‘తడిగుడ్డతో గొంతు కోసిన కేసీఆర్’
మంథని: టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను తండ్రిలా భావిస్తే తడిగుడ్డతో తన గొంతు కోశారని పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధానకార్యదర్శి చందుపట్ల సునీల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా మంథనిలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగేళ్ల నుంచి ఉద్యమంలో తమను అన్ని విధాలుగా వినియోగించుకుని ఇప్పుడు తీరని అన్యాయం చేశారని వాపోయారు.
పార్టీ కోసం కష్టపడ్డవారికి న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తమను పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులకు పెద్దపీట వేయడం దుర్మార్గమన్నారు. మాటంటే మాటేనని, అవసరమైతే నాలుక కోసుకుంటానే కానీ మాట తప్పనని చెప్పిన కేసీఆర్.. సర్వేలను నమ్మి తమకు అన్యాయం చేయడం సమంజసమా అని ప్రశ్నించారు.
వారం రోజుల క్రితం పెద్దపల్లి ఎంపీ వివేక్ కాటారంలో జరిగిన సభలో కేసీఆర్ సూచనల మేరకు మంథని అభ్యర్థిగా తనను ప్రకటించారన్నారు. తర్వాత తమకు కనీసం మాటైనా చెప్పకుండా మరొకరిని పార్టీలో చేర్చుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం అవమానించడం కాదా అన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించి జెడ్పీటీసీగా పోటీలో ఉండమని సూచించడం తగునా అని నిలదీశారు. రెండురోజుల్లో పార్టీకి రాజీనామా చేసి భవిష్యత్ నిర్ణయాన్ని ప్రకటిస్తానన్నారు.