చంద్రబాబు ఫ్లాప్ షో
సాక్షి, రాజమండ్రి : సీమాంధ్ర ప్రాంత ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు మంగళవారం జిల్లాలో నిర్వహించిన రోడ్ షో ఫ్లాప్ అయింది. రాజానగరం నియోజకవర్గం గాడాల గ్రామం నుంచి కొత్తపేట నియోజకవర్గం రావులపాలెం వరకూ రోడ్‌షో నిర్వహించారు. ఆశావహులకు టిక్కెట్లు దక్కకపోవడంతో నెలకొన్న అసంతృప్తి బాబు పర్యటనపై స్పష్టంగా కనిపించింది. రాజమండ్రి అర్బన్‌ను బీజేపీకి కేటాయించిన ఫలితంగా సిటీలో బాబు రోడ్‌షోకు ఆదరణ లేకుండా పోయింది. చంద్రబాబు వస్తున్నారని తెలిసినా చూసేందుకు జనం ఎవరూ రాలేదు. రూరల్ నియోజకవర్గంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరికి టిక్కెట్టు కేటాయించవద్దంటూ పెద్దఎత్తున కార్యకర్తలు రోడ్‌షోను అడ్డుకున్నారు. బుచ్చయ్య గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు. రాజమండ్రి పార్లమెంటు పరిధిలో బాబు సామాజిక న్యాయం పాటించలేదని బిగ్గరగా నినాదాలు చేశారు.
బాబు తన పర్యటనలో అడుగడుగునా ఎమ్మార్పీఎస్ కార్యకర్తల నిరసనలను చవిచూశారు. గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన బాబు మాదిగలకు టిక్కెట్లు ఇస్తానని ప్రకటించడాన్ని గుర్తుచేస్తూ తన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలంటూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. మధురపూడి విమానాశ్రయం, కొండగుంటూరు తదితర ప్రాంతాల్లో ఆ వర్గం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. మండపేట, రావులపాలెం సభల్లో బాబు తన మునుపటి హామీల చిట్టానే చదివి వినిపించారు. టిక్కెట్ దక్కని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే చందన రమేష్ ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. సాయంత్రం 4.20 గంటలకు హైదరాబాదు నుంచి ప్రత్యేక విమానంలో మధురపూడి విమానాశ్రయంలో దిగిన చంద్రబాబు గాడాల గ్రామం నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.
ప్రతిచోటా చేసిన వాగ్దానాలే చేస్తూ, చెప్పిన మాటలే చెబుతూ అధికారం కోసం జనానికి అరచేతిలో వైకుంఠాన్ని చూపించే ప్రయత్నం చేశారు. కేంద్రంలో నరేంద్రమోడీని, రాష్ట్రంలో తనను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందంటూ సభల్లో చెప్పుకొచ్చారు. ముందుగా గాడాలలో తన ప్రసంగాన్ని ముగించిన అనంతరం అక్కడి నుంచి నేరుగా బొమ్మూరు చేరుకున్నారు. బొమ్మూరులో పదినిముషాల పాటు ప్రసంగించి రాజవోలు, కొండగుంటూరు, కేశవరం, ద్వారాపూడి వంతెన, తాపేశ్వరం మీదుగా మండపేట చేరుకుని అక్కడ కలువపువ్వు సెంటర్‌లో ఏర్పాటుచేసిన సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి రావులపాలెం 9.55 గంటలకు చేరుకుని ఐదు నిముషాలపాటు ప్రసంగించి ఎన్నికల కోడ్ ప్రకారం సమయం ముగియడంతో తన పర్యటనను ముగించారు. అనంతరం పశ్చిమగోదావరి జిల్లా తణుకు బయలుదేరి వెళ్లారు.
రాజమండ్రి ఎంపీ అభ్యర్థి మాగంటి మురళీమోహన్, అమలాపురం ఎంపీ అభ్యర్థి రవీంద్రబాబు, మాజీ మంత్రులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మెట్ల సత్యనారాయణ, టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు పెందుర్తి వెంకటేష్, వేగుళ్ల జోగేశ్వరరావు, బీజేపీ నాయకులు సోము వీర్రాజు, ఆకుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెంకటేశ్వరరావు, చిన్నం బాబూ రమేష్ తదితర నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.