమ్ముళ్లు మరింత నిరుత్సాహానికి గురయ్యారు.